(చరిత్ర గతిని మార్చిన గోర్భచేవ్)
గోర్భచేవ్ ని అరెస్టు చేసిన 1991, ఆగస్టు 18 న ఏమి జరిగింది అనే దానిపై విభిన్న కధనాలు ప్రచారంలో
వున్నాయి. ఎందుకంటే ఆ రోజుల్లో పత్రికలు
ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తుండేవి.
బాగా విస్తృతంగా ప్రచారం పొందిన ఒక
కధనం ప్రకారం, ఆరోజు
క్రైమియా నల్ల సముద్ర తీరంలో సోవియట్ యూనియన్ అధ్యక్షుడి వేసవి విడిది ‘ఫోరొస్’ భవనపు గేట్ల దగ్గర అయిదు ఓల్గా కార్లు
వచ్చి ఆగాయి. అప్పటి సోవియట్ ప్రెసిడెంట్ మిహాయిల్ గోర్భచెవ్ ఆ భవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
గట్టి భద్రత ఉన్న ప్రాంతం. ఎవరైనా ఆగంతకులు వాహనాల్లో దూసుకువస్తే వాటి టైర్లు
పంక్చర్ చేయడానికి ఆ మార్గంలో ఏర్పాట్లు వున్నాయి. మొదటి కారు నుంచి కేజీబీ
అత్యున్నత అధికారి యూరి ప్లీకనోవ్ దిగారు. సోవియట్ అధ్యక్షుడి భద్రతా ఏర్పాట్లు
కనిపెట్టి చూసే బలగాలు ఆయన పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. ఆయన్ని చూడగానే రెడ్ స్టార్లు కలిగిన ఆ భారీ పచ్చటి ఇనుపగేట్లు
తెరుచుకున్నాయి. పీకనోవ్ తో పాటు అయిదుగురు కేజీబీ అధికారులు, సైనికాధికారులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, వారి అంగరక్షకులు ఆ విడిది గృహంలోకి దూసుకు వెళ్ళారు. ఆ సమయంలో
వాళ్ళు వస్తారని ఏమాత్రం సమాచారం లేని ప్రెసిడెంట్ గోర్భచెవ్, ఆశ్చర్యపోతూ కేజీబీ చీఫ్
వ్లాదిమిర్ కృశ్చెవ్ తో
మాట్లాడడానికి ఫోను చేయడానికి ప్రయత్నించారు. కానీ లైన్ కట్టయింది. ఒకనాటి సోవియట్
అధినేత నికితా కృశ్చెవ్ ఉదంతం
గుర్తుకువచ్చింది. 1964 లో కృశ్చెవ్ ఇలాగే నల్ల సముద్ర తీరంలో విశ్రాంతిగా రోజులు
గడుపుతున్నప్పుడు ఆయన్ని హఠాత్తుగా పదవి నుంచి తొలగించారు.
తన ఇంటికి హఠాత్తుగా వచ్చిన కేజీబీ
అధికారులని చూసి మొదట్లో ప్రెసిడెంట్ గోర్భచెవ్
కంగారు పడ్డారని అధికారిక వర్గాల సమాచారం.
“నన్ను అరెస్టు చేస్తున్నారా?” అని గోర్భచేవ్ ఆ అధికారులని ప్రశ్నించారు. అలాంటిది ఏమీ లేదని వాళ్ళు
బదులు చెప్పారు. అరెస్టుచేసి తీసుకుపోవడంలేదని హామీ ఇచ్చిన తరువాత ఆయన కొంత
స్థిమితపడ్డట్టు కనిపించింది. దానితో వాళ్ళు తనముందు పెట్టిన డిమాండ్లని
అంగీకరించడానికి అయన నిర్ద్వందంగా
తిరస్కరించారు.
“మీరు నమ్మక ద్రోహులు. దీనికి తగిన
మూల్యం చెల్లిస్తారు, తప్పదు” అంటూ ఆయన వారిని హెచ్చరించారు. వాళ్ళు మాస్కో తిరిగి వెళ్ళిన తర్వాత
కొన్ని రోజులు గోర్భచేవ్ దంపతులు ఫోరొస్ విడిదిలోనే గృహ నిర్బంధంలో వుండిపోయారు. ఇంట్లో ఉన్నారన్న మాటే కానీ
వారిద్దరూ చాలా భయం భయంగా రోజులు గడిపారు.
ఏది తిందామన్నా భయమే. ఏది తాగాలన్నా భయమే.
దేంట్లో విషం కలిపారో తెలవదని రైసా తర్వాత ఒక దర్యాప్తు అధికారితో
చెప్పారు.
మరునాడు, ప్రెసిడెంట్ గోర్భచెవ్ వద్ద వైస్ ప్రెసిడెంటుగా పనిచేసిన గెన్నదీ
యనఏవ్ మాస్కోలో విలేకరులతో మాట్లాడారు. ‘ప్రెసిడెంట్ మిహాయిల్ గోర్భచెవ్ సెలవులో వున్నారు. అందుచేత తాను ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు’
వెల్లడించారు.
‘ప్రెసిడెంట్ సెలవులో వున్నారు’ అని యనయేవ్ ప్రకటిస్తున్నప్పుడు ఆయన గొంతు కంపించడం, చేతులు వణకడం టీవీ తెరలపై ప్రపంచం
యావత్తు చూసింది.
“ప్రెసిడెంట్ గోర్భచెవ్ నల్ల సముద్ర
తీరంలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం కులాసాగానే వున్నారు. త్వరలోనే
మళ్ళీ విధులకు హాజరవుతారు” అని ఆయన చెప్పారు.
ఆగస్టు పరిణామాలపై రష్యన్ అధికారిక
వార్తాసంస్థ టాస్ కధనం:
1991 ఆగస్టు పరిణామాలను గురించి టాస్ విలేకరి జమ్యతినా
తమారా తన కధనంలో ఇలా పేర్కొన్నారు.
“1991 ఆగస్టు 19 వ తేదీ ఉదయం సోవియట్
న్యూస్ చానళ్ళలో మామూలు వార్తా కార్యక్రమాలను నిలిపివేసి స్వాన్ లేక్ బాలే ప్రసారం
చేస్తూ వుండడం చూసిన ప్రజలు, దేశ నాయకుడు ఎవరైనా చనిపోయారేమో అని భావించారు. కానీ ఇంతలోనే మరో
ఊహించని వార్త బయటకు వచ్చింది. సోవియట్ ప్రెసిడెంట్ మిహాయిల్ గోర్భచేవ్ ఆరోగ్యం
బాగాలేక, ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో లేరన్నది
ఆ వార్తసారాంశం. అత్యవసర పరిస్తితుల్లో ఏర్పాటయిన అధినాయక సంఘానికి ప్రెసిడెంట్
బాధ్యతలు బదిలీ అవుతాయని కూడా వెల్లడించారు. కొత్తగా ఏర్పాటయిన ఈ కమిటీ దేశంలో
రాజకీయ పార్టీల కార్యకలాపాలను, ర్యాలీలు, ప్రదర్శనలను నిషేధించింది. పత్రికలపై ఆంక్షలు విధించింది.
రష్యన్ రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడిగా
ఎన్నికయిన బోరిస్ ఎల్త్సిన్ ఈ ఉత్తర్వులను తిరస్కరించారు. ఎల్త్సిన్ అయన అనుయాయులు
మకాం చేసిన రష్యన్ పార్లమెంటు భవనానికి వెళ్ళే అన్ని దారులను వీధుల్లోకి వచ్చిన
వేలాదిమంది రష్యన్లు దిగ్బంధనం చేసారు. బోరిస్ ఎల్త్సిన్ కు మద్దతుగా
నిలిచారు. కమిటీకి ఈ పరిణామాలు మింగుడు
పడలేదు. వారిలో నైతిక స్తైర్యం దెబ్బతిన్నది. రక్తపాతాన్ని నివారించడం మంచిదనుకుని
తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.
ఆగస్టు 21 వ తేదీన అప్పటి సోవియట్ వైస్
ప్రెసిడెంట్ అలెక్జాండర్ రుత్స్కోయ్ గోర్భచేవ్ సెలవులు గడుపుతున్న క్రైమియా లోని
ఆయన గెస్ట్ హౌస్ కి వెళ్ళారు. ఆ రాత్రికే వారు మాస్కో తిరిగివచ్చారు కానీ అప్పటికే
గోర్భచేవ్ భవితవ్యం, సోవియట్ యూనియన్ భవితవ్యం రెండూ నిర్ధారణ అయ్యాయి. తర్వాత జరిగిన పరిణామాలలో
సోవియట్ రిపబ్లిక్కులు ఒక్కొక్కటిగా స్వాతంత్రం ప్రకటించుకుంటూ పోయాయి. 1991
డిసెంబరు కల్లా సోవియట్ యూనియన్ చరిత్ర పుటల్లో చేరిపోయింది” (ఇంకావుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి