8, మే 2020, శుక్రవారం

ఇద్దరు ముఖ్యమంత్రులు - ఒక సీఎస్



రాజకీయాల్లో, ప్రత్యేకించి ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో తటస్థంగా ఉంటూ విశ్లేషణలు చేయగలగడం నిజంగా కత్తిమీద సామే. ఇంగ్లీషులో న్యూట్రాలిటి అని పిలుచుకుంటున్న ఈ పదానికి ఎవరి అర్ధం వారు చెప్పుకుంటున్నారు.  ఏపీ రాజకీయ యవనికపై ఎన్ని పాత్రలు కనిపిస్తున్నా ప్రస్పుటంగా కనిపించేది చంద్రబాబు, జగన్ మోహన రెడ్డి ఇద్దరు మాత్రమే. టీడీపీ, వైసీపీ పార్టీలు  కూడా కాదు, బాబు, జగన్ ఇద్దరు మాత్రమే. వారి చుట్టూనే మొత్తం రాజకీయం పరిభ్రమిస్తోంది. గతంలో అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఇలాంటి పోటీ చంద్రబాబునాయుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి నడుమ నడిచేది. పొతే,
ఐఏఎస్ కాకపోయినా జీవితంలో గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళు కొందరు వుంటారు. కాకుంటే, వాళ్ళు వేళ్ళమీద లెక్కపెట్టగలిగే సంఖ్యలో వుంటారు. వారిలో ఒకరు మోహన్ కందా. ఐఏఎస్ అయిన తర్వాత కూడా తనలో  నిగూఢంగా పెంచుకున్న రచనా దాహాన్ని రిటైర్ అయిన తర్వాత తీర్చుకున్నారు.  అందుకే గొప్పవాడు అన్నది.
రాజకీయాలు, న్యూట్రాలిటీ అనే మొదలు పెట్టి మధ్యలో ఈ కందా గారి ప్రసక్తి ఏమిటంటారా!  ఒక అధికారిగా ఉంటూ, అదీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ  ఉత్తర దక్షిణ ధృవాల వంటి ఇద్దరు రాజకీయ నేతలతో నెగ్గుకు రావడం అనేది మామూలు వ్యవహారం కాదు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అనే సందర్భాలలో కూడా ఆయన తామరాకు మీది నీటిబొట్టువలే తన కర్తవ్యాన్ని నిర్వహించిన తీరు ఈ న్యూట్రాలిటీకి అద్దం పడుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు  మోహన్ కందా ప్రధాన కార్యదర్శి. నిజానికి సీఎస్ గా కందాగారిని ఆయనే ఏరికోరి తెచ్చుకున్నారు. అదే సమయంలో రాజశేఖరరెడ్డి ప్రతిపక్షనేత. కొంతకాలం తర్వాత పాత్రలు తిరగబడ్డాయి. ఎన్నికల అనంతరం వైఎస్ ముఖ్యమంత్రి, చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు. కందాగారు మాత్రం యధావిధిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.
చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించాలని భావించేవారు. తనది వర్కింగ్ గవర్నమెంట్ అని చెప్పుకునేవారు. ఈ క్రమంలో ఆయన అధికారగణంపై అసహనాన్ని దాచుకునేవారు కాదు. ముఖ్యమంత్రి అలా కటువుగా మాట్లాడుతుంటే మోహన్ కందా ఒకసారి కలగచేసుకుని, “ఛీఫ్ సెక్రెటరీ అని నన్నిక్కడ కూర్చోబెట్టాక నేను చెప్పింది వినిపించుకోకపోతే ఎలా” అనేశారు. చంద్రబాబుకు కోపం వచ్చి, “నేను ఏ సిఎస్ ను మిమ్మల్ని చూసినట్టు చూసుకోలేదు” అన్నారు. కందా కూడా గట్టిగానే జవాబు ఇచ్చారు. “నాకు ఎటువంటి ట్రీట్ మెంట్ కావాలో నాకో అంచనా వుంది. మీరు మిగతా వాళ్ళ కంటే నన్ను బాగా ట్రీట్ చేస్తున్నారన్న ఫీలింగుతో నేనెలా సర్దిపెట్టుకుంటాను చెప్పండి”
“మీరు చెప్పేవి సబబుగానే అనిపిస్తున్నాయి.  నాక్కూడా ఏడేళ్ళ నుంచి అలా అలవాటయిపోయింది. ఎలెక్షన్స్ వస్తున్నాయి కదా. ఇప్పటికిలా కానివ్వండి. వచ్చేసారికి ఇవన్నీ సర్దుకునే ప్రయత్నం చేద్దాం” అన్నారు చంద్రబాబు నవ్వుతూ.
ఇలాంటిదే వై.ఎస్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా జరిగింది.
ఓసారి పెద్ద మీటింగు జరుగుతోంది. వై.ఎస్. కిందిస్థాయి  అధికారులను ఏవో ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్ళు నోరు తెరిచేలోగానే మోహన్ కందా జవాబు చెబుతున్నారు. వై.ఎస్ కాసేపు  చూసి ‘ఏమండీ నన్ను  అధికారులతో నేరుగా మాట్లాడనివ్వరా” అని మోహన్ కందాను అడిగారు.
“లేదండీ” అనేశారు కందా. ఎదురుచూడని ఆ జవాబుతో వైఎస్. నిర్ఘాంతపోయారు.
“చీఫ్ సెక్రెటరీగా ఇక్కడ కూర్చున్నంతసేపు వాళ్ళ తరపున జవాబు చెప్పాల్సిన బాధ్యత నాదే. మీకు వాళ్ళే డైరెక్టుగా సమాధానం చెబితే ఇక నేనెందుకు. లీడర్ షిప్ అంటే ఇదే”
“బలేవారే మీరు” అన్నారు వై.ఎస్. కాసింత చిరాగ్గా, కాస్త నవ్వుకుంటూను.                      
చంద్రబాబునాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు లోకసభతో పాటు అసెంబ్లీకి కూడా కలిపి ఎన్నికలు జరపాలని కోరుతూ ప్రభుత్వం తరపున మోహన్ కందా కేంద్ర ఎన్నికల కమీషనర్ కు లేఖ రాసారు. అప్పటి రాజకీయ పరిస్తితుల్లో అలా లేఖ రాయడం వై ఎస్ కి నచ్చలేదు. ఆయన మనసులో మాట దాచుకునే బాపతు కాదు.
రెండు ఎన్నికలు కలిపి నిర్వహించాలని చీఫ్ సెక్రటరీ సిఫారసు చేయడం తప్పని ఆయన పత్రికా ప్రకటన చేసారు.
అది చూడగానే కందా గారు వై.ఎస్. కి ఫోను చేసారు.
“ఇవన్నీ రాజకీయ నిర్ణయాలు. మీకేమిటి సంబంధం” అన్నారు వై.ఎస్. గట్టిగా.
కందా ఇలా చెప్పారు. “ఇది క్యాబినెట్ నిర్ణయం. సీఎస్ గా సమర్ధించాను. ఎందుకంటారా. మీరు నా చోట్లోకి వచ్చి చూడండి. మీరు చీఫ్ సెక్రెటరీగా వున్నా ఇదే నిర్ణయం తీసుకుంటారు”   
ఈ నేపధ్యంలో ఎన్నికలు జరిగాయి.
వై.ఎస్. ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రులు మారినప్పుడు చీఫ్ సెక్రెటరీ మారడం ఒక నిబంధన కాకపోయినా మారుతున్న రాజకీయ పరిస్తితుల్లో ఆనవాయితీగా మారింది.
మోహన్ కందా వెళ్లి వై.ఎస్. ని కలిసి చెప్పారు. ‘ప్రభుత్వం మారింది. కొనసాగడానికీ, అలాగే  తప్పుకోవడానికీ అభ్యంతరం లేదు అని. రెండ్రోజుల్లో చెబుతా అన్నారు వై.ఎస్.
రెండ్రోజుల్లో ఆయనే పిలిచి చెప్పారు, “ఐ హావ్ డిసైడెడ్ టు రిక్వెస్ట్ యు టు కంటిన్యూ”
మొదట్లోనే వై.ఎస్. సీ.ఎస్. తో మరోమాట కూడా చెప్పారు “ యూ విల్ ఫైండ్ మీ ఎ వెరీ ఈజీ మాన్ టు గెట్ ఆన్ విత్”  
పదవీవిరమణ తరువాత శ్రీ మోహన్ కందా ‘అనుభవాలూ – జ్ఞాపకాలూ’ అనే పేరుతొ ‘మోహన మకరందం’ రాశారు. అందులో ఇటువంటి ఆసక్తికరమైన అంశాలు ఎన్నో వున్నాయి. అవి చదువుతుంటే మోహన్ కందా గారిలో మనకు మరో ముళ్ళపూడి కనిపిస్తారు.
పైన పేర్కొన్న అంశానికి ఆయన ఇచ్చిన కొసమెరుపు ఆయన మాటల్లోనే:
“వై.ఎస్. అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రతిపాదనల  ఎస్టిమేట్స్, ప్రొజెక్షన్స్ చూసి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసే కమిటీ వేసారు. దాని నాయకత్వం  చీఫ్  సెక్రెటరీకి అప్పగించారు.
ప్రతిపక్షంలోకి వచ్చిన టీడీపీ నాయకులు విమర్శలు మొదలు పెట్టారు. చీఫ్ సెక్రెటరీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అవుతున్నారని ఆరోపించారు.
రాజశేఖరరెడ్డిగారి దగ్గరకు వెళ్లి “సీజర్స్ వైఫ్ షుడ్ బి ఎబౌవ్ సస్పిషన్. నేను లీవులో వెళ్ళిపోతా” అని రాసిచ్చాను.
అది చదివి పక్కన పడేస్తూ, ‘మీకేమిటి సంబంధం. నిర్ణయం నాదే కదా!” అన్నారు వై.ఎస్.
“మొన్నటిదాకా టీడీపీకి పక్షపాతం చూపించానని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ కు వలపక్షం చూపిస్తున్నానని టీడీపీ వారు నిందలు వేస్తున్నారు” అన్నాను కారణం వివరిస్తూ.
“మీరే చెప్పారు కదా! చోటుమారి చూడమని” అని వై.ఎస్. గట్టిగా నవ్వేశారు.
(మోహన మకరందం, అనుభవాలూ – జ్ఞాపకాలూ  రచన: మోహన్ కందా, ప్రతులకు : నవోదయా బుక్ హౌస్, వెల: రెండు వందల రూపాయలు)               


కామెంట్‌లు లేవు: