దాదాపు మూడువారాల తరువాత మా ఆవిడకు బెయిల్
దొరికింది. అదీ షరతులతో కూడిన బెయిల్.
ఇన్నాళ్ళు ఆసుపత్రిలో వున్నది చాల లేదట. రెండు
మూడు రోజులకోమారయినా వచ్చివెడుతుండాలట. ఇంట్లో కూడా చాలా చాలా జాగ్రత్తగా వుండాలట.
వైద్యమా మజాకా మరి.
మా ఆవిడ గుండె మంచిదని తెలిసిన వాళ్లందరూ
అంటుంటారు. మంచిదే కాదు గట్టిది కూడా అని ఆ గుండెకు రెండుసార్లు ఆపరేషన్లు చేసిన డాక్టర్లు
చెబుతుంటారు. పాతికేళ్ళ వయస్సులో ఓ ఆపరేషన్ మళ్ళీ మరో పాతిక ముప్పయ్యేళ్ళు గడిచిన తరువాత మళ్ళీ అదే గుండెకు ఇంకో
ఆపరేషన్. ఇంతెందుకు మొన్నటికి మొన్న ఆసుపత్రిలో మా గోలలో మేముంటే – 1989లో అదే
ఆసుపత్రిలో ఆమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన
డాక్టరు సీతారామారెడ్డి గారు వచ్చి చూసి వెళ్ళడమే కాదు మిగిలిన డాక్టర్లకు చూపించి ‘ఈవిడకే నేను ఆ రోజుల్లో గుండె ఆపరేషన్ చేసాను. గుండెకు
ఆపరేషన్ అంటే గుండె ఆగిపోయే రోజుల్లో ఈవిడ ధైర్యంగా చేయించుకుంది. అది సక్సెస్
కావడానికి ఈవిడ గుండె ధైర్యం కూడా కొంత కారణం’ అని చెప్పుకుంటుంటే పెద్ద కష్టం
నుంచి బయటపడిన నాటి సంగతులు గుర్తుకు తెచ్చుకుని సంబరపడాలో, లేక నేటి గడ్డు
పరిస్తితి గురించి బాధపడాలో అర్ధం
కాలేదు.
ఈ ఇరవై
రోజులు నిజానికి మా జీవితాల్లో కఠిన పరీక్షాకాలం. పరీక్షల్లో నెగ్గడం మాట
అటుంచినా కాస్తోకూస్తో నిగ్గుదేలడానికి
అవకాశం వుంటుంది. ఇన్ని రకాల వైద్య పరీక్షలు వుంటాయా అన్నట్టు అన్ని రకాల పరీక్షలు
ఎన్నో రకాలుగా చేశారు. వొంట్లో రక్తం
పరీక్షలకే అన్నట్టు గుచ్చి గుచ్చి తీశారు. యాభయ్ ఏళ్ళ పైచిలుకు జీవితంలో సొంత సంతానాన్ని సాకినట్టే షుగరు, బీపీ, గుండె
జబ్బుల్ని జాగ్రత్తగా పోషించుకుంటూ వస్తోందేమో అవి కూడా ‘గుడి పదిలం’ అన్న
పద్ధతిలో వొంట్లో సెటిల్ అయిపోయాయి.
ఇన్నింటిని సంభాలించుకుంటూ డాక్టర్లు వైద్యం చేయాల్సిన పరిస్తితి. ఈ స్తితికి
రావడానికి ఆమె యెంత బాధ్యురాలో తెలియదు కాని నా బాధ్యతారాహిత్యం మాత్రం కొండంత
వుంది. బాధ్యతల్నీ బరువుల్నీ ఆమెకు వొదిలేసి నా మానాన నేను టీవీలు చర్చలు అంటూ
తిరగడం పరిస్తితి ఇలా దిగజారడానికి కారణం అని ఏ భేషజం లేకుండా వొప్పుకోవాల్సిన
వాస్తవం. అందుకే జరిగినది తలచుకుంటూ, జరుగుతున్నది చూస్తూ ఈ క్రమంలో నన్ను నేను ఎన్నోసార్లు తిట్టుకున్నాను. గింజుకున్నాను. గుంజుకున్నాను.
అన్నీ అయిపోయి ఇదిగో ఇప్పుడిలా బెయిళ్లు,
షరతులు అంటూ అడ్డమయిన జోకులు
పేలుస్తున్నాను. నన్ను నేను సముదాయించుకోవడానికి నాకు దొరికిన సులభ మార్గం
ఇదేనేమో!
పద్దెనిమిది రోజులక్రితం షుగర్ పరీక్ష చేయించుకుని అటునుంచి అటే హోటల్లో
టిఫిన్లు చేసి ఇంటికి వద్దామని ఆస్పత్రికి ఉదయాన్నే వెళ్ళిన వాళ్ళం – అటునుంచి అటే
ఆమెను ఐ.సీ.యూ.కి తీసుకువెడుతుంటే కలో
నిజమో తెలియక కళ్ళప్పగించి చూసిన వాళ్ళం –
మొత్తానికి ఇంటికి చేరాం. ఇక్కడా మార్పే. అమ్మకు బాగాలేదని తెలిసి అమెరికానుంచి వచ్చిన మా పెద్దవాడు సందీప్,
రెండోవాడు సంతోష్ కలిసి ఈ మూడు వారాల్లోపే కావూరి హిల్స్ లో కొత్త అపార్ట్ మెంట్ అద్దెకు
తీసుకుకోవడం, సామాను మార్చడం, సదరడం అన్నీ కలలోలాగా జరిగిపోయాయి.
ఆసుపత్రి నుంచి నేరుగా కొత్త ఇంట్లో ‘గృహ ప్రవేశం’.
1975లో హైదరాబాదులో ఆకాశవాణిలో చేరినప్పుడు చిక్కడపల్లి, అశోక్ నగర్, ఆ
పిమ్మట మాస్కో, తరువాత పంజాగుట్ట, అమీర్ పేట్, ఎర్రమంజిల్, ఎల్లారెడ్డి గూడాల
మీదుగా ఇదిగో ఇప్పుడు కావూరి హిల్స్ ఇలా కదులుకుంటూ వస్తున్నాం.
నిజమే కదా! చలనం లేకపోతే జీవితమే లేదు.
(14-12-2013)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి