(Published in SURYA daily on 21-07-2019, SUNDAY)
జులై 19 వ తేదీ శుక్రవారం మధ్యాన్నం
ఒంటి గంటా ముప్పయి నిమిషాలు.
ఇదేమీ ఇస్రోలో రాకెట్ ప్రయోగానికి
నిర్ణయించిన ముహూర్తం కాదు.
అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి
కుమారస్వామికి రాష్ట్ర గవర్నర్ వజూ భాయ్
వాలా విధించిన గడువు.
జులై పందొమ్మిది వచ్చింది. మధ్యాన్నం
ఒంటిగంట కూడా అయింది. ముఖ్యమంత్రి వైఖరితో గవర్నర్ ఆదేశం బుట్టదాఖలు అయింది.
గవర్నర్ ఓపికస్తుడు కనుక నొచ్చుకోకుండా
గడువును పొడిగించారు.
ఈసారి శుక్రవారం ఆరు గంటలలోగా బల
నిరూపణ జరిగి తీరాలని ఆదేశిస్తూ గవర్నర్ నుంచి ముఖ్యమంత్రికి మరో శ్రీముఖం.
నిజానికి ఇది మూడో గడువు. మొదటి గడువు
గురువారం నాడు స్పీకర్ రమేష్
కుమార్ కు రాసిన లేఖ. ఆ రోజునే బలపరీక్ష పూర్తి చేయాలని గవర్నర్ ఆదేశం. దాన్ని
స్పీకర్ నిర్ద్వందంగా త్రోసిపుచ్చారు.
ఈ వ్యాసం రాసే సమయానికి మూడో గడువు
కూడా ముగిసింది. స్పీకర్ దాన్ని ఖాతరు చేయకుండా అసెంబ్లీ సమావేశాన్ని
కొనసాగిస్తున్నారు.
అయినా గవర్నర్ గడువును మరోసారి
పొడిగిస్తారా? లేదా ధిక్కారమున్ సైతునా అనే రీతిలో ఆయన మరేదైనా కఠిన నిర్ణయం
తీసుకుంటారా? కేంద్రంతో సంప్రదించి రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారా? లేదా
ఈలోగా సుప్రీం కోర్టు కెక్కిన కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి విన్నపాన్ని
అత్యున్నత న్యాయ స్థానం పరిగణన లోకి తీసుకుని విప్ విషయంలో ఏదైనా స్పష్టమైన వివరణ
ఇస్తుందా? ముఖ్యమంత్రి కుమార స్వామి,
కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య పదేపదే
చెబుతున్నట్టు సభలో విశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయిన తర్వాతనే ఓటింగు జరుగుతుందా?
అప్పటిదాకా స్పీకర్ సభను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తారా?
అన్నీ ప్రశ్నలే! దేనికీ జవాబులు లేవు.
రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఎవరు
అధికులు? గవర్నరా? ముఖ్యమంత్రా? అసెంబ్లీ స్పీకరా?
ఎవరి మాట చెల్లుతుంది? చెల్లుబాటు
కావాలి?
ప్రజాస్వామ్యంలో వివిధ రాజ్యాంగ
వ్యవస్థల నడుమ ఆధిక్యతకు సంబంధించిన వివాదం తలెత్తితే దాన్ని తీర్చేవారెవరు?
క్లుప్తంగా చెప్పాలంటే ఇదీ చాలా రోజులుగా
కర్ణాటకలో రాజకీయ అవనికపై సాగుతున్న నాటకం. ఇది ముగింపు ఇప్పట్లో లేని టీవీ సీరియల్
మాదిరిగా కొనసాగుతుందా? లేక ఎక్కడో ఒకచోట ఆగుతుందా?
ఎలాగు సమాధానాలు లేవు కాబట్టి,
వర్తమానాన్ని ప్రస్తుతానికి వదిలేసి గతాన్ని అవలోకిద్దాం.
దాదాసాహెబ్ గణేష్ వాసుదేవ్ మావలంకర్.
లోకసభ మొట్టమొదటి స్పీకర్ (1952-1956). మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. ఒక రోజు ప్రధాని
నెహ్రూ, స్పీకర్ ను తన ఇంటికి పిలిచారు. పిలిచింది సాక్షాత్తు ప్రధాని. ఆనాటి
రాజకీయాల్లో శిఖరసమానుడు. పార్టీలో, ప్రభుత్వంలో తిరుగులేని నాయకుడు. కానీ పిలుపు
అందుకున్నది మావలంకర్. ఆయనా సామాన్యుడు కాదు. తనకు అందిన ఆహ్వానానికి ఆయన నెహ్రూకు
కృతజ్ఞతలు తెలుపుతూ జవాబు పంపారు. ఏమనీ!
“మీరు పంపిన ఆహ్వానానికి మావలంకర్ అనే
నేను ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయిన మాట వాస్తవం. అయితే, మరో వాస్తవం మీ దృష్టికి తేవడానికే ఈ లేఖ.
నేనిప్పుడు కేవలం మావలంకర్ ని మాత్రమే
కాదు. మన దేశపు అత్యుత్తమ రాజకీయ వేదిక అయిన పార్లమెంటుకు స్పీకర్ ని కూడా. ఆ హోదాలో నేను
మీ ఇంటికి రావడం కుదరని పని. గమనించగలరు”
వర్తమాన రాజకీయాల్లో లోక సభ, శాసన సభల
స్పీకర్ల వ్యవహార శైలితో పరిచయం ఉన్నవారికి ఎప్పుడో అరవై ఏడేళ్ళ క్రితమే స్పీకర్
అనే పదవి ఎంతటి అత్యున్నతమైనదో తెలియ చెప్పిన మావలంకర్ గురించి వింటే ఆశ్చర్యం కలగక మానదు.
మావలంకర్ అనుభవం నేర్పిన పాఠ౦ ఫలితమో ఏమో తెలియదు కానీ స్పీకర్ల విషయంలో ఆయన
వైఖరి పూర్తిగా మారిపోయింది. ఒక సందర్భంలో ప్రధానిగా నెహ్రూ చెప్పిన మాటలు ఇలా
వున్నాయి.
‘స్పీకర్ అంటే గౌరవానికి ప్రతీక. సభా
గౌరవానికి, సభకు వున్న స్వేచ్చాస్వాతంత్రాలకు కూడా ఆయన ప్రతినిధి. పార్లమెంటు
అనేది అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక, అది యావత్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
దానికి సర్వాధికారి అయిన స్పీకర్ సయితం మొత్తం దేశానికి ప్రతినిధి. స్పీకర్ స్థానం
అత్యంత గౌరవప్రదమైనది. ఆ పదవిని అలంకరించేవారు అత్యద్భుతమైన స్థోమత, మొక్కవోని
నిష్పాక్షికతలకు ప్రతిరూపంగా వుండాలి. వారికి స్వేచ్చగా వ్యవహరించగల పరిస్తితులు
వుండాలి.’
సరే! అలనాటి రోజులు గుప్తుల స్వర్ణ
యుగం మాదిరిగా ఊహించుకోవాల్సిందే కాని ఆచరణ సాధ్యం అయ్యే రోజులు కావివి.
చట్టసభల స్పీకర్లు ఎంత ఉదాత్తంగా
ఉండాలో, వారిని ఎలా గౌరవించాలో పండిట్ జవహరలాల్ నెహ్రూ చెబితే, భారత దేశపు
అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు, స్పీకర్లకు వుండే విశేషాధికారాలు ఎలాంటివో
తెలియచెప్పింది.
2016 లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ
రాజ్యాంగ సంక్షోభానికి సంబంధించిన కేసులో అసెంబ్లీ స్పీకర్ కు ఉన్న అధికారాలను కోర్టు స్పష్టం చేసింది. స్పీకర్ సుప్రీం అని
సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
అసెంబ్లీకి సంబంధించిన కొన్ని విషయాల్లో తప్ప గవర్నర్ పాత్ర చాలా స్వల్పమని
పేర్కొన్నది. పదో షెడ్యూల్ లోని పార్టీ
ఫిరాయింపుల వంటి అంశాలలో స్పీకర్ దే తుది
నిర్ణయం అంటూ తీర్పు వెలువరించింది. ఈ విషయాల్లో గవర్నర్ కు ఎలాటి పాత్రా,
అధికారాలు ఉండవని అందులో స్పష్టం చేసింది.
అంతకు ముందు 2010లో సుప్రీంకోర్టు గవర్నర్ల అధికారాలను నిర్వచిస్తూ ఒక తీర్పు
ఇచ్చింది.
‘గవర్నర్లు రాష్ట్రాలకు రాజ్యాంగ
అధినేతలు మాత్రమే. గవర్నర్ కేంద్ర
ప్రభుత్వానికి ఏజెంట్ కాదు. జీతం తీసుకునే ఉద్యోగి కూడా కాదు. అంతేకాదు, గవర్నర్
అనేవాడు ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు కూడా కాదు, కాకూడదు’
స్పీకర్లకు మాత్రం రాజ్యాంగం
విశేషాధికారాలు కల్పించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కూలిపోవడానికి చట్ట
సభల్లో వాటి ఆధిక్యం సింపుల్ మెజారిటీకి తగ్గితే చాలు. ప్రభుత్వం పడిపోతుంది. స్పీకర్ ని తొలగించాలంటే సింపుల్ మెజారిటీ
సరిపోదు. సభలోని మొత్తం సభ్యుల్లో సగానికి పైగా స్పీకర్ కు వ్యతిరేకంగా ఓటు
వేసినప్పుడే అది సాధ్యం అవుతుంది.
లోకసభ స్పీకర్ గా పనిచేసిన సోమనాధ
చటర్జీ కూడా స్పీకర్ల పాత్రపై సందేహాలు వ్యక్తం చేయడం విశేషం.
పదో షెడ్యూల్ లో పార్టీ ఫిరాయింపుల
విషయంలో స్పీకర్లకున్న విశేషాధికారాలను ఆయన ప్రశ్నించారు. ఒక వ్యక్తి చేతిలో ఒక
ప్రభుత్వం మనుగడకు సంబంధించిన అధికారాన్ని వుంచడం మంచిది కాదని సోమనాధ చటర్జీ
అభిప్రాయం. స్పీకర్ కు బదులు ఈ అధికారాలను ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన
వ్యవస్థకు అప్పగించాలని ఆయన సూచించారు.
చివరాఖరుకు నిస్సంశయంగా ఒక విషయం
చెప్పవచ్చు.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి
తూట్లు పొడవడంలో స్పీకర్లకు ఉన్న విచక్షణాధికారాలకు స్వస్తివాచకం పలకాల్సిన తరుణం మాత్రం ఆసన్నమైందని కర్ణాటక
ఉదంతం తెలుపుతోంది.
బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న భారత
రాజ్యాంగం పార్లమెంటరీ వ్యవస్థలో వివిధ విభాగాలకు విధులను నిర్దేశించింది.
అంతరిక్షంలో తిరుగాడుతున్న అనేక గ్రహాలు ఒకదానినొకటి తాకని రీతిలో నియమిత కక్ష్యలో
పరిభ్రమిస్తున్నట్టు రాజ్యంగ మూలస్థంభాలయిన శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థలు తమ తమ పరిధులలో
కర్తవ్య నిర్వహణ సాగిస్తున్నంత కాలం ప్రజాస్వామ్యం మూడు పువ్వులు, ఆరు కాయలుగా
విలసిల్లుతుంది. అలా కాకుండా ఒకదానితో మరొకటి విబేధించుకున్నా, ఒకదాని పనిలో
మరొకటి జోక్యం చేసుకున్నా ప్రజాస్వామ్యసౌద పునాదులకే ముప్పు వాటిల్లుతుంది.
ఒక ప్రధానమంత్రి, ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక
గవర్నర్, ఒక స్పీకర్, ఒక ముఖ్యమంత్రి, ఒక కేబినెట్ సెక్రెటరీ, ఒక ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి వీరందరూ వారి వారి పరిధుల్లో పనిచేసినప్పుడే పరిపాలన సజావుగా
సాగుతుంది. సామాన్యుడి జీవితం సాఫీగా సాగుతుంది. అశాశ్వతమైన అధికారాన్ని అంటిపెట్టుకుని
నేనే సర్వం సహా చక్రవర్తిని అనే భావన ఏ
ఒక్కరు పెంచుకున్నా ఇక ఇంతే సంగతులు.
2 కామెంట్‌లు:
Excellent article sir with good conclusion
In current generation of speakers, andhra Speaker tamminaeni seetaaraam is the worst of all These worst speakers!
కామెంట్‌ను పోస్ట్ చేయండి