భ్రమణ కాంక్ష – డాక్టర్ ఎం. ఆదినారాయణ - 3
(విశాఖ నుండి డార్జిలింగ్ వరకు పాదయాత్ర)
“నరసన్నపేట చేరేసరికి సాయంత్రం అయింది....
“పెద్ద పెద్ద బండల చాటున కూర్చుని
చుట్ట తాగుతున్న కోనార్లు కనిపించారు. ఆ నీడలో కూడా వారు తాటి గొడుగుల్ని ఒదలలేదు. వీరు ‘తప్పెటగుళ్ళు’ అనే
జానపద నృత్యం అద్భుతంగా ప్రదర్శిస్తారు.
వీటితో పాటు, గొల్ల చదువులు, బైఠో భజనలు, కర్రసాము, దొమ్మరి గంతులు వీరి
వినోదాల్లోని విశేషాలు.
“సంత నుండి వచ్చే స్త్రీలు ఎదురయ్యారు. కాసుల పేరు, మెడపట్టి, కడియాలు,
చెవులకి కొనకొమ్ములు, లోలకులు, జుంకాలు, బుట్టలు. వీరు మోస్తున్న అలంకరణ వీళ్ళు
తెస్తున్న సామగ్రి బరువుకు సమానమేమో.
“వాతావరణం మారి మేఘాలు కమ్ముకున్నాయి.
వర్షంలోనే మమ్మల్ని ఓ పేద రైతు తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. ఇల్లంతా బస్తాలతో,
గడ్డి మోపులతో, మంచాలతో కిక్కిరిసి వుంది. గాలికి రెపరెపా కొట్టుకుంటున్న దీపం
వెలుగులో రైతుగారి తల్లి మమ్మల్ని పరీక్షగా చూసింది. పేద రైతుల ఆతిధ్యం
స్వీకరించడానికి అదృష్టం వుండాలి. తమకు వున్న దానిలోనే ఇంటికి వచ్చిన వారి ఆకలి
తీరుస్తారు....
“పాకివలస గ్రామం చేరేసరికి
తెల్లారింది. అక్కడ పాతర్లలో ధాన్యం నిలవ చేసుకునే సంప్రదాయం వున్నట్టు లేదు.
ప్రతి ఇంటి ముందు (ధాన్యం) కొట్టు వుంది. మట్టి గోడలు. పై కప్పు గడ్డి.
“సాగిపల్లి కొత్తూరులో ఆవుల మందలు
కానవచ్చాయి. వాటి పేడ కోసం తల్లులు, పిల్లలు తట్టాబుట్టా పట్టుకుని వాటి వెంట
పడ్డారు. ఈ పశువులు కాసేవారిని మందల వాళ్ళు అని పిలుస్తారు. నెలకి, ఆవుకి నాలుగు
రూపాయలు జీతం. ...
“టెక్కలి జంక్షన్ పాత వూరిలో జగన్నాధ
ఆలయం చాలా అందంగా వుంది. మండపంలో రైతులు పండు మిరప కాయలు ఆరబోశారు.
“ఊరు దాటగానే కొండలు. ఇక్కడి కోనార్లకి
ఎలుగుబంట్ల భయం జాస్తి.
“వాలుగాలికి మా నడక పరుగులోకి మారింది.
ఎంతో ఎత్తులో పక్షులు శూన్యంలో తేలిపోతున్నాయి. బెండి కొండ రైల్వే గేటు దాటగానే
ఉరుములు, మెరుపులు. ఈ రాత్రికి కాశీబుగ్గ చేరగలమా అన్న అనుమానం. ...
“బెండి కొండ మొగలో తోటల గుండా పనస
పళ్ళు నింపుకున్న ఎడ్లబళ్ళు బారులు తీరి
ఒంటెల బిడారు మాదిరిగా సాగుతున్నాయి.......కాశీబుగ్గ చేరాం ఎలాగోలా తడిసి
ముద్దై......
(PHOTO COURTESY WRITER DR.M.ADINARAYANA)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి