సమాజంలో ఏ వ్యక్తి గురించి అయినా ఆయన భార్యకు తెలిసినంతగా వేరెవ్వరికీ తెలియదు. అంచేత భార్యలు తమ భర్తల గురించి రాసే రచనల్లో అసమగ్రతకు అవకాశం తక్కువ. సాధికారతకు అవకాశం ఎక్కువ. ఆ రీత్యా చూస్తే శ్రీమతి వై.ఎస్. విజయమ్మ(వాస్తవానికి పుస్తకం ముఖచిత్రం మీద రచయిత్రి పేరు వైయస్ విజయ రాజశేఖరరెడ్డి అని ముద్రించారు. వారి వివాహ శుభలేఖలో విజయమ్మ పేరు రాజేశ్వరి అని వేశారు. జాతకాల్లో గణాలేవో సరిపోలేదని తమ పేరును రాజేశ్వరిగా మార్చారని, అందుకే వెడ్డింగ్ కార్డులో విజయలక్ష్మి అని ఉండదని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. కానీ ఆ పేరుతొ నన్నెవ్వరూ, ఎప్పుడూ పిలవలేదని కూడా వెల్లడించారు) భర్త వై.ఎస్. రాజశేఖరరెడ్డి గురించి రాసిన ‘నాలో...నాతో... YSR’ అనే గ్రంధం అత్యంత సమగ్రంగా, వాస్తవాలకు అతి దగ్గరగా వుంది. రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వాన్ని అతి దగ్గరగా గమనించగలిగిన జీవన సహచరిగా శ్రీమతి విజయమ్మ ఆయన గురించి తన మనసులోని భావాలకు అందంగా, హృద్యంగా, ఒక్కోచోట హృదయం ద్రవించే విధంగా అక్షరరూపం ఇవ్వడంలో సఫలీకృతం అయ్యారు. దీనికి తగ్గట్టు ప్రచురించింది ఎమెస్కో కావడం మూలాన పుస్తక స్వరూపం కూడా వైభవంగా రూపుదిద్దుకుంది.
ముఖ్యంగా వై.ఎస్.ఆర్. తో తన పెళ్లి గురించీ, తమ కుటుంబ సభ్యుల నడుమ బలంగా పెనవేసుకుని పోయిన అనుబంధాలను గురించీ, షర్మిల వివాహం గురించీ, ఆయన షష్టిపూర్తి విశేషాలు గురించీ ఆవిడ అనేక విషయాలను దాపరికం లేకుండా వ్యక్త పరచిన విధానం ఈ పుస్తకానికి మంచి విశ్వసనీయతను సమకూర్చిపెట్టింది.
‘పెళ్లి కాకముందు నా ప్రపంచం చాలా చిన్నది. పెళ్ళయ్యాక ఈయనే నా ప్రపంచమయ్యారు. ఈయనతో పాటు విస్తారంగా నా ప్రపంచం పెరిగింది. అందుకే ఇవాళ నేను మీకు తెలుసు’ అని మొదటి పేజీలోనే రాసిన వినమ్రపూరిత వాక్యాలు చదువరులని క్షణం ఆలస్యం చేయకుండా ఈ పుస్తక ప్రపంచంలోకి తీసుకువెడతాయి.
వై.ఎస్.ఆర్. మరణించడానికి కొద్ది రోజులముందు ఆయన షష్టిపూర్తి జరిగింది. పెద్ద హడావిడి లేదు, కేవలం కుటుంబసభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆడంబరంగా జరక్కపోయినా పిల్లల బలవంతం మీద సాంప్రదాయంగా, వేడుకగా నిర్వహించారు. దంపతుల చేత పట్టుబట్టలు కట్టించారు. పక్కపక్కన కూర్చోబెట్టారు. తాళి కట్టించారు. వై.ఎస్. చేత విజయమ్మ కాళ్ళకు మెట్టెలు తొడిగించారు. నల్లపూసల గొలుసు భార్య మెడలో వేయించారు. ఉంగరాలు, దండలు మార్పించారు. బిందెలో ఉంగరం వేసి వధూవరుల చేత తీయించారు. తలంబ్రాల వేడుక కనుల పండుగగా చేసారు. ఇదంతా ఎప్పుడు? 2009 ఆగస్టు ఇరవై రెండున. అంతకు ముందు రోజు మెహిందీ జరిపి ఆడవారి చేతులకు గోరింటాకు పెట్టారు.
“బాధాకరమైన విషయం ఏమిటంటే ...ఆరోజు పెట్టుకున్న గోరింటాకు సెప్టెంబర్ రెండుకి పూర్తిగా చెరగను కూడాలేదు” అంటారు విజయమ్మ హృదయం ద్రవించేలా. (ఆ రోజే వై.ఎస్.ఆర్. హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించారు)
నిజానికి వై.ఎస్.ఆర్. జీవితం ఒక
తెరిచిన పుస్తకం. కానీ ఆ తెరిచిన పుస్తకంలో కూడా చాలామందికి తెలియని కొన్ని
అధ్యాయాలు వున్నాయి. వాటిని తెరిచి చూపించారు విజయమ్మ ఈ పుస్తకంలో ఎంతో మార్దవంగా.
ఎవరినీ నొప్పించని రీతిలో, భాషలో.
“వైఎస్సార్ ను ప్రత్యర్ధులు ఎప్పుడూ ఫ్యాక్షనిస్ట్ అని, హైదరాబాదు మత కల్లోలాల్లో వందలమందిని చంపాడని గోబెల్స్ ప్రచారం చేస్తుంటారు. అలాంటివి వినే అనుకుంటా ఈయన సీఎం అయినప్పుడు ప్రముఖ ఆర్ధిక శాస్త్రవేత్త శ్రీ స్వామినాధన్ అయ్యర్, ఆ గోబెల్స్ ప్రచారాలు నిజమనుకుని ‘ఇటువంటివారు ముఖ్యమంత్రులు అయితే ఈ దేశం ఏమైపోతుంద’ని అన్నారట. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు వుండాలని నక్సలైట్లతో చర్చలు జరిపారు. ఈయన చనిపోయిన తర్వాత ఒసారి చత్తీస్ ఘడ్ లో నక్సలైట్లు కాల్పులు జరుగుతున్నప్పుడు, ఇదే స్వామినాధన్ గారు ‘ తుపాకీ గుండు పేల్చకుండా, రక్తం బొట్టు చిందించకుండా పల్లెల్ని పచ్చగా సంతోషాలతో నింపిన మహోన్నతుడు రాజశేఖరరెడ్డి గారు, అటువంటి వ్యక్తిని ఈ దేశం మళ్ళీ పుట్టిస్తుందా’ అని ప్రశంసించారు. (బహుశా అప్పటికి వై.ఎస్. ఆర్. గురించి విన్నవన్నీ గోబెల్స్ ప్రచారాలు అని బోధపడి వుంటుంది)
వై.ఎస్. సతీమణిగా రచయిత్రి విజయమ్మ ఈ పుస్తకంలో వెల్లడించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు.
“ఒక సైనికుడి భార్యలా జీవించాను. ఈయనకి ప్రతిరోజూ ప్రజాజీవితంలో ఏదో ఒక యుద్ధం తారసపడేది. ఈయనకు తిలకం దిద్ది విజయ కీర్తిని ప్రసాదించమని ప్రార్ధించడమే నా జీవితం”
“ఈయనకు మీసాలు బాగా ఉంటేనే రాజసంగా కనిపిస్తారు. ఎంపీ అయినప్పుడు మీసాలు తగ్గించారని కొట్లాడాను. సి ఎం అయిన తర్వాత ఇంకా తగ్గించారు. ఒకటి రెండు సార్లు చెప్పిచూశాను. ఎలాగూ మాట వినరని ఓసారి బార్బరుకు కూడా చెప్పి చూశాను. అయినా లాభం లేకపోయింది.”
“మొదటిసారి సి ఎం అయినప్పుడు ఆనవాయితీని గౌరవిస్తూ ఈయన తిరుపతి వెళ్ళారు. తర్వాత కొన్నాళ్ళకు ఒక బిలీవర్ ఈయన దగ్గరకొచ్చి ‘ఒక క్రిష్టియన్ అయివుండి మీరు దేవాలయాలకు వెళ్ళడం తప్పు అనిపించలేదా అని అడిగారు. అప్పుడు ఈయన ఒకే మాట అన్నారు, ‘మతానికి సంబంధంలేదు, అది వ్యక్తిగతం. ఎవరి నమ్మకం వారిది. అన్నిటినీ, అందరినీ గౌరవించుకోవాలి. ప్రజాప్రతినిధిగా ప్రతి ఒక్కరి అభిమతాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాపై వుంది”
“షర్మి(షర్మిల) కి చిన్నప్పటి నుంచీ గోళ్ళు కొరకడం ఓ అలవాటు. దాన్ని మాన్పించడానికి ఓ తండ్రిగా, ఓ డాక్టరుగా ఈయన విశ్వప్రయత్నం చేసేవారు. చివరికి ఓ కండిషన్ మీద ఒప్పుకుంది. “ముందు మీరు సిగరెట్ మానేయండి పా (తండ్రిని అలాగే పిలుస్తుంది, ఈయన షర్మీని పాప్స్అని పాపా అని పిలిచేవారు) నేను గోళ్ళు కొరకడం మానేస్తాను” అంది. మాటకి కట్టుబడి ఇద్దరూ తమ అలవాట్లు వదిలిపెట్టారు”
“రోజూ రాత్రి సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్స్ పై సంతకాలు పెట్టికానీ పడుకునేవారు కాదు. ‘ఒక్క రోజు లేటైనా పేషెంటుకు ఉపయోగపడకపోవచ్చు. ఇక మోసాలు అంటావా. ఒక మనిషి ప్రాణం నిలబడ్డం ముఖ్యం. ఏదైనా జరిగితే ఎంక్వైరీ లో బయట పడతాయి”
నాలో... నాతో అనే పేరు పెట్టడం వల్ల ఇదేదో రాజకీయాలకు అతీతమైన పుస్తకం అనుకోనక్కర లేదు. రాజశేఖర రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం యావత్తూ ఇందులో వుంది.
వైఎస్ ఆఖరి ఘడియల్ని విజయమ్మ చాలా వివరంగా, ఒక డైరీ లాగా రాసుకొచ్చారు, ఈ పుస్తకంలో.
ఆవిడ మాటల్లోనే :
“సెప్టెంబరు -2. ఉదయం 7.15 కల్లా రెడీ అయిపోయారు. బ్రేక్ ఫాస్ట్ దగ్గరకూర్చున్నప్పుడు జగన్ వచ్చాడు. ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఫోను వచ్చింది. ‘సార్! వర్షాలు బాగా పడుతునాయి. ఇప్పుడు పోవద్దు సార్!’ అంటున్నారు ఎవరో అవతల నుంచి. నేనూ అదే మాట చెప్పాను.
‘పైలట్ వద్దంటే చేసేదేముంటుంది. ఇంటికి వస్తాను. వేరే అప్పాయింట్ మెంట్లు లేవు కాబట్టి అందరం కూర్చుందాములే’ అన్నారు నాతో.
“ఎప్పుడూ నవ్వుతూ వుండే ఈయన ఆరోజు మాత్రం హెలికాప్టర్ ఎక్కేటప్పుడు కొంచెం సీరియస్ గా వున్నారని చాలామంది నాతో చెప్పారు. తర్వాత టీవీల్లో చూసినప్పుడు నాక్కూడా అలాగే అనిపించింది.
“ఉదయం 8.34 కి హెలికాప్టర్ టేకాఫ్ అయింది. 9.34 నుంచి హెలికాప్టర్ తో సంబంధాలు తెగిపోయాయట.
“విషయం తెలిసి భారతి, షర్మి పిల్లలు బెంగుళూరు నుంచి హైదరాబాదు వచ్చారు.
“సెప్టెంబరు - 3
“హెలికాప్టర్ కూలిపోయిన సంగతి జగన్ కు ముందే తెలిసినా మాతో చెప్పలేదు. రూములోకి వెళ్లి చాలాసేపటివరకూ బయటకు రాలేదు.
“తర్వాత జగన్ మమ్మల్ని దగ్గరకు తీసుకుని భోరున ఏడ్చాడు. మాకు ఆ వార్త నమ్మశక్యంగా అనిపించలేదు.
“మధ్యాన్నం 12.30 నుంచి గవర్నర్, చంద్రబాబునాయుడు ఇంకా చాలామంది నాయకులు పరామర్శకు రావడం మొదలయింది. కానీ ఈయన జీవించే ఉన్నారన్న నమ్మకం నాలో చావలేదు. అందుకే గవర్నర్ పలకరించగానే నేను, ‘ఆయనకేం కాదు, హి ఈజ్ ఎలైవ్’ అన్నాను. ఆ పెద్దాయన షాకయ్యి, ఇంకేం మాట్లాడాలో అర్ధం కాక కాసేపు మౌనంగా వుండి వెళ్ళిపోయారు.
“సాయంత్రం 5.30
“కర్నూలు నుంచి ఈయన్నిఇంటికి తీసుకువచ్చారు. రూము మధ్యలో పెద్ద బాక్సు. తెల్లని బట్టల్లో చుట్టి ఉంచారు. ఒక్కసారి చూపించమని అడిగాను. ‘వద్దు వద్దు చూస్తే మీరు తట్టుకోలేరు. మీ మనస్సులో వుండే ఇమేజ్ ని అలాగే ఉంచుకోండి’ అన్నారెవరో.
“షర్మికి ఎక్కడలేని కోపం వచ్చింది.
‘ఎందుకు అలా కవర్ చేసారు. అసలు ఇందులో వున్నది నాన్నేనా! వుంటే, ముఖం ఎక్కడ? కాళ్ళు ఎక్కడ? అదయినా మాకు తెలియాలి కదా’ అంటూ అరిచేసింది.
సెప్టెంబరు - 4
ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో సోనియా గాంధి, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధి వచ్చారు.
“రెండు హెలికాప్టర్లలో ఈయన్ని తీసుకుని అందరం సాయంత్రానికి ఇడుపులపాయ చేరుకున్నాం. 5. 20 ప్రాంతంలో లక్షలాది జనాలమధ్య, తోపులాటల నడుమ ఈయన్ని సమాధి చేసారు. అదే సమయంలో ఆకాశంలో హరివిల్లు కనబడింది. ఆ రాత్రి చుట్టూ ఒక వలయంతో చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపించాడు. పక్కనే మరో కాంతివంతమైన నక్షత్రం కూడా కనబడింది. బ్రదర్ బిల్లిగ్రాహమ్ చనిపోయినప్పుడు కూడా ఈ దృశ్యం కనబడిందట”
రాజశేఖరరెడ్డి మరణానంతరం మారిన రాజకీయ పరిస్తితుల్లో తమ కుటుంబం పడిన మానసిక వేదనలను విజయమ్మ విశదంగా రాశారు.
“పార్టీ అధిష్టానం ఆరళ్ళు భరించలేక జగన్ ఎంపీ పదవికీ, నేను ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసాము. జగన్ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు. అతడికి మద్దతుగా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ రాజీనామా చేసారు. జగన్ ని కట్టడి చేస్తే కొత్త పార్టీకి పుట్టగతులు లేకుండా పోతాయని అనుకున్నారో ఏమో ఉపఎన్నికలకు పదిహేను రోజుల ముందు జగన్ ని విచారణ పేరుతొ పిలిచి నాడు అరెస్ట్ చేసారు. జైలుకు పోతూ జగన్ నాతొ చెప్పాడు.
‘వాళ్ళు మనల్ని నమ్ముకుని బయటకు వచ్చారు. వాళ్ళని గెలిపించుకోవాలి. నువ్వూ, షర్మీ క్యాంపెయిన్ కి వెళ్ళాలమ్మా’ అని. బస్సులో పదివేల కిలోమీటర్లు తిరిగి ప్రచారం చేసాం. తొంభయి రోజులకు రావాల్సిన బెయిలు రాకుండా ఆపారు. కోడలు భారతి బెయిల్ కోసం కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరిగి నలిగిపోయింది. మరో పక్క సాక్షి నిర్వహణ బాధ్యతలు. ఆస్తుల జప్తులు. మానసిక వేధింపులు. దుష్ప్రచారాలు.
“జగన్ కు బెయిల్ రాకపోవడంతో, షర్మిల అన్న విడిచిన బాణంలా పది మాసాలపాటు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ మూడువేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. తండ్రి పోయిన తర్వాత పిల్లలు పడుతున్న బాధలు చూస్తుంటే కడుపు తరుక్కుపోయేది. పదహారు నెలల తర్వాత జగన్ జైలు నుంచి బయటకు వచ్చాడు.
“2014 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకున్నాం కానీ రాలేదు. జగన్ మాత్రం నిరాశ పడకుండా మళ్ళీ జనం మధ్యకు వెళ్ళాడు. పద్నాలుగు నెలల పాటు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసాడు. ఒక కుటుంబంలో ముగ్గురు పాదయాత్ర చేయడం ఒక రికార్డు. పడిన ఈ కష్టాలకు 2019 ఎన్నికల్లో ప్రజలు చక్కని ఫలితం చూపించారు. బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు.
“జగన్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూ, ‘వై.ఎస్’ అనగానే నేను ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యా. తొమ్మిది సంవత్సరాల పాటు అనుభవించిన కష్టాలు, మోసిన నిందలు, అనలేని, వినలేని మాటలు, కేసులు, జగన్ జైలు ..అన్నీ ఒక్కసారి గుర్తుకువచ్చాయి.
“పేదవాడి కోసం నాన్న ఒక్క అడుగు వేస్తే నేను రెండు అడుగులు వేస్తాను’ అంటున్న జగన్ ని చూస్తుంటే, పేదలకోసం ఈయన ప్రారంభించిన ప్రతి పధకాన్ని జగన్ అమలుచేసి తీరతాడనే నమ్మకం కలుగుతోంది.
“అప్పుఅడప్పుడు అనిపిస్తుంది. ఈయన వున్నప్పుడు ఇంట్లో పదిమందిమి ఎంత బాగావుండేవాళ్ళం. జీవితం ఎంత పర్ఫెక్ట్ గా సాగేది’ అని. షర్మి వెంటనే అంటుంది.
‘అమ్మా రోజులు గడుస్తున్న కొద్దీ మనం స్వర్గంలో వున్న నాన్నని కలవడానికి ఒక్కోరోజు దగ్గరవుతున్నాం అని మరచిపోకు. మనం ఆయనతో కొన్నేళ్ళే గడిపామని బాధపడే అవసరం లేదు. స్వర్గానికి చేరిన తర్వాత అక్కడ ఫ్యామిలీ అంతా ఎప్పటికీ కలిసి జీవిస్తాం’
“ఇక జగన్, వాళ్ళ నాన్న ఎక్కడికీ వెళ్ళలేదని భావిస్తున్నాడు. తను వేసే ప్రతి అడుగూ ఈయన దగ్గర వుండి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడని విశ్వసిస్తున్నాడు. ప్రజల ప్రేమలో ఈయన కనబడుతూనే ఉన్నాడని జగన్ నమ్ముతున్నాడు”
పిల్లలు ఇలా అంటూ వుంటే ఇక ఆ తల్లికి ఏం కావాలి!
‘ఈయన జీవితంలో ఎన్నో సంతకాలు పెట్టారు. ప్రతి సంతకం ఎందరికో జీవితం అయింది’ అని ముగించారు విజయమ్మ ఈ పుస్తకాన్ని. (EOM)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి