20, మే 2016, శుక్రవారం

గెలుపు మొదటిదీ కాదు, ఓటమి చివరిదీ కాదు


సూటిగా....సుతిమెత్తగా......

గతవారం జాతి జనుల దృష్టిని ఆకట్టుకున్న అంశాలు, అయిదు రాష్ట్రాల అసెంబ్లీ  ఎన్నికలు,  కొసరుగా  పాలేరు ఉపఎన్నిక. వాటి ఫలితాలు.
వివిధ రాష్ట్రాల్లో  విభిన్న తేదీల్లో ఎన్నికలు  జరిగిన కారణంగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం వీటి ఫలితాలు వెలువడ్డాయి.
వీటిల్లో  చిత్రమైనది పాలేరు ఉపఎన్నిక.
పాలేరు ఎన్నికల్లో  గెలిచిన పార్టీకి ఓడిపోతామన్న భయం ఏ దశలోనూ లేదు, ఓడిన వాళ్లకు గెలుస్తామన్న నమ్మకం ఏ  కోశానా లేదు. అయినా సరే ప్రచారం కానీ, దాని సంరంభం కానీ తక్కువ స్థాయిలో  జరగలేదు. గెలుస్తామని విశ్వాసం  వున్న అధికార పార్టీ టీ.ఆర్.ఎస్. ఎలాంటి చిన్న లొసుగుకు కూడా అవకాశం ఇవ్వకుండా  సర్వశక్తులూ ఒడ్డి పోరాడింది. గెలిచే నమ్మకం ఆవగింజంత లేకపోయినా విపక్షాలు కూడా గెలిచి తీరాలి అనే విశ్వాసంతో ఎదురు పోరాడాయి. అందుకే పాలేరు ఉపఎన్నికలో  అంతటి భారీ  స్థాయిలో ప్రచారం జరిగింది. చివరికి అందరూ అనుకున్నట్టుగానే విజయలక్ష్మి టీ.ఆర్.ఎస్. నే వరించింది. ఆ పార్టీ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు బ్రహ్మాండమయిన మెజారిటీతో గెలుపొందారు. మెజారిటీ యెంత అనేదానిపైనే తప్ప అక్కడ ఎవరికీ ఫలితం పట్ల ఆసక్తి లేకపోవడం ఒక విశేషం.
ఉప ఎన్నిక అని కూడా చూడకుండా, అధికార పార్టీ, మంత్రుల్నీ, శాసన సభ్యులనూ ఊరూరా మోహరించిందని,   తన చేతుల్లో వున్న సమస్త అధికారాలను, ధన వనరులను విచ్చల విడిగా దుర్వినియోగం చేసి గెలిచిందని విపక్షాలు ఆరోపించాయి. అది సహజం కూడా.
పొతే, అధికార దుర్వినియోగం అనే మాటే ఈ రోజుల్లో కాస్త వింతగా  వినబడుతోంది. సద్వినియోగానికి అధికారాన్ని వాడుకుంటున్న రాజకీయ పార్టీలు ఈనాడు కలికానికి కూడా కానరావడం లేదు. ఈ ఆరోపణలు చేస్తున్న వాళ్ళు గతంలో అధికారంలో వున్నప్పుడు ఇదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా  మంత్రులను గెలుపు బాధ్యత అప్పగించాయి.
అలా అని అధికార దుర్వినియోగాన్ని సమర్ధించడం ఈ రచయిత ఉద్దేశ్యం కాదు. కాకపొతే అలా ఆరోపించే  నైతిక హక్కును రాజకీయ పార్టీలే పోగొట్టుకుంటున్నాయి. ఈ నైతిక హక్కు అనేది కూడా ప్రస్తుత కాలంలో ఒక  పనికిమాలిన ఊతపదంగా  మారిపోయింది. చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రాన్నే అన్ని పార్టీలు పాటిస్తూ వస్తున్నాయి. ఇక ఎవరిని యేమని ఏమి లాభం?
అయితే, ఒకే ఒక్క ఉప ఎన్నికలో విజయం కోసం ఇంతటి స్థాయిలో నింద మోయడం ఆ పార్టీకి  అవసరమా అనే ప్రశ్న మిగిలే వుంటుంది. నిష్టూరమైన నిజం, ఏం చేస్తాం!
ప్రచారం సందర్భంగా తమపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు అన్నింటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు.  హైదరాబాదులోని  పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విజయోత్సవాలకు హాజరయిన ముఖ్యమంత్రి విలేకరులతో ముచ్చటించారు. ఆరోపణలకు  జవాబు చెప్పడమే కాదు ఒక హెచ్చరిక కూడా చేసారు. నిరాధారమైన ఆరోపణలు చేసే వారిపై కేసులు పెట్టి కఠిన శిక్షలు పడేలా చూస్తామని గట్టిగా హెచ్చరించారు. ఎన్నికల సంఘం  సమర్దులయిన అధికారులని కితాబు ఇచ్చిన ఖమ్మం జిల్లా అధికారులపై ఎన్నికల సందర్భంగా  విపక్షాలు చేసిన ఆరోపణలను,ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్  భగీరధ వంటి పధకాల గురించి మాట్లాడుతున్న తీరును  కేసీఆర్ తప్పుపట్టారు. పాలేరు ఉప ఎన్నిక ఫలితం తమ రెండేళ్ళ పాలనకు ప్రజలు తెలిపిన ఆమోదంగా ఆయన అభివర్ణించారు. టీ.ఆర్.ఎస్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో తమ పార్టీ పెద్ద మెజారిటీలతో గెలుస్తూ రావడమే ప్రతిపక్షాల ఆరోపణలకు ఎలాంటి ప్రాతిపదిక లేదనడానికి నిదర్శనమన్నారు.
పనిలో పనిగా కేసీఆర్ తన పార్టీ శ్రేణులకు కూడా హితవు పలికారు. సాధించిన విజయాలతో పొగరుగా  వ్యవహరించరాదనీ, విజయ గర్వంతో అధిక ప్రసంగాలు చేయవద్దనీ, ప్రజలు అందించిన విజయాన్ని గౌరవంగా స్వీకరించి మరింత బాగా  పని చేయాలని ఆయన సలహా ఇచ్చారు.      
పాలేరులో ఘన విజయం  సాధించిన తుమ్మలపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనను మరో అందుకు కూడా  అభినందించవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి  పరాజయం పాలయిన నాగేశ్వరరావు, ఆ తరువాత టీ.ఆర్.ఎస్.  లో చేరి, ఎమ్మెల్సీ అయి మంత్రి కూడా అయ్యారు. దొడ్డి దోవన మంత్రి అయ్యారనే నింద ఆయనపై  ప్రతికక్షులు మోపారు. బహుశా ఆ మచ్చ మాపుకోవడం కోసం అన్నట్టుగా ఆయన ఉప ఎన్నిక బరిలో దిగి, నేరుగా ప్రజల  ఆమోదంతో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  ఒకరకంగా ఇది మంచి సాంప్రదాయం. ఇందుకు తుమ్మలను అభినందించాలి.  
ఎన్నికల్లో పొత్తులు కొన్ని సందర్భాలలో కలిసి వస్తాయి. మరి కొన్ని సార్లు వికటిస్తాయి. 2014 లో జరిగిన  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు మొదటి దానికి ఉదాహరణ. పాలేరు ఉపఎన్నికలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవడం రెండో దానికి రుజువు.
భారత దేశానికి ఉత్తరాన  ఒక కొసన వున్న ఈశాన్య రాష్ట్రం ‘అసోం’ తో మొదలు పెట్టి, తూర్పున వున్న పశ్చిమ బెంగాల్, దక్షిణాదిన వున్న తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అయిదు రాష్ట్రాల్లోని ఓటర్లు ఇచ్చిన తీర్పులు,  ప్రజల నాడిని పట్టుకోవడానికి, వారి ‘మూడ్’ గ్రహించడానికి ఒక మేరకు ఉపకరిస్తాయి.
ఈ అయిదింటిలో భారతీయ జనతా  పార్టీ ఎక్కడా అధికారంలో లేదు. అంచేత ఒక్కటి గెలిచినా ఆ పార్టీకి బోనసే అవుతుంది. అసోం లో ఆ పార్టీ సాధించిన విజయానికి బీజేపీ అధినాయకత్వం సంబర పడడానికి అదే కారణం. అదొక చారిత్రాత్మక విజయంగా అభివర్ణించడంలో కొంత అతిశయోక్తి  ఉన్నప్పటికీ, బీహారు, ఢిల్లీ ఎన్నికల పరాజయ నేపధ్యం నుంచి అసోం విజయాన్ని గమనిస్తే, అది ఆ పార్టీకి  మంచి ఊరట కలిగించే పరిణామమే అనాలి. మూడు పర్యాయాలుగా అంటే పదిహేనేళ్ళుగా ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు మొహం మొత్తడం కూడా సహజమే. అయితే ఆ ఒక్క కారణమే బీజేపీ గెలుపుకు కారణం అని చెప్పలేము, ముస్లిం ఓటర్లు గణనీయంగా  వున్న ఆ ఈశాన్య రాష్ట్రంలో పొత్తుల విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముందు చూపుతో అనుసరించిన వ్యూహం కూడా ఆ పార్టీ  విజయానికి కారణం అయింది. పొత్తులు కలిసివచ్చిన అదృష్టం బీజేపీని వరించింది. గత లోక సభ ఎన్నికల్లో అసోంలో సంఖ్యాబలం పెంచుకోగలిగిన బీజేపీకి బాగా సంతోషపడగల మరో విజయం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో లభించింది.
“గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో (బహుశా అసోంలో సాధించిన విజయోత్సాహం కావచ్చు), ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రధాని మోడీ చెప్పినట్టు మీడియాలో వచ్చింది.
సంతోషం. ప్రజలకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది.  కోడలు కంటానంటే కనొద్దనే  అత్తగారుంటుందా!
అయితే, రెండేళ్ళ క్రితం, మోడీ నాయకత్వం పట్ల అచంచల విశ్వాసంతో ఓటేసి ఆయనకు అపూర్వ విజయం సమకూర్చి పెట్టిన ప్రజలు ఇతర రాష్ట్రాల్లో కూడా వున్నారు. వాళ్ళు కూడా ఈ మాటలు వింటున్నారని మోడీ మహాశయులు గుర్తు పెట్టుకోవాలి.         

మరో అపూర్వ విజయం పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఇక్కడ పొత్తులు కొన్ని పార్టీల కొంప ముంచాయి. కాంగ్రెస్, కమ్యూనిష్టులు జత కట్టడం జనాలకు నచ్చినట్టు లేదు. కాకపోతే  స్వతంత్రం వచ్చిన తొలి ఏళ్ళలో బెంగాల్ ని గుప్పెట్లో పెట్టుకుని, ఆ తరువాత ఆ రాష్ట్ర రాజకీయాల్లో నామ మాత్రంగా మిగిలిపోయిన కాంగ్రెస్, తన స్థానాలను ఈ పొత్తులతో  మెరుగు పరుచుకుంటే, కాంగ్రెస్ ఓట్లు సరిగా బదిలీ కాక కమ్యూనిష్టు పార్టీలు చతికిలపడ్డాయి. మూడు దశాబ్దాలకు పైగా అప్రతిహతంగా  బెంగాల్ ని పాలించిన వామపక్షాలు, వ్యూహ రచనలో విఫలమై మూడో స్థానానికి దిగజారాయి. పొత్తులు అచ్చిరాని పార్టీల జాబితాలో చేరిపోయారు.
సర్వజనులు, సర్వే జనులు పసికట్టలేని ఫలితం తమిళనాట వెలువడింది.               
అప్పటికి ఇంకా అసలు ఫలితాలు రానే రాలేదు. తమిళనాడులో జయలలిత పార్టీ పరాజయం పాలవుతుందని వచ్చిన సర్వేల సమాచారాలపైనే టీవీల్లో చర్చోపచర్చలు పుంఖానుపుంఖాలుగా   మొదలయ్యాయి. ఒకనాటి  సాయంత్రం ఒక టీవీ ఛానల్ ఎడిటర్స్ టైం కార్యక్రమంలో చెన్నై నుంచి ఓ తెలుగు మహిళ మాట్లాడుతూ, ‘అమ్మ (జయలలిత) ఓడిపోయే ప్రసక్తే లేద’ని కుండ బద్దలు కొట్టి చెప్పారు. జయలలిత పట్ల ఆమెకు వున్న ప్రత్యేకాభిమానం ఆమె చేత అలా మాట్లాడిస్తున్నదేమో అనుకున్నారు కానీ చివరికి ఆవిడ చెప్పిందే నిజమయింది. అనేక ఏళ్ళకు పూర్వం ఆమె  సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న రోజుల్లో హీరో జోడీగా వెలిగి, తదుపరి ఆమెకు రాజకీయ అరంగేట్రం చేయించిన  ఎంజీఆర్, మూడు దశాబ్దాల క్రితం నెలకొల్పిన విజయ భేరీ  రికార్డును ఇప్పుడు  జయలలిత  తిరగరాసింది. తమిళనాడు రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర తీసింది. అయితే, ప్రచార పర్వంలో ఆకాశమే హద్దుగా ఆమె ప్రకటించుకుంటూ పోయిన వరాల భారం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత అలవి కాని భారం అయ్యే ప్రమాదం పొంచి వుంది. అంతే కాదు, బలమైన సంఖ్యాబలంతో ప్రతిపక్ష డీఎంకే కొలువు తీరడం కూడా జయకు రానున్న అయిదేళ్ళ కాలం కత్తిమీద సామే. ఎందుకంటే గతంలో ఈ రెండు పార్టీల్లో ఎవరు గెలిచినా ఓడిపోయిన వారికి దక్కిన స్థానాలు నామమాత్రమే.
కెప్టెన్ సీఎం అంటూ స్వయం ప్రకటిత ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుని  అపారమైన సంఖ్యలో సినిమా అభిమానులను కలిగిన  సినీ హీరో విజయకాంత్ కనీసం ఎమ్మెల్యేగా గెలుపుకు కూడా నోచుకోలేదు.  ఆయన పార్టీ  ఈ ఎన్నికల్లో పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది. కొన్ని పార్టీలు, ఇతరులను ఓడించడానికో, గెలిపించడానికో తప్ప స్వయంగా గెలవడానికి పనికిరావన్న నానుడికి నిదర్శనంగా  ఆ  పార్టీ మిగిలిపోయింది.
కేరళలో కమ్యూనిష్టు కూటమి విజయానికి మార్గం సుగమం చేసిన కీర్తి ఆ రాష్ట్రాన్ని గత అయిదేళ్లుగా పాలిస్తూ వచ్చిన కాంగ్రెస్ కూటమికి దక్కుతుంది. ఆ కాలంలో వెల్లువెత్తిన స్కాములు, అధికార దుర్వినియోగాలు, సహజంగా రాజకీయ చైతన్యం కలిగిన కేరళీయులను మార్పు దిశగా అడుగులు వేయించింది.
2014 నుంచి మొదలయిన మోడీ వెలుగుల్లో మసకబారుతూవస్తున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ ప్రాభవం ఈ ఎన్నికల్లో మరింత  దిగజారింది. అసోం చేజారింది. కేరళ చేయి ఒదిలేసింది. తమిళనాడులో కాంగ్రెస్ కు నిలువ నీడే లేకుండా పోయింది. కమ్యూనిష్టుల పుణ్యమా అని, వాళ్ళు ఓడిపోయినా  పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్  పార్టీకి కాస్తంత ఊపిరి చిక్కింది.  పొతే,  చిరు రాష్ట్రం పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ పతాకపు మువ్వన్నెల ధగధగలు మెరిశాయి. అయితే ఈ మెరుపుల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న డీ.ఎం.కే.కి  కొద్ది  వాటా వుంది. అంచేత అక్కడ దక్కేది సంపూర్ణ అధికారం కాదు, సంకీర్ణమే.       
గెలుపోటములు దైవాధీనాలు అంటారు. కానీ, ఎన్నికల్లో ఓటమికి స్వయంకృతాపరాధాలే ప్రధాన కారణం. విజయాలకు తామే కారణం అని గొప్పలు చెప్పుకోవచ్చు కానీ అది పూర్తి వాస్తవం కాదు. ఎదుటి వారి వైఫల్యాలు, తప్పిదాలు కూడా విజయ సోపానాలు ఎక్కడానికి ఉపకరిస్తాయి. కానీ ఏ పార్టీ ఈ నిజాన్ని ఒప్పుకోదు.
 ఉదాహరణకు ఒక పార్టీ ఒక రాష్ట్రంలో గెలుపొందింది. మరో రాష్ట్రంలో పరాజయం పాలయింది. ఆ  పార్టీ నాయకుడు ఒకాయన ఇలా అంటున్నాడు మీడియాతో.
‘మాకు ప్రజలు బ్రహ్మ రధం పట్టారు. మా విధానాలు నచ్చి, మెచ్చి ఆ రాష్ట్రంలో  మాకు పట్టం కట్టారు’
‘అధికార పార్టీ అనుసరించిన అరాచక విధానాలు, అధికార దుర్వినియోగాలు అక్కడ మా ఓటమికి కారణం’
రాజకీయ పార్టీలకి ఇవి సహజంగా అనిపించవచ్చు కానీ, రాజకీయాలను దగ్గరగా గమనించేవారికి అసహజంగా అనిపిస్తాయి. ఈ ద్వంద్వ  ప్రమాణాలతో  ఇలా ఇంకెన్నాళ్ళు  ప్రజలని మభ్య పెడతారో అర్ధం కాదు.
గెలుపోటములను హుందాగా స్వీకరించే తత్వం అలవరచుకోవాలి. రాజ్యాలను తమ జీవిత పర్యంతం పాలించే రాజుల కాలంలో మనం  జీవించడం లేదు. మనం వున్నది  ప్రతి అయిదేళ్లకూ ఎన్నికలు జరిగే ప్రజాస్వామ్య వ్యవస్థలో.  ఈ  విషయం మరిచిపోతుండడం వల్లనే ఈ రాజకీయులతో ఇన్ని అవస్థలు.   
గెలిచి వచ్చిన ప్రతి పార్టీ ప్రజలకు మేలు చేస్తూ పోతుంటే వాళ్ళే  వాటిని ప్రతి అయిదేళ్లకు తిరిగి ఎన్నుకుంటారు. అంతేకాని అధికారంలో పాతుకుపోవడానికి అడ్డ దారులు తొక్కే అవసరంలేదు.
దురదృష్టం ఏమిటంటే రాజకీయ పార్టీలు మరోలా ఆలోచిస్తున్నాయి. పదవి  శాశ్వతం అనే భ్రమల్లో మునిగితేలుతున్నాయి. అంతే అయితే పరవాలేదు పదవిని శాశ్వతం చేసుకోవాలనే కాంక్షతో ప్రజలని భ్రమల్లో ముంచి తేల్చే పనిలో పడ్డాయి. తాము పనిమంతులం  గొప్పలు  చెప్పుకోవడానికి అవతలివాళ్ళు పనికిమాలిన వెధవలు  అని నిర్ధారించే కార్యక్రమంలో మునిగి తేలుతున్నాయి.   
అందుకే ముందే చెప్పింది.
గెలుపు మొదటిదీ కాదు, ఓటమి చివరిదీ కాదు .
ఎవరెస్టు ఎక్కిన వాడు అక్కడే వుండిపోడు, పాతాళంలో పడ్డవాడు అక్కడే ఆగిపోడు. ఇది తెలుసుకుంటే ఓటమి వల్ల నైరాశ్యం కలగదు. విజయం వల్ల గర్వం ప్రబలదు.
ఉపశృతి:
ఇది జరిగి చాలాయేళ్ళు అవుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా  పనిచేసిన మోహన్ కందా గారు పదవీ విరమణ చేస్తుంటే, రేడియోలో నా సీనియర్ సహచరుడు ఆర్వీవీ కృష్ణారావుతో కలిసి ఆయన్ని చూడడానికి వెళ్లాను.  
అప్పుడు ఆయనో మాట చెప్పారు.
“పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదు.  ఈ సత్యం తెలిసి కూడా  ప్రతి ఒక్కరూ జీవితం  శాశ్వతం అనే అనుకుంటూ వుంటారు. అలాగే, ప్రతి ఉద్యోగికీ ఏదో  ఒకరోజు రిటైర్మెంట్ తప్పదు. కానీ, రిటైర్ అయ్యే రోజు కూడా ఇంకా పదవిలో వుంటాననే భ్రమలో ఉంటాడు.”’
మోహన్ కందా గారు ఈ  విషయం ఒక పత్రికలో కూడా రాసినట్టు జ్ఞాపకం.
అయినా నా చాదస్తం కానీ, ఈ మెట్టవేదాంతం  వేదాంతులకే ఎక్కదు, రాజకీయులకేం పడుతుంది.
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595  
   


2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఎప్పటిలానే మీ విశ్లేషణ బావుంది. ఐతే అవెందుకున్నాయో తెలియని ఉభయ కమ్మ్యునిస్ట్ పార్టిలు వాటి ఎన్నికల వైఫల్యాల గురించి మరో వ్యాసం వ్రాయవలసిందిగా నా విన్నపం.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: ధన్యవాదాలు. సందర్భం రానివ్వండి, అలాగే రాస్తాను. - భండారు శ్రీనివాసరావు