moscow life లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
moscow life లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, మార్చి 2012, మంగళవారం

మాస్కోలో మెక్ డొనాల్డ్




మాస్కోలో మెక్ డొనాల్డ్


1990 వ సంవత్సరం ప్రారంభంలో కాబోలు మాస్కోలో మొట్టమొదటి మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ మొదలయింది. అప్పుడు చూడాలి తమాషా. మాస్కో నగరంలో వున్న పిల్లలు,  యువతీ యువకులు అందరికీ అదొక అడ్డాగా మారిపోయింది.  అంటే హైదరాబాదులో ఒకప్పుడు ఇరానీ కఫేలు చాలామందికి రోజూ పరస్పరం కలుసుకునే ప్రదేశాలుగావుండేవి. అక్కడ కూర్చుని సమోసాలు తింటూ వేడి వేడి చాయ్ తాగుతూ, దక్కన్ క్రానికల్ పేపర్లో స్పోర్ట్స్ న్యూస్ చదువుతూ కుర్రకారు భలేగా  కాలక్షేపం చేసేవారు.  అయితే మాస్కో మెక్ డొనాల్డ్ విషయం లో కాసింత తేడా వుంది. అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునే సావకాశం వుండేది కాదు. ఎప్పుడు చూసినా కిలోమీటర్ల పొడుగునా క్యూలు దర్శనమిచ్చేవి. మా పిల్లలు అక్కడికి వెళ్లి పిజ్జా తిని కోక్ తాగిరావాలంటే ఒక పూటకు పైనే  పట్టేది.



లెనిన్ సమాధి దగ్గర బారులు తీరిన ప్రజలు 




 ఆ రెస్టారెంట్ కు కొద్ది దూరంలోనే  లెనిన్ సమాధి వున్న రాతి పలకలు పరచిన  మైదానం వుండేది. ఈ మెక్ డొనాల్డ్ వచ్చిన తరువాత అక్కడ క్యూలు పలచబడ్డవని హాస్యోక్తిగా చెప్పుకునే వారు.


మాస్కోలో మెక్ డొనాల్డ్

ఇనుప తెరదేశంగా పేరు పొందిన సోవియట్ రష్యా లో గోర్భచెవ్ సంస్కరణల పుణ్యమా అని తలుపులు బార్లా తెరవడంతో మెక్ డొనాల్డ్ వంటి పాశ్చాత్య రెస్టారెంట్లకు అక్కడ కాలుమోపే అవకాశం దొరికింది.
మాస్కో మెట్రో సింబల్ ఇంగ్లీష్ అక్షరం ‘M’ని పోలివుంటుంది. సరిగ్గా దానిలాగే వుండే మెక్ డొనాల్డ్ సింబల్ కూడా మాస్కో యువతరాన్ని అమితంగా ఆకర్షించింది.
మెక్ డొనాల్డ్ రెస్టారెంట్లలో బాగా అమ్ముడుపోయే బిగ్ మాక్మాస్కో రెస్టారెంట్ లో బల్షోయీ మాక్అనేవారు. రష్యన్లో బల్షోయీఅంటే పెద్దఅని అర్ధం. అప్పట్లో బిగ్ మాక్ ధర  రెండు రష్యన్ రూబుళ్లు. అంటే అమెరికా కరెన్సీలో చెప్పాలంటే మూడు  డాలర్ల ముప్పయ్ ఎనిమిది సెంట్లు. సగటు రష్యన్ పౌరుడి నెల జీతంలో వందో వంతు. కాకపొతే ఇవన్నీ గతకాలపు ముచ్చట్లు సుమా!
మాస్కో పౌరులను మంత్ర ముగ్ధులను చేసిన ఈ మెక్ డొనాల్డ్ కధాకమామిషూ ఏమిటంటే-
1940 మే 15 వ తేదీన మొట్టమొదటి మెక్డొనాల్డ్ రెస్టారెంట్ ను- డిక్, మాక్ మెక్డొనాల్డ్ అనే సోదరులు కలసి కాలిఫోర్నియాలోని సాన్  బెర్నార్డినో అనే చోట ఏర్పాటుచేశారు. అలా మొదలయిన ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్ రెస్టారెంట్లు కాలక్రమంలో 122  దేశాలకు ఎగబాకి మొత్తం ముప్పై వేల పైచిలుకు రెస్టారెంట్లతో యావత్ ప్రపంచ ప్రజానీకాన్ని తమదయిన  రుచులతో అలరించే  స్తాయికి చేరుకున్నాయి.
ఇక అమెరికాలో మెక్ డొనాల్డ్ ప్రభ యెలా వెలుగుతున్నదో తెలుసుకోవాలంటే కొన్ని గణాంకాలు అవసరం. 1970 లో మెక్డొనాల్డ్ అమ్మకాలు మొత్తం అమెరికాలో ఆరు బిలియన్ డాలర్లు వుండగా 2001 నాటికి అవి 110 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంటే ఆ దేశంలో ఉన్నత విద్య పైనా, కంప్యూటర్లు, మోటారు కార్లు, సినిమాలు, మాగజైన్లు, పుస్తకాలు, వీడియోలు వీటన్నిటి పైనా కలిపి ఆ దేశస్తులు ఖర్చు పెట్టే మొత్తం కంటే ఇది చాలా చాలా  ఎక్కువ.
 (20-03-2012)

19, జనవరి 2010, మంగళవారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు - పదో భాగం)- భండారు శ్రీనివాసరావు

   










నదిపై పిల్లల  ఫుట్ బాల్  ఆట 
నీళ్ళపై నడయాడగల యోగపురుషులున్న పుణ్య భూమి గా పేరుగాంచిన భారత దేశంనుంచి వెళ్ళిన మేము - మాస్కోలో 'నదిపై ఫుట్ బాల్ ఆడుతున్న పిల్లల'ను కళ్ళారా చూసాము.
ఉత్తర ధృవానికి చేరువగా వుండడం వల్ల, మాస్కోలో ఉష్ణోగ్రతలు సున్నాకంటే ముప్పయి నలభై డిగ్రీలు తక్కువగా వుంటాయి. ఈ చల్లదనానికి మాస్కో నగరం మధ్యలో పాయలుగా పారే మాస్కవా నదిలో నీళ్ళు గడ్డకట్టుకు పోతాయి. కాంక్రీటు మాదిరిగా గట్టిపడిన ఆ నది ఉపరితలం పిల్లలకు ఆట మైదానంగా మారిపోతుంది. ఇక దానిపై ఫుట్ బాల్ ఆటలేనా, స్కేటింగ్ లేనా, ఓహ్! అది చూసి తీరాల్సిన దృశ్యం.



సాధారణంగా మనవైపు ముసురు పట్టినప్పుడు, చల్లగాలులు వీస్తున్నప్పుడు చంటి పిల్లలను బయట తిప్పడానికి సంకోచిస్తాము. కానీ అక్కడ అలా కాదు. ఒక పక్క మంచు నిలబడి కురుస్తూనే వుంటుంది. మరో పక్క నెలలు నిండని శిశువులను సయితం చలి దుస్తుల్లో 'ప్యాక్' చేసి ఆరుబయట వొదిలేసి తల్లులు 'షాపింగ్' చేస్తుంటారు. అది చూస్తూ 'మన దేశం నుంచి వెళ్ళిన తల్లులు' ఇలా ఎలా ? అన్న ప్రశ్నలు వేసుకుని సతమతమౌతుంటారు.
తుమ్మి చిరంజీవ
అలా అని - తుమ్మని వాళ్ళూ , పడిసం పట్టని వాళ్ళూ అసలే లేరని కాదు. మనదగ్గర పల్లెల్లో ఇప్పటికీ పిల్లలు తుమ్మినప్పుడు దగ్గరున్న పెద్దవాళ్ళు వాళ్ళ నెత్తిపై తట్టి 'చిరంజీవ! చిరంజీవ!!' అని అంటూ వుండడం కద్దు. అలాగే అక్కడ కూడా ఎవరయినా తుమ్మగానే పక్కనున్నవాళ్ళు ' బూజ్ ద్దరోవా '( బహుశా దీనికి అర్ధం వెయ్యేళ్ళు బతకమని కాబోలు) అంటుంటారు. మోడరన్ అమ్మాయిల మాటేమోగాని పాత తరం మనుషులు ఇప్పటికీ చిన్న చిన్న నలతలకు ఇళ్ళల్లోనే చిట్కా వైద్యాలు చేస్తుంటారని పిలిపెంకో దంపతులు చెబుతుండేవాళ్ళు.
భోజనాలకు కటకట






పిలిపెంకో ఓసారి పట్టుపట్టి మమ్మల్ని లెనిన్ గ్రాడ్ రైల్లో తీసుకువెళ్ళాడు. అక్కడ పట్టుమని రెండు రాత్రులు కూడా గడపలేదు. ఎప్పుడు వెళ్లి ఇంట్లో పడదామా అన్న ఆరాటంతోనే సరిపోయింది. ఆ నగరంలో చూడాల్సినవి ఎన్నోవున్నాయి. కానీ తినకుండా తిరగడం అన్నదే సమస్యగా మారింది.



 శాఖాహారులకు హోటళ్ళలో తినడానికి ఏమీ దొరకదు. ముతక బియ్యంతో పొడి పొడిగా వండిన అన్నంపై ఉప్పూ మిరియప్పొడి చల్లుకు తినాలి. పెరుగు కాదు కానీ పెరుగు లాంటిది 'కిఫీర్'   దొరుకుతుంది. దానితో సరిపెట్టుకుని భోజనం అయిందనుకోవాలి. అలాగని మాంసాహారులకు రుచికరంగా అన్నీ దొరుకుతాయని అనుకోనక్కరలేదు. ఉడికించిన కోడిగుడ్లు మినహా మిగిలినవేవీ మనవైపునుంచి వెళ్ళిన వాళ్లకు అంతగా రుచిస్తాయనుకోవడానికి లేదు. మాంసాన్ని ఉప్పునీళ్ళల్లో ఉడికించి అదేమాదిరిగా సర్వ్ చేస్తారు. ఉప్పుకారాలు దట్టించి, నూనెల్లో వేయించి వేయిన్నొక్క రకాలుగా వంటలు వండుకుని తినే అలవాటు వున్న వాళ్లకు ఆ తిండి సయించడం కష్టమే. అందుకే అక్కడికి వ్యాపారపు పనులమీదనో లేక ఇండో సోవియట్ సాంస్కృతిక సంఘం ఆహ్వానం మేరకో వచ్చినవాళ్ళు భోజనానికి కటకట పడుతుంటారు.అలా వచ్చినవాళ్ళు మొదటి రోజు అక్కడి హోటళ్లు, బస ఏర్పాట్లు చూసి పరవాలేదనుకుంటారు. విందుల్లో మందు తప్ప ఇష్టపడి తినదగిన భోజనం కనబడక పోవడంతో- ఆకలి ఎరుగని దేశంలో వాళ్లకు ఆకలి కష్టాలు మొదలవుతాయి.

(భోజనానికి బస్సు వేసుకువచ్చిన అతిధులతో మా ఇల్లు ఎలా కళకళ లాడిందన్న ముచ్చట మరోసారి)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.