(పిల్లలకు
చెడ్డీలు మార్చినంత సులభంగా రాజకీయనాయకులు పార్టీలు మార్చగలరన్న అపవాదును రాజకీయనాయకులు
మోస్తున్నారు. దీనికి తోడు ‘ఈ దేశంలో
ప్రతిదీ తమ సొంతం , ప్రతిదీ తమకు ఉచితం’ అనే
భావన వారిలో ప్రబలిపోయిందని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. దీనికి సంకేతంగా నెట్లో ఇంగ్లీష్ లో ప్రచారంలోవున్న ఓ కధనం నా తెలుగులో మీకోసం)
“క్షవరం
చేయించుకుందామని పువ్వులమ్ముకునే ఓ చిరు వ్యాపారి ఓ రోజు ఓ క్షవరశాలకు వెళ్లాడు.
పని పూర్తయిన తరవాత డబ్బులు ఇవ్వబోయాడు. ‘ఈ వారం
రోజులూ నేను నా తోటివారికి నా చేతనయిన సర్వీసు ఉచితంగా చేద్దామనుకుంటున్నాను.
అందువల్ల డబ్బులు తీసుకోను’ అని అతగాడు మృదువుగా
తిరస్కరించాడు. ఆ మాటలకు ముగ్ధుడయిన ఆ పూల వ్యాపారి అక్కడినుంచి నిష్క్రమించాడు.
మరునాడు క్షురకుడు తన దుకాణం వద్దకు వెళ్లేసరికి అందంగా తయారు చేసిన పూల బొత్తి
షాపు ముందు కనిపించింది. ‘మీ సేవకు ధన్యవాదాలు’ అని
దానికో చీటీ పెట్టివుంది.
“తరువాత, ఆ షాపుకు
ఓ పోలీసు వచ్చాడు. బిల్లు చెల్లించబోయేటప్పుడు అతడికి కూడా అదే సమాధానం వచ్చింది.
ఈ వారమంతా అందరికీ ఉచిత సేవ అందించాలన్న నిర్ణయానికి అనుగుణంగా డబ్బులు తీసుకోనని
క్షురకుడు తెగేసి చెప్పాడు. మరునాటి ఉదయం అతడు దుకాణం తెరవడానికి వచ్చినప్పుడు ఆ
పోలీసు పంపిన ధన్యవాదాల సందేశం, దానితో పాటు అతడి ఇల్లాలు
స్వయంగా తయారు చేసిన మిఠాయిలు కనిపించాయి.
“ఆ
మరునాడు, ఘనత
వహించిన పార్లమెంట్ సభ్యుడు ఒకరు క్షవరం చేయించుకుందామని ఆ దుకాణానికే వెళ్లాడు.
క్షురకుడు యధావిధిగా డబ్బులు తీసుకోకపోవడానికి కారణం ఆయన గారికి
నివేదించుకున్నాడు. ఈ వారమంతా ఉచిత సేవ చేయాలని అనుకున్నానని పార్లమెంటు సభ్యుడితో
చెప్పాడు. అస్తమానం ప్రజాసేవలో తరించే ఆ ప్రజా ప్రతినిధి ఆ మాటలు విని ఎంతో
మురిసిపోయి వెళ్లి పోయాడు.
“మరుసటి
రోజు ఉదయం క్షురకుడు తన దుకాణం తెరవడానికి వెళ్ళినప్పుడు అక్కడ బారులు తీరి జనం
కనబడ్డారు . విచారిస్తే తెలిసినదేమిటంటే వారంతా గౌరవ పార్లమెంటు సభ్యులేనని.
ఉచితంగా దొరికే క్షవర సేవను అందుకుందామని వచ్చారని. తీరిగ్గా విచారించడమే ఇక
అతగాడికి మిగిలింది”
సాధారణ
జనాలకు, వారిని
పాలించే రాజకీయ నాయకులకు - మనస్తత్వాల్లో స్తూలంగా వున్న తేడాను ఎత్తిచూపుతూ
వెలువడిన ఈ కధనం ముక్తాయింపు ఇలా వుంది.
“చంటి
పిల్లలకు వాడే ‘డైపర్’ లనూ, రాజకీయనాయకులనూ
తరచూ మారుస్తుండడం చాలా అవసరం”
NOTE: Courtesy Cartoonist
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి