(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 10-03-2016, THURSDAY)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా
వున్నప్పుడు చంద్రబాబునాయుడికి ‘మీడియా మిత్రుడు’ అనే పేరు వుండేది. ఆ రోజుల్లో తన పరిపాలనకు సంబంధించి ఇరవై మూడు
జిల్లాల్లో ఎక్కడ, ఏమూల, ఏవిధమైన ప్రతికూల వార్త
వచ్చినా సరే, ఆయన తక్షణం స్పందించడం ఆ రోజుల్లో
పనిచేసిన నా బోటి విలేకరులకు బాగా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక
వార్తలు ప్రచురించే పెద్ద పత్రికల ‘పిల్ల పత్రికలను’ ఏరోజుకారోజు తన వద్దకు
తెప్పించుకుని, అదే రోజు దిద్దుబాటు చర్యలకోసం జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ
చేయడం అనేది నిత్యకృత్యంగా వుండేది. అంతేకాదు ఆయా ప్రతికూల వార్తలపై ముఖ్యమంత్రి స్పందన కూడా ప్రజలకు తెలిసేలా ఆ
విషయం పత్రికల్లో వచ్చేట్టు చూసే ప్రత్యేక
వ్యవస్థ ఒకటి ముఖ్యమంత్రి కార్యాలయంలో
పనిచేసేది. ‘అత్యంత సమర్దుడయిన ముఖ్యమంత్రి’ అనే మంచి పేరు చాలా త్వరగా రావడానికి ఇది ఎంతో ఉపకరించింది కూడా. పత్రికల
యాజమాన్యాలతోనే కాకుండా నిత్యం వృత్తిరీత్యా తనను కలిసే సామాన్య విలేకరులతో కూడా
మర్యాదగా వ్యవహరించే చంద్రబాబు మనస్తత్వం, ఇంటా బయటా ఆయనకు ‘మీడియా
సావీ సీఎం’ అనే మంచి బిరుదును
కట్టబెట్టింది.
అయితే, ఈనాటి పరిస్తితుల ప్రాబల్యం కావచ్చు, మంత్రివర్గ సహచరుల కారణంగా
వచ్చి పడుతున్న సమస్యల వల్ల కావచ్చు, తెచ్చిపెట్టుకున్న ఇబ్బందుల వల్ల
కావచ్చు, అన్నింటికీ మించి రాజకీయ అనివార్యతల
వల్ల కావచ్చు – గతంలో ఎన్నడూ లేని విధంగా, మీడియాలో వస్తున్న కొన్ని వార్తలు ఆయన్ని అసహనానికి, కలవరపాటుకు గురిచేస్తున్న
విషయం మాత్రం యదార్ధం అనిపిస్తోంది. యాక్టివ్ జర్నలిజంలో లేనందువల్ల
దగ్గరనుంచి పరిశీలించే అవకాశం నాకిప్పుడు లేదు.
కానీ, టీవీ లలో ప్రసారం అవుతున్న
మీడియా సమావేశాల్లో కానవస్తున్న ఆయన ముఖ కవళికలు
ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. గతంలో నాకు తెలిసిన చంద్రబాబు ఈయనేనా అన్న
అనుమానం కూడా కలుగుతోంది. అయితే,
ఈ విషయంలో ఆయన్ని పూర్తిగా తప్పుపట్టడానికి
కూడా వీల్లేదు. అప్పటికీ, ఇప్పటికీ రాజకీయాల తీరూ
తెన్నూ గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మాటా
నిజమే. రాష్ట్రంలో తనకు ప్రధాన
ప్రతిపక్షంగా వున్న వై.ఎస్.ఆర్.సీ.పీ., ఒక పత్రికను, ఒక టీవీ ఛానల్ ను
అడ్డుపెట్టుకుని రాజకీయంగా తనను సాధిస్తోందని ఆయన ఆరోపణ. మునుపు పత్రికల్లో ఏదయినా
ప్రభుత్వ వ్యతిరేక వార్త వచ్చినా సరే తక్షణం స్పందించి చర్యలకు ఆదేశించిన
చంద్రబాబు, ఇప్పుడు ఒక మీడియా పనికట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక వార్తలను
వండివారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పైపెచ్చు అటువంటి వార్తలు రాసే పత్రికపై
న్యాయపరమయిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. చంద్రబాబునాయుడు
అన్నట్టు ఆ పత్రికా, ఆ ఛానల్ రెండూ కూడా ప్రతిపక్షనేత ఆధ్వర్యంలో పనిచేసేవి కావచ్చు. ఆ
మాటకు వస్తే, ప్రతిపక్షానికే కాదు,
ఈ రోజు రాష్ట్రంలో ప్రతి (రాజకీయ) ‘పక్షానికీ’, సానుకూల వార్తలు రాసే, చూపించే, మీడియా దన్ను వున్న మాట కూడా వాస్తవమే. పొరుగున వున్న తమిళ నాడుతో
పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్తితి కాస్త మెరుగేమో. నిజం చెప్పాలంటే పత్రికలు, ఛానల్స్ మాత్రమే కాదు, వాటిని చదివే,
చూసే
పాఠకులు, వీక్షకులు కూడా పార్టీల వారిగా విడిపోయినట్టు అనిపిస్తోంది. ఇలా మారిన పరిస్తితుల్లో
చంద్రబాబునాయుడు కూడా పత్రికల పట్ల తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందేమో
తెలవదు. ‘కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన అహరహం కష్టపడి పనిచేస్తుంటే, సహకరించాల్సింది పోయి, ఈ సన్నాయి నొక్కుళ్ళు ఏమిట’న్నది తెలుగు తమ్ముళ్ళ ఆవేదన. చేయి చాచుకునే స్వేచ్చ ప్రతివాడికీ వుంటుంది, కాకపొతే ఆ చేయి కొన పక్కవాడి ముక్కుకు తాకనంతవరకే అనే ఒక ఆంగ్ల సూక్తిని
వారు ఉదహరిస్తున్నారు. స్వేచ్చకు కూడా సరిహద్దులు ఉండాలనేది దాని టీకా తాత్పర్యం.
అయినా కానీ, పత్రికా స్వేచ్చ పట్ల చంద్రబాబు వెలిబుచ్చే అభిప్రాయాలు గతంతో
పోల్చిచూసుకున్నప్ప్పుడు కొంత విడ్డూరంగా అనిపిస్తున్న మాట కూడా వాస్తవం.
వై.ఎస్.ఆర్.సీ.పీ. నాయకుల వాదన సహజంగా
ఇందుకు భిన్నంగా వుంటుంది. గతంలో తమ
నాయకుడి గురించిన ఆరోపణలు కొన్ని
పత్రికల్లో సీరియల్ గా వస్తున్న రోజుల్లో నోరు మెదపని తెలుగుదేశం అధినేత, ఇప్పుడిలా నోరు చేసుకోవడం ఏం
భావ్యమని ఆ పార్టీ నాయకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. సరే! ఇది, నిప్పూ ఉప్పూ వంటి రెండు రాజకీయ
పార్టీల నడుమ వ్యవహారం. అవి సమాధానపడే అవకాశమే లేదు. కాకపోతే ఈ మొత్తం వ్యవహారం
మరోసారి పత్రికల పాత్రను గురించి,
మీడియా బాధ్యతను గురించి, వాటి స్వేచ్చను గురించి కొన్ని
కీలకమైన ప్రశ్నలను చర్చకు తెచ్చింది.
పత్రికా స్వేచ్చ గురించి ఎవరెన్ని
కబుర్లు చెప్పినా అది నేతిబీరకాయ చందం అనేవారూ వున్నారు. స్వేచ్చ యజమానులదే కాని, పత్రికల్లో పనిచేసే
సిబ్బందిది కాదనే వారూ లేకపోలేదు.
‘కలం కూలీ’ గా తనను తాను
అభివర్ణించుకుంటూ జీవితం చాలించిన ప్రసిద్ధ జర్నలిష్టు జీ. కృష్ణ గారు
చెబుతారు ‘అప్పుడు- ఇప్పుడు’ అని రాసిన తన
అనుభవాల సమాహారంలో. ‘యజమానులే రాజకీయ పార్టీలకు అంకితం కావడం వల్ల, పత్రికారచయితలకు కూడా
రాజకీయాలు తప్పనిసరి అవుతున్నాయ’ని. దీనికి తోడు జర్నలిష్టులకు సొంత రాజకీయం
తగలడితే ఇక చెప్పేదేమి వుంటుంది. ‘అసలే కోతి, నిప్పులు తొక్కింది అనే సామెత చందం’
అంటారాయన.
జీ.కృష్ణ గారు పాతతరం పత్రికారచయిత.
ఆయన సూత్రాలు, సిద్ధాంతాలు ఈనాటి కాలానికి వర్తించవేమో!
‘స్వాతంత్రం వచ్చిన తరువాత మన రాజకీయ
నాయకులు నేర్చుకున్నదేమిటి?
ఈ ప్రశ్నకు
కృష్ణగారి జవాబును సుప్రసిద్ధ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వర రావు గారు ఆ
పుస్తకానికి ముందు మాటలో రాసారిలా. ‘వాళ్ళు నేర్చినవి రెండే రెండు విద్యలు. ఒకటి
గుడ్డిగా పొగడడం. లేదా గుడ్డిగా వ్యతిరేకించడం”
దీన్ని కాస్త మారిస్తే ప్రస్తుతానికి
అన్వయించుకోవచ్చేమో! ‘పత్రికలకు తెలిసింది గుడ్డిగా పొగడడం లేదా అంతే గుడ్డిగా
వ్యతిరేకించడం’. కాస్త పరుషంగా అనిపించవచ్చేమో, మన్నించాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ ఆవిర్భావానికి
చాలా పూర్వం, కాంగ్రెస్ పార్టీ
ఏకచత్రాధిపత్యంగా పాలిస్తున్న రోజుల్లో పాలకపక్షంలోని రెండు వర్గాలకు
తెలుగు పత్రికలు చెరో వైపూ కొమ్ము కాసేవన్న సంగతి బహిరంగ రహస్యమే. నాటి మేటి
తెనుగు పత్రికల్లో ఒకటి నీలం సంజీవరెడ్డిని సమర్ధిస్తే, రెండోది ఎన్జీ రంగాకు అండదండగా నిలబడేవని సీనియర్ జర్నలిష్టులు
చెబుతారు. ప్రతి రోజూ ఆ రెండు పత్రికలు ఇలా తమ ఈ విధానానికి తగ్గట్టు వార్తలు
సేకరించి రాసేవట. అప్పుడే అలా వుంటే, ఇప్పుడు పార్టీలు పెరిగాయి. పత్రికలు
పెరిగాయి. తగ్గట్టే వండి వార్చే వార్తలూ పెరిగాయి. కాబట్టి చింతించి వగచిన ఏమి
ఫలము?
పూర్వపు రోజుల్లో వేరే పత్రిక గురించి మరో పత్రికలో రాయాల్సి వచ్చినప్పుడు, ‘ఒక పత్రిక’ అనో,
లేదా ‘తమ
పత్రిక కాద’నో, మొత్తం మీద ఆ పత్రిక పేరు
పెట్టకుండా రాసేవారు. ఇప్పుడలాంటి మర్యాదలు ఎవ్వరూ పాటిస్తున్నట్టు లేదు.
పార్టీలు, పత్రికలూ అని కదా మాట్లాడుకుంటున్నాం. ఈ సందర్భంలో ఒక మహానుభావుడ్ని
తప్పనిసరిగా గుర్తుచేసుకోవాలి.
ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఇప్పటిది కాదు, గతంలో ఎమర్జెన్సీ కాలంలోనే
కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ
పై కాలుదువ్వి, కయ్యం పెట్టుకున్న ఘన చరిత్ర కలిగిన ఆంగ్ల పత్రిక. దాని అధిపతి రామనాద్ గోయెంకా, తన సంపాదక బృందంతో ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారట, ‘తనకొక పూచిక పుల్ల దొరికినా
దాంతో ఇందిరాగాంధీని ఎదుర్కుంటాన’ని. ఇక అంతటి పెద్ద పత్రిక చేతిలో వుంటే
చెప్పేదేముంటుంది?
పరిశోధనాత్మక జర్నలిజం అనే మాట తరచుగా
వినబడుతోంది. కూపీలాగి సమాచారం సేకరించడం అని దీనికి అర్ధం చెప్పుకోవచ్చు. ఈ మాదిరి కూపీ
జర్నలిజానికి ఒక ఆద్యుడు వున్నాడు. ఆయన
పేరు గాజుల లక్ష్మీనరసు చెట్టి. బ్రిటిష్ పాలనలోని భారతదేశంలో స్వదేశీ ఉద్యమాలు
ఊపిరి పోసుకుంటున్నప్పటి కాలంనాటి వాడు. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన రహస్య
సమాచారాన్ని బయటికి లాగి ‘కార్లీలియన్’ అనే పత్రికలో ప్రచురించేవాడు. కూపీలాగి
సమాచారం సేకరించేందుకోసం ఆ పత్రిక కొందరు విలేకరులను ప్రత్యేకంగా నియోగించేది. ఈ
కారణంగా ప్రభుత్వ ఆగ్రహాన్ని చవిచూడవలసి వచ్చింది కూడా.
స్వేచ్చగా వ్యక్తపరిచే భావాల సంఘర్షణ
నుంచే సత్య నిరూపణ జరుగుతుందని జాన్ లాక్ అంటాడు.
ఈనాటి పత్రికలకు ఈ స్వేచ్చ వున్నమాట నిజమే కాని పత్రికల్లో తాము రాసే ప్రతి
విషయం ఎవరి అదుపు ఆజ్ఞా లేకుండా ప్రచురితం
అవుతున్నాయని ఏ జర్నలిష్టూ చెప్పుకోలేని పరిస్తితిని కూడా నేడు చూస్తున్నాము.
‘ప్రజాభిప్రాయం యుద్ధం కంటే
శక్తివంతమైనద’ని టాల్ స్టాయ్ అభిప్రాయం.
ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి రామారావును పదవి నుంచి దించి
వేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెల్లుబికిన ప్రజాందోళనను ప్రజాభిప్రాయంగా మలచడంలో
పత్రికల పాత్ర ఇంతా అంతా కాదు. ఆ మొత్తం
వ్యవహారానికి కర్తా, కర్మా, క్రియగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు కంటే ఈ విషయం బాగా తెలిసిన
వాళ్ళు మరొకరు వుంటారని నేననుకోను.
అధికారంలో వున్నప్పుడు ఒక మాదిరిగా, లేనప్పుడు మరో విధంగా పత్రికలపట్ల వైఖరులను మార్చుకోవడం గురించి
చెప్పుకునేటప్పుడు తటాలున గుర్తుకు వచ్చే మనిషి అమెరికా మాజీ అధ్యక్షుడు థామస్
జెఫర్సన్. “పత్రికలులేని ప్రభుత్వం కావాలా? ప్రభుత్వం లేని పత్రికలు కావాలా? ఏదో
ఒకటి కోరుకోమంటే మారుమాట లేకుండా
ప్రభుత్వం లేని పత్రికలనే కోరుకుంటానని’ జెఫర్సన్ మహాశయుల ఉవాచ. అయితే అప్పటికి
ఆయన అమెరికా అధ్యక్షులు కాలేదు. అయిన తరువాత అయన స్నేహితుడికి రాసిన ఉత్తరంలో
పత్రికలు గురించి తద్విరుద్ధమైన వ్యాఖ్య
చేస్తాడు. “ఇప్పుడు పత్రికల్లో వచ్చేది ఏదీ నమ్మడానికి వీల్లేకుండా వుంది” ఇదీ అయన
మనసులోని మాట సారాంశం.
గతంలో పత్రికావిలువలు యెంత సమున్నతంగా
వుండేవో తెలుసుకోవాలంటే ప్రసిద్ధ
సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు రాసిన ‘నాటి పత్రికల మేటి విలువలు’ చదవాలి.
ప్రచురణకు ముందు పొత్తూరివారి ఈ ప్రసంగవ్యాస పరంపర విజయవాడ, ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారం అయింది.
‘ఈవేల్టి న్యూస్ పేపర్ రేపటి వేస్ట్
పేపర్’ అని పత్రికల్లో ఏమి వచ్చినా దులిపేసుకుపోయే రాజకీయ నాయకులూ వున్నారు. ఎలా
రాసినా భలేగా రాశారే అని సంతృప్తి పడే
అల్పసంతోషులు సయితం వున్నారు.
జర్నలిష్టులకు బ్రిటిష్ పత్రికాధిపతి
లార్డ్ బీవర్ బ్రూక్ (1879-1964)
ఇచ్చిన సలహా నేటికీ వర్తించేదిగా వుంది. ఆయన తన
సిబ్బందితో అంటాడు ఇలా. ‘వెళ్ళండి! నోరులేనివాళ్ళ పక్షాన, నిండా మునిగిన వాళ్ళ పక్షాన మాట్లాడండి!”
సరే!
లార్డ్ బ్రూక్ మహాశయులు
చెప్పారుకదా అని నిజాలను పచ్చి నిజాలుగా రాసేస్తే అవి నేటి రాజకీయ నాయకులకు
రుచించకపోవచ్చు. కెమెరాలు ఎదురుగా వున్నప్పుడు వారిలో కొందరి హావభావాలు, అనే
మాటలు, చేసే వ్యాఖ్యానాలు చెలియలి కట్ట దాటి పోతున్నాయి.
రాజకీయ నాయకులు ఒకరు చెబితే వినే
పరిస్తితి వుండదు. వారి వారి అనివార్యతల కారణంగా మాట్లాడే విధానాలు మార్చుకోవడం
కష్టం కూడా. అటువంటప్పుడు ఈ సమస్యకు పరిష్కారం మీడియానే చూపాలి.
ఎలక్ట్రానికి మీడియా రంగప్రవేశం చేసిన
రోజుల్లో ఎక్కడయినా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు
ఛిద్రమైన బాధితుల శరీర భాగాలను యధాతధంగా చూపేవారు. మనసులను కలచివేసే
ఇటువంటి దృశ్యాలను చూపడం సరికాదనుకుని వారే కాలక్రమంలో పద్దతులు మార్చుకున్నారు.
వాటిని కనీ కనిపించకుండా మసక మసకగా
చేసి చూపిస్తున్నారు. ఒకరకంగా మంచి
పరిణామం. ప్రెస్ కాన్ఫరెన్సుల్లో ఆయా నాయకులు చేసే అసభ్యవ్యాఖ్యలను ప్రత్యక్ష
ప్రసారాల్లో ఒకసారి చూపించడం సాంకేతిక రీత్యా తప్పకపోవచ్చు. అయితే వాటిని పునః
ప్రసారం చేసేటప్పుడు ఎడిట్ చేసి చూపిస్తే బాగుంటుందేమో మీడియా యాజమాన్యాలు
ఆలోచించుకోవాలి. అసభ్య వ్యాఖ్యలు అని అంటున్నప్పుడు వాటిని అదేపనిగా యధాతధంగా
ప్రసారం చేయడంలో ఔచిత్యం ఏమి వుంటుంది?
ఉపశృతి:
అవి ఎమర్జెన్సీ
రోజులు.
హైదరాబాద్ ఆకాశవాణి
ప్రాంతీయ వార్తవిభాగంలో నేను కొత్తగా అడుగుపెట్టాను.
పత్రికా స్వేచ్చ పట్ల
అపరితమయిన గౌరవాభిమానాలతో జర్నలిజం ను వృత్తిగా స్వీకరించిన నా స్నేహితుడొకరు ఒక
ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. రేడియోలో పనిచేసే నాకు
వృత్తిపరమయిన స్వతంత్రం లేదనే భావన అతనిది. సర్కారు జర్నలిస్టుగా ముద్రవేసి నన్ను
ఆట పట్టించడం అతగాడికో అలవాటుగా మారింది. దీనికి ఎప్పుడో ఒకప్పుడు అడ్డుకట్ట
వేయాలనే తలంపులో వున్న నేను - ఒక రోజు అతడిని బాహాటంగా సవాలు చేసాను. ‘నాకో వార్త
చెప్పు. అది యధాతధంగా సాయంత్రం రేడియో వార్తల్లో వస్తుందో రాదో చూద్దాము. అలాగే
నేను చెప్పిన వార్త రేపు ఉదయం నీ పేపరులో వస్తే నీకు స్వేచ్చవుందని ఒప్పుకుంటాను.’
పత్రికా స్వేచ్చపట్ల
అపారమయిన గౌరవం వున్న నా స్నేహితుడు నేను విసిరిన సవాలుని స్వీకరించాడు. ఫలితం
గురించి చెప్పాల్సిన పని లేదు. అతను పంపిన వార్తకు అతడి పేపర్లో అతీగతీ లేదు. నేను
ఫోనులో చెప్పిన వార్త అదే సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో ప్రసారమయింది. అప్పటినుంచి
ఇప్పటివరకు మా స్నేహ బంధం కొనసాగుతూ వచ్చింది కానీ ఆతను ఎప్పుడు పత్రికా స్వేచ్చ
గురించిన ప్రసక్తి నా వద్ద తీసుకురాలేదు. (09-03-2016)
4 కామెంట్లు:
సార్. మీ అపార అనుభవం మీ రచనలలో కనిపిస్తుంది.
పచ్చపత్రికలు రెండు పదేళ్ళపాటు అభూతకల్పనవార్తలు రాయలేదా. వ్యక్తిత్వ హననం చేయటంలోను కులపిచ్చిలోను ABN AJ మించినవాళ్ళు లేరు. అందుకే PRESSTITUTES అన్న పదం పత్రికలవాళ్ళకు సరిగా సరిపోతుంది.
ఈరోజున తెలుగు మీడియా యజమానులలో కొద్ది మంది తప్ప మిగిలనవారు అందరూ చంద్రబాబు భజన చేసేవారే. వేమూరి లాంటి వారు చంద్రబాబుపై చూపించినంత మొరటు ప్రేమ వెదజల్లకుండా ఐవీయారు లాంటి సీనియర్లు జాగ్రత్త పడతారు తప్ప వీరందరిదీ పచ్చబాటే.
అంతెందుకు దేశం మొత్తంలో కాబినెట్ హోదా ఇచ్చి మరీ మీడియా సలహాదారును పెట్టుకున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ‘మీడియా సావీ సీఎం' అనే పేరు వుండేది. నిజం, పేరు ఉండేది.
హై టెక్ సిటీకి చుట్టుప్రక్కలా 2000 వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ముందుగానే కొనుక్కుని ఆస్థులు పెంచుకున్నారని కేసీఆర్ గారు ప్రచారం చేసి విభజనకి తొలిబీజం వేసారు.ఎక్కడివాళ్ళో ఇక్కడికి వచ్చి మన భూములు,మన రాష్ట్రం పాలించడమేమిటీ అని తెరాస స్థాపించారు. ఇటువంటి ప్రచారాలవల్ల రాష్ట్రం విడిపోయింది అని చంద్రబాబు గారికి తెలుసు కనుకనే ఇపుడు వస్తున్న కొత్త ప్రచారాలపై తీవ్రంగా స్పందిస్తున్నారు.
సీ ఎం నివాసం కి 30 కోట్లు ఖర్చుపెడుతున్నారంటే తెలంగాణాలో కేసీఆర్ కుటుంబమే ఎప్పటికీ పాలిస్తుందన్న నమ్మకం ఉంది.అటువంటి పరిస్థితి నిలువనీడలేని ఆంధ్ర ప్రదేశ్ సీ ఎం కి లేదు కనుక ఏ చిన్న ప్రచారానికైనా తీవ్రంగా స్పందించి భయపడుతున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి