భండారు వారి వంశానికి ‘జాతీయ పర్వదినం’ అంటూ
వుంటే అది తిధుల ప్రకారం ఈరోజే. కొన్ని
దశాబ్దాల నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఈరోజు ‘తాతయ్య తద్దినం’ అంటూ
ఎక్కడెక్కడినుంచో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు పిల్లాపాపతో కలసి రెక్కలుకట్టుకుని మా వూళ్ళో వాలిపోయేవాళ్ళు. ఆయన
(మా నాన్నగారు భండారు రాఘవరావు గారు) పోయి అరవై ఏళ్ళు దాటింది. నాకప్పటికి అటూఇటూ
కాని వయసు. బయట వూళ్ళో వుండి చదువుకోవడం వల్ల మా నాన్న రూపు అస్సలు గుర్తులేదు. ఆయన
చనిపోవడానికి కొన్ని రోజులముందు, మంచానపడ్డ స్తితిలో ఆయన్ని మా బావగారొకరు
ఫోటో తీసారు. ఆ ఫోటో మా ఇంటి
వరండాలో చాలా ఏళ్ళు అలాగే వుంది. పాత కాలపు కెమేరాతో తీసిన ఆ ఫోటోలో గుర్తుపట్టి,
గుర్తుంచుకోగలిగిన పోలికలేవీ కనిపించేవి కాదు. అందువల్ల మా నాన్న నాకు
సంబంధించినంతవరకు ఓ జ్ఞాపకం మాత్రమే. కాకపొతే, మా పెద్దన్నయ్యగారితో కలసి తద్దినం
పెట్టేవాడి తమ్ముడి పాత్రలో యాభయ్ సంవత్సరాలకు పైగా వొదిగిపోయాను. తాతయ్య ఎవరో తెలియకపోయినా ఆడామగా
తేడా లేకుండా ఆయన వారసత్వ సంతానం అందరికీ ఏటా మా వూళ్ళో పెట్టే మా నాన్నగారి
తద్దినం మాత్రం బాగా గుర్తుండి పోయింది. పెళ్ళికి తరలివెళ్ళినట్టు అంతా బళ్ళు
కట్టుకుని ఎంతెంతో దూరాలనుంచి తరలివచ్చేవాళ్ళు. పేరుకు తద్దినం అయినా వూళ్ళో వుండే
మా మూడో అన్నయ్య కార్యదక్షత కారణంగా అదొక వేడుకలా జరిగిపోయేది. అందుకే ‘పర్వదినం’
అనేది.
ఇన్నేళ్ళుగా ఒక్క నాగా లేకుండా సాగుతూ వచ్చిన ఈ
వేడుకకు ఈ ఏడాది బ్రేకులు పడ్డాయి. అనివార్యమైన పరిస్థితుల్లో తద్దినం పెట్టడానికి
బదులు శాస్త్రంలో చెప్పినట్టుగా పితృదేవతలకు తర్పణాలు వొదిలి తృప్తి
పడాల్సివస్తోంది. ఈ విషయంలో నా అశక్తతను ఈ ఏడాది అందరూ మన్నిస్తారని అనుకుంటున్నాను.
–భండారు శ్రీనివాసరావు (07-12-2013)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి