సూటిగా......సుతిమెత్తగా........
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 20-03-2016, SUNDAY)
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 20-03-2016, SUNDAY)
సాధారణ ప్రజల్లో కోర్టు తీర్పుల పట్ల
ఒక అపోహ వుంది, అవి ఓ పట్టాన ఎవరికీ అర్ధం కానంత క్లిష్టంగా వుంటాయని.
గత గురువారంనాడు హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్ రామలింగేశ్వరరావు ఒక కేసులో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇందుకు విరుద్ధంగా, చాలా సుబోధకంగా, ఎటువంటి గందరగోళాలు లేకుండా, సందిగ్దతకు తావివ్వకుండా సూటిగా
వున్నాయనే చెప్పాలి.
ఈ తీర్పుకు ముందు, కోర్టులు, చట్ట సభల అధికార పరిధుల గురించి, పరిమితుల గురించి మీడియాలో
విస్తృతమైన చర్చే జరిగింది. ఎందుకంటే ఈ కేసు హై కోర్టు గడప ఎక్కడానికి
కారణం గత డిసెంబరులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ
చేసిన ఒక తీర్మానం. సభలో వైఎస్ఆర్సీపీ సభ్యురాలు రోజా అనుచిత ప్రవర్తనను కారణంగా చూపుతూ ఆమెను సభనుంచి ఏకంగా ఏడాది పాటు
సస్పెండు చేస్తూ శాసనసభ ఒక తీర్మానం చేసింది. సభానిబంధన 340 (2) కింద శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించిన ఈ
తీర్మానాన్ని స్పీకర్ అనుమతితో ప్రవేశపెట్టడం, ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ఒక
సభ్యురాలిని ఏడాదిపాటు సస్పెండు చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో కనీవినీ
ఎరుగని సంగతి కావడంతో సహజంగానే అది సంచలనం అయింది.
మామూలుగా ఇటువంటి సంఘటనలు
చోటుచేసుకున్నప్పుడు సభలో వున్నఇతర పార్టీల నాయకులు కలగచేసుకుని సభాపతికి
విజ్ఞప్తి చేయడం, ఆ సభ్యుడు లేదా సభ్యురాలు ‘తన మాటలు, ప్రవర్తన ఎవరినయినా బాధ పెట్టి వుంటే
మన్నించండి’ అంటూ ఒక మోస్తరు షరతులతో
కూడిన క్షమార్పణ సభాముఖంగా కోరడంతో, ఆ సస్పెన్షన్ తొలగించడం, లేదా ఆ కాలాన్ని తగ్గించడం వంటి తక్షణ
ఉపశమన చర్యలు తీసుకునే వాళ్ళు. దురదృష్టం ఏమిటంటే ఈ సారి నూతనంగా ఏర్పడ్డ
అంధ్రప్రదేశ్ శాసనసభలో అటువంటి అవకాశం లేకుండా పోయింది. వున్నవి రెండే పార్టీలు.
ఒకటి పాలక పక్షం టీడీపీ. రెండోది ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ. పేరుకు భారతీయ
జనతాపార్టీ ఉన్నా అది పాలకపక్షంలో భాగస్వామ్య పక్షం. సర్దుబాటు చేయాలన్నా, సర్దిచెప్పాలన్నా మధ్యన ఎవ్వరూ లేకపోవడం కూడా పరిస్తితులు ఈ విధంగా
పరిణమించడానికి దోహదం చేస్తుండవచ్చు. తాజా రోజా వివాదం అందుకు ఉదాహరణ.
రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ యనమల రామకృష్ణుడు
ప్రతిపాదించిన తీర్మానం సభ ఆమోదం పొందడంతో
‘నగరి’ నియోజక వర్గానికి సభలో ప్రాతినిధ్యం కరువయింది. దాంతో రోజా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అత్యున్నత
న్యాయస్థానం హైకోర్టులోనే తేల్చుకోవాల్సిందని ఆ బంతిని అటు మళ్ళించింది.
ఈ లోగా,
రెండు రాజ్యంగ వ్యవస్థలనడుమ ఈ రకమైన ఘర్షణ మంచిది కాదన్న వాదన బయలుదేరింది.
నిజానికి ఇందులో పస లేదు. హైకోర్టులో ఉభయ
పక్షాల వాదన విన్న సింగిల్ జడ్జి జస్టిస్ రామలింగేశ్వరరావు తన మధ్యంతర ఉత్తర్వులలో
ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పారు.
గత డిసెంబరు నెలలో రోజాను సభనుంచి
సస్పెండు చేస్తూ చేసిన తీర్మానం అమలును న్యాయమూర్తి, నిలుపు చేశారు. ముందే చెప్పినట్టు రెండు రాజ్యాంగ వ్యవస్థల
నడుమ అధికార పరిధికి సంబంధించి సంఘర్షణకు దారితీసే పదజాలం ఏదీ ఈ ఉత్తర్వులలో లేదు.
సస్పెన్షన్ ఉత్తర్వులను నిలిపివేసినంత మాత్రాన, ఆనాటి సభలో పిటీషనర్ (సభ్యురాలి) ప్రవర్తనను
సమర్ధించినట్టు కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా, 212 అధికరణం కింద చట్టసభల తీర్మానాలలోని లొసుగులపై కోర్టులు జోక్యం
చేసుకోవడానికి వీలుండదని చెబుతూనే, 340 వంటి సభా నిబంధనలలోని (ప్రోసీజరల్ ఇర్రెగ్యులారిటీస్) అవకతవకలపై
న్యాయస్థానాలు కలగచేసుకోవచ్చని న్యాయమూర్తి అభిప్రాయ పడ్డారు. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా
వేశారు.
స్పీకర్ అధికార పరిధిని గౌరవిస్తూనే, పిటీషనర్ సహజ న్యాయ సూత్రాలకు భంగం కలగని రీతిలో జస్టిస్
రామలింగేశ్వరరావు ఇచ్చిన ఈ మధ్యంతర
ఉత్తర్వులతో ఈ సీరియల్ కధకు ముగింపు దొరికిందన్న అభిప్రాయం కలిగింది. కానీ ఇక్కడే
కధ అడ్డం తిరిగింది.
తన సస్పెన్షన్ ను రోజా తీవ్రంగా
తీసుకున్నట్టే, టీడీపీ కూడా సీరియస్ గా
తీసుకుంది. రోజా సభలో అడుగుపెట్టకుండా చూడడానికే ప్రభుత్వం నిశ్చయించుకున్నట్టు
తోస్తోంది. కోర్టు ఆదేశాలతో వచ్చిన ఆమెను అసెంబ్లీ
గేటు దాటి రాకుండా లేడీ మార్షల్స్ అడ్డుకున్నారు. వైఎస్ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు అభ్యంతరం చెప్పడంతో ఆ పార్టీ కార్యాలయం వరకు
అనుమతించారు. సభలో ప్రవేశానికి రోజాకు అనుమతి లేకపోవడంతో ఆ పార్టీ సభ్యులు
కొంతసేపు గాంధీ విగ్రహం దగ్గరా,
రాజ్ భవన్ దగ్గరా నిరసనలు తెలిపి, గవర్నర్ కార్యదర్శికి ఒక వినతి పత్రం అందచేసారు.
న్యాయస్తానాలతో ఘర్షణకు తావులేకుండా
కోర్టుల ద్వారానే పరిష్కారం సాధించే క్రమంలో ప్రభుత్వం కూడా కోర్టు గడప తొక్కింది.
సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను నిలుపు చేయాలని కోరుతూ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీలు చేసారు. ఒక
పక్క అసెంబ్లీ ‘సుప్రీం’ అని వాదిస్తూ మరో పక్క కోర్టును ఆశ్రయించడం ప్రభుత్వ వాదనలోని డొల్లతనాన్ని సూచిస్తోందని
ప్రతిపక్షం అంటోంది. అప్పీలుపై విచారణను కోర్టు సోమవారం చేపడుతుంది. ఈలోగా ‘ఏం జరుగుతుంది’ అనేది ఉత్కంఠగా మారింది.
శుక్రవారం నాడు జరిగిన సభలో స్పీకర్
కోడెల శివప్రసాదరావు చెప్పిన మాటలు కొత్త ఆశలకు ఊపిరిలూదాయి. కోర్టు తీర్పు
ప్రతులను సోమవారం సభ్యులందరికీ అందచేస్తామని, దానిపై చర్చిద్దామని అన్నారు. సభ తీర్మానం ప్రకారం స్పీకర్ తీసుకున్న నిర్ణయం
కాబట్టి మళ్ళీ సభ తీర్మానం ద్వారానే సస్పెండు అయిన సభ్యురాలిని సభలోకి
అనుమతించాలని ప్రభుత్వ పక్షం ఆలోచన చేస్తున్నట్టు
ఆరోజు అనిపించింది. అదే జరిగితే అంతకంటే కావాల్సింది మరోటి వుండదు అని కూడా
ఈ వివాదాన్ని నిష్పక్షపాతంగా పరిశీలిస్తున్నవారు భావించారు. ఒకవేళ కాదూ కూడదు,
సభలో అసభ్యంగా ప్రవర్తించిన సభ్యురాలిపై వేటు వేసి తీరాలి అనుకున్నా, కోర్టు
తీర్పును గౌరవించి, ఆమెను సభలోకి అనుమతించి, తిరిగి కట్టుతప్పి వ్యవహరిస్తున్నారు
భావిస్తే, ఈసారి సరయిన నిబంధన కింద ఆ పని చేసే వెసులుబాటును ప్రభుత్వం ఎందుకు ఒదులుకుంటున్నదన్నది
అర్ధం కాని మరోవిషయం. స్పీకర్ చేతిలో, ఆ
మాటకు వస్తే సభ చేతిలో అటువంటి విశేషాధికారాలు వుండనే వున్నాయి. ప్రివిలేజ్ కమిటీలు కూడా ఆపని చేయవచ్చు. అలా
చేయడం ద్వారా సభలో అంతా ఒక పద్దతి ప్రకారం
జరుగుతోందన్న అభిప్రాయం ప్రజలకు కలుగుతుంది.
శనివారం ఒక్క రోజే ఈవారంలో శాసన సభకు పనిదినం. ఆ రోజూ రోజాకి అనుమతి దొరకలేదు.
వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆమెకు సంఘీభావంగా, ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్ల దుస్తులతో సభలోకి వచ్చి స్పీకర్
పోడియం దగ్గర నినాదాలు చేసి సభాకార్యక్రమాలకు అడ్డు తగిలారు. స్పీకర్ కొద్దిసేపు
వాయిదా వేసి ఛాంబర్ కు వెళ్ళిపోయారు. పాలక, ప్రతిపక్ష సభ్యులే కాదు, మంత్రులు కూడా వాయిదా వల్ల దొరికిన సమయాన్ని అసెంబ్లీ లోని
మీడియా పాయింటు వద్ద తమ వాదనని తిరిగి వినిపించడానికి వాడుకున్నారు. అక్కడా వారి తీరులో తేడా లేదు.
రాజీ పడే ధోరణి బొత్తిగా కానరాలేదు. ఈ వ్యాసం రాస్తున్న సమయానికి ఇదీ
పరిస్తితి. సభ తిరిగి సమావేశం అయిన తరువాత
అయినా ఉభయ పక్షాలలో వివేచన చోటుచేసుకుంటుందన్న ఆశ లేకపోయినా ఆశ పడక తప్పదు.
పొతే, ఆదివారం సెలవు. సోమవారం హైకోర్టు ధర్మాసనం
అప్పీలు విచారించి ఒక నిర్ణయం ప్రకటించేలోగా శాసనసభ సమావేశం మొదలవుతుంది. మరి
ఆరోజయినా రోజాను సభలోకి అనుమతిస్తారా? లేక పాత కధే పునరావృతమవుతుందా?
రెండు పార్టీల నడుమ పంతాలు, పట్టింపుల కారణంగా గోటితో పోయే వ్యవహారాలు కూడా గొడ్డలి దాకా
పోతున్నాయి. ఒక క్షమాపణతో సద్దుమణగాల్సిన వ్యవహారం న్యాయస్థానాలవరకు చేరింది. ఇది
ఏమంత గౌరవప్రదం? గౌరవనీయ శాసనసభ్యులు అని
శిలాఫలకాలపై పేర్లు వేయించుకునే సభ్యులే ఆలోచించుకోవాలి. ఒక సభ్యుడు తప్పు చేశారని
అనుకున్నప్పుడు పాలకపక్షం కూడా కొంత సంయమనం పాటించి తేలికపాటి దండనతో సరిపుచ్చి, సర్దుబాటు చేసివుంటే విషయం ఇంత ముదిరి వుండేది కాదు.
కోర్టుకు పోయి అనుకూలంగా ఒక ఉత్తర్వు
తెచ్చుకోవడం ఒక ఘన విజయంగా భావించడం యెంత
తప్పో, నిబంధనల సాకుతో ఒక
ప్రజాప్రతినిధిని ఏడాది పాటు సస్పెండు చేయడం కూడా ప్రజాస్వామ్యంలో అంత
తప్పే. అందుకు ఒక తప్పు నిబంధనను ఉదహరించడం అంతకన్నా తప్పు. ఏదో సినిమాలో
చెప్పినట్టు ఇంత చిన్న లాజిక్ అంత అనుభవం వున్న పెద్దలకు ఎందుకు తట్టలేదో!
తప్పులను తప్పుగా ఒప్పుకోకపోవడం, చేసిన తప్పులను సమర్ధించుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సవరించుకోలేని
తప్పులు. ఇది తెలుసుకోలేనంత కాలం,
మనం ఇలాంటి పరిణామాలను చూస్తూనే వుంటాం.
నిజానికి ఇది టీ కప్పులో తుపాను.
పెద్దది చేయాలనుకుంటేనే పెద్దది అయ్యే చిన్న విషయం. సభలో కొందరు సభ్యుల నడవడి, విమర్శలకు పదాలు దొరకనంతగా దారితప్పుతోంది. అత్యున్నత చట్ట సభలో మనసు చివుక్కుమనే పద
ప్రయోగాలు విచ్చలవిడిగా చేసుకోవడం, క్షమాపణలతో ముగింపు పలకాలని అనుకోవడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. సభలో అనుభవజ్ఞులు
వున్నారు. కొత్తవారూ వున్నారు. సభ దారి తప్పుతూ వుండడానికి కాస్తో కూస్తో అనుభవం
వున్నవారే కారకులు అవుతూ వుండడమే ఇందులోని
విషాదం.
హుందాగా వ్యవహరించడం వల్ల ప్రజలనుంచి
లభించే మర్యాద మన్ననతో పోలిస్తే,
పంతాలు, పట్టింపుల ద్వారా ఒనగూడే విజయాల వల్ల
కలిగే సంతృప్తి దిగదుడుపే.
జనసామాన్యానికి కూడా సులువుగా అర్ధం
అయ్యే ఈ సత్యం, ఏలినవారికి కానీ,
వారిని ఎదిరించేవారికి కానీ ఎందుకు బోధపడడం లేదో ఎప్పటికీ అర్ధం
కాని విషయం.
ఉపశృతి : శాసనసభ స్వల్ప కాలానికి వాయిదా పడిన సమయంలోనే
దానికి అల్లంత దూరంలోని ఒక పంచ నక్షత్రాల
హోటల్ లో రెండు తెలుగు రాష్ట్రాల న్యాయాధికారుల సదస్సు జరుగుతోంది. సుప్రీం కోర్టు
న్యాయమూర్తులు, ఉమ్మడి హైకోర్టు ప్రధాన
న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులతో పాటు, తెలంగాణా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న ఈ సదస్సు వివరాలను
అనేక టీవీ చానళ్ళు ప్రత్యక్ష ప్రసారం
చేస్తున్నాయి. ‘దేశాభివృద్ధిలో న్యాయవ్యవస్థ పాత్ర కీలకం’ అంటూ వక్తల ఉద్ఘాటనలు స్క్రోలింగుల్లో
దొర్లుతూ కనిపించాయి.
‘ఏమి చెప్పుదు సంజయా!’ (19-03-2016)
1 కామెంట్:
మొత్తం తీర్పును మీరు చదివారాండీ? ఒకవేళ తీర్పు అంతర్జాలంలో లభ్యం అయితే లింకు ఇవ్వగలరా థాంక్స్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి