పెద్దల ఆశీశ్శులతో, ఆత్మీయుల ఆదరణతో, పిల్లల ప్రేమాభిమానాలతో కరోనా నేపథ్యంలో సైతం మా ఆవిడ ఏడూడి ,(సంవత్సరీకాలు) భగవంతుని దయతో నిర్విఘ్నంగా నేటితో పూర్తయ్యాయి. ఈ మూడు రోజుల క్రతువులో నేను నిమిత్తమాతృడిని. కొడుకులు, కోడళ్ళు యావత్ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వర్తించారు.
మొత్తం కార్యక్రమంలో అందరికీ కళ్ళ నీళ్ళు తెప్పించింది మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారి వ్యాఖ్య:
"మాకన్నా ఎంతో చిన్నదైన మా తమ్ముడి భార్యకు దండాలు పెట్టడం ఎంతో బాధ కలుగుతున్నది . ఏటా అమ్మ నాన్నల తద్దినాలకు వెళ్లి, అదే ఇంట్లో ఎన్ని సంవత్సరాలనుంచో దండాలు పెడుతూ ఉన్నాము .అదే ఇంట్లో ఈరోజు ఇలా చిన్న మనిషికి నమస్కరించి రావడం
మనసును కలచి వేసింది .
అమ్మ నాన్నల తద్దినాలు పెట్టినప్పుడు , తమ్ముడి భార్య నిర్మల సర్వం తానుగా అన్ని ఏర్పాట్లు చేసి , పురో హితునితో మాట్లాడటం, వంటమనిషితో మాట్లాడటం ,
ధోవతులు తేవడం ,అందరికీ ఫోన్లు చేయడం , మడి కట్టుకొని అన్నీ ఏర్పాట్లు స్వయంగా, శ్రద్ధగా, నిష్ఠగా చూసుకొనేది .
అటువంటిది ఆ ఇంట్లోనే ఆమె పిండాలకు దణ్ణం పెట్టడం మా దురదృష్టం .మనం దేనినన్న జయించవచ్చు కానీ ,
విధిని మాత్రం జయించలేము .విధికి తలవంచి రాజీ పడటం మాత్రమే మనం చేయకలిగే కర్తవ్యం .
ఆమె పవిత్ర ఆత్మకు
శ్రద్దాంజలి . ఓం శాంతి శాంతి" (05-08-2020)
4 కామెంట్‌లు:
అప్పుడే ఏడాది గడిచిపోయిందా? ఆమె పోయారని తెలిసిన తరువాత మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పలకరించడం మొన్నీమధ్యేగా అన్నట్లు నాకింకా అనిపిస్తోంది.
వారి ఆత్మకు సద్గతి ప్రాప్తిరస్తు 🙏.
శ్రీనివాసరావు గారూ,
ఈ సందర్భంలో నమస్కారాలు అందుకొన్నది ఒక పవిత్రాత్మ. జీవునకు వయస్సు ఇంత అని ఏముంది. పెద్దాచిన్నా అన్న లెక్క ఏముంది. భూమిని సశరీరంగా నడయాడిన కాలంలో విధ్యుక్తకర్మలను శ్రధ్ధాభక్తులతో చక్కగా నిర్వహించి ఆదర్శంగా నిలచిన జీవునకు అందరూ నమస్కరించారు. అది వారు ఆ జీవునకు అంజలి ఘటించి నెరవేర్చిన తమ కర్తవ్యం. అలా చేయటం ఆవిడ ఇక్కడ నెరవేర్చిన కర్తవ్యాన్ని మనం అభినందన పూర్వకంగా గుర్తించినట్లు. అందుకు గాను ఆ జీవునకు సంతోషం. ఆ సంతోషం కులవర్దనం. ఆవిడ దివ్యస్మృతి మీయందరి యందు కలకాలం నిలచి శుభం కలిగించు కాక.
@విన్నకోట నరసింహారావు గారికి - చనిపోయింది ఈ నెల 17/18న. తిధుల ప్రకారం సంవత్సరీకాలు ముందు వచ్చాయి. ధన్యవాదాలు
@శ్యామలీయం : ధన్యవాదాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి