పేదవాడికి విద్యాగంధం అంటేలా చూడండి. చదువుతోపాటు అతడిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈ ప్రపంచంలో నెగ్గుకు రాగలననే ఆత్మవిశ్వాసం అతగాడిలో ఇనుమడిస్తుంది. సమాజంలో తనకూ ఒక గౌరవప్రదమైన స్థానం లభించిందనే తృప్తినిస్తుంది. సామాజిక పరమైన ఆత్మన్యూనతను అతడిలో పోగొడుతుంది. ఇంతమందిలో తానూ ఒకడిననే న్యూనతా భావం సన్నగిల్లి, తనూ అందరివంటివాడిననే ఆత్మాభిమానం పొటమరిస్తుంది. విద్యవల్ల వినయం ఒకటే కాదు ఆత్మబలం కూడా మనిషిలో పెరుగుతుంది. ఇందుకోసం ఖర్చుపెట్టే ప్రతి పైసా, ముందు ముందు మంచి సమాజ నిర్మాణానికి చక్కటి, దృఢమైన పునాది వేస్తుంది. ఇది చరిత్ర చెప్పే సత్యం.
అలాగే వైద్యం. రాను రాను ఇది సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతోంది. ప్రభుత్వంలో ఈ అంశాన్ని పర్యవేక్షించే విభాగాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అంటారు. ప్రజారోగ్యం దెబ్బతింటే వైద్యం అందించే బాధ్యత ఈ విభాగానిది. ఆరోగ్యం బాగా వుంటే వైద్యంతో అవసరమే వుండదు. నిదానం కంటే నివారణ మేలు. తాగే నీటి ద్వారా అనేక వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ముందు అందరికీ పరిశుభ్రమైన మంచి నీరు లభించేలా చూడండి. సగం రోగాలు తగ్గిపోతాయి. అలాగే, సుగరూ, రక్తపు పోటు. పల్లెల్లో నివసించే పేదవారికి ఈ రోగాలు వున్నట్టు కూడా తెలవదు. సుగరు ఒంట్లో వుంటే అది వెయ్యి రోగాల పెట్టు. దాన్ని అదుపులో ఉంచడానికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. హెచ్చు తగ్గుల్ని బట్టి మందులు మారుస్తూ వుండాలి. అదే విధంగా బ్లడ్ ప్రెషర్. అదుపులో వుంటే సరి. విషమిస్తే పక్షవాతం వంటి ప్రమాదకర రోగాలకు కారణమవుతుంది. దీనికీ క్రమం తప్పని పరీక్షలు అవసరం. తీవ్రతను బట్టి మందులు మారుస్తూ వాడడం మరింత అవసరం. పెద్ద రోగాల బారిన పడకుండా ఈ చిన్న రోగాలను అదుపులో ఉంచాలి. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోకూడదు. లేని వాళ్ళకే కాదు, ఉన్నవాళ్ళకి కూడా సుగరు, రక్తపు పోటు పెద్ద సమస్యలే. పరీక్షలు చేయించుకోవడంలో అశ్రద్ధ కొంత, అవకాశాలు లేక కొంత, వెరసి జనాల్లో ఈ వ్యాధులు ఇలవేల్పుల మాదిరిగా తయారయ్యాయి. ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటే ఈ రెండింటినీ అదుపు చేయడం పెద్ద కష్టమేమీ కాదు.
రోగం రొష్టూ లేకపోతె రాళ్ళు తిని హరాయించుకోవచ్చు. రాళ్ళు కొట్టుకుంటూ అయినా బతుకుతెరువు సంపాదించుకోవచ్చు. ఆరోగ్యవంతమయిన శరీరానికి విద్యతో శోభించే మెదడు కూడా వుంటే ఇక ఆ మనిషికి అడ్డే వుండదు.
అంచేత ఎన్నిక కాబోయే ప్రభువులూ! ఈ రెంటి మీదా కాస్త దృష్టి మళ్ళించండి.
ధర్మో రక్షిత రక్షితః ! ధర్మాన్ని మీరు కాపాడితే ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది.
అలాగే నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు ప్రభుత్వాలు ఇస్తే, మంచి ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన సమాజాన్ని ప్రజలే నిర్మించి ఇస్తారు.
ఇది సత్యం.
4 కామెంట్లు:
భలే జోక్ వేసారండీ
ఎంత పెద్ద బిజినెస్సిది ? దానికే ఢోకా వేస్తున్నారా ! హన్నా !
౨)
ఈ మధ్య ఆంధ్రపదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి విభిన్న అభిప్రాయాలు రాజకీయ శంఖారావాలు వినిపిస్తున్నాయి.
దీనిపై మీ సమగ్ర విశ్లేషణ వ్రాయగలరు ఈ చట్టం నిజంగానే మోసపూరితమైనదా ?
మీరు చెప్పింది నిజం. డిగ్రీ వరకు విద్య, వైద్యం, సురక్షిత నీరు, ఆహార భద్రత ముఖ్యమైన విషయాలు.
గత ఐదు సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రం లో విద్య, వైద్యం విషయాలలో మెరుగు పడింది అన్నది నిజం. అందుకు ప్రస్తుత ప్రభుత్వం కృషిని అభినందించాలి.
అయితే తమకు నచ్చని వారు చేసిన మంచిని గుర్తించే సహృదయత ప్రస్తుత కనిపించడం లేదు.
వేల ఎకరాల పంట భూములను సేకరించి పేకమేడల్లాటి ఆకాశ హర్మ్యాలు నిర్మించడం అభివృద్ధి కాదు.
@ Zilebi ధన్యవాదాలు. నేరుగా రాజకీయాలు గురించి రాసే పరిస్తితి ఈనాడు తెలుగు రాష్ట్రాలలో లేదని నా అభిప్రాయం. వీలయితే జూన్ నాలుగు తర్వాతనే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి