26, జులై 2016, మంగళవారం

రేడియో భేరి - 4

రేడియో శైలి

తొలి ప్రసారాలనుబట్టి – మద్రాసు కేంద్రం వివిధ ప్రక్రియలలో ప్రసారం చేసేదని తెలుస్తోంది. సాహిత్య విషయాలను గురించే కాకుండా ఇతర అంశాలను గురించి సరళమైన భాషలో ప్రసారాలు మొదలు పెట్టింది. ప్రసంగాలనే కాక నాటకాలను, గేయాలను వినిపించింది. ఏకొందరో తప్ప చాలామంది సరళమైన భాషలోనే ప్రసంగాలు చేసేవారు. రేడియో ప్రసంగం కానీ, నాటకం కానీ వినగానే మొదటిసారే అర్ధం కావాలి. అంటే కఠినమైన, అన్వయం కల పొడుగుపాటి వాక్యాలు పనికిరావు. భాష సమాస భూయిష్టం కాకుండా తేలికగా వుండాలి. ‘మయ నాగరికత గురించి మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రసంగం రేడియో పద్ధతిలో రాసినట్టు కనిపిస్తుంది. తేట తెలుగులో రాసిన ఆ ప్రసంగం నుంచి కొన్ని వాక్యాలు. ‘ఈ యుగం యెంత చిత్ర మైనదో. ఇదంతా పరిశోధన యుగం. వైజ్ఞానిక యుగం. ప్రతి విషయంలోను పరిశోధనే.! నిప్పూ నీరూ, గాలీ ధూళీ .... ఇంతెందుకు.. మన....పంచేంద్రియాల ద్వారా గ్రహించే ప్రతి విషయమూ అఖండ పరిశోధనల పాలపడుతున్నది. నిప్పును శోధిస్తున్నారు. నీటిని గాలిస్తున్నారు. గాలిని చీలుస్తున్నారు. రాతిని పగులగొడుతున్నారు. భూమిని తవ్వి పోగులు పెడుతున్నారు.’
1939 నాటికి గేయాల ప్రసారం ఓ దారిలో పడింది. ఆ ఏడాది మల్లవరపు విశ్వేశ్వరరావు రాసిన ‘బిల్హణీయం’ సంగీత నాటకం ప్రసారం అయింది. సూరి నారాయణమూర్తి రూపొందించిన ఈ సంగీత నాటకానికి బీ.వీ. నరసింహారావు సంగీతం సమకూర్చడం మాత్రమే కాకుండా నాయక పాత్ర పోషించారు.
లలిత సంగీతం అన్న పేరు ప్రాచుర్యంలోకి రాని ఆ రోజుల్లో ‘గీతావళి’ పేరుతొ భావగీతాలు ప్రసారం చేసేవారు. ఈ కార్యక్రమంలో గాయనీ గాయకులు పాడడానికి కొత్త గీతాలు కావలసి వచ్చాయి. పండుగలు వస్తే ప్రత్యేకంగా పాటలు రాయించి పాడించేవారు.
రేడియోకు మాత్రమే ప్రత్యేకమైన ప్రక్రియ ‘రూపకం’. (ఆంగ్లంలో దాన్ని ఫీచర్ - FEATURE- అంటారు.) రేడియోకి ప్రత్యేకమైనవి కనుక రూపకాల రచన, రూపకల్పన విలక్షణంగా వుంటాయి. తెలుగులో ప్రసారం అయిన తొలి రూపకం ‘కృష్ణదేవరాయ వైభవం’. 1941 జనవరి 15 నాడు ప్రసారమైన ఈ రూపకం మౌలిక రచన చేసిన వారు ఆకొండి వేంకటేశ్వరరావు. రేడియోకు అనువుగా రూపక రచన చేసి దానికి ప్రాణం పోసిన వారు ఆచంట జానకీరాం. చరిత్రను రసవత్తరంగా వినిపించడానికి చేసిన ఆ ప్రయత్నం ఎందరినో ఆకర్షించింది. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్.గోపాలకృష్ణ సౌజన్యంతో)

3 కామెంట్‌లు:

Jaabilliraave చెప్పారు...

విలువైన సమాచారం అందిస్తున్నారు. ధన్యవాదాలు. వీలయితే ఆనాటి కార్యక్రమాలు ఆడియో(దొరికితే) ఇస్తే వినటానికి వీలుంటుంది. ఇలాంటివి ఈ తరానికి పరిచయంచేద్దామన్నా ఎక్కడా దొరకవు కదా.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Sasidhar Pingali - ధన్యవాదాలు. ఈ సమాచారం కూడా సేకరించినదే. కాకపోతే నాటి ఆడియోలు దొరకపుచ్చుకోవడం అనేది అంత సులభం కాదేమోనండీ.

శ్రీనివాసుడు చెప్పారు...

పింగళి శశిధర్ గారూ!
http://eemaata.com/em/category/features/audiolibrary
ఈ లంకెలో ఈమాట అనే తెలుగు అంతర్జాల పత్రికలో కొన్ని ఆకాశవాణి కార్యక్రమాల అపురూప శబ్దముద్రణలు వినవచ్చు.

అలాగే,
maganti.org అనే జాలగూటిలో ఆనేక వందల అపురూపమయిన కార్యక్రమాలను వినవచ్చు.
http://maganti.org/newgen/index1.html

...శ్రీనివాసుడు