24, మే 2020, ఆదివారం

స్థిర చిత్తంతో కూడిన జగన్ ఏడాది పాలన – భండారు శ్రీనివాసరావు




(Published in the edit page of SAKSHI daily dated 24-05-2020, SUNDAY) 


2014 లో జగన్ మోహన రెడ్డి అధికారానికి అడుగు దూరంలో ఆగితే, 2019 లో చంద్రబాబు నాయుడు అధికార పీఠానికి ఆమడ దూరంలో ఆగిపోవడం ప్రజాస్వామ్యంలో ఉన్న చమత్కారం అనిపిస్తుంది.
నూతన ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన రెడ్డి పదవిని స్వీకరించి మే 30 వ తేదీకి  సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. అయిదేళ్ళు పరిపాలించడం కోసం ప్రజాతీర్పు పొందిన వ్యక్తి పనితీరును ఏడాదికి కుదించి పోల్చిచూసి సమీక్షించడం సబబు అనిపించుకోదు. అయినా ఆయన ఏ దిశగా సాగుతున్నారు, ఏ మార్గంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అనేది స్థాలీపులాక న్యాయంగా పరిశీలించుకోవడానికి ఈ సంవత్సర కాలం అక్కరకు వస్తుంది.
తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అనిపించుకునే నిర్ణయాలను ఎన్నింటినో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జగన్ మోహన్ రెడ్డి ప్రకటిస్తూ వచ్చారు. పదవిని చేపట్టిన కొద్ది గంటల్లోనే డీజీపీతో సహా ఉన్నతాధికారుల బదిలీ ప్రక్రియ చేపట్టారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు నవరత్నాల పేరుతొ ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు సమర్దులయిన అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ముందే రాసిపెట్టుకున్న స్క్రిప్ట్ మాదిరిగా,  జరిగేవన్నీ ఒక పద్దతి ప్రకారం చకచకా సాగిపోతూవుండడం జగన్ పాలనలోని ఓ ప్రత్యేకత. అసెంబ్లీ సమావేశం, మంత్రివర్గ నిర్మాణం, శాఖల పంపిణీ, స్పీకర్ ఎన్నిక, పదమూడు జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు, గ్రామ సచివాలయాల ఏర్పాటు, గత ప్రభుత్వం ఎన్నికలకు కొద్ది ముందు అమలు చేసిన అన్నదాతా సుఖీభవ పధకం రద్దు, దాని స్థానంలో రైతు భరోసా పధకం, పారిశుధ్య పనివారు, అంగన్ వాడీ మహిళల వేతనాల పెంపు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అనే వివక్ష లేకుండా ఇంటర్ విద్యార్ధులకు కూడా అమ్మవొడి పధకం వర్తింపు, పొరుగురాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తో సత్సంబంధాలు పెంపొందించుకునే ప్రయత్నాలు, ఢిల్లీ యాత్రలు, ప్రధాని నరేంద్ర మోడీ ఇతర కేంద్ర మంత్రులతో భేటీలు ఇలా అలుపూసొలుపు లేని పనులతో, ప్రతి రోజూ ఏదో ఒక కొత్త నిర్ణయం ప్రకటిస్తూ మొదటి నెల ఇట్టే గడిచిపోయింది. గతంతో పోలిస్తే కొట్టవచ్చినట్టు కనబడుతున్న తేడా ఒకటుంది. అది ప్రచార ఆర్భాటంలో తగ్గుదల. అధికారుల సమీక్షా సమావేశాల్లో కొత్త ముఖ్యమంత్రి మార్కు మార్పు స్పుటంగా కానవస్తోంది. ప్రత్యేకంగా విలేకరుల సమావేశాలు అంటూ నిర్వహించకుండా వారికి అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వమే విడుదల చేసే పద్దతిని కూడా ప్రవేశపెట్టినట్టు ఈ ఏడాది పాలన తీరుతెన్నులు చూసేవారికి అర్ధం అవుతోంది. కరోనా కట్టడి కాలంలో అది కొద్దిగా రూపు మార్చుకుంది. ముఖ్యమంత్రి నేరుగా విలేకరులతో మాట్లాడకుండా ముందుగా రికార్డు చేసుకున్న వీడియోని మీడియాకు విడుదల చేస్తున్నారు.
పార్టీ మార్పిళ్ల విషయంలో అసెంబ్లీ సాక్షిగా జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ప్రజాస్వామ్య ప్రియులను ఎంతగానో అలరించింది. తమ పార్టీలోకి వేరేవారు ఎవరు రావాలన్నా ముందు పదవులకు రాజీనామా చేయాలని పునరుద్ఘాటించారు. అలా గీత దాటే వారిని ఏమాత్రం ఉపేక్షించకుండా వారిపై అనర్హత వేటువేయాలని కొత్తగా స్పీకర్ గా ఎన్నికయిన తమ్మినేని సీతారాంకు సభానాయకుడి స్థానం నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి సూచించడం ముదావహం. ప్రజాస్వామ్యానికి చెదపురుగుల్లా తయారయిన పార్టీ మార్పిళ్ళకు, ఈ సాహసోపేత నిర్ణయం అడ్డుకట్ట వేయగలిగితే అంతకంటే సంతోషించాల్సింది లేదు. చట్టంలోని లొసుగులను నిస్సిగ్గుగా వాడుకుంటూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వచ్చిన  పార్టీలు కూడా జగన్ సూచించిన ఈ విధానాన్ని పాటిస్తే, చట్ట సవరణ అవసరం లేకుండానే ఈ అనైతిక చర్యలను చాలావరకు అరికట్టవచ్చు. అయితే,  తదనంతర కాలంలో ఒకరిద్దరు  ప్రతిపక్ష ఎమ్మెల్యేల విషయంలో ఈ నియమం ఒకింత పట్టు  సడలిందేమో అన్న సందేహం కలిగేలా జగన్ ప్రభుత్వ వైఖరి వుండడం ప్రజాస్వామ్య అభిమానులకు రవంత బాధ కలిగించిన మాట కూడా నిజం. అది అక్కడితో ఆగడం కొంతలో కొంత ఉపశమనం.  
అటు రాష్ట్ర పరిపాలకుడుగా, ఇటు రాజకీయ పార్టీ అధినేతగా జగన్ మోహన రెడ్డి తన రెండు చేతుల్లోను రెండు పగ్గాలు ధరించి పాలనారధాన్ని ముందుకు నడుపుతున్నారనేది కూడా సుస్పష్టం. పాలనాపరంగా, రాజకీయంగా తొలిరోజుల్లోనే  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఒకపక్క సెహభాష్ అనిపించుకునే ప్రకటనలు. మరో పక్క తొందర పడుతున్నారేమో అనిపించే రాజకీయ నిర్ణయాలు.
విచ్చలవిడిగా పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలనే గట్టి నిర్ణయానికి ఆయన వచ్చినట్టు తోస్తోంది. ఈ విషయంలో శషభిషలకు తావు లేకుండా ఏకంగా జిల్లా కలెక్టర్ల సమావేశంలోనే జగన్ మోహన రెడ్డి కుండబద్దలు కొట్టారు. సమావేశం జరుగుతున్న ప్రజావేదిక కట్టడమే ఒక అక్రమ నిర్మాణమని చెబుతూ, వీటి తొలగింపు అనేది ప్రజావేదికను నేలమట్టం చేయడంతోనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆ వేదిక సాక్షిగానే ఆదేశించారు. సదస్సు అలా ముగిసిందో లేదో అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి ఆదేశాలను తుచ తప్పకుండా అమలు చేసింది. కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్రజావేదిక కట్టడం కూల్చివేత కార్యక్రమాన్ని రాత్రికి రాత్రే పూర్తిచేసింది. ఈ చర్య సహజంగానే రాజకీయ వర్గాల్లోనే కాక సాధారణ ప్రజల్లో కూడా సంచలనాన్ని కలిగించింది. అక్రమ నిర్మాణాలు చేసిన వారి గుండెల్లో అలజడి రేపింది. కొందరు దీనికి రాజకీయ ఉద్దేశ్యాలు ఆపాదిస్తే, మరికొందరు తొందరపాటు, దుందుడుకు  చర్యగా పరిగణించారు. ఆయన అనుకున్నట్టుగానే కృష్ణానది కరకట్ట మీద నిబంధనలకు విరుద్ధంగా అనేకమంది శ్రీమంతులు నిర్మించుకున్న భవంతులను కూల్చివేసే ప్రయత్నంలో భాగంగా అధికారులు అనేకమందికి నోటీసులు కూడా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివసిస్తున్న గెస్ట్ హౌస్ కూడా వీటిలో ఒకటి కావడం రాజకీయ కలకలానికి కేంద్ర బిందువుగా మారింది. అవతల ప్రభుత్వం నిబంధనలకు లోబడి చర్యలు తీసుకుంటూ ఉన్నందున పరిపాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశాన్ని మరింత వివాదం చేయకుండా విజ్ఞతతో వ్యవహరిస్తే బాగుండేది. ఇదే దృఢ సంకల్పంతో ముందుకు సాగి అక్రమ నిర్మాణాలకు ముకుతాడు వేయగలిగివుంటే  ప్రజల మద్దతు ప్రభుత్వానికి పుష్కలంగా లభించి వుండేది. కానీ దురదృష్టం, ఈ ఏడాది కాలంలో ఈ రెండూ జరగలేదు.
ఉద్దేశ్యం మంచిదే. పెట్టుకున్న లక్ష్యం గొప్పదే. కానీ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆచరణలో దోవతప్పి మరో బాట పట్టడం కొత్త విషయం ఏమీ కాదు. ఎంత మంచి పధకం అయినా ప్రజల మద్దతు లేనిదే విజయవంతం కానేరదు. కొన్ని కొన్ని విషయాల్లో పాలకులు తమ పట్టుదలలకు కొంత వివేచన జత చేస్తే బాగుంటుందేమో ఏలికలు ఆలోచించాలని విజ్ఞులు పదేపదే సూచనలు చేసేది ఇందుకే.
వై.ఎస్. జగన్ మోహన రెడ్డి పాలన కొన్ని శుభశకునాలతో మొదలయింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీతోనూ, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ చక్కటి స్నేహపూర్వక సంబంధాలు గత ఏడాది కాలంలో పెరుగుతూ రావడం ఆహ్వానించదగిన పరిణామం. ఢిల్లీలో ప్రధానమంత్రిని తొలిసారి కలిసి వచ్చిన తర్వాత మోడీ చేసిన ట్వీట్ ఇందుకు చక్కని ఉదాహరణ. జగన్ మోహన రెడ్డితో తన సమావేశం అద్భుతంగా జరిగిందని ప్రధాని వర్ణించడం మోడీ వ్యవహార శైలి తెలిసిన వారికి గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించి వుంటుంది. కొత్తగా ఏర్పడ్డ  రాష్ట్రానికి తనకుతానుగా పరిష్కారం చేసుకోలేని సమస్యలు కొన్ని వుంటాయి. ఇటువంటివాటి విషయంలో కేంద్ర సహకారం అత్యంత ఆవశ్యకం. ఈదిశగా ముఖ్యమంత్రి తొలిఅడుగులు పడడం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మంచిది. అలాగే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో అయన  చంద్రబాబు నాయుడితో వ్యవహరించిన తీరు గుర్తున్న వారికి, ఇప్పుడు వై.ఎస్. జగన్ తో ఆయన వ్యహరిస్తున్న విధానం ఒకింత అచ్చెరువు కొలిపేదిగా వుంది. ఒక విధంగా ఉభయ రాష్ట్రాలకు ఈ మార్పు ప్రయోజనకరం. రెండు కొత్త రాష్ట్రాల నడుమ పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలు వున్నాయి. ప్రతియేటా సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి నదీ జలాల సమగ్ర వినియోగం, నానాటికీ తగ్గిపోతున్న కృష్ణానదీ జలాల గరిష్ట వాడకం. వీటిని సుసాధ్యం చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్. తెలంగాణా రాష్ట్రాలకు సేద్యపు నీటి సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది. చినుకు పడితేనే బతుకు అనే రైతాంగం దుస్తితికి తెర పడుతుంది. ఈ రెండు నదుల అనుసంధానానికి ఉన్న అవకాశాలను పరిశీలించి ఆచరణలోకి తేగలిగితే రెండు తెలుగు రాష్ట్రాల ఆర్ధిక స్తితిగతులు ఊహించలేనంతగా మారిపోతాయి. కానీ కొత్త రాష్ట్రాలు ఏర్పడి దాదాపు ఆరేళ్ళు దగ్గరపడుతున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనేమాదిరిగా కొన్ని ఇంకా అపరిష్కృతంగానే వున్నాయి. పోతిరెడ్డిపాడు వంటి అంశాలు ఇటీవల చిలికి చిలికి గాలివానగా మారడం గమనిస్తున్న వారికి ఈ ఇరువురు నాయకుల మధ్య సయోధ్య మూడునాళ్ళ ముచ్చట అవుతుందేమో అనే సందేహం కలిగితే ఆశ్చర్యపడాల్సింది లేదు. ముఖ్యమంత్రుల స్థాయిలో చొరవ చూపిస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరకడం అసాధ్యమేమీ కాదు.   
కిందటేడాది ఏప్రిల్ 11 వ తేదీన జగన్ మోహన రెడ్డి పెద్ద పరీక్ష రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. సరిగ్గా నలభయ్ రెండు రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, మే 23న ఫలితాలు వెలువడ్డాయి.  నిజానికి ఆ పరీక్షలో గట్టెక్కడం అనేది ఆయన రాజకీయ భవిష్యత్తుకు  ఎంతో కీలకం. ఎందుకంటే ఆయనది ఒక ప్రాంతీయ పార్టీ. వరసగా రెండు ఎన్నికల్లో పరాజయం పాలయితే మూడోసారి ప్రజా పరీక్షకు సిద్ధం కావడం అనేది ఒక ప్రాంతీయ పార్టీకి, అందులో ఏనాడు అధికార పీఠం ఎక్కని రాజకీయ  పార్టీకి  అసాధ్యం అని అంటారు.  అయితే, జగన్ మోహన రెడ్డి గత మార్చిలో పెద్ద పరీక్షే రాసి పాసయ్యారు. అదీ అత్తెసరు మార్కులతో కాదు, మొత్తం 175 స్థానాల్లో  151 సీట్లలో తన అభ్యర్ధులను గెలిపించుకుని కొత్త రాష్ట్ర చరిత్రలో నూతన  అధ్యాయం లిఖించారు. ఈ విజయాల్లో అధిక భాగం ఆయన తన సొంత రెక్కల కష్టంతో సాధించుకున్నవే.
ఏడాది తిరుగుతూనే తిరిగి మార్చి నెలలోనే మరో ఊహించని పరీక్ష కరోనా రూపంలో ముఖ్యమంత్రికి ఎదురయింది.
రాష్ట్రం ఆర్ధిక పరిస్తితి అంతంత మాత్రం. ఆదాయపు వనరులు కుంచించుకుపోయేవే కానీ పెరిగే అవకాశాలు అద్యతన భావిలో కానరాని పరిస్తితి. చేసిన వాగ్దానాలు కొండంత. నవరత్నాలు ఏమైనా సరే నెరవేర్చి తీరాల్సిందే అనే పట్టుదల. మరో పక్క పెరుగుతున్న విపక్షాల స్వరం. చేసే ప్రతిపనిలో తప్పులు ఎన్నేవారే కానీ, ఇదిగో ఇదీ పొరబాటు సవరించుకోమని చెప్పేవారే లేరు. నిజానికి అది వారి పని కూడా కాదు. 
వెళ్ళాల్సిన మార్గాన్ని నిర్ణయించుకుని, చేయాల్సిన పనులను నిర్దేశించుకుని, అందుకు అవసరమైన కాలపట్టికను రూపొందించుకుని, ఇదిగో ఈ నెలలో ఇది చేయగలిగాను అని టిక్కు పెట్టుకుని, ఆ పని పూర్తి చేసినట్టు  తను మాటిచ్చిన జనాలకు  చెప్పుకుంటూ పోతున్న తరుణంలో ఈ కరోనా భూతం ఆకస్మికంగా  విరుచుకుపడి అధ్వాన్నంగా మారుతున్న రాష్ట్ర ఆర్ధిక పరిస్తితిని మరింత అస్తవ్యస్తం చేసింది.  
జగన్ మోహన రెడ్డిపై ముందు నుంచీ ఒక అపోహ వుంది, అయన ఎవ్వరి మాట వినని సీతయ్య అని. నిజమే కావచ్చు. కానీ 1956 లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ నాటినుంచి  పరిపాలించిన ముఖ్యమంత్రులలో ఒకరో ఇద్దరో, దామోదర సంజీవయ్య, టి. అంజయ్య వంటి వారిని మినహాయిస్తే అందరూ ఈ సీతయ్య కోవలోకి వచ్చేవారే. కాకపోతే వారిలో చాలామంది తమలోని ఈ స్వభావం బయట జనాలకు తెలియకుండా జాగ్రత్త పడేవారు. జగన్ మోహన రెడ్డికి ఆ శషభిషలు వున్నట్టులేదు. అందుకే ఆయన మీద ఈ అపోహలు తేలిగ్గా ముసురుకుంటున్నాయి కాబోలు.   
నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, చెల్లుబాటయిన మొత్తం ఓట్లలో అప్పటికి అయిదేళ్లుగా పాలిస్తున్న టీడీపీకి, కొత్తగా ఎన్నికల బరిలోకి దిగి పోటీ చేసిన జనసేనకు, కాంగ్రెస్, బీజేపీ లకు కలిపి వచ్చిన ఓట్ల కంటే వైసీపీకి ఆరులక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ గణాంకాలనే  ప్రాతిపదికగా తీసుకుంటే అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా వాటిపై వైసీపీ విజయం సాధించి వుండేది అనేది  ఒక వాదన.
అయితే ఇంతటి బహుళ ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు, ప్రజాస్వామ్య సూత్రాలను పట్టించుకోకుండా  తన చిత్తం వచ్చినట్టు పాలన సాగించవచ్చా అనేది ఆదినుంచి  ప్రతిపక్షాలు లేవదీస్తున్న ప్రశ్న. కరోనా పూర్వరంగం నుంచి తొలుస్తూ వచ్చిన ఈ సందేహాన్ని,  కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆ పార్టీలు  ఒకటికి పదిసార్లు ప్రజలకు చెబుతూ మరింత పెద్దది చేస్తూవచ్చాయి. కేవలం సందేహం అయితే పర్వాలేదు, జగన్ ప్రభుత్వ నిర్వహణలో పూర్తిగా వైఫల్యం చెందారు అనేది జనం నమ్మేలా  చేయడానికి వాళ్ళు శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు.
గత ఏడాది కాలంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ అనాలోచితమైనవి, తొందరపాటుతో కూడినవి కాకపోయినా చాలావరకు వివాదాస్పదంగా మారుతున్నాయి. అదే సమయంలో కొన్ని నిర్ణయాలు మొదట్లో దుందుడుకుతనంగా అనిపించినా తర్వాత తర్వాత వాటిల్లో సహేతుకత లేకపోలేదని జనమే ఒప్పుకునేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు కరోనాతో సహజీవనం చేయక తప్పదని జగన్ చేసిన వ్యాఖ్య పెద్ద దుమారాన్నే లేపింది. అందరూ ఆక్షేపించేలా చేసింది. చివరికి పాలకులు అందరూ అదేమాట చెప్పాల్సిన పరిస్తితి ఏర్పడింది. కానీ ఈలోపలే ఆ ప్రకటనను జగన్ అనుభవరాహిత్యానికి గీటురాయిగా ముద్ర వేయడం జరిగిపోయింది.    

ఈ కరోనాకు తోడు పులిమీది పుట్రలా విరుచుకుపడిన వైజాగ్ విష వాయువు దుర్ఘటన దరిమిలా ప్రతిపక్షాల వాదన సరయినదేమో అనే శంక సమాజంలోని  కొన్ని వర్గాలవారికి కలిగేలా ఈ ప్రయత్నాలు తారాస్థాయికి చేరాయి.
తనపై దుష్ప్రచారం ఎంత పెద్ద ఎత్తున సాగితే అంత మంచిదని జగన్ మోహన రెడ్డి భావిస్తున్నారేమో తెలవదు. దీన్ని బలంగా తిప్పికొట్టే ప్రయత్నాలు ఏవీ ఆయన వైపు నుంచి కానరావడం లేదు. బహుశా గతంలో ఇలాగే అన్ని  రాజకీయ పక్షాలు ఏకమై తనను ఒంటరివాడిని చేసినప్పుడు ప్రజలకు తనపట్ల సానుభూతి వెల్లువెత్తిన సంగతిని దృష్టిలో పెట్టుకుని ఇలా ప్రతిస్పందించకుండా మిన్నకుంటున్నారేమో తెలవదు. ముందే చెప్పుకున్నట్టు ఆయన ఎవరి అంచనాలకు అందని లోతైన మనిషి.
చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఒక అభిమాన నాయకుని పట్ల అయన  అభిమానులు పెంచుకున్న అభిమానం ఎల్లవేళలా ఒకేలా వుండదు. కాకపోతే బహుళ ప్రజాదరణ కలిగిన నాయకులకు ఒక రక్షాకవచం వుంటుంది. వారిపై వచ్చే విమర్శలను, ఆరోపణలను జనం తేలిగ్గా తీసుకుంటారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గురించి వెలువడిన నిందాప్రచారాలు అన్నీ ఇన్నీ కావు. అయినా ప్రజలు  పట్టించుకోలేదు. పరిపాలనలో లోటుపాట్లని లెక్కపెట్టకుండా ప్రతిసారీ ఆయన్ని గెలిపిస్తూ వచ్చారు.  అలాంటి నాయకుడికి 1989 లో ఏం జరిగిందో అందరికీ తెలుసు.  అంతగా అభిమానించిన ఎన్టీఆర్ వంటి మహానాయకుడినే ఒక నియోజకవర్గం, కల్వకుర్తిలో ఓడించారు. పూచిక పుల్లను నిలబెట్టి గెలిపించుకునే సత్తా తనకుందని అహంకారపూరిత ప్రకటనలు చేయడం, ఓ చిన్న కారణం చూపెట్టి తన మంత్రివర్గంలోని మంత్రులను అందరినీ ఒక్క కలంపోటుతో  తొలగించడం వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను ప్రజలు హరాయించుకోలేక పోయారు. కాబట్టి మంచి ప్రజాదరణ కలిగిన జగన్ వంటి నాయకులు గతం బోధించే పాఠాలను గుర్తుచేసుకుంటూ భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసుకోవాలి. 
తోకటపా:
జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి గురించి సోషల్ మీడియాలో కనబడిన వ్యాఖ్య:
"రైల్వే ప్లాటుఫారం ప్రయాణీకుల సందడితో, తినుబండారాలు అమ్మేవారి కేకలతో  నానా గోలగా వున్నా, వచ్చిపోయే రైళ్ళు రణగొణధ్వనులు చేస్తున్నా ఆ గోలని (ప్రతిపక్షాల వ్యతిరేక ప్రచారం) ఏమాత్రం  పట్టించుకోకుండా ఏకాగ్రతతో తన పని తాను చేసుకునే స్టేషన్ మాష్టర్ వంటివాడు జగన్ మోహన్ రెడ్డి” (EOM)



2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

కొన్ని తొందరపాటు చర్యలు ఉన్నా జగన్ ఏడాది పాలన బాగుంది. ప్రతిపక్ష నేత అతని భజన మీడియా , వివిధ వ్యవస్థ లలో ప్రవేశపెట్టిన పచ్చ కోవర్తులు అడుగడుగునా నీచంగా అడ్డుపడినా జగన్ బాగా ఎదుర్కొన్నాడు.

మీ వ్యాసం చాలా బాగుంది సార్.

అజ్ఞాత చెప్పారు...

ఇంగ్లీష్ మీడియం కి చప్పట్లు కొట్టొచ్చు . లిక్కర్ షాప్ లు తగ్గిస్తాడు అనుకున్నా , కానీ సొంత తయారీ మొదలు పెట్టి అది అమ్ముతాడు అని ఊహించలేదు . మైనర్ లు కూడా తాగేస్తున్నారు , లిక్కర్ బాగా తగ్గిస్తే అదే పదివేలు . గ్రామ వాలంటీర్ లు పార్టీ కి బాగా ఆదాయం తీసుకొచ్చారు . తెలుగు దేశం కి ఇప్పుడు దిక్కు దివాణం లేదు . విపరీతమైన అవినీతి చేసేసారు పోయే ముందు , చంద్రబాబు కి కంట్రోల్ పోవడం, పార్టీ ఓడిపోతుంది అని తేలడం తో కింద స్థాయి లో పని చేసే పార్టీ నేతలు జనాలని దారుణంగా పిండేశారు, షాక్ అది . టీడీపీ లో 3 లక్షలు అడిగిన పని , వైస్సార్సీపీ లో లక్ష కి అయిపొయింది లంచాలతో కలిపి . ఇంత తక్కువ అవినీతి తో పని చేసే నేతని జనం గుండెల్లో దాచుకుంటారు .