9, మే 2016, సోమవారం

ఆడదంటే మజాకానా!



ఏకాంబరం ఎంతో ఏకాగ్రతతో తపస్సు చేసాడు. అతడి తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై  వరం కోరుకొమ్మన్నాడు పరమేష్టి.
'పరమేశా! మా ఆవిడ పరమ బద్ధకస్తురాలు. నేను పగలల్లా ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తాను. ఆవిడేమో టీవీలో సీరియళ్ళు చూస్తూ ఎంచక్కా కాలక్షేపం చేస్తుంటుంది. ఒక్కరోజు మేమిద్దరం పరకాయ ప్రవేశం చేసేలా అనుగ్రహించు. నేను పడే కష్టం ఏమిటో ఆవిడకు తెలిసిరావాలి' అన్నాడు ఆత్రంగా. 'ఓస్ ఇంతేనా' అంటూ వరం ఇచ్చేసి పరమేశ్వరుడు కైలాసం వెళ్లాడు.
ఆ రాత్రి కలలు కంటూ నిద్రపోయిన ఏకాంబరం, తెల్లారి లేచేసరికి, ఒక ఆడదానిగా కళ్ళు తెరిచాడు.
మొహం కూడా కడుక్కోకుండానే వంటింట్లోకి వెళ్ళి మొగుడికి బ్రేకఫాస్ట్ తయారు చేసాడు. పిల్లల్ని లేపి మొహాలు కడిగించాడు. స్నానాలు చేయించి స్కూలు యూనిఫారాలు వేయించి టిఫిన్ తినిపించి, మధ్యాహ్న భోజనం బాక్సుల్లో సర్ది, వాళ్లని స్కూల్లో దింపి, తిరిగివస్తూ పచారీ సామాను దుకాణంలో ఇంటికి కావలసినవి కొనుక్కుని తిరిగివచ్చేసరికి ఇంట్లో తీరికలేని పని సిద్దంగా వుంది. ఉతకాల్సిన దుస్తులు వాషింగు మెషిన్ లో వేసి, అంట్ల గిన్నెలు కడిగి, ఇల్లంతా తుడిచి అన్నం పళ్ళెం ముందు పెట్టుకునేసరికి పిల్లలు ఇంటికి వచ్చే సమయం అయింది. ఆదరాబాదరాగా నాలుగు ముద్దలు నోట్లో కుక్కుకుని, స్కూలుకి వెళ్ళి పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చి బట్టలు మార్పించి నాలుగు తినుబండారాలు వాళ్ల  ముందు పెట్టి, ఉతికిన బట్టలు ఇస్త్రీ చేసి టైం చూసుకుంటే  సాయంత్రం ఆరుగంటలు. ఆయన ఆఫీసునుంచి ఇంటికి వచ్చే సమయం. లేచివెళ్ళి వేడిగా పకోడీలు చేసి, కాఫీ డికాక్షన్ సిద్దం చేసేసరికి ఉస్సురుస్సురంటూ పతి దేవులు తయారు. మళ్ళీ వొంటిట్లో దూరితే రాత్రి భోజనాలు తయారుచేసే పని. కుక్కర్ స్టవ్ మీదకు ఎక్కించి చూస్తే పెరుగు తోడుకోలేదు. అది లేకపోతే పిల్లలకు ముద్ద దిగదు. పరుగు పరుగున బజారుకు వెళ్ళి డబ్బా పెరుగు కొనుక్కువచ్చి పిల్లలకు తినిపించి పడుకోబెట్టేసరికి రెండో మూడో పెగ్గులు బిగించిన భర్తగారు ఆవురావురుమంటూ అన్నానికి సిద్ధం. ఆయనకు పెట్టి, నాలుగు మెతుకులు తాను కొరికి, అంట్ల పళ్ళేలు సింకులోవేసి, వంటిల్లు తుడిచి చీరె మార్చుకుని, తలలో పూలు తురుముకుని  పడక గది చేరేసరికి పదిగంటలు. నడుం వాలుద్దామంటే మొగుడు వూరుకునే మొగుడు కాదాయె.   అలా రోజంతా అందర్నీ కనుక్కుంటూ, అందరికీ అన్నీ చేసిపెట్టి, చూసిపెట్టి కునుకుతీసి లేచేసరికి మళ్ళీ బండెడు పని,  ఇంటెడు చాకిరీ చెప్పాపెట్టకుండా తయారు.
'అమ్మో యేమో అనుకున్నాను. భార్యలు కాలు మీద కాలు వేసుకుని టీవీలు చూడడమే వాళ్ల పని అనుకున్నా కాని, వాళ్లకు  వొళ్ళు విరిగే ఇంత పని వుంటుందని కలలో కూడా అనుకోలేదు' ఏకాంబరం  ఆలోచనలు ఇలా సాగుతుండగానే అతగాడికి  పరమేశ్వరుడు ఇచ్చిన ఒక్క రోజు వరం జ్ఞాపకం వచ్చి ఓకే! ఒక్క రోజే  కదా! ఇవ్వాల్టితో పీడా పోతుందని సంతోషించాడు. కాని అది ఎంతో సేపు నిలవలేదు. తూరుపు తెల్లారుతున్నా చీరే జాకెట్ తో తన ఆకారం ఏమీ మారకపోవడం గమనించి, కంగారు పడిపోయి మళ్ళీ పరమేశ్వర ప్రార్ధన మొదలు పెట్టాడు. కాపోతే ఈసారి అట్టే ఆలశ్యం చేయకుండా దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. రోజు గడిచిపోయిందనీ, ముందు చెప్పిన విధంగా తిరిగి తనకు పాత మగ రోజులు ప్రసాదించమనీ కోరాడు. అందుకు ఆయన నోరారా నవ్వుతూ ఇలా అన్నాడు.
'నీ కోరిక తీరాలంటే మరో తొమ్మిది నెలలు ఆగాలి. రాత్రి నీకు నెలతప్పి గర్భవతివయ్యావు. అంచేత ఆడవాళ్ళు పడే ప్రసవ వేదన యెంత భయంకరంగా వుంటుందో అదీ తెలుసుకునే మహత్తర వరం నీకు అదనంగా ఇస్తున్నాను' అంటూ అదృశ్యం అయిపోయాడు. ఏకాంబరం కొయ్యబారిపోయాడు.

నీతి: దేవుడు తేరగా దొరికాడని లేనిపోని వరాలు కోరరాదు

6 కామెంట్‌లు:

SD చెప్పారు...

This joke is at least 25 years old. Cannot find anything better to post?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@DG Better post?.... That is the problem.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@DG - You have perfectly guessed. I wrote this at the age of 20. Later, it was translated into English and posted by some one in FB in the recent past. Hence, intentionally I repeated.

శ్యామలీయం చెప్పారు...

.... వరం కోరుకొమ్మన్నాడు పరమేష్టి. ....... వరం ఇచ్చేసి పరమేశ్వరుడు కైలాసం వెళ్లాడు.
భండారు వారూ, పరమేష్టి అంటే బ్రహ్మగారు. పరమేశ్వరుడు అంటే శివుడు. మీరు కొంచెం పరాకు పడ్డారండీ.

ఈ చిన్నవిషయం‌ వదిలేస్తే టపా బాగుంది. ఐనా దీనిని మీ‌ బ్లాగులోనే పూర్వం చదివానేమో నన్న అనుమానం‌ కూడా కలుగుతోంది.

sarma చెప్పారు...

DG! This joke may be much older than said by you. Just laugh for a moment and enjoy :)

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శ్యామలీయం- పరాకు పడ్డం కాదండీ శ్యామలీయం గారూ, ఏకంగా పొరబడ్డానండీ బాబూ. ఖచ్చితంగా చెప్పాలంటే దూడ వేసినట్టే అనుకోండి. తప్పు ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు. - భండారు శ్రీనివాసరావు