13, జులై 2019, శనివారం

నవరత్నఖచిత బడ్జెట్ - భండారు శ్రీనివాసరావు


ఎన్నికల ప్రణాళికే తమకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అంటుంటారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన రెడ్డి. అందుకు తగ్గట్టే ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ రెడ్డి, తమ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరచిన నవరత్న హామీలనే బడ్జెట్లో పొదిగి శాసనసభకు సమర్పించారు.
బడ్జెట్ అంచనా రు. 2, 27, 975 కోట్లు,  రెవెన్యూ వ్యయం రు. 1,80, 475 కోట్లు, మూలధన వ్యయం రు.  32,293 కోట్లు, వడ్డీల చెల్లింపులు రు. 8,994 కోట్లు, ఆరోగ్యశ్రీ  రు. 1740 కోట్లు, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకీకరణ కోసం రు. 1500 కోట్లు, కాపుల సంక్షేమం రు. 2000 కోట్లు, సాగునీరు రు.  13,139 కోట్లు, బీసీల అభివృద్ధి కోసం రు.   15,061 కోట్లు, వై.ఎస్.ఆర్. రైతు భరోసా రు. 8750 కోట్లు, జల యజ్ఞం  రు. 13, 139 కోట్లు,  వై.ఎస్.ఆర్. గృహ నిర్మాణం రు. 8,615 కోట్లు, అమ్మవొడి రు. 6,455 కోట్లు, వ్యవసాయ బడ్జెట్ అంచనా వ్యయం రు. 28,866 కోట్లు.
స్థూలంగా చూసినప్పుడు ఈ కేటాయింపులు, అంచనాలకు సంబంధించిన అంకెలు ఘనంగానే కనిపిస్తున్నాయి. ఆచరణలోకి వచ్చినప్పుడు కానీ ఫలితాలు గురించి చెప్పలేని పరిస్తితి. అన్నిటికంటే ముందు ఆదాయానికీ, వ్యయానికీ నడుమ విపరీతంగా కానవస్తున్న వ్యత్యాసం. ఎలా పూడ్చుకుంటారు అనేది జవాబు దొరకని ప్రశ్న.
జనం కోరేది మనం శాయడమా! మనం చేసేది జనం చూడడమా!  అలనాడు 'పాతాళభైరవి' సినిమాలో మాంత్రికుడి నోట వినిపించిన మాట ఇది. జనానికి కావాల్సింది చేయడమే ఈనాటి రాజకీయ పార్టీలు తమ విద్యుక్త ధర్మంగా భావిస్తున్నాయి. బడ్జెట్లు కూడా అందుకు అనుగుణంగా తయారవుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన రెడ్డి ఈ విషయంలో లేనిపోని భేషజాలకు పోతున్నట్టు లేదు. తన పాదయాత్ర సందర్భంలో ప్రజలకు ఇచ్చిన మాటే వేదంగా ఆయన భావిస్తున్నారు. ఆ నవరత్నాలే ఈనాడు బుగ్గన గారి బడ్జెట్లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అగ్రాసనాన్ని అలంకరించాయి.     
ఉమ్మడి రాష్ట్రంలో లక్షలతో మొదలయిన బడ్జెట్ అంచనాలు, రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డ తర్వాత అవి  కాలక్రమంలో పెరిగి పెరిగి లక్షల కోట్లల్లోకి చేరుకున్నాయి. ప్రతియేటా బడ్జెట్ పరిమాణం పెరుగుతూ  పోవడం తప్పనిసరిగా తయారయింది. ఆర్ధిక ప్రగతికి ప్రభుత్వాలు కూడా దీన్ని ఒక కొలమానంగా పరిగణిస్తున్నాయి. బడ్జెట్ అంచనా  మొత్తం యెంత గొప్పగా వుంటే అభివృద్ధి కూడా ఆ స్థాయిలో ఉంటుందని నమ్మే రోజులు వచ్చాయి.
వాస్తవానికి ప్రతి ప్రభుత్వం, అది ఏ పార్టీ ప్రభుత్వం అయినా సరే ప్రతి ఏటా బడ్జెట్ పై గట్టి కసరత్తే చేస్తుంది. తమ విధానాలకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో  కేటాయింపులు చేస్తుంది. యెంత ఖర్చు చేయాలన్నా ఎంతో కొంత రాబడి వుండాలి. ఖజానాలో చేరే రూపాయలు తగ్గిపోయి పెట్టే ఖర్చు పెరిగిపోతే అదనపు ఆదాయ వనరుల అన్వేషణ తప్పనిసరి అవుతుంది. ఇందుకోసం అప్పులన్నా చేయాలి. లేదా పన్నులన్నా వేయాలి. మొదటిది దొరకడం కష్టం. రెండోది వేయడం తేలికే కాని, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కొంత ఇబ్బందికరమైన వ్యవహారం. ఎన్నికలకు ముందు బడ్జెట్ అయితే ఇక చెప్పే పనిలేదు. సాధ్యమైనంత ఉదారంగా పన్ను భారం ప్రజలపై వేయకుండా చూడడం ఆర్ధిక మంత్రుల ప్రధమ ప్రాధాన్యం.
జగన్ ప్రభుత్వానికి ఇది తొలి బడ్జెట్ కాబట్టి ఈ సమస్య లేదు.
సమస్య లేదు సరే! మరి ఇంత లోటు పూడ్చుకోవడం ఎలా!
ఇలాంటి సందర్భాల్లో దొరికినంత అప్పులు చేయడం, విధి లేకపోతే పన్నులు వేయడం అనేది ప్రభుత్వాలకు ఆనవాయితీగా మారింది. అయితే,  బడ్జెట్లో పన్నులు వేయడం అన్న పద్దతికి పార్టీలు, ప్రభుత్వాలు ఏనాడో స్వస్తి పలికాయి. ఏడాది పొడుగునా వేయగల వెసులుబాటు వున్నప్పుడు బడ్జెట్లో చూపించి లేని తలనొప్పులు కొని తెచ్చుకోవడం ఎందుకన్న నిర్ధారణకు వచ్చేసాయి.
చాలా ఏళ్ళ క్రితం బడ్జెట్ పై ఒక టీవీ చానల్ వారు నిర్వహించిన  డిబేట్ లో నాతోపాటు పాల్గొన్న ప్రొఫెసర్ హర గోపాల్ చెప్పారు. ‘గతంలో బడ్జెట్ రోజుకు ముందుగానే దుకాణాల్లో సిగరెట్లు, అగ్గిపెట్టెలు, పాల పొడి డబ్బాలు మాయమై పోయేవని. కొత్త పన్నులు వేస్తే పాత రేటుకు కొన్న సరకులు కొత్త రేట్లకు అమ్ముకుని లాభాలు సంపాదించవచ్చని వ్యాపారులు అలా చేసేవాళ్ళు. మార్కెట్ మీద ప్రభుత్వాలకు పట్టు వున్న రోజులవి. ఇప్పుడో, మార్కెట్ శక్తులే ప్రభుత్వాలని శాసిస్తున్న రోజులాయె!’
అందుకే బడ్జెట్లు ఈనాడు ఓ తంతుగా ముగిసే ప్రభుత్వ  కార్యక్రమాలు అయ్యాయి. వాటి మీద మీడియాకు తప్ప మామూలు జనాలకు ఆసక్తి లేకుండా పోతోంది. లోగడ కేంద్ర బడ్జెట్ అంటే రేడియో పెట్టుకుని వినేవారు. గాస్ సిలిండర్  ధరలు, పెట్రోలు ధరలు ఏవన్నా పెరిగాయా, కుక్కర్లు, ఫ్రిజ్  ల ఖరీదులు పెరిగాయా అనే ఆసక్తితో. ఇప్పుడు బడ్జెట్లకు, ధరల పెరుగుదలకు లంకె తెంపేసారు. వేటి దోవ వాటిదే. 'కోడి గుడ్డు ధర' మాదిరిగా, ఏరోజు రేటు ఆ రోజుదే!   
ఏపీ బడ్జెట్ పై శాసన సభలో చర్చలు ఎలా సాగుతాయో తెలియదు కానీ, టీవీ ఛానళ్ళలో మాత్రం చర్చోపచర్చలు సాగిపోతూనే వున్నాయి. అసలు బడ్జెట్ అంటే ఏమిటి అని ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యే అడిగారు.  చిత్రం ఏమిటంటే బడ్జెట్లు రూపొందించి, ఆమోదించే చట్టసభలో ఆయన సభ్యుడు.
బడ్జెట్ అంటే కొన్ని ఆలోచనలు, ఆలోచనలకు తగ్గ అంచనాలు, అంచనాలకు తగిన కేటాయింపులు. అంతటితో బడ్జెట్ పని పూర్తి చేసామని చెప్పుకోవచ్చు. అయితే, కేటాయింపులకు అనుగుణంగా  ఆ నిధులను  సకాలంలో విడుదల చేసి  ఖర్చు చేస్తున్నారా అంటే  అవునని చెప్పడం ఏ ప్రభుత్వానికయినా కష్టమే. ఆర్ధిక సంవత్సరం ముగియవచ్చే తరుణంలో హడావిడిగా నిధులు ఇబ్బడిముబ్బడిగా విడుదల చేయడం, సకాలంలో వాటిని ఖర్చు చేయలేక మురగబెట్టడం ఓ ఆనవాయితీగా మారిపోయింది.  ఖర్చు చేయనిదానికి కేటాయింపులు చేయడం ఎందుకు? కేటాయింపులు చేయలేదని, లేదా సరిగా చేయలేదని ప్రశ్నించడం ఎందుకు? అటు చూసినా, ఇటు చూసినా, అటుఇటు చూసినా రాజకీయమే!
లక్షలు కోట్లు అంటున్నారు. చిన్న అంకెలు పాలకుల కంటికి ఆనడం లేదు. అంకెలు కొట్టొచ్చినట్టు పెద్దవిగానే కనబడుతున్నాయి. ప్రాధాన్యతల దగ్గరే పాలక ప్రతిపక్షాలకు  శృతి కుదరడం లేదు. అంకెల గారడీ అని విపక్షాలు విమర్శిస్తుంటే, వాటి మాటల్ని అవగాహనా రాహిత్యంగా పాలకపక్ష సభ్యులు కొట్టి పారేస్తున్నారు. చెప్పింది ఏమిటి చేస్తున్నది ఏమిటి? సరయిన వనరులు లేకుండా చేసే  ఈ కేటాయింపులతో ఏవి సాధిస్తారు అని ప్రతిపక్షాల ప్రశ్న. మనసుంటే మార్గం  వుంటుంది అని సర్కారు వారి షరా మామూలు జవాబు. వినేవారికి చెప్పేవారు లోకువ అంటారు. కానీ ఈ నానుడి తిరగబడింది. తమ మాటలతో, తమ పధకాలతో ప్రజలను  ఊహాలోకాల్లో తిప్పి చూపించే ప్రభువులకు  చూసే జనాలు లోకువ.
బడ్జెట్ పై పాలక, ప్రతిపక్షాల స్పందనలు వింటుంటే మాయాబజార్ చిత్రంలో ప్రియదర్శిని పేటిక  సన్నివేశం గుర్తుకురాక మానదు. అందులోని దర్పణంలో ఎదురుగా నిలబడ్డవారి మొహం కాకుండా వారి మనసులో ఉన్నవారి ప్రతిబింబం కనిపిస్తుంది. అలాగే పాలక ప్రతిపక్షాలు, వాటి అభిమానులు. అక్షరం పొల్లుపోకుండా అవే  వ్యాఖ్యానాలు మార్చి మార్చి చేస్తుంటారు. రాజకీయాల్లో వుండే కిక్కు అలాంటిది మరి.    
బడ్జెట్ ప్రసంగం పేరుతొ ప్రతి ఆర్ధిక మంత్రి యాభయి  అరవై పేజీల పుస్తకం శాసన సభలో చదవడం రివాజు. మరో రెండు పేజీలు  అదనంగా జత చేసి, నిరుడు బడ్జెట్లో, కనీసం కొన్ని ప్రధాన రంగాలకు యెంత కేటాయించారు, వాటిల్లో యెంత ఖర్చు పెట్టారు అనే వివరాలు జోడిస్తే, లక్షల కోట్ల బడ్జెట్లకు అంకెల అలంకారంతో పాటు కొంత నిజాయితీ తోడవుతుంది. సరే! వైఎస్ ఆర్ సీపీ ప్రభుత్వానికి ఇది మొట్టమొదటి బడ్జెట్ కాబట్టి ఒక ఏడాది ఆగి ఈ విషయం అడగొచ్చు.     
ఉపశ్రుతి:
చాలా కాలం నాటి ముచ్చట.
తెలుగు దేశం పార్టీ  వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా పాలిస్తున్నప్పుడు మహేంద్ర నాథ్ అనే ఓ పెద్దమనిషి ఆర్ధిక మంత్రిగా వుండేవారు. వారికి వినికిడి సమస్య. చెవిలో చిన్న యంత్రం అమర్చుకుని బడ్జెట్ ప్రసంగ పాఠం నెమ్మదిగా చిన్న గొంతుకతో చదువుకుంటూ పోయేవారు. బడ్జెట్ పై చర్చలో ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తుంటే ఆయనగారు నెమ్మదిగా చెవిలోని వినికిడి యంత్రం తీసేసి నిరాసక్తంగా తన సీటులో కూర్చుండిపోయేవారు.

కామెంట్‌లు లేవు: