క్షణం తీరికలేని మనిషికి దొరికిన మధుర క్షణాలు. - భండారు శ్రీనివాసరావు
అనుక్షణం వార్తలమధ్య
గడిపే జర్నలిష్టులను ప్రతిరోజూ పత్రికల్లో
వచ్చే వార్తలు అంతగా ఆకట్టుకోవు. కానీ, నవంబర్ ఇరవై ఐదో తేదీన ఈనాడు లో పడ్డ వార్తను
చూసి, లోగడ ఆలిండియా రేడియో, దూర దర్శన్
లలో న్యూస్ డైరెక్టర్ గా పనిచేసిన ఆర్.వీ.వీ.
కృష్ణారావు కాసేపు చకితులయ్యారు. దానికో కారణం వుంది. అది తెలుసుకోవాలంటే
అంతకు ముందు శనివారం నాడు హైదరాబాదులో
జరిగిన ఒక పెళ్లి. అది చెప్పుకునే ముందు ఈనాడులో పడ్డ వార్త సారాంశం
తెలుసుకుందాం.
తోట్లవల్లూరును మరచిపోలేను.
డాక్టర్ నోరి దత్తా త్రేయుడు
(తోట్లవల్లూరు, న్యూస్
టుడే- కేన్సర్ చికిత్సలో ప్రపంచ
ప్రఖ్యాత కీర్తి గడించిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గురువారం
కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో పర్యటించి తన చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు
వేసుకున్నారు. తాను చిన్నప్పుడు నివసించిన ఇంటిని సాంబశివరావు కొనుగోలు
చేసి కొత్తగా నిర్మించుకున్న ఇంటికి వెళ్లి
అంతా కలయతిరిగిచూసారు. ‘ఇక్కడో బావి
వుండాలే!’ అని ఆ ఇంట్లోవారిని వాకబు చేశారు. పమిడిముక్కల
మండలం ఘంటాడలో తాను జన్మించినా, కుటుంబ సభ్యులతో చిన్నతనంలో గడిపిన తోట్లవల్లూరును జీవితంలో మరచిపోలేనని
చెప్పారు. తనకు నామకరణం చేసిన కలగా పూర్ణచంద్ర శాస్త్రి ఇంటివద్ద
కొద్దిసేపు గడిపి వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకులు ప్రసాదంగా ఇచ్చిన చిట్టి గారెలు తిని దాదాపు
యాభై అరవై ఏళ్ళ నాటి సంగతులు గుర్తు
చేసుకున్నారు.)
ఈ వార్త కళ్లబడగానే కృష్ణారావు గారికి నెప్పల్లి ప్రసాద్ గారి అబ్బాయి పెళ్ళిలో జరిగిన సంఘటన
సినిమా రీలులా కళ్ళముందు కదలాడింది.
ప్రసాద్ గారు అమెరికాలో
పేరుమోసిన చార్టర్డ్ అక్కౌంటెంట్. వారి ఆహ్వానం మేరకు కృష్ణారావు గారు ఆ పెళ్ళికి
వెళ్లారు. అక్కడ ఆయనకు వూహించని అతిధి
తారసపడ్డారు. ఆయనే నోరి దత్తాత్రేయుడు గారు. ఆయన హస్తవాసికి తిరుగులేదు. క్షణం
తీరికలేని వైద్యులు. కేన్సర్ రక్కసి పీచమడిచే పనిలో పడి దేశదేశాలు తిరుగుతుంటారు.
ఇటీవల సోనియా గాంధీ గారికి వైద్యం చేసిన డాక్టర్ల బృందానికి ఆయనే నేతృత్వం వహించారని పత్రికల్లో వచ్చింది.
దత్తాత్రేయుడి గారికి నెప్పల్లి
ప్రసాద్ గారు అత్యంత ఆత్మీయులు. అందుకే
వారి కుమారుడి వివాహానికి అమెరికానుంచి రెక్కలు కట్టుకుని వచ్చారు. వారిని పెళ్ళిలో
చూడగానే కృష్ణారావు గారికి చిన్నప్పటి తోట్లవల్లూరు సంగతులు మదిలో
మెదిలాయి. దత్తాత్రేయుడు గారి కుటుంబం, కృష్ణారావు గారి కుటుంబం యాభయ్ , అరవై
ఏళ్ళనాడు ఆ వూళ్ళో ఒకే ఇంట్లో నివాసం వుండేవి. చిరకాలం నాటి బాల్య మిత్రుడు అన్నేళ్ల తరువాత తారసపడగానే కృష్ణారావు గారు ఆయనతో మాటలు
కలిపారు. మాటల మధ్యలో తోట్లవల్లూరు సంగతి ఎత్తారు. పెళ్ళిలో నలుగురి మధ్యవున్న
కారణంగానో యేమో ఆయన నుంచి వెంటనే స్పందన కాన రాలేదు. అయినా కృష్ణారావు గారు
నిరుత్సాహ పడలేదు. పెళ్ళయిన తరువాతో అంతకు ముందో కానీ, భోజనాల సమయంలో మరోసారి దత్తాత్రేయుడు గారితో ముచ్చటించే వీలు చిక్కించు కున్నారు.
చిన్నప్పటి సంగతులు కొన్ని గుర్తు చేశారు.
ఈ సారి ఆయన గుర్తుపట్టినట్టే అనిపించింది.
“ఎన్నో ఏళ్ళయింది తోట్లవల్లూరు
వెళ్లి. మేము అమ్మేసిన ఇల్లెలా వుంది? వూరేలా వుంది ?” అని అడిగారు.
‘వీలయితే ఈసారి
కలసివెడదాం’ అని కూడా అన్నారు.
“కోట పోయింది.
చదువుకున్న స్కూలు అలాగే వుంది. మనం ఆడుకున్న గుడీ అలానే వుంది. పక్కన కృష్ణానది
అందరి జ్ఞాపకాలను వొడిలో దాచుకుని అలాగే
పారుతోంది.” బదులు చెప్పారు.
అంతటితో ఆగలేదు.
చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలు, మసలిన మనుషులు అన్నింటినీ గుర్తుచేశారు.
“వేణుగోపాలస్వామి ఆలయం,
గుళ్ళో ప్రసాదంగా పెట్టే చిట్టిగారెలు, కట్టు పొంగలి రుచి, వాళ్లు వున్న ఇల్లు,
ఇంటి ముందు గిలక బావి, దొడ్లో బాదం చెట్టు” ఇలా ఒకటేమిటి గుర్తుకొచ్చినవన్నీ
పూసగుచ్చినట్టు చెప్పేశారు కృష్ణారావు గారు.
విందు పూర్తయింది.
పెళ్లయిపోయింది. ఇంటికి తిరిగివచ్చిన తరువాత కూడా కృష్ణారావు గారికి తోట్లవల్లూరు
గురించిన తలపులు వొదలలేదు. అది ఆయన సొంత వూరు
కాకపోయినా, దత్తాత్రేయుడు గారి మాదిరిగానే కృష్ణారావు గారికి కూడా ఆ వూరితో
మరచిపోలేని అనుబంధాలు, జ్ఞాపకాలు అనేకం వున్నాయి.
కృష్ణారావు గారి నాన్న
గారు రాయసం గంగన్న పంతులు గారు. దేవాదాయ శాఖలో ఉద్యోగి. చిన్న చిన్న దేవాలయాలను
పర్యవేక్షించే అధికారి. బదిలీ మీద కుటుంబాన్ని వెంట తీసుకుని తోట్లవల్లూరు
వెళ్లారు.
ఆ వూళ్ళో నోరి
సత్యనారాయణ గారింట్లో ఓ వాటా అద్దెకు తీసుకున్నారు.
సత్యనారాయణ గారికి నలుగురు
కుమారులు. పెద్దబ్బాయి నోరి రాధాకృష్ణ
మూర్తి గారు. ఐ.పి.ఎస్. అధికారి. పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ గానో ఆ పై
పదవిలోనో రిటైర్ అయ్యారు. పోలీసు ఉద్యోగంలో చేరక మునుపు ఆయన బందరు కాలేజీలో
లెక్చరరుగా పనిచేసేవారు.
రెండో కుమారుడు ఎన్.మధురబాబు
గారు. స్టేట్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్ చేశారు. ఇందిరాగాంధీ హయాంలో ప్రవేశపెట్టిన
గ్రామీణ బ్యాంకుల వ్యవస్థలో భాగంగా ఆంధ్ర
ప్రదేశ్ లో నెలకొల్పిన మొట్టమొదటి గ్రామీణ
బ్యాంక్ – నాగార్జున గ్రామీణ బ్యాంక్ కు మొదటి చైర్మన్ గా పనిచేసి సమర్ధుడయిన అధికారిగా పేరు
తెచ్చుకున్నారు. జ్యోతిష శాస్త్రంలో కూడా దిట్ట, మూడో కుమారుడు రామతీర్ధ
కాగా కనిష్ట కుమారుడు నోరి దత్తాత్రేయుడు
గారు. చిన్నప్పుడు ‘దత్తు’ అని పిలిచేవాళ్ళు.
కొత్త వూరిలో
కృష్ణారావుగారికి కొత్త స్నేహితులు లభించారు. ఆటపాటలతో కాలక్షేపం చేసేవారు. ‘అమ్మా
నాన్నా ఏదయినా పనిమీద బెజవాడ వెళ్ళాల్సి
వస్తే ఆ నాలుగు రోజులు తన భోజనం పడకా కూడా నోరి వారింట్లోనే’ అని కృష్ణారావు గారు నాతో ఈ విషయాలు చెబుతూ గుర్తు చేసుకున్నారు.
వారి తండ్రిగారి అకాల
మరణం తరువాత నోరి వారి మకాం బందరుకు మారిపోయింది.
కృష్ణారావు గారు మాత్రం
తండ్రిగారి ఉద్యోగరీత్యా తోట్లవల్లూరులోనే మరికొంత కాలం గడిపారు.
ఆ నాటి రోజులు గురించీ,
అప్పటి వాతావరణం గురించీ ఆయన మాటల్లోనే.
‘నదికి ఆనుకునే కాలవ. బెజవాడ
నుంచి లాంచీలు తిరుగుతుండేవి. శివ కామేశ్వరి, శివ పార్వతి, గంగ వాటి
పేర్లు.
‘నోరి వారి కుటుంబం
యావత్తూ కుసుమ హరనాధ బాబా భక్తులు. ఇంట్లో రోజూ
భజనలు. పూజలు. తండ్రి చని పోయిన తరువాత వారి కుటుంబం బందరు వెళ్ళగానే ఆ వాటాలోకి అప్పయ్య
శాస్త్రి గారు అద్దెకు దిగారు.
‘తోట్లవల్లూరులో వాళ్లు
వున్న ఇల్లు బాగా పెద్దదేమీ కాదు. ఉత్తర ముఖంగావున్న ఆ ఇంటి
ముందు గిలక బావి. దొడ్లో బాదం చెట్టు. కుడి పక్క
తాడికొండ వారి నివాసం. ఆ ఇంట్లోనే రామమందిరం. దాపునే తోట్లవల్లూరు కరణం గారయిన అడిదం వారి ఇల్లు. మరోపక్క గోవిందరాజుల వాళ్లు
వుండేవాళ్ళు. పోతే, శివలెంక వీరేశ
లింగం గారి ఇల్లు కూడా పక్కనే. వీరేశ
లింగం గారు పేరు మోసిన పెద్ద
జ్యోతిష్కులు. సినీ నటుడు ముదిగొండ లింగమూర్తి గారి వియ్యంకులు. మద్రాసునుంచి భానుమతి వంటి
ప్రముఖ సినీ కళాకారులు కూడా ఆయనను
కలవడానికి తోట్లవల్లూరు వచ్చేవాళ్ళు. వీరేశలింగం గారి అబ్బాయి ఎస్.వి.ఎం. శాస్త్రి గారు దక్షిణ మధ్య
రైల్వేలో ఉన్నతాధికారిగా పనిచేశారు. తోట్లవల్లూరులోని శివాలయానికి శివలెంక వారు
అనువంశిక ధర్మ కర్తలు.
‘వూళ్ళో వున్న పెద్దగుడి
వేణుగోపాలస్వామిది. ఆ గుడికి తగ్గట్టు పెద్ద గాలి గోపురం. దాని మీద పావురాళ్ళు. వాటి
రక్తం పూస్తే పక్షవాతం వంటి రోగాలు నయమవుతాయని చెప్పుకునే వాళ్లు. అది బొమ్మదేవరపల్లి
జమీందారులు కట్టించిన గుడి కావడం వల్ల
వైభోగానికి తక్కువలేదు. పూజలు, పునస్కారాలు,
ప్రసాదాల వితరణ ఘనంగానే జరిగేవి.
తిరునక్షత్రం నాడు పులిహోర చేసేవాళ్ళు. పర్లాంగు దూరంలో కృష్ణానది. ధనుర్మాసంలో ఆలయ అర్చకులు ఆ బావినుంచి
మంగళ వాయిద్యాలతో తీర్ధపు బిందెలు తెచ్చేవాళ్లు. మా పిల్లల ఆటలన్నీ గుళ్ళో పొగడ చెట్టు కిందనే.
‘మా వీధి లోనే
పోస్టాఫీసు. అన్నంభొట్లవాళ్లు టపా పని చూసేవారు. ఉయ్యూరు నుంచి
ప్రతిరోజూ ఒక భారీ మనిషి (పోస్టల్ రన్నర్)
తపాలా సంచీ మోసుకుంటూ అయిదుమైళ్లు గబగబా నడుచుకుంటూ తోట్లవల్లూరు వస్తుండేవాడు. పెద్ద పెద్ద అంగలు
వేస్తూ, చేతిలో వున్న పొడుగుపాటి బల్లేన్ని నేల మీద పోటు పొడుచుకుంటూ అతగాడు నడిచివస్తుంటే ఆ బల్లెం పైన కట్టిన
మువ్వలు అదోరకం శబ్దం చేస్తుండేవి.
‘తోట్లవల్లూరు జమీందారులు బొమ్మదేవర వంశీకులు వేణుగోపాలస్వామి
దేవాలయానికి అనువంశిక ధర్మకర్తలే కాదు,
దానికి కర్తా కర్మా క్రియా అన్నీ వాళ్ళే. జమీందార్ల దగ్గర ఏనుగుల్ని సంరక్షించే నాగయ్య
అనే వ్యక్తి తరువాతి రోజుల్లో ఈ గుడి వ్యవహారాలూ కనిపెట్టి చూసేవాడు. కృష్ణారావు గారి తండ్రి రాయసం గంగన్న
పంతులు గారు ప్రభుత్వం తరపున అంటే దేవాదాయ శాఖ తరపున ఆలయం బాధ్యతలు చూస్తుండే వారు. అప్పట్లో ఆయన నెల జీతం అరవై
రూపాయలు. కరవుభత్యం కింద ఇరవై రూపాయలు.
పైన మరో అర్ధ రూపాయి. ఆ వూరి మొత్తంలో నెలసరి అంత జీతం వచ్చేవాడు మరొకడు లేకపోవడం వల్ల
అది చిన్న జీతంగా ఆయన ఎప్పుడూ భావించలేదు. కాకపొతే అంత జీతం అన్నది ఆయనకు వూళ్ళో
ఒక ప్రత్యేకతను,అయాచిత గౌరవాన్ని
కట్టబెట్టింది.
గరుడవాహనంపై వేణుగోపాలస్వామి వారు
(1955 లో తీసిన ఈ ఫోటోలో కుడి నుంచి రెండో వ్యక్తి ఆలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అడిదెం కనక వీరభద్ర రావు గారు మూడో వ్యక్తి రాయసం గంగన్న పంతులు గారు, స్వామి వారి పక్కన ఆలయం ప్రధాన అర్చకులు పరాంకుశం అప్పలాచార్యులు గారు. పోతే, కూర్చున్న వారిలో కుడివైపు మొదటి కుర్రవాడు ఆర్.వీ.వీ. కృష్ణారావు గారు)
‘ఆ రోజుల్లో బెజవాడ
నుంచి తోట్లవల్లూరుకు ప్రైవేటు సర్వీసులవాళ్లు బస్సులు నడిపేవాళ్ళు.
ఒకటి రామాంజనేయ మోటార్ సర్వీస్,
రెండోది గోపాలకృష్ణా ట్రాన్స్ పోర్ట్. బస్సులమీద ఆ పేర్లు రాసివుండేవి. గోపాలకృష్ణా ట్రాన్స్
పోర్ట్ అని రాసి పక్కనే ‘ఇన్ లిక్విడేషన్’ అని కూడా
వుండేది. దాని అర్ధం ఇప్పటికీ తెలియదు. వీటిల్లో
రామాంజనేయా సర్వీసు బస్సు
ఖచ్చితంగా టైం ప్రకారం నడిచేది. ఒక బస్సు డ్రైవర్
పేరు సుబ్రహ్మణ్యం అని గుర్తు.
‘వెనుక బెజవాడ నుంచి రావాలంటే చుట్టూ తిరిగి రావాల్సివచ్చేది. ఇప్పుడు కృష్ణానది కరకట్ట
మీదుగా హంసలదీవి దాకా రోడ్డు
వేసారు. దాంతో రాకపోకలు సులువయ్యాయి.
‘తోట్లవల్లూరులో వున్న హైస్కూలే చుట్టుపక్కల వూళ్ళకు దిక్కు. వల్లూరిపాలెం
నుంచి ఆడపిల్లలు నడుచుకుంటూ స్కూలుకు
వచ్చేవాళ్ళు. పక్కనున్న భద్రిరాజుపాలెం నుంచి కూడా చదువుకోవడానికి పిల్లలు తోట్లవల్లూరు రావడం గుర్తు.
‘వూళ్ళో గుర్రబ్బళ్లు కూడా వుండేవి. ఒకరోజు బండి చక్రం కింద ఓ కుక్క
పిల్ల నలిగి చనిపోవడం చూసిన పిల్లలకు ఆ రోజు అన్నం తినబుద్దికాలేదు.’
తోట్లవల్లూరు గురించిన పాత సంగతులు కృష్ణారావు గారికి ఇంకా అనేకం గుర్తున్నాయని ఆయనతో
మాట్లాడుతున్నప్పుడు నాకనిపించింది.
పెళ్ళిలో కలసి కాకతాళీయంగా ఆయన చెప్పిన
నాలుగు ముచ్చట్లు నోరి దత్తాత్రేయుడి గారి తోట్లవల్లూరు పర్యటనకు ‘ప్రేరణ’ కావడం నా ఈ రచనకు ‘ప్రేరణ’గా మారింది. (28-11-2011)
12 కామెంట్‌లు:
Srinivasarao Uncle,
Chaala baaga raasaaru.Chaala baavundi Viseshaalu ilaa chadavadam
vyaasam loni maatalu jeevamtho tonikisalaaduthoo vunnaayi.aa naati jnaapakaalu maruvaraanivi-madhuramayinavi.abhinandanalu.-voleti venkata subbarao, hyderabad.
@Annapurna Sarada Rayasam - Very many thanks - Bhandaru Srinivas Rao
@susee- Very many thanks for the kind sentiments expressed - Bhandaru Srinivas Rao
అద్భుతంగా వుంది.. జీవితమంటే..అనుభవాలు... జ్ఞాపకాలేగా...
అద్భుతంగా వుంది.. జీవితమంటే..అనుభవాలు... జ్ఞాపకాలేగా...
అద్భుతంగా వుంది.. జీవితమంటే..అనుభవాలు... జ్ఞాపకాలేగా...
sir i had also interaction with thotlavalluru like krishnarao garu,i also studied in same school, same interaction with temples, river krishna from 1977 to 1983,thanks for sharing
you took back us to memorable child hood
కామెంట్‌ను పోస్ట్ చేయండి