19, నవంబర్ 2011, శనివారం

తెరిపినపడ్డ కాంగ్రెస్


తెరిపినపడ్డ కాంగ్రెస్ – భండారు శ్రీనివాసరావు



ఇంట్లో కరెంట్ పోయినప్పుడు ఏంచేయాలి. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పాలి. కానీ సాధారణంగా జరిగేదేమిటి ?  పక్క వాటాలో కూడా కరెంట్ వుందో లేదో అని ఓ కంట కనిపెట్టిచూడడం మానవ నైజం. తనకు నష్టం జరిగిందన్న బాధ కన్నా పక్కవారికి కూడా అదే జరిగితే సంతోషించే రోజులివి.
సీ.బీ.ఐ. దర్యాప్తులకు న్యాయస్తానాలు ఆదేశిస్తున్న ఉదంతాలపై  ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలు స్పందిస్తున్న తీరు కూడా ఈ స్వభావాన్నే సూచిస్తోంది.
ఏమయితేనేం! చేతులారా తెచ్చిపెట్టుకున్న సమస్యలతో కుడితినపడ్డ ఎలుకలా కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఎంతోకాలం తరువాత చక్కని  ఊరట దొరికింది.
జగన్ అండ చూసుకుని కొరకరాని కొయ్యలుగా తయారయిన కొందరు ఎమ్మెల్యేలను కట్టడి చేయలేక నిస్సహాయస్తితిలోవున్న అధికార కాంగ్రెస్ కు, కోర్టు ఆదేశాలపై సీ.బీ.ఐ. ప్రారంభించిన జగన్ ఆస్తుల కేసు విచారణ  కొంత ఊరటనిస్తే,  చంద్రబాబు అధికార దుర్వినియోగం గురించి హైకోర్టు ఆ  సీ.బీ.ఐ. నే దర్యాప్తుచేయమని తాజాగా ఆదేశించడం పూర్తి ఊరటను ఇచ్చింది. అటు  సీమాంధ్ర లో పూర్తిగా, ఇటు తెలంగాణలో ఓ మోస్తరుగా  ఏకుమేకై కూర్చున్న వైఎస్సార్ పార్టీని, తెలుగుదేశం పార్టీని రాజకీయంగా యెలా ఎదుర్కోవాలో తెలియని పరిస్తితిలో బాగా డీలాపడ్డ కాంగ్రెస్ పార్టీకి తాజా పరిణామాలు కొత్త ఊపిరి పోస్తున్నాయి. సరికొత్త ఆశలు  చిగురింపచేస్తున్నాయి.
కారణాలు ఏమయితేనేం, కారణ’భూతం’ ఏదయితేనేం చాలాకాలం తరువాత, అదీ ఏడాది పాలన పూర్తిఅవుతున్న తరుణంలో ‘కిరణ్ సర్కార్’ కొంత తెరిపిన పడింది.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే కాబోలు (18-11-2011)   


           

కామెంట్‌లు లేవు: