16, ఏప్రిల్ 2020, గురువారం

మహాభారతంలో కూటనీతి – భండారు శ్రీనివాసరావు


(ఎటో వెళ్ళిపోయింది మనసు)
పేరుకు తగ్గట్టే మంచి రాజుకు ఉండాల్సిన  సుగుణాలు అన్నీ కురుసార్వభౌముడు సుయోధనుడికి  వున్నాయి.  అయితే, అతడి దురదృష్టం,  అసూయ అనే దుర్గుణం ఒక్కటే అతగాడి  వినాశనానికి హేతువు అయింది.
దాయాది ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యాగానికి వెళ్లి వచ్చిన తర్వాత అతడిలో ఈ మత్సరం మరింతగా  వెర్రి తలలు వేసింది. లక్కఇంటిని తగలబెట్టి పంచపాండవులను హతమార్చాలనే పన్నాగం బెడిసి కొట్టడంతో దుర్యోధనుడిలోని అసూయాద్వేషాలకు అంతం లేకుండా పోయింది.
ఈ నేపధ్యంలో కౌరవ సలహాదారులలో ఒకడయిన కణికుడు దుర్యోధనుడికి ఇచ్చిన సలహాలు కూటనీతి పేరిట ప్రాచుర్యం పొందాయి. ప్రత్యర్ధుల పీచమణచడానికి ఉద్దేశించిన ఈ కుటిల పన్నాగాలకు సంబంధించి   మహాభారతంలో ఏకంగా ఒక అధ్యాయమే వుంది. కాకతాళీయమో ఏమో తెలియదు కానీ ఈనాటి రాజకీయులు కణికుడు బోధించిన ఆ కూటనీతినే పాటిస్తున్నట్టు అనిపిస్తుంది.
ఆ కూటనీతి ప్రకారం రాజు అనేవాడు శత్రురాజుపై హమేషా ఓ కన్నేసి ఉంచాలి. తనకు నమ్మకస్తులైన సాటి రాజులను వైరి రాజుకు అనుకూలంగా మాట్లాడేటట్టు చేయాలి.
దేశ సంచారం చేసే కొంతమంది పండిత శ్రేష్టులను మచ్చిక చేసుకుని వారి ద్వారా ఇరుగుపొరుగు రాజ్యాల్లో తన మంచితనం గురించి, తన సామర్ధ్యం గురించి తన సుపరిపాలన గురించి సానుకూల ప్రచారం ప్రజాబాహుల్యంలోకి చొచ్చుకు పోయేలా చేయాలి.
విశ్వాసపాత్రులయిన తన సొంత మనుషులను  కొంతకాలంపాటు శత్రు దేశపు రాజు కొలువులో చేర్పించి వారి ద్వారా అతడి లోగుట్లను, బలహీనతలను గురించిన సమాచారం తనకు ఎప్పటికప్పుడు అందేలా ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళు వైరి ప్రభువుల ఎదుట తనను తూలనాడుతూ ఆ రాజు నమ్మకాన్ని చూరగొనేలా చూసుకోవాలి.
ఇలా అనేకానేక బోధలు ఈ కూటనీతిలో వున్నాయి.
అవన్నీ ఆ గాంధారిసుతుడు ఎన్ని ఏమేరకు ఆచరించాడో లేదో తెలియదు కానీ మహాభారతంలో పేర్కొన్న ఆ కూటనీతి శాస్త్రాన్ని ఈనాటి రాజకీయ నాయకులు పుణికి పుచ్చుకుని అక్షరం పొల్లు పోకుండా ఆచరణలో పెడుతున్నారు.
‘ఎందుకైనా మంచిది అతడిపై ఓ కన్నేసి ఉంచు’ అంటుంది సినిమాలో ఓ దుష్ట పాత్ర. ‘ఒక కన్నేమిటి రెండు కళ్ళూ అతడిమీదనే’ అంటుంది అతడి సహాయక దుష్టపాత్ర.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు అసెంబ్లీ లాబీ విశేషాలు సేకరించే విలేకరులు కొందరు లాబీలో ఒక చోట చేరి ఆ వైపుగా వచ్చిన ఒక మంత్రితో పిచ్చాపాటీ మాటలు కలిపారు. మూడు దశాబ్దాల అనుభవం వున్న ఓ సీనియర్ పాత్రికేయుడు హాస్యోక్తిగా ఆయనపై ఓ వాక్బాణం విసిరి, అది విని అక్కడ ఉన్న  అందరూ పెద్దగా నవ్వుతుండగా మెల్లగా నడుచుకుంటూ దగ్గరలో వున్న ముఖ్యమంత్రి ఛాంబర్లోకి వెళ్ళాడు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి.  ఆ విలేకరిని  చూస్తూనే ముఖ్యమంత్రి ఒక చిరునవ్వు నవ్వి, ‘ఏమిటి మా మంత్రిని అలా  ఆట పట్టిస్తున్నావ్’ అని అడిగారు. జరిగి  నిమిషాలు కూడా  గడవక ముందే ఈ విషయం సిఎం చెవులకు ఎవరు చేరవేసారా అని ఆశ్చర్య పోవడం ఆ విలేకరి వంతయింది.
అలా పనిచేస్తాయి ప్రభుత్వ నిఘా వర్గాలు. టెర్రరిస్టులు, అసాంఘిక శక్తుల కదలికలు కనిపెట్టి వారి ఆనుపానులు సంబంధిత అధికార వర్గాలకు అందచేయడం వారి ప్రాధమిక బాధ్యత. కానీ వాళ్ళు ఎక్కువగా దృష్టి సారించేది ప్రత్యర్ధి పార్టీల నాయకుల మీద. నిఘా విభాగంలో పనిచేసిన అధికారే మరో విశేషం ఓ సందర్భంలో చెప్పారు. తన సొంత పార్టీ  నాయకుల గురించిన సమాచారం మీదే ఎక్కువమంది ముఖ్యమంత్రులు ఆసక్తి చూపేవారట.
అలా మహాభారత కాలంనాటి ఆ కూటనీతి నేటి భారత కాలంలో ఇలా వూడలు దిగి విస్తరిస్తోంది.   

కామెంట్‌లు లేవు: