16, మే 2024, గురువారం

విలేకరిగా జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు



1975 నవంబర్ లో నేను హైదరాబాదు ఆకాశవాణిలో విలేకరిగా చేరిన నాటి నుంచి కొన్ని దశాబ్దాలపాటు ఒకటే దినచర్య. నేను వుంటున్న చిక్కడపల్లి నుంచి బయలుదేరి రెండు బస్సులు మారి రేడియో స్టేషన్ కు రెండు స్టాపుల ముందే, సరోవర్ హోటల్ దగ్గర దిగిపోయేవాడిని. నేను పనిచేసేది రేడియో స్టేషన్ అయినా, నా కార్యస్థానం మాత్రం సచివాలయమే. ఆరోజుల్లో సెక్రెటేరియట్ ప్రధాన ద్వారం, రాజసం ఒలకబోసే నీలం రంగు ఇనుపకమ్మీలతో ప్రస్తుతం ఫ్లై ఓవర్ మొదలయ్యే ప్రధాన రహదారిలో వుండేది. దాని ఎదురుగా ఆంధ్ర జ్యోతి సిటీ బ్యూరో ఆఫీసు. ఆదిరాజు వేంకటేశ్వర రావు గారు దానికి విలేకరి. ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం బెజవాడలో అచ్చయ్యేది. ఆయన ఇక్కడనుంచే టెలిప్రింటర్ లో వార్తలు పంపేవాడు. నేను రేడియోలో చేరకముందు ఒకసారి ఆయనతో కలిసి సచివాలయానికి వెళ్లాను. అంతకుముందు ఎప్పుడూ అందులో అడుగు పెట్టిన అనుభవం లేదు. పేరులోనే కాకుండా వేషభాషల్లో కూడా ఆయన ఆదిరాజే. ఫుల్ సూటు. నెక్ టై. చేతిలో బ్రీఫ్ కేసు. ఢిల్లీలో ఎక్కువకాలం విలేకరిగా వుండడం వల్ల అలవడ్డ అలవాట్లు కాబోలు. సచివాలయం గేటు దగ్గర కాపలా మనిషి ఆదిరాజుని చూడగానే రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. అయన వెంట వస్తున్న నన్ను చూసి కనీసం ఎవరని కూడా అడగలేదు. వెలుగుతున్న సిగరెట్ చేయిని విలాసంగా వూపుతూ ఆదిరాజు లోపలకు వెళ్లాడు. ఆయనతో పాటే నేనూ.
 ఆ తరువాత రేడియో విలేకరిగా నాకు సచివాలయం మొదటి కార్యస్థానంగా మారిపోయింది. ప్రతి రోజూ ముందు హాజరు అక్కడే. ఆ తరువాతే రేడియో. ఎందుకంటే రేడియో వార్తలకి అవసరం అయ్యే అధికారిక సమాచారం యావత్తూ అక్కడే దొరికేది. కాలక్రమంలో గేటు మనిషి నుంచి ముఖ్యమంత్రివరకు అందరితో ముఖపరిచయాలు. ఎక్కడికయినా గేటు (తలుపు) తోసుకుని వెళ్ళగల చనువూ, వెసులుబాటు, వీటికి తోడు రేడియో విలేకరి అన్న ట్యాగు లైను ఒకటి.

ఈ చిన్న పోస్టుకు కూడా ఒక చిన్ని తోక టపా వుంది. 
అదేమిటంటే.... 
సచివాలయంలో వార్తా సేకరణ పనులు ముగించుకుని మధ్యాన్నం  సరోవర్ హోటల్ బస్ స్టాప్ వద్ద సిటీ బస్సు ఎక్కి రేడియో స్టేషన్ స్టాపులో దిగిపోవడం నా రోజువారీ కార్యక్రమం. ఒకరోజు అలా బస్సు ఎక్కడానికి వెయిట్  చేస్తున్న సమయంలో నా పక్కన ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. తలపై రూమీ టోపీ (నవాబీ టోపీ) బంద్ గాలా కోటు ధరించిన ఆ ముస్లిం పెద్దమనిషిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఎవరా అని పరికించి చూసేటప్పటికి ఆయన ఎక్కాల్సిన బస్సు వచ్చింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత గుర్తుకు వచ్చింది. ఆయన గతంలో రాష్ట్ర హోం మంత్రిగా పనిచేసారు. పేరు సరిగా గుర్తు లేదు. మీర్ అహ్మద్  ఆలీ ఖాన్ అయి వుండాలి. అంతటి పెద్ద పదవులు నిర్వహించి కూడా అధికారం నుంచి తప్పుకున్న తర్వాత అలా సామాన్యుడిలా సిటీ బస్సులో వెళ్ళడం చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు కలలో కూడా ఊహించలేము.

కామెంట్‌లు లేవు: