12, ఆగస్టు 2015, బుధవారం

సబ్సిడీలు సంపన్నులకా ? ఆపన్నులకా?

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 13-08-2015, THURSDAY)

"వంట చేయడానికి బియ్యం కడిగేటప్పుడు ఒక పిడికెడు బియ్యం వేరే ఒక పాత్రలో రోజూ వేయండి. అందులో ఒక చిల్లర డబ్బు కూడా వుంచండి. మీ పేటవాసులంతా ఒక సంఘంగా ఏర్పడి అలా  పోగుపడే బియ్యాన్ని సేకరించండి. మీ పేటలోని ఏ ఆలయంలోనైనా  ఆ బియ్యంతో పేదలకు అన్నదానం చేయండి. చిల్లరడబ్బులను వంట చెరకు, ఇతర  అధరువులు కొనడానికి ఉపయోగించవచ్చు. పిడికెడు బియ్యంతో ఆకలిగొన్న పేదవాడి కడుపు నింపవచ్చు. నిష్కామంగా మీరు చేసే ఈ సేవకు భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది " – కీర్తిశేషులు కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి ఒకనాటి అనుగ్రహభాషణ
‘మీరు సంపన్నులు. ప్రభుత్వం వంట గ్యాసు సిలిండర్ పై ఇచ్చే సబ్సిడీ మీకు అవసరంలేదు. అయితే  దేశంలో అందరూ సంపన్నులు కారు. కట్టెల పొయ్యి ముందు కూర్చుని, పొగచూరిన కళ్ళతో ఇంటిల్లిపాదికీ వంట చేసిపెట్టే పేద తల్లులకు ఈ దేశంలో కరువు లేదు. వారి కష్టాలు తీర్చాలంటే మీరు కొంత త్యాగం చేయండి. సబ్సిడీ ఒదులుకోండి. దానితో ఓ పేద కుటుంబంబానికి వంటగ్యాసు సదుపాయం లభిస్తుంది. దయచేసి ఈ పుణ్యం కట్టుకోండి’- కొన్ని మాసాలక్రితం ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి.    
ఇదే మోడీ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండగా ఆయన పనితీరు తెలిసిన వాళ్లకి,  ప్రధాని ఇచ్చిన ఈ  పిలుపుకు వస్తున్న స్పందన అంతంత మాత్రంగా వుండడం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ రోజుల్లో మోడీ వ్యవహారశైలి విభిన్నంగా వుండేది. తెలుగు తెలియని గుజరాత్  మిత్రుడు ఒకరు, మోడీ ముఖ్యమంత్రిగా వున్న  రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పారు.
“మోడీని  గుజరాత్ సీతయ్య అనొచ్చు.   కాకపొతే కొంత తేడా వుంది. మన తెలుగు సీతయ్య ఎవడి మాటా వినడు. ఈ గుజరాత్ సీతయ్య అందరి మాటా వింటాడు కానీ చివరకు తాను అనుకున్నదే చేస్తాడు.
ఉదాహరణకు గుజరాత్ రాష్ట్రంలో చిన్నపిల్లల్ని స్కూళ్లకు పంపేలా వారి తలితండ్రులను ప్రోత్సహించడం యెలా అన్న ఆలోచన వచ్చిందనుకోండి. వెంటనే సంబంధిత అధికారుల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ల అభిప్రాయాలను సావధానంగా వింటారు. తమ మనసులో మాట స్వేచ్చగా, ధైర్యంగా చెప్పేలా అధికారులను ప్రోత్సహిస్తారు. మధ్యలో భోజన సమయం అయితే పదిహేను నిమిషాల్లో ఆపని ముగించుకుని మళ్ళీ  మీటింగుకు హాజరు. అందరూ చెప్పింది జాగ్రత్తగా విని తాను ఒక అభిప్రాయానికి వచ్చి ఏం చేయాలో ఆ ఆదేశాలు జారీచేస్తారు. ఆ తరహా చూసిన వారికి ఒక మిలిటరీ అధికారి తన సైన్యానికి ఆదేశాలు జారీ చేసే విధానం గుర్తుకు రాకమానదు. ఇక అప్పటినుంచి ఆ కార్యక్రమం  పురోగతి గురించి వెంట వెంటనే సమీక్షా సమావేశాలు. ఎప్పటికప్పుడు పరిస్తితిని బేరీజు వేసుకుని తదుపరి ఆదేశాలు. వేసవి సెలవుల్లో మండుటెండలను లెక్కపెట్టకుండా అధికారులను వెంటేసుకుని ఒక నెలంతా పల్లెల్లో పర్యటించి పిల్లల చదువు ప్రాధాన్యతను గురించి ప్రతి ఒక్కరికీ వివరించే ప్రయత్నం మరోపక్క. ఫలితం గురించి చెప్పే పని ఏముంటుంది. రెండేళ్లలో స్కూళ్ళల్లో చేరే పిల్లల సంఖ్య  ఇరవయ్యారు శాతం నుంచి నూటికి  నూరు శాతానికి పెరిగిపోయింది. 
దటీజ్ మోడీ మోటివేషన్ పవర్.”
అయితే అదంతా గతం. ఆయన  గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండగా అలా వుండేది ఆయన తీరు.
ప్రధాని పీఠం ఎక్కిన కొత్తల్లో నేల నాలుగు చెరగులకు కాంతులు వెదజల్లిన  మోడీ ప్రభలు గత కొంత కాలంగా  మసక బారుతున్నట్టుగా అనిపిస్తోంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ‘గివ్ ఇట్ అప్’ అంటూ గ్యాస్ సబ్సిడీ ఒదులుకోమని మోడీ ఇచ్చిన పిలుపుకు ప్రజలనుంచి లభిస్తున్న అంతంత మాత్రపు స్పందన.

ప్రధానమంత్రి స్థాయి కలిగిన వ్యక్తి చేసిన విజ్ఞప్తి కాబట్టి కొందరు బడా పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి సబ్సిడీ ఒదులుకుంటున్నట్టు  భారీ ప్రకటనలు చేసారు. అంతే  కాకుండా తమ సంస్థల్లో పనిచేసే సిబ్బందిని  కూడా ఈ సదుపాయం వదులుకోవాల్సిందని కోరారు. ఆయా సంస్థలు జారీ చేసిన పత్రికా ప్రకటనలు గమనిస్తే వారి పిలుపుల పట్ల ఉద్యోగుల  స్పందన బాగానే  వున్నట్టు కానవస్తోంది. కానీ మోడీ మంత్రివర్గంలో పనిచేసే మంత్రులలో ఎవరో కొందరి పేర్లు ఈ ‘త్యాగరాజుల’  జాబితాలో వున్నాయి తప్పిస్తే యావత్ మంత్రిమండలి మోడీ పిలుపుకు సానుకూలంగా స్పందించి సబ్సిడీ వదులుకున్న దాఖలా అధికారిక ప్రకటనల్లో ఎక్కడా లేదు. ఒకవేళ సబ్సిడీ వదులుకుని కూడా ఆ విషయం బహిరంగ పరచడంలో వైఫల్యం చెందివుంటే అది మరో వైఫల్యం కిందికే వస్తుంది.
దేశ వ్యాప్తంగా పదిహేను కోట్ల ముప్పయి లక్షలమంది వంట గ్యాసు వినియోగదారులు వున్నారని అధికార గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రధాని పిలుపుకు స్పందించి ఇప్పటివరకు సబ్సిడీ వదులుకున్న వారి సంఖ్య పద్నాలుగు లక్షలు దాటలేదు. అంటే ఈ గివ్ ఇట్ అప్ అనే పధకం ఏరకంగా నీరుకారిపోతున్నదో అర్ధం చేసుకోవచ్చు.
ఈ సందర్భంగా సామాన్యుల్లో కలిగే సందేహం ఒక్కటే.  ప్రధాని మోడీ ఇలా చేసివుంటే బాగుండు అని కోరుకునేది కూడా ఒక్కటే.
ఏ త్యాగమైనా ఇంటి నుంచి మొదలు కావాలంటారు. అందుకే దాన్ని ముందు పార్లమెంటు నుంచి మొదలుపెట్టాలి. పార్లమెంటు సభ్యులకు, మంత్రులకు వచ్చే జీతభత్యాల విషయం రహస్యమేమీ కాదు. 'దేశం మొత్తంలో అత్యంత చౌక ధరలకు అత్యంత నాణ్యమైన ఆహార పదార్ధాలు ఎక్కడ దొరుకుతాయి అంటే పార్లమెంటు క్యాంటీనులో మాత్రమే'   అని జవాబు వచ్చేలా అనేక కధనాలు సాంఘిక మాధ్యమాల్లో  నిత్యం సంచారం చేస్తున్నాయి. ఆ  క్యాంటీనులో  వాడుతున్న గ్యాస్ సిలిండర్లు సబ్సిడీవే అయినప్పుడు ఇతరులను సబ్సిడీ ఒదులుకోమని చెప్పడం అసంగతం అవుతుంది. ఒకవేళ సబ్సిడీ లేని సిలిండర్లు అక్కడి క్యాంటీనులో వాడుతూ ఉన్నట్టయితే  ఆవిషయానికి విస్తృత ప్రచారం కల్పించి వుంటే ఈ రకమైన విమర్శలకు అవకాశం వుండేది కాదు.
అదీ కాక సబ్సిడీ భారంగా పరిణమిస్తోంది అని ప్రభుత్వం అనుకుంటున్నప్పుడు ఈ రకమైన విజ్ఞప్తులు, పిలుపుల పద్ధతికి స్వస్తి పలకాలి. దేశంలో సంపన్నుల జాబితా ప్రభుత్వం వద్దనే సిద్ధంగా వుంటుంది. 'పలానా తేదీ నుంచి అలాటివారందరికీ సబ్సిడీ ఎత్తి వేస్తున్నాం' అని ఒక ప్రకటన చేస్తే సరిపోయేది. గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వం నుంచి పొందుతున్న సబ్సిడీ మొత్తానికి కనీసం కొన్ని వందల రెట్లు తమ కుక్క పిల్లల ఆలనాపాలనాపై ఖర్చు పెట్టగలిగిన ఖామందుల సంఖ్య మన దేశంలో తక్కువేమీ కాదు. దుష్టాంగాన్ని తొలగించి శిష్టాంగాన్ని కాపాడమన్నట్టుగా అనర్హులయిన వారిని సబ్సిడీ జాబితా నుంచి తొలగించి అవసరమైన పక్షంలో సబ్సిడీ మొత్తాన్ని  మరింత పెంచి అర్హులైన పేదలకు అందించగలిగితే అది నిజమైన సంక్షేమ ప్రభుత్వం అనిపించుకుంటుంది. పేదల రేషను కార్డుల విషయంలో అనర్హులను తొలగించే కార్యక్రమాలపట్ల  ఎక్కడలేని తొందర ప్రదర్శించే ప్రభుత్వాలు, సంపన్నులకు గ్యాస్ సబ్సిడీ తీసివేసే విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తాయన్నది సామాన్యుల మనస్సులను తొలుస్తున్న జవాబులేని ప్రశ్న.     
నిజమే. అభివృద్ధి చెందుతున్న  దేశాల్లో సబ్సిడీలు తప్పనిసరి. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ సబ్సిడీ విధానం అమల్లో వుంది. ఎందుకంటె పెరిగే సంపద సక్రమంగా అన్ని చోట్లా సమానంగా పెరగదు. సంపన్నత పెరిగే కొద్దీ సమాజంలో అసమానతలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తాయి. వృద్ధాప్యం, అనారోగ్యం మొదలయిన అంశాలు వ్యక్తిగత ఆదాయాలపై ప్రభావం చూపుతాయి. అంచేతే సిరి సంపదలు పుష్కలంగా వున్న దేశాల్లో కూడా ఆహార సబ్సిడీలు, ఆరోగ్య సబ్సిడీలు  ఘనంగానే ఉంటున్నాయి. కాకపోతే సబ్సిడీల విషయంలో ఆయా  దేశాల ప్రజలు స్వచ్చందంగా  పాటించే కొన్ని నియమ నిబద్ధతతల కారణంగా అవి దుర్వినియోగం కావడం లేదు. సంపన్నులయినవాళ్ళు సబ్సిడీలకోసం ఆరాటపడని మంచి  సమాజాలను వారు సృష్టించుకున్నారు. సంక్షేమ పధకాలకోసం ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులు సంపన్నులకోసం కాకుండా ఆపన్నులకోసం ఖర్చు చేయాలని ఆశించేవారు ఆదేశాల్లో అధికంగా వుండడం దీనికి కారణం. మన దేశంలో పరిస్తితి దీనికి పూర్తిగా భిన్నం. సబ్సిడీ బియ్యం నుంచి  ఆరోగ్యశ్రీ కార్డు వరకు ఇదే తంతు. అన్ని రకాల సబ్సిడీలు ఆదాయాలతో నిమిత్తం లేకుండా తమ ఒళ్ళో వచ్చి పడాలని ఆరాటపడేవారే ఎక్కువ.
మరో విచిత్రం అయిన విషయం ఏమిటంటే, ఉత్పత్తి ఖర్చుకంటే అనేక వందల రెట్లు అమ్మకం ధర వుండే వస్తుసామాగ్రి కొనడానికి పరుగులు తీసే వారే సబ్సిడీ ధరలకు ప్రభుత్వం అన్నీ సరఫరా చేయాలని పట్టుబడుతుంటారు. సబ్సిడీ తగ్గించినప్పుడల్లా నానా  కాకి గోల  చేస్తుంటారు.
ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ప్రభుత్వాలు  కొన్ని  కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పుకాదు. అయితే అటువంటి నిర్ణయాల అమలు ప్రభుత్వాధినేతల నుంచే మొదలు కావాలి. పొదుపు చేయండని పిలుపు ఇచ్చేవాళ్ళు దాన్ని ఆడంబరంగా చేయకూడదు. వాటి ప్రచారానికి అట్టహాసంగా ఖర్చు చేయకూడదు. ‘సబ్సిడీ ఒదులుకోవాలని  పిలుపు ఇచ్చిన ప్రధాని మోడీ గారింట్లో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వాడడం లేదు’ అనే విషయం  తెలుసుకోగోరే వారుంటే, అలాటి వారిని అనుమానంగా చూడాల్సిన అవసరం లేదు. పైగా అలాటి సందేహాలను నివృత్తి చేయగలిగితే మరింత బాగుంటుంది.
గతంలో లాల్ బహదూర్ శాస్త్రి  ప్రధాన మంత్రిగా వున్నప్పుడు దేశంలో ఏర్పడ్డ తిండిగింజల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ ప్రతి సోమవారం ఒక పొద్దు మాత్రమే భోజనం చేయాలని ఇచ్చిన పిలుపుకు అపూర్వ స్పందన లభించింది. ఎందుకంటె ఆయన ఆ నియమాన్ని అయన  బతికున్నంతవరకు పాటించారు.
తమ భవిష్యత్తు గురించి, ఈపూట గడిస్తే చాలు అని ఆలోచించే  రాజకీయ నాయకులు దేశంలో  పుష్కలంగా వున్నారు. రేపటి గురించి, జాతి భవిష్యత్తు గురించి  ఆలోచించే రాజనీతిజ్ఞులే క్రమంగా కనుమరుగయిపోతున్నారు.
ఇదొక విషాదం.   (12-08-2015)

(రచయిత  మొబైల్ నెంబరు : 98491 30595  మెయిల్: bhandarusr@gmail.com)

NOTE: Courtesy Image Owner 

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

రకరకాల పన్నులు కట్టి, కట్టి మేము కూడ ఆపన్నులు అయిపోయామండి.

అజ్ఞాత చెప్పారు...

ముందర రాజకియ నాయకులకి-ప్రభుత్వ ఉదొగులకి ఇచ్చే విపరిత వెతనాలు....అనవసర ప్రబుత్వ. ఖర్చులు తగ్గించు కుంటే..ఎవరు ఏ సబ్సిడిని ఒదులుకోవలసిన పనిలేదు....