12, జూన్ 2019, బుధవారం

శంకర్ చెప్పిన కాళేశ్వరం కధ – భండారు శ్రీనివాసరావు



ఎం. ఎస్. శంకర్. ఢిల్లీ నుంచి వెలువడే ఆంగ్ల పత్రిక ఔట్ లుక్ హైదరాబాదు కరస్పాండెంట్.
తెలంగాణాలో నిర్మితమవుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి రాయాలని సంకల్పం. అందుకోసం ఆ ప్రాజెక్టు ఇంజినీర్ ఇన్ చీఫ్  నల్లా వెంకటేశ్వర్లు గారి నెంబరు సంపాదించి ఫోన్ చేసాడు. ఆయన పలానా రోజున  రమ్మంటే కారులో బయలుదేరి వెళ్ళాడు. హైవె దిగి ప్రాజెక్టు దిశగా వెడుతుంటే అన్నీ భారీ వాహనాలు. అల్లంత దూరంలో ఓ పెద్ద ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న దృశ్యం దృగ్గోచరమైంది. సీఈ గారికి ఫోను చేసాడు ఎక్కడికి రావాలో కనుక్కుందామని. ఎన్నిసార్లు చేసినా ఆయన ఫోను కలవడం లేదు. అతడికి ఏం చెయ్యాలో తోచక దిక్కులు చూస్తుంటే సీఈ గారు పంపారని ఒక ఇంజినీరు వచ్చాడు. బతుకు జీవుడా అని ఆయన వెంబడి వెడితే ఒక చోట నుంచి ఆ ఇంజినీరు చేయి సాచి చూపించాడు. దూరంగా ఒక చోట  ప్రాజెక్ట్ ఇంజినీర్  ఇన్ చీఫ్ దగ్గరుండి పనివారితో కాంక్రీటు పనిచేయిస్తూ కనిపించారు. అక్కడ ఫోన్లు తేలిగ్గా కలవవు. అందుకే శంకర్ ఆయన్ని సంప్రదించలేకపోయాడు.
ఇంతకీ శంకర్ చెప్పిన కధలో ఓ కొసరు సంగతి వుంది. అది చెప్పడానికే ఇదంతా.
ఆ ప్రాజెక్టు దగ్గర ఎత్తయిన ప్రదేశంలో ఒక శక్తివంతమైన కెమెరా అమర్చారు. ప్రాజెక్టులో ఏ మూల ఏ పని జరుగుతున్నా అది ఇట్టే పట్టేస్తుంది. తాను  తీసిన చిత్రాలను ఎప్పటికప్పుడు హైదరాబాదులోని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపుతుంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఇంజినీర్లకు తగు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తుంటారు.
శంకర్ అక్కడికి వెళ్ళిన రోజు ఆ ప్రాజెక్టులో ఒక చోట  కాంక్రీటు పని అనుకున్న విధంగా జరగడం లేదని ముఖ్యమంత్రి ఆ కెమెరా ద్వారా హైదరాబాదు నుంచే గమనించారు. వెంటనే  కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు గారిని అప్రమత్తం చేసారు. ఆ అధికారి తక్షణం స్పందించి అక్కడికి వెళ్లి కాంక్రీటు పనులను దగ్గర వుండి పర్యవేక్షిస్తూ శంకర్ కాల్ ని రిసీవ్ చేసుకోలేకపోయారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అనే స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి కేసీఆర్ అహరహం ఎంతటి శ్రద్ధ చూపిస్తున్నారో తనకు బోధపడిందని శంకర్ చెప్పాడు. గోదావరి జిల్లాలకు కాటన్ దొర మాదిరిగా తెలంగాణా రైతాంగానికి కేసీఆర్ అలా గుండెల్లో నిలిచిపోతారని ఆ ప్రాజెక్ట్ చూసివచ్చిన తర్వాత శంకర్ అన్నాడు.      

1 కామెంట్‌:

Zilebi చెప్పారు...



గోదావరి జిల్లాలకు
ఆ దొర కాటన్ వలె తెలగాణ జనులకై
యీ దొర కేసీయార
య్యే!దండాలెట్టుకొనుడి ఈశుండితడే

జిలేబి