15, జూన్ 2019, శనివారం

సర్పమూషిక న్యాయం


(Published in Andhra Bhoomi Daily on 16-06-2019, SUNDAY)

గత ఆదివారం నాడు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు పసికందులు చనిపోయారనే వార్త ప్రకంపనలు సృష్టించింది. ఆసుపత్రిలో, అదీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి మరణాలు సహజమే అని సరిపుచ్చుకునే వారికి ఇదొక వార్తలా కనిపించదు. అయితే గడచిన అయిదు మాసాల వ్యవధిలో అదే ఆసుపత్రిలో సరయిన వైద్యం అందక అక్షరాలా 168 మంది పసికూనల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అనే విషయం తెలిస్తే ఆశ్చర్య పడక మానరు.
వైద్యుల నిర్లక్ష్యం, ఆసుపత్రిలో అరకొర సౌకర్యాలు తమ పిల్లల మరణానికి కారణమయ్యాయని ఆ పిల్లల తలితండ్రులు ఆరోపించి ఆందోళనకు దిగడంతో ఈ వార్త ప్రాముఖ్యం సంతరించుకుంది. అదే ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న మరో అయిదుగురు చంటి పిల్లలు కూడా అదే రోజు చనిపోవడంతో ఆందోళనకు ఆద్యం పోసినట్టు అయింది.
జరిగింది సర్దిచెప్పుకోలేని, సమర్ధించుకోలేని అంశం కావడంతో ఆసుపత్రి అధికారులు ఆత్మరక్షణలో పడ్డారు. తమ వద్దకు తీసుకురావడానికి పూర్వమే ఆ పిల్లల ఆరోగ్య పరిస్తితి విషమించివుందని, అంతకుముందు ప్రైవేటు వైద్యశాలల్లో వారికి చేయించిన చికిత్స ఫలించకపోవడం వల్లనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారని కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.
ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి కొద్ది రోజులు కూడా గడవక ముందే ఇటువంటి దుర్ఘటన జరగడం వై.ఎస్. జగన్ మోహనరెడ్డి ప్రభుత్వానికి కూడా మింగుడుపడని అంశమే. సరే! కొత్తగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా  బాధ్యతలు స్వీకరించిన ఆళ్ళ నాని వెంటనే స్పందించి హుటాహుటిన అనంతపురం బయలుదేరి వెళ్ళారు. పరిస్తితిని దగ్గరుండి సమీక్షించారు. పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని షరామామూలుగా ప్రకటించారు. అంతకు ముందే స్థానిక శాసన సభ్యుడు అనంత వెంకట రామరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ ఆసుపత్రికి వెళ్లి ఆందోళన చేస్తున్న తలితండ్రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి పరిస్తితులు గురించి తనిఖీ చేసారు.
ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల పదో తేదీవరకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో  994 మంది చిన్న పిల్లలకు వివిధ రోగాలకు చికిత్స చేసారు. కాగా వారిలో 168 మంది మరణించారని గణాంకాలు తెలుపుతున్నాయి.
ఈ నేపధ్యంలో నాలుగేళ్ళకు పూర్వం జరిగిన ఒక దుస్సంఘటన గుర్తుకు వస్తోంది.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పసికందును ఎలుకలు కొరికి చంపిన దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆనాటి మానవ హక్కుల కమిషన్ ఈ విషయాన్ని సీరియస్ గా  తీసుకుంది.
సాధారణంగా న్యాయస్థానాలు తమ ముందుకు వచ్చే కేసుల విషయంలో భావోద్వేగాలకు అతీతంగా తామరాకుమీది నీటి బొట్టు మాదిరిగా వ్యవహరిస్తాయి. అయితే మానవ హక్కుల కమిషన్  గుంటూరు ఆసుపత్రి కేసు విషయంలో వెలువరించిన అభిప్రాయాలు, వ్యక్తపరచిన విధానం ఆ కేసులోని తీవ్రతను తేటతెల్లం చేశాయి. మామూలుగా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కమిషన్ స్పందించి, సంబంధిత అధికారులకు జారీ చేసే ఆదేశాలు, ఇంగ్లీష్ భాషలో, ఒక నిర్దిష్ట పద్దతిలో, ఒక రకంగా చెప్పాలంటే పడికట్టు పదాలతో,  ఒకే మూసలో వున్నట్టు కానవస్తాయి. కానీ గుంటూరు సంఘటన విషయంలో మానవ హక్కుల కమిషన్ స్పందించిన తీరు, ఈ సాంప్రదాయక విధానానికి భిన్నంగా వుంది. కమిషన్ ఆదేశాలు సరళమైన తెలుగులో, ఉద్వేగ పూరిత భావజాలంతో, అదీ చేతిరాతతో వెలువడ్డాయి.
‘నిర్లక్ష్యం కమ్ముకున్న ఈ వ్యవస్థలో ..ఆ తల్లికి  బిడ్డను తెచ్చి ఇవ్వగలమా?దీనికి బాధ్యులు ఎవ్వరు ?’ అని  కమిషన్ ప్రశ్నించింది. వైద్యులను ప్రాణదాతలుగా కొలిచే మన సమాజంలో వాళ్ళు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గు చేటని చీవాట్లు వేసింది. అంతేకాదు, పసికందును ఎలుకలు పీక్కు తిన్నాయని తెలిసినప్పుడు నిర్ఘాంతపోయిన యావత్ సభ్య సమాజం మాదిరిగానే మానవ హక్కుల కమిషన్  కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయిందన్న విషయం ఆదేశాల్లో పొందుపరచిన అతిలోతయిన భావాలు చదివితే అర్ధం అవుతుంది.
‘అమ్మా! నేను ప్రపంచంలోకి వస్తున్నా! నాకు భావి పౌరుడిగా ఎదగాలని వుంది. ఎందుకమ్మానన్ను ఈ ఆసుపత్రికి తీసుకువచ్చావ్?’ అని ఎలుకలు తన మీద దాడి చేస్తున్నప్పుడు ఆ శిశువు యెంతటి  మూగవేదన అనుభవించి వుంటుందో’ అంటూ కమిషన్ అచ్చ తెలుగులో వ్యక్తపరచిన భావాలు సమస్య తీవ్రత పట్ల ఎంతగా కమిషన్ స్పందించి వుంటుందో అనే వాస్తవాన్ని బహిర్గతం చేస్తున్నాయి.
‘మనిషిని మనిషి కాటేసే సంఘంలో తామేమీ తీసిపోమని చాటిచెప్పేలా గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలు ఆ పసి కందుపై దాడిచేశాయి. అవి కొరుకుతుంటే ఆ పసి ప్రాణం ఎంతగా విలవిలలాడిపోయిందో. ఈ ఘటన మన భాషకు, భావాలకు అందనంత హృదయ విదారకమైనది’ అంటూ కమిషన్  తన ఆదేశాల్లో  అభివర్ణించింది.
‘దవాఖానాలు దెయ్యాల ఖానాల మాదిరిగా మారిపోయి పసివాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్కలు పసికందుల్ని పీక్కుతిన్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవస్థలోని లోపాలను ఎలా సరిదిద్దుతాం ?’ అన్నది కమిషన్ సంధించిన ప్రశ్న.
 కమిషన్  స్వయంగా పేర్కొన్నట్టు ఆ పసికందు ప్రాణాలు తిరిగి తేవడం అసాధ్యం. కానీ ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సింది ఏమిటన్నది ప్రధాన ప్రశ్న.
సరే! అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. సంఘటనకు బాధ్యులయిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాధమిక దర్యాప్తు జరిపి, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను, శిశువులకు చికిత్స చేసే ఒక వైద్య నిపుణుడిని బదిలీ చేసినట్టు నాటి  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా చనిపోయిన శిశువు తాలూకు వారితో దురుసుగా ప్రవర్తించిన ఒక హెడ్ నర్సును, మరో స్టాఫ్ నర్సును సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు.
ఆసుపత్రిలో ఎలుకలు రేపిన కలకలంతో కంగారు పడిన అధికారులు ఎలుకలు పట్టే ఓ వ్యక్తిని వెతికి పట్టుకుని ఎలుకలను పట్టించారు. రెండు రోజుల్లోనే 87 ఎలుకలు దొరికాయని సమాచారం. దొరికినవే ఇన్ని వుంటే దొరక్కుండా కలుగుల్లో ఇంకా ఎన్ని దాగున్నాయో అన్నది జవాబు దొరకని ప్రశ్న.
ఈ ఎలుకలను పట్టడానికి ఓ మనిషి దొరికాడు. కానీ, ప్రభుత్వఆసుపత్రుల్లో ఖరీదయిన వైద్య పరికరాల్ని, మందుల్నీ ఎవరి కన్ను పడకుండా కరకరా నమిలి మింగుతూ, ‘వాతాపి జీర్ణం జీర్ణం’ అనుకుంటూ, చట్టానికి దొరక్కుండా కూడబెట్టుకున్నఅక్రమ సంపాదనలతో పెంచుకున్నబొజ్జల్ని హాయిగా నిమురుకుంటున్న ‘అసలు ఎలకల్ని’ ఎవరు పట్టుకోవాలి? ఎవరు పట్టిస్తారు? పట్టించినా ఏదో ఒక రకంగా తప్పించుకోగల ‘వారి’ తెలివితేటలకి ఎవరు అడ్డుకట్ట వేస్తారు?
ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఎందుకంటే సమాజాన్ని దోచుకునే సంఘ విద్రోహ, ఆరాచకశక్తుల్లో మరెక్కడా కానరాని సమైక్యత వుంటుంది. ఒకరినొకరు కాపాడుకోవడం, ఆపదలో పడ్డప్పుడు ‘సర్ప మూషిక న్యాయాన్ని’ పాటించడం వాటికి వెన్నతో పెట్టిన విద్య.
ఒక పాము, ఒక ఎలుక సమయం కలిసిరాక ఒకే బుట్టలో ఇరుక్కుపోయాయి. పాముకు ఎలక ఆహారం. తినేస్తే ఒక పనయిపోతుంది. కానీ బుట్ట నుంచి బయట పడక పొతే అంతే సంగతులు. అంచేత ఆ పాము ఓ ఆలోచన చేస్తుంది. తన పొడ గమనించి  ప్రాణభయంతో గడగడలాడిపోతున్నఎలకతో యుక్తిగా ఓ సలహా  చెబుతుంది. ‘నావల్ల నీకు ఎలాటి ప్రమాదం వుండదు. ముందు నీ దంతాలతో ఈ బుట్టకు ఓ రంధ్రం చెయ్యి. ఇద్దరం తప్పించుకుని ప్రాణాలు దక్కించుకుందాం’ 
పామును చూడగానే సగం ప్రాణాలు పోయిన ఆ ఎలక బతుకు జీవుడా అనుకుంటూ బుట్టకు రంధ్రం చేస్తుంది. వెంటనే పాము ఆ ఎలకని ఎంచక్కా నమిలి మింగేసి, ఆ తరువాత ఎలక చేసిన  ఆ రంధ్రం ద్వారా బయట పడిప్రాణాలు దక్కించుకుంటుంది.
ఈ సర్పమూషిక న్యాయం ప్రకారం పరస్పర ఆధారిత స్వార్ధపర శక్తులు ఒకమేరకు తమలో తాము సహకరించుకుంటాయి. ఆ క్రమంలో ఒక స్థాయికి చేరిన తరువాత తమ స్వార్ధానికి, తమ ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. సామాన్యులు మాత్రం ఇందులో శలభాలుగా మారతారు.
అప్పుడు గుంటూరు ఆసుపత్రి సంఘటనపైనా విచారణ జరిగింది.  ఇప్పుడు అనంతపురం ఆసుపత్రిలో శిశుమరణాలపైనా  విచారణ జరుగుతుంది. దోషులకు శిక్ష పడుతుంది. వ్యవస్థలోని లొసుగులను అడ్డం పెట్టుకునివాళ్ళు కొన్నాళ్ళ తరువాత బయటపడతారు. అప్పటికి జనం ఈ విషయం మరచిపోతారు. ఎలకలు కొరుక్కు తిన్న ఆ పసిపాప చిట్ట చివరి దైన్యపు చూపులు,  ఎవరో చేసిన తప్పిదాలకు తమ ప్రాణాలు పోగొట్టుకున్న పసికందుల మౌన రోదనలు నేతల జ్ఞాపకాల్లో రూపుమాసిపోతాయి.  కడుపుకోతతో విలవిలల్లాడే  ఆ మాతృమూర్తుల  వేదన అరణ్య రోదనే అవుతుంది.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కావంటూ నాయకులు ఇచ్చే  హామీలు మాత్రం పునరావృతం అవుతూనే వుంటాయి. ఇదొక విష చక్ర భ్రమణం. (EOM)

కామెంట్‌లు లేవు: