31, అక్టోబర్ 2016, సోమవారం

ఎంతచెట్టుకు అంత గాలి (కధానిక)


పది కోట్లు ఖరీదు చేసే రాజశేఖరం కారు ఎయిర్ పోర్ట్  ప్రైవేటు గేటు  దాటి టార్మాక్ మీద ఆగివున్న అతడి సొంత విమానం వద్దకు చేరుకుంది.  పైలట్  స్వయంగా వెంటబెట్టుకుని అతడ్ని లోపలకు తీసుకువెళ్ళాడు. కాసేపు తనని డిస్టర్బ్ చేయవద్దని సిబ్బందికి చెప్పి రాజశేఖరం  బెడ్ పై వాలిపోయాడు. ఆలోచనాలోచనాలకి నిద్ర ఎలా పడుతుంది.  ఒకటా రెండా! రెండే రెండు రోజుల్లో లక్షకోట్లు సిద్ధం చేయాలి? దేశదేశాల్లో విస్తరించివున్న తన వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలి పోకుండా వుండాలంటే అంత మొత్తం వెంటనే కావాలి. ఎలా అన్నదే జవాబు దొరకని ప్రశ్న.
రాజశేఖరాన్ని విమానం ఎక్కించి తిరిగివస్తున్నాడు అతడి కంపెనీ సీయీఓ బెనర్జీ. నున్నటి రోడ్డు మీద కారు మెత్తగా సాగిపోతోంది. కోటుజేబులో నుంచి తీసి చూసుకున్నాడు. కోటి రూపాయల చెక్కు. అవసరం అంటే బాసు మరో మాట అడ్డు చెప్పకుండా చెక్కు రాసి ఇచ్చాడు. అది సరే. మరో కోటి యెట్లా! వారం రోజుల్లో సర్దుబాటు చేస్తానని మాట ఇచ్చాడు. ఒక్కగానొక్క కూతురికి చక్కటి సంబంధం కుదిరింది. రెండు కోట్లు కట్నం. మరో మూడు  పెళ్లి ఖర్చులకి. పరపతి అంతా వాడితే,  మూడు కోట్లు సర్దుబాటు అయ్యాయి. మరో కోటి కావాలి. ఎల్లా అన్నదే కోటి రూపాయల ప్రశ్న.
బెనర్జీని ఇంట్లో దించి అటునుంచి అటే ఆఫీసుకు చేరుకున్నాడు అతడి పర్సనల్ అసిస్టెంట్ రామారావు. దారి మధ్యలో  బెనర్జీ ఇచ్చిన కోటి చెక్కు బ్యాంకులో డిపాజిట్ చేసాడు. తనకు అవసరం అని చెబితే ఏ కళన ఉన్నాడో మహానుభావుడు లక్ష రూపాయల కట్ట తన చేతిలో పెట్టాడు. ఆఫీసుకు వెళ్లి  కారు దిగుతుండగానే సెల్ మోగింది. చూడకుండానే అర్ధం అయిపొయింది ఆ ఫోను ఎవరు చేసారో. కుర్చీలో కూర్చుంటూ వుండగానే మరోసారి మోగింది. గతి లేక ఆన్సర్ చేసాడు.
“చూడండి రామారావు గారు, ఇప్పటికి ఆరు సార్లు డిఫాల్ట్ అయ్యారు. మంచి కంపెనీ అని మీ పర్సనల్ లోన్ విషయంలో ఇన్నాళ్ళు చూసీ చూడనట్టు ఊరుకుంటున్నాము. ఇక ఆగడం కష్టం. పైనుంచి  మాకు ప్రెషర్ పెరుగుతోంది. ఏం  చేస్తారో తెలవదు. రెండు రోజుల్లో ఆరు కిస్తీల బకాయిలు వడ్డీతో కలిపి ఒకేమాటు కట్టేయండి. ఇది ఫైనల్. వార్నింగు అనుకున్నా మేము చేయగలిగింది లేదు’        
అప్పు చేసి కొన్న కొత్త విల్లాలో గృహప్రవేశం చేసి ఏడాదికూడా కాలేదు. కొడుకూ, కోడలు ఉద్యోగాలు చేస్తున్నారన్న  భరోసాతో అంత అప్పు చేశాడు. అయితే నెల తిరగకుండానే వాళ్ళని బెంచిలో పెట్టారు. విల్లా  చాలా పెద్దది. కానీ,  అప్పు అంతకంటే  పెద్దదిగా కనబడుతోంది. బాసు ఇచ్చిన లక్ష వడ్డీకి కూడా సరిపోదు. మరి మిగిలిన పాతిక లక్షలు ఎల్లా.
ఇంటికి వస్తూనే డ్రైవర్ పరంధాములుకి లక్ష ఇచ్చి బ్యాంకులో కట్టమన్నాడు. బ్యాంకు వాళ్ళు ఒప్పుకుంటారో, లేదో! రామారావుకు మనసులో ఏదో మూల అనుమానం.
స్కూటర్ నడుపుతున్నాడే కాని పరంధాములు మనసు మనసులో లేదు. పిల్లాడు ఇంజినీరింగు మూడో ఏడు చదువుతున్నాడు. ఇంటిల్లిపాదీ కడుపు కాల్చుకుని చదివిస్తున్నారు. ఒక్క ఏడాది ఎలాగో లాక్కువస్తే వాడి జీవితం ఒడ్డున పడుతుంది. చదివి ఉద్యోగం చేసి ఇంటి కష్టాలు తీర్చాలని అతడూ శ్రద్ధగా చదువుతున్నాడు.  కానీ శ్రద్ధ ఒక్కటే సరిపోదు కదా! కాలేజీ  వాళ్లకి ఫీజు కూడా కావాలి. పదివేలు ఫీజుకట్టమని, లేకపోతే పేరు తీసేస్తామని  కాలేజీలో చెప్పి పది రోజులు అవుతోంది. అమ్మగార్ని అడిగితే ‘అయ్య ఎయిర్ పోర్ట్ కి వెళ్ళారు, వచ్చిన తరువాత అడిగి చూడు’ అన్నది. దిగాలు పడ్డ తన మొహం చూసి ఏవనుకున్నదో లోపలకు వెళ్లి ఓ ఐదువేలు తెచ్చి ఇచ్చి, మిగిలింది ఎక్కడయినా తెచ్చి  పని గడుపుకో’ అంది. బ్యాంకులో కట్టమని యజమాని ఇచ్చిన లక్ష రూపాయలు జేబులో వున్నాయి. కానీ తనకు కావాల్సింది ఐదు వేలే! అవి ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు?      
బ్యాంకులో డబ్బు కట్టి పరంధాములు ఇల్లు చేరేసరికి కధ వేరే విధంగా వుంది. పక్కింటి పిల్లాడికి  ప్రాణం మీదకు వచ్చింది. చిన్నాసుపత్రి నుంచి పెద్దాసుపత్రికి ఇలా తిప్పడంతోనే, అలా  తిరగడంతోనే ఆ పిల్లాడి తండ్రి చిక్కిపోయింది.  రోగం మాత్రం పెద్దది అయ్యింది.  'ఏవేవో పరీక్షలు జరూరుగా  చేయాలి, అయిదు వేలు కట్టమన్నారు. ఇల్లంతా వెతికినా యెర్ర ఏగానీ లేదు. చివరికి పరంధాములే వాళ్లపాలిట పరంధాముడు అయ్యాడు. అతడి పిల్లాడి ఫీజు డబ్బు ఆసుపత్రిలో ఫీజుగా మారింది.
అయిదు వేలు యెట్లా అన్న ప్రశ్న మళ్ళీ పదివేలకు రూపు మార్చుకుంది.
పిల్లాడి ఫీజు సమస్య కూడా జవాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. 

2 కామెంట్‌లు:

M KAMESWARA SARMA చెప్పారు...

ఎంత చెట్టుకు అంత గాలి
'కష్టం'స్ ఆర్ కామన్ ఫర్ ఆల్
యంకె శర్మ

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నాడో మహానుభావుడు 🙂.