12, మే 2020, మంగళవారం

నూటికి నూరుపాళ్ళు జనం మనిషి


“నా పేరు రజనీష్ శర్మ, సిమ్లా రాజ్ భవన్ నుంచి మాట్లాడుతున్నాను. గవర్నర్ సాబ్ మీతో మాట్లాడుతారు లైన్లో వుండండి” అన్నాడో వ్యక్తి  స్వచ్చమైన హిందూస్థానీలో.
కాసేపటి తర్వాత బండారు దత్తాత్రేయ గారు లైన్లోకి వచ్చారు.
“ఏం శ్రీనివాస్ ఎలా వున్నారు” అని పలకరించారు సాదరంగా. కానీ గొంతు చాలా మార్దవంగా, సన్నగా వినబడింది.
“మీ ఆరోగ్యం ఎలా వుంది” నా పరామర్శ.
“బాగానే వున్నాను. కాకపోతే తెలిసిన వాళ్ళు అందరికీ దూరంగా ఇలా’
అప్పుడు ఆర్ధం అయింది ఆయన ఎందుకు అంత నీరసంగా అనిపించారో.
అంజయ్య గారికి, దత్తాత్రేయ గారికి చుట్టూ జనం వుండాలి. అదీ సాధారణ జనం. గొప్పగొప్ప వాళ్ళు కాదు. వాళ్ళ మధ్యలో వుంటే అదే ఆయనకు ఆక్సిజన్. వాళ్ళతో మాట్లాడుతూ వుంటే అదే ఆయనకు టానిక్కు.
లాక్ డౌన్ పరామర్శలు పూర్తయిన తర్వాత ఆయన పాత రేడియో రోజులను గుర్తు చేసుకున్నారు.
“నన్ను చాలామంది అడిగేవారు, ఆ రేడియో శ్రీనివాసరావు (భండారు) మీకేమైనా చుట్టమా అని. నేను చెప్పేవాడిని, ఆయన నా కుటుంబ సభ్యుడు అని. ఆ రోజులు నిజంగా వేరు. విలేకరులు అందరూ నన్ను ప్రేమించేవారు. అభిమానించేవారు, నిజంగా వారికి నేను చేసింది ఏమీ లేదు, అప్పుడప్పుడూ రైలు టిక్కెట్లు కన్ఫర్మ్ చేయించడం తప్ప” దత్తాత్రేయ గారు చెప్పుకుపోయారు.
నిజమే. ఆయన రైల్వే మంత్రిగా వున్నప్పుడు మాలో ఎవరం రైల్వే రిజర్వేషన్ల కోసం ఇబ్బంది పడలేదు. నిజానికి ఆయన్ని మేమే చాలా ఇబ్బంది పెట్టి ఉంటాము. ఆయన వ్యక్తిగత సహాయకుడు నగేష్ కి ఫోను చేసేవాళ్ళం. అంతే! కాసేపట్లో బోగీ నెంబరు, బర్త్ నెంబరు వచ్చేసేవి. బండారు దత్తాత్రేయ గారికి నగేష్ నమ్మిన బంటు. ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కాగానే హైదరాబాదు నుంచి సిమ్లాకు వెంటబెట్టుకుని వెళ్ళింది నగేష్ నే. దత్తాత్రేయ గారి లాగే నగేష్ కు కూడా ప్రజాసంబంధాలు ఎక్కువే. అందరికీ చేతనయినంత సాయం చేయాలనే మనస్తత్వం.
కాసేపు మాట్లాడిన తర్వాత దత్తాత్రేయ గారు చెప్పారు, హైదరాబాదులో మన మిత్రులను అందరినీ అడిగినట్టు చెప్పమని. మర్యాదకు అలా అన్నారు కానీ నాకు తెలుసు ఆయనే ఫోను చేసి వాళ్ళని పలకరిస్తారని. నేను అనుకున్నట్టు ఆయనే చెప్పారు.
“మన కృష్ణారావు (ఆర్వీవీ కృష్ణారావు, ఆలిండియా రేడియో న్యూస్ ఎడిటర్)తో కూడా మాట్లాడాను. నేనూ ఆయనా రాం నగర్ లో వుండేవాళ్ళం. ఉస్మానియా యూనివర్సిటీ రోడ్డులో మార్నింగ్ వాక్ లో కలుస్తుండేవాళ్ళం”
బండారు దత్తాత్రేయ గారు ఒకసారి సికిందరాబాదు నుంచి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఢిల్లీ ఆకాశవాణి వాళ్ళు ఆయన వాయిస్ అడిగారు. నగేష్ ని రిక్వెస్ట్ చేస్తే కాదనకుండా రాత్రి పదకొండు దాటిన  తర్వాత  ఆయన్ని వెంటబెట్టుకుని రేడియో  స్టేషన్ కు తీసుకువచ్చాడు. ఎన్నికల ఫలితాలు కదా, మాకు ఇరవై నాలుగు గంటల వార్తాప్రసారాలు నడుస్తున్నాయి. ఇళ్ళకు పోకుండా ఆఫీసులోనే పనిచేస్తున్నాము. ఆయన ఢిల్లీ ఇంటర్వ్యూ వెంటనే అయిపొయింది. లైవ్ కాబట్టి ఆయన కూడా విన్నారు. మేము మా పనిలో పడ్డాము. పొద్దుటి నుంచి బాగా అలసిపోయినట్టున్నారు. న్యూస్ రూమ్ కుర్చీలోనే కాసేపు అలా పడుకుండి పోయారు. కొద్ది సేపటి తర్వాత లేచి వెళ్ళిపోయారు. అంత సాదాసీదా మనిషి.          
“ఇదిగో ఈ లాక్ డౌన్ అవగానే హైదరాబాదు వస్తాను, అప్పుడు కలుద్దాం” అన్నారు దత్తాత్రేయ గారు ఆప్యాయంగా.
“లేదా మీరే సిమ్లా వద్దురు కానీ” అనేసారు వెంటనే.

నిజంగా నూటికి నూరుపాళ్ళు జనం మనిషి. 


2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

గొప్ప వ్యక్తుల అభిమానం సంపాదించుకున్న మీరు ధన్యులు sir. దత్తాత్రేయ గారు మృదు భాషి. సౌమ్యులు. మంచి మనిషి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత : ధన్యవాదాలు