(ఎటో వెళ్ళిపోయింది మనసు)
పాత విషయాలు కదా తేదీలు సంవత్సరాలు సరిగా గుర్తుండడం లేదు.
తిరుపతికి దగ్గరలో, మరీ అంత దగ్గర కాదు, శ్రీ సిటీ అనే ఒక సెజ్ రూపు దిద్దుకుంటోంది. ఆ సంస్థ పీఆర్వో కి మాకు ఆ సిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూపించాలనే సత్సంకల్పం కలిగింది. జర్నలిస్టు శంకర్, జ్వాలా నేను. తిరుపతిలో స్వామి దర్శనం అనే మాట మమ్మల్ని మరో మాట మాట్లాడ నివ్వలేదు. హైదరాబాదు నుంచి విమానంలో చెన్నై వెళ్లి, అక్కడి నుంచి శ్రీ సిటీ కారులో అక్కడికి చేరడం మా ప్రోగ్రాం.
సుమారు ఏడుగంటల ప్రాంతంలో చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగగానే జ్వాలా రాజ్ భవన్ కు ఫోన్ చేసి తుల్జానంద్ సింగ్ తో మాట్లాడాడు. ఆయన వెంటనే రాజ్ భవన్ కు ఆహ్వానించారు. ఒక రకంగా చెప్పాలంటే చెన్నైలో దిగేంతవరకు ఈ రాజ్ భవన్ సందర్శన కార్యక్రమం లేదు. ఏ వూరు పోయినా ఆ వూళ్ళో ఎవరెవరు తెలిసిన వాళ్ళు వున్నారో వాళ్లకి ఫోను చేయడం కాని, వీలయితే కలిసిరావడం కానీ జ్వాలా పీఆర్ లో ఒక భాగం.
తుల్జానంద్ రండి రండి అంటూ ఆహ్వానం పలకడం, మేము ప్రయాణిస్తున్న వాహనం రూటు మార్చుకుని రాజ్ భవన్ లోకి దూసుకుపోవడం జరిగింది. లోపలకు వెళ్ళగానే అప్పుడే వాకింగ్ నుంచి వస్తూ గవర్నర్ రోశయ్యగారు కనబడ్డారు. అందర్నీ పేరు పేరునా పేరుతొ పలకరించి, ఎలావున్నారు, ఎప్పుడొచ్చారు ఎన్నాళ్ళు వుంటారు అని కుశల ప్రశ్నలు వేసారు. వెంటనే వెళ్ళాలని చెప్పాం. కుర్చీలు తెప్పించి బయట లాన్ లో వేయించారు. రాజ్ భవన్ కదా మర్యాదలు మామూలే. టీ తాగుతూ పిచ్చాపాటీ. ఒకరకంగా గత కాలపు ముచ్చట్లే. పాత కబుర్లు చెబితే రోశయ్యగారే చెప్పాలి. ఆయన ధారణ శక్తి అసాధారణం. ఎప్పటెప్పటివో సంగతులు చెప్పారు. తెనాలి, గుంటూరు, విలేకరులను ఆయన పేర్లతో సహా గుర్తు పెట్టుకోవడం గమనించి ముచ్చటేసింది.
పనిలోపనిగా చెన్నై రాజ్ భవన్ ముచ్చట్లు. ఒకప్పుడు అది సుమారు పదమూడువందల ఎకరాల్లో వుండేది. చాలావరకు దట్టమైన అడవి. మేము కూర్చున్న చోటుకు దగ్గర్లో కొన్ని హరిణాలు తచ్చాడుతూ కనిపించాయి. ప్రస్తుత రాజ భవన్ విస్తీర్ణం బాగా కుదించుకు పోయినా, ఇంకా వంద ఎకరాల పైమాటే. రాజ్ భవన్ లో విశాలమైన ప్రాసాదాలు గవర్నర్ నివాసంకోసం వున్నప్పటికీ, రోశయ్య గారు వాటి జోలికి పోకుండా పక్కనే వున్న ఓ చిన్న గెస్ట్ హౌస్ లో మకాం చేస్తున్నారు.
'వుండేది నేనూ నా భార్య ఇద్దరమే. మరీ పెద్ద ఇళ్ళల్లో అయితే ఒకరినొకరం వెతుక్కోవాలి.'
చిన్న భవనంలో వుంటున్నందుకు రోశయ్యగారు ఇచ్చుకున్న సంజాయిషీ అది.
కాసేపు కబుర్లు చెప్పుకుని, తుల్జానంద్ సింగ్ ఫోటోలు తీయగా తీయించుకుని, రోశయ్య గారికి నమస్కారాలు, ధన్యవాదాలు చెప్పి మళ్ళీ రోడ్డున పడ్డాము. దోవలో శరవణ భవన్ కనిపిస్తే టిఫిన్లు, కాఫీల పనిపూర్తి చేసుకుంటుంటే జ్వాలా ఎవరితోనో తెలుగులో ఫోన్లో మాట్లాడుతూ కన్పించాడు. దాంతో మరో స్టాప్ అనివార్యం అని తేలిపోయింది.
అప్పుడీ గూగుల్ మ్యాపులు లేవు. దోవలో దారి కనుక్కుంటూ కువైట్ శర్మ గారింటికి వెళ్ళాము. నిజానికి ఆయన బాంబే శర్మగారు. షిప్పింగ్ కార్పొరేషన్ లో పనిచేసేవారు. అప్పుడెప్పుడో ఏదో పని మీద బాంబే వెడితే (అప్పటికి ముంబై కాలేదు) ఆయన జ్వాలని, నన్నూ ఒకరోజంతా షిప్పులో అతిధులుగా మర్యాదలు చేశారు. బీరు సీసాల్లో కాకుండా టిన్నుల్లో దొరుకుతుందన్న లోకజ్ఞానం అప్పుడే కలిగింది. . ప్రపంచంలో దొరికే అరుదైన స్కాచ్ విస్కీలు అన్నీ ఆ షిప్ బార్లో వున్నాయి.
ఆ తర్వాత శర్మ గారు కువైట్ వెళ్ళిపోయారు. అక్కడ ఉండగానే యుద్ధం వచ్చి ఆ దేశంలో ఉన్న భారతీయులు అందరూ కట్టుబట్టలతో స్వదేశం చేరుకోవాల్సి వచ్చింది. అలా కాందిశీకులుగా దేశం చేరుకున్నవారిలో శర్మ గారి కుటుంబం కూడా వుంది. పిల్లలు పెరిగి పెద్దయి, పెళ్ళిళ్ళూ పేరంటాలు అయిన తర్వాత ముందు ఢిల్లీలో, తర్వాత చెన్నైలో సెటిల్ అయ్యారు.
ఆయన ఇంటికి వెళ్ళే సరికి శర్మ గారికి ఒంట్లోబాగాలేదని తెలిసింది. పడక పక్కన ఆక్సిజన్ సిలిండరు వగైరా. మమ్మల్ని చూడగానే ఒంటిమీద అంటించిన తీగెల్ని సినిమాలో హీరోలా పీకి పారేసి డ్రాయింగు రూములో మా దగ్గర కూర్చుని హుషారుగా కబుర్లు మొదలు పెట్టారు. శర్మ గారి భార్య కూడా సంతోష పడింది, ఆయనలో మార్పు చూసి.
తర్వాత అడంగు శ్రీ సిటీ. కొన్ని వేల ఎకరాల్లో విస్తరించి వుంది. అక్కడ తయారయ్యే వస్తువులు అన్నీ ఎగుమతికి ఉద్దేశించినవి కాబట్టి అక్కడ కష్టమ్స్ అధికారుల అనుమతి లేకుండా లోపలకు బయటకు రాకపోకలు నిషిద్ధం. అయితే ముందస్తు ఏర్పాట్ల కారణంగా మా వాహనానికి గేట్లు బార్లా తెరుచుకున్నాయి. గెస్ట్ హౌస్ లో దిగి కాసేపు విశ్రాంతి. సెజ్ ఉన్నతాధికారులతో ఇష్టాగోష్టి మాటలు. ఆ తర్వాత మమ్మల్ని సెజ్ లోని వివిధ ఉత్పత్తి విభాగాలకు తీసుకు వెళ్ళారు. విశాలమైన రోడ్లు. చల్లటి నీడనిస్తూ బాగా పెరిగిన చెట్లు. కాలిబాటలు. వాటికి కూతవేటు దూరంలో పెద్ద పెద్ద భవనాలు. ఫాక్టరీ షెడ్లు.
మెత్తటి దూది కూరిన బొమ్మలు తయారు చేసే ఫాక్టరీకి వెళ్ళాము.
నా చిన్నప్పుడు మా నాన్నగారు చెన్నపట్నం నుండి ఓ దూది (కూరిన) చిన్న కుక్క బొమ్మ తెచ్చారు. యెంత ముద్దొచ్చేదో!
పెరిగి పెద్దయి మాస్కోలో ఉద్యోగం చేసే రోజుల్లో అక్కడ బొమ్మలే బొమ్మలు. సోఫాలో కూర్చోబెడితే మనకంటే పెద్దగా కనబడే భారీ సైజు ఎలుగుబంటి బొమ్మ నాకు ప్రాణసమానంగా వుండేది. అదేమిటో ఏండ్లు మీద పడుతున్నా బొమ్మలన్నా, చందమామ పత్రిక అన్నా మోజు రోజు రోజుకూ పెరిగిపోతూనే వుంది.
శ్రీ సిటీలో వున్న బొమ్మల ఫాక్టరీ చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు తయారు చేసే ఫాక్టరీ అయినా చాలా పెద్దగానే వుంది. చైనా వాళ్ళది కాబోలు. (Pals Plush Ltd., China). ఇక్కడి వ్యవహారాలను శ్రీమతి సీమా నెహ్ర పర్యవేక్షిస్తున్నారు. వెంట వుండి అందులోని విభాగాలను అన్నీ చూపించారు. ఎగుమతుల వ్యవహారం కాబట్టి నాణ్యతలో రాజీపడే ప్రసక్తి వుండదు. పిల్లల బొమ్మలు కాబట్టి వాటితో ఆడుకునే చిన్నారులకు ఎలాటి అనారోగ్యసమస్యలు, ప్రమాదాలు కలగకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాల్లో ఏమాత్రం తభావతు వచ్చినా ఇంతే సంగతులు. మొత్తం సరుకు తిప్పి పంపిచేస్తారు. ఇన్ని ప్రమాణాలు పాటించే ఈ యూనిట్ లో పనిచేసేవాళ్ళు చాలామంది ఆ చుట్టు పక్కల వుండే జనాభాలో అరకొర చదువులు చదివిన వారే కావడం గమనార్హం. వారికి సాంకేతిక పరమైన శిక్షణ ఉచితంగా ఇచ్చి ఉపాధులు కూడా అక్కడే కల్పిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి