నా ఈ సుదీర్ఘ జీవితంలో ఫోటోలకు ప్రాధాన్యత తక్కువ. నా జ్ఞాపకాలకు తగిన ఫోటోలు ఏవీ లేవు. ఆ రోజుల్లో కెమెరా అనేది ఒక లక్జరి. ఫోటో దిగడం అనేది ఒక గొప్ప ఘట్టం. ఫోటోలు దిగినా, వాటిని పదిలపరచుకోవడం మరింత కష్టమే కాదు, ఖరీదైన వ్యవహారం కూడా.
నేను
ఎక్కువకాలం పనిచేసిన హైదరాబాదు రేడియో స్టేషన్ మెయిన్ గేటు వద్ద, ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం అనే
పెద్ద బోర్డుతో పాటు, ఇది
నిషేధిత ప్రాంతం,
ఫోటోలు తీయరాదు అని స్ఫుటంగా రాసిన మరో హెచ్చరిక బోర్డు కూడా వుంటుంది. చాలా మంది
పెద్దవాళ్ళతో ఇంటర్వ్యూలు చేసినా కూడా గుర్తుగా దాచుకోవడానికి ఫోటోలు వుండవు.
స్టుడియోలో ఫోటో దిగాలి అంటే అదో పెద్ద తతంగం. నాంపల్లి స్టేషన్ దగ్గర రేడియో ప్యానెల్ ఫోటోగ్రాఫర్ ఒకరు ఉండేవాడు. ఫోటో అవసరం తెలియచేస్తూ ముందు పర్మిషన్ కోసం కేంద్రం అధికారికి తెలియచేయాలి. ఆయన అనుమతి
తీసుకున్న తరువాత మరో అధికారి ఆ ఫోటోగ్రాఫర్ కు ముందుగా తెలియపరచాలి. ఒక్కోసారి
అతడు దొరకడు. కొన్నిసార్లు అతడు దొరికినా
పిలిచిన అతిథి దేవుడికి ఆరోజు మరో ఏదో
జరూరు పనిపడి, రాలేకపోతున్నా అని చివరి నిమిషంలో కబురు చేయడం వల్ల అసలు
రికార్దింగే వాయిదా పడేది. అంచేత ఫోటో లేకపోతే కొంపలు మునగవు అనే నిర్ధారణకు రావడం
అలవాటయి పోయింది. రేడియోలో ప్రతి కార్యక్రమం కొన్ని నెలల ముందు షెడ్యూలు చేస్తారు, ఒక్క మా వార్తా విభాగం ప్రోగ్రాములు
తప్ప. అన్నీ చివరి నిమిషం వ్యవహారాలే. అంచేత ఫోటోలు దిగే పద్దతికి మేమే స్వస్తి
పలికే వాళ్ళ. దానాదీనా జరిగింది ఏమిటి అంటే ఎవరితో ఫోటోలు లేవు. ఇప్పుడు మరి
నిబంధనలు మారాయో, లేదా
మార్చుకున్నారో తెలియదు కానీ,
రేడియో రికార్దింగుల లైవ్ వీడియోలే సాంఘిక మాధ్యమాల్లో షికార్లు చేస్తున్నాయి. ఈ
ఒక్క విషయంలో ఈనాటి సిబ్బంది మాకన్నా అదృష్టవంతులే అని చెప్పాలి.
సోవియట్
యూనియన్ లో, రేడియో మాస్కోలో అయిదేళ్లు పనిచేస్తూ
వున్నప్పుడు నా దగ్గరే ఒక కెమెరా వుండేది. అది జర్మన్ కెమెరా. రష్యన్ కెమెరాలు
చాలా చౌక. మన్నికయినవి. కానీ తూకం ఎక్కువ. మోసుకు తిరగడం ఒక ప్రయాస. జర్మన్
కెమేరాతో ఫోటోలు తీసుకున్నా మాస్కో మొత్తం మీద కలర్ రీళ్ళను ప్రింట్ చేసే దుకాణం
ఒక్కటే వుండేది. పైగా ఇచ్చిన తరువాత ఎప్పుడు ప్రింట్లు ఇస్తారో తెలవదు. ఆ ఫోటోలను
స్క్రూటినీ చేసేవారని, అందుకే అంత ఆలస్యం అని చెవులు కొరుక్కునేవారు. ఎవరైనా
తెలిసిన వారు హైదరాబాదు వెడుతుంటే ఆ ఫోటో
రీళ్ళను వాళ్ళతో పంపి ప్రింట్స్ వేయించి తెప్పించుకునే వాళ్ళం. ఇది అంత ఆషామాషీ
పని కాకపోవడంతో ఫోటోలు తీయడం, తీసిన
రీళ్ళు చాలా కాలం వరకు అలాగే పడివుండడం జరిగేది. కొన్ని రోజుల తర్వాత అవి పనికి
రాకుండా పోయేవి. ఇత్యాది కారణాలతో మా మాస్కో జీవితానికి సంబంధించిన అనేక అపురూప
చిత్రాలు వెలుగు చూడలేదు. జ్ఞాపకాలుగా మిగలలేదు.
రేడియో
మాస్కోలో చేరడానికి వెళ్ళినప్పుడు, మొదటి రోజునే ఒక ఫోటో అనుభవం ఎదురైంది.
ప్రోపుస్కా ( గుర్తింపు కార్డు) కోసం మూడు పాస్ పోర్టు సైజు ఫోటోలు తీసుకురమ్మని
దగ్గరలో వున్న ఒక ఫోటో స్టూడియోకి పంపారు. అది చూస్తే తిరుణాల స్తుడియోలాగా వుంది.
ఒక పెద్ద కెమెరా. లైట్ అడ్జస్ట్ మెంటుకు గొడుగులు. ముసుగు కప్పుకున్న కెమెరా పెద్ద
మనిషి ఒకటి రెండు మూడు అని రష్యన్ లో అంటూ కెమెరా ముందున్న క్యాప్ తెరిచి వెంటనే
మూయడం అదంతా చూసినప్పుడు పాత తెలుగు సినిమాలు గుర్తుకు వచ్చాయి. ఒక న్యూస్ పేపరు
సైజులో ఫోటో ప్రింట్లు వరసగా వేసి ఇంటికి పోయి కత్తిరించుకోమని సైగలతో చెప్పాడు.
దాదాపు వంద పాస్ పోర్టు సైజు ఫోటోలు
ప్రింట్ చేసి ఇచ్చి ఒక రూపాయి (రూబులు) ఇస్తే, కొంత చిల్లర వెనక్కి ఇచ్చాడు.
డెబ్బయ్యవ దశకంలో నేను
విజయవాడలో కాలేజి చదువు
వెలగబెడుతున్నప్పుడు, నా చిన్ననాటి స్నేహితుడు, సహాధ్యాయి ప్లస్ మేనల్లుడు అయిన
తుర్లపాటి సాంబశివరావు (శాయిబాబు, ఇప్పుడు
లేడు) దగ్గర, నాగపూరులో కొనుక్కున్న ఒక
డబ్బా డొక్కు కెమెరా వుండేది. అది పని చేస్తుందా లేదా తెలుసుకోవాలి అంటే పదో పదిహేనో
రూపాయలు కావాలి. రీలు కొనడానికి ఓ పది, కడిగించి ప్రింట్లు వేయడానికి మళ్ళీ కొంతా ఇల్లాగన్న మాట.
అంత మొత్తం
మాదగ్గర ఎలాగూ వుండదు కాబట్టి, అదో
టాయ్ కెమేరాలాగా శాయిబాబు వద్ద చాలా కాలం ఉండిపోయింది.
ఒకరోజు
దాని అవసరం వచ్చింది. అదీ నాకు. అప్పటికి
చదువే పూర్తి
కాలేదు. పైగా ఉద్యోగం సద్యోగం అనేది కనుచూపుమేరలో లేదన్న సంగతి నిర్ధారణగా తెలిసిన
రోజుల్లో అన్నమాట. పక్కింటి అమ్మాయితో (అంటే తదనంతర కాలంలో మా ఆవిడ) నా ప్రేమ వ్యవహారం
నిరాఘాటంగా సాగిపోతున్న ఆ అద్భుత కాలంలో, నాకు ఆ కెమెరా కావాల్సి వచ్చింది. కృష్ణా బ్యారేజి దాకా నడుచుకుంటూ వెళ్లి
అక్కడి నుంచి గూడు రిక్షాలో మంగళగిరి పానకాల స్వామి దర్శనం చేసుకుని రావాలనేది నా
ప్లాను. మరో మేనల్లుడు రామచంద్రం మన కూడా వస్తేనే తను వస్తానని నాకు కాబోయే ఆవిడ
షరతు పెట్టడంతో,
ముగ్గురం కలిసి
వెళ్ళాము. దర్శనం
అదీ అయిన తర్వాత అక్కడి కొండపై ఇదిగో ఈ కింది ఫోటో దిగాము. తీసింది రామచంద్రం.
కెమెరా ఇచ్చేటప్పుడే చెప్పాడు శాయిబాబు, రీల్లో ఆల్రెడీ తీసిన ఫోటోలు కొన్ని వున్నాయి. డబ్బులు లేక
కడిగించలేదు, కాబట్టి
ఒకటీ లేదంటే రెండు, అంతే!
అంతకంటే ఎక్కువ దిగకండి అని. దాంతో ఒక్కటంటే ఒక్క ఫొటోనే దిగి కెమెరా తిరిగి
ఇచ్చేశాను.
ఆ రీలు
కడిగించే డబ్బులు కూడబెట్టడానికి మరి కొన్ని నెలలు ఆగాల్సివచ్చింది. వీరన్న
స్టూడియోలో ఇచ్చాము. రెండు రోజుల తర్వాత చూస్తే రీల్లో చాలా ఫోటోలు ప్రింటుకు పనికిరానివని తేలింది.
చివరికి ఐదో ఆరో బాగున్నాయి. కానీ అన్నీ ప్రింటు వేయించాలి అంటే డబ్బులు సరిపోవు.
అంచేత ఓ మూడు వేయించాము. అందులో ఇదొకటి.
పెళ్ళికి
ముందు ఫోటో కదా! అదో స్వీట్ మెమొరి.
పరీక్షలకోసం
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీయించుకోవడం తప్ప మా చిన్నతనంలో విడిగా కావాలని ఫోటో దిగడం
అనేది అబ్బురమే. అసలు కెమెరా అనేది చాలామంది ఇళ్ళల్లో కనిపించేది కాదు. రేడియో,
కెమెరా
ఉన్నాయంటే కలిగినవాళ్ళని అర్ధం.
అలాంటిది
నేను ఓ యాభయ్ ఏళ్ళక్రితం
ఫోటో దిగాను అంటే నేనే నమ్మను. కానీ ఏం చెయ్యను కళ్ళెదుట కనిపిస్తుంటే...
నేను
బెజవాడ ఎస్సారార్ కాలేజీలో చేరకముందు కాంగ్రెస్ ఆఫీసు రోడ్డులోని సింహాలమేడలోని
అనేకానేక వాటాల్లో ఒక దానిలో అద్దెకు వుండేవాళ్ళం. (మా పెద్దన్నగారనుకోండి). ఆ మేడ
ఆవరణలోనే రోడ్డుకు ఆనుకుని విశ్వా టైప్ రైటింగ్ ఇన్స్తిటూట్ వుండేది. అందులో
సూర్యనారాయణ అని పనిచేస్తుండేవాడు. మాంచి హుషారు మనిషి. ఎప్పుడూ క్రాఫు చెదరకుండా
దసరా బుల్లోడిలా ఉండేవాడు. ఆ రోజుల్లో స్కూలు ఫైనల్ పాసయిన ప్రతి వాడూ టైప్
నేర్చుకోవాలని అనుకునేవాడు. ఆ డిప్లొమా చేతిలో వుంటే ప్రభుత్వ ఉద్యోగం తేలిగ్గా
వస్తుందని. అమీర్ పేటలో జావాలు, ఆ ప్లస్
లూ, ఈ ప్లస్ లు నేర్చుకునే వాళ్ళ మాదిరిగా
అనుకోండి.
ఆ
సూర్య నారాయణ చాలా ఏళ్ల తరువాత ఫేస్ బుక్ ద్వారా నన్ను పట్టుకుని వాట్స్ అప్ లో
మూడు ఫోటోలు
పంపాడు. టీవీల్లో నన్ను చూస్తుంటాడట. పేరేమో భండారు శ్రీనివాసరావు అని చెబుతారు,
మనిషి
చూస్తేనేమో వేరేగా వున్నాడు, అసలు ఆయనా
ఈయనా ఒకరేనా అనే అనుమానంతో నాకు ఫోన్ చేసి అడిగాడు, టీవీల్లో కనిపించేది నువ్వేనా అని.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసిన దాసు మధుసూదనరావు గారు కూడా ఇందులో
వున్నారు.
ఫోటోలు
చూసిన తర్వాత ఆ అనుమానం ఎవరికైనా వస్తుంది. అప్పుడు సన్నగా రివటగా వుండే వాడిని.
మా ఆవిడేమో మద్రాసు
ఆంధ్రా మెట్రిక్. నాకు ‘వొట్రకంబు’ అని నిక్ నేమ్ పెట్టింది. (అప్పటికి పెళ్లి
కాలేదు, ప్రేమ
లేఖల స్థాయిలోనే వుంది. ఆ మాటకు అర్ధం పెళ్ళయిన తర్వాత చెప్పింది. వొట్రకంబు అంటే
ఇళ్ళల్లో పాజుట్లు (బూజు) దులిపే కర్ర) అని.
సరే!
ఏం చేస్తాం!
ఇప్పుడు
సూర్యనారాయణ పంపిన పాత ఫోటోలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది.
కింది
ఫోటోలు
(ఇంకా
వుంది)
2 కామెంట్లు:
// “ ఇది నిషేధిత ప్రాంతం, ఫోటోలు తీయరాదు అని స్ఫుటంగా రాసిన మరో హెచ్చరిక బోర్డు కూడా వుంటుంది.” //
ఎందుకని భండారు వారూ ?
ఆకాశవాణి భవనాన్ని బయట నుంచి ఫొటో తీసుకోవడంలో ప్రమాదం ఏమిటి ?
విన్నకోట వారికి : రేడియో రాజ్యం ఏలే రోజుల్లో నిబంధన కావచ్చు. పూర్వం ఏ దేశంలో అయినా తిరుగుబాటు జరిగినప్పుడు సాధారణంగా వార్తల్లో తిరుగుబాటుదారుల స్వాధీనంలోకి దేశం వచ్చింది అని చెప్పడానికి తాము రేడియో ద్వారా ఆ విషయం ప్రకటించడం ఒక రివాజుగా వుండేది. రేడియో కేంద్రాన్ని వశపరచుకోవడం అంటే యావత్ దేశం వారి స్వాధీనంలోకి వచ్చింది అని జనాలు నమ్మేవారు. బహుశా ఈ కారణం చేత రేడియో కేంద్రాన్ని నిషేధిత ప్రాంతంగా పరిగణించేవారేమో! కమ్యూనికేషన్ వ్యవస్థ విస్తరించడంతో ఇప్పుడు ఆ అవసరం లేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి