3, అక్టోబర్ 2016, సోమవారం

మీడియా ఆత్మశోధన – చర్చ


(2010లో రాసిన వ్యాసం)
అంజయ్యగారు ముఖ్యమంత్రిగా  వున్నప్పుడు పత్రికలవారిపట్ల ప్రత్యేక అభిమానం ప్రదర్శించేవారనేది  బహిరంగ సత్యం.  పత్రికల యజమానులే  కాకుండా అనుదినం వార్తలు సేకరించే సాధారణ విలేకరులతో  కూడా ఆయన సంబంధాలు ఆదరణ పూర్వకంగా ఉండేవి. చక్కటి తెలంగాణా పలుకుబడితో కూడిన ఆయన మాటలు వినసొంపుగా ఉండేవి. సునిశితమయిన  హాస్యంతో  అంజయ్యగారు చేసే వ్యాఖ్యలు, విలేకరులకు వండివార్చిన 'సిద్దాన్నం' మాదిరిగా వార్తల ముడిసరుకుగా మారిపోయేవి. మరునాడు పత్రికల్లో తను చెప్పిన విషయాలను చదువుకుని 'ఇంత చక్కగా మాట్లాడానా' అని  అమాయకంగా మురిసిపోయేవారు.  ఆ రోజుల్లో తెలుగు పత్రికారంగంలోకి దూసుకువచ్చిన ఒక దినపత్రిక మాత్రం,  కొత్త  బాణీ  కనిపెట్టి అంజయ్యగారి భాషను యధాతధంగా ప్రచురించడం మొదలుపెట్టింది. అందుకు ఆయన నొచ్చుకున్న దాఖలాలు లేవు కానీ, ఆ పత్రిక తీరు ముఖ్య మంత్రి స్తాయికి తగినట్టుగా లేదని జర్నలిష్టు వర్గాలలోనే  కొందరు గుస గుసలాడుకున్న మాట నిజం.  వున్నది వున్నట్టు రాయడంతోపాటు, అన్నది అన్నట్టు రాసే పత్రికా సంప్రదాయానికి అప్పుడే బీజం పడినట్టువుంది. 

రాష్ట్ర రాజకీయ యవనికపై  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో, అప్పటివరకు వార్తలకోసం కాంగ్రెస్ పార్టీ వర్గ రాజకీయాలపై ఆధారపడిన పత్రికలకు కొత్త వనరు దొరికినట్టయింది.
ఏరోజుకారోజు  పత్రికలలో వచ్చిన వార్తలను పరిశీలించి అదే రోజు మధ్యాన్నం ఒక పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితేరెండో పార్టీ అదే రోజు సాయంత్రం పెట్టేది. ఒకరి కామెంట్లు మరొకరికి చేరవేసే బాధ్యతను అత్యుత్సాహం కలిగిన కొందరు విలేకరులు భుజానికి ఎత్తుకునేవారు. ఇందులో వారికి యేవో స్వార్ధ ప్రయోజనాలు వున్నాయని సందేహించనక్కర లేదు. వార్తకు వార్త తెగులు అన్నట్టు ఏదో కొత్త వార్త పట్టుకెళ్లాలన్నదే  వాళ్ళ ఆరాటం. దీన్ని ఆయా రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకునేవి. ఈ క్రమంలో సంబంధ అనుబంధాలు క్రమేపీ బలపడేవి. తాము చెప్పదలచుకున్న మాటలను తమనోటితో కాకుండా, తాము  బయటపడకుండా, తమ చేతికి మసి అంటకుండా పత్రికలలో ప్రచురింపచేసుకునే విధానం రూపుదిద్దుకుంది.ఒక వార్త పత్రికల్లో వచ్చేలా చేసి అదే వార్తను తామే మర్నాడు ఖండించేలా వీలుకల్పించే ఈ నూతన వొరవడి, తమ రాజకీయ ప్రత్యర్ధుల  పీచమణచడానికి కొందరికి బాగా ఉపయోగపడుతూ వచ్చింది. ఈ పరిణామ క్రమమే తదనంతరకాలంలో వార్తల స్తానంలో వార్తా కధనాల ఆవిర్భావానికి  మార్గం  వేసింది.

నూతన ఆర్ధిక సంస్కరణల అమలుతో అన్ని రంగాలలోమాదిరిగానే పత్రికారంగంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి.పత్రికల ముద్రణలో రంగు, హంగులు పెరిగిపోయాయి. పెద్ద స్తాయిలో పెట్టుబడులు ప్రవహించాయి. ప్రైవేటు టీవీ ఛానళ్ళ ప్రవేశంతో జర్నలిజం రంగానికి 'గ్లామరు' తోడయింది. సిబ్బంది జీతభత్యాలు కలలో ఊహించలేనంతగా పెరిగిపోయాయి. ఆహ్వానించదగిన ఈ పరిణామాలన్నీ పవిత్రమయిన పత్రికా రంగంలో స్వార్ధ శక్తులు  చొరబడడానికి  కొంతమేరకు తోడ్పడ్డాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల అమోఘమయిన శక్తి యుక్తులున్న ఈ రంగంపై రాజకీయుల కన్ను పడడంలో ఆశ్చర్య పడాల్సినది ఏమీ లేదు. అలాగేరాజకీయ నిర్ణయాలను తమకు  అనుకూలంగా మార్చుకోవడానికి బడా పారిశ్రామికవేత్తలు కూడా ఈ రంగాన్ని ఎంచుకోవడంలో వింతేమీ లేదు. ఈ రెండు బలవత్తర శక్తులూ మీడియాను తమ కనుసన్నల్లో ఉంచుకోవడానికి   చేస్తున్న ప్రయత్నాల  పర్యవసానంగానే నిప్పుకు చెదలంటుకున్నాయని చెప్పాలి. 

మీడియా విశ్వసనీయతపై  ఇన్నాళ్ళుగా కదలాడుతున్న నీలినీడలు  ఇటీవలి కాలంలో  కారుమబ్బులుగా మారి ఒక  పెద్ద ప్రశ్నను  మీడియా ముందుకు తెచ్చాయి. 

ఫలితంగా,  మంచికో చెడుకో  మీడియాపై  ఒక చర్చ మొదలయింది. పత్రికలంటే పన్నెత్తి మాట్లాడడానికి జంకే వాళ్ళందరూ ఈ నాడు మీడియా నీతీ నిజాయితులగురించి నిలదీస్తున్నారు. నిరాధార వార్తలను ప్రసారం చేసే టీవీ ఛానళ్ళను మూసివేయాలని నిగ్గదీస్తున్నారు. బాధ్యతతో మెలగాలనీ, నిజానిజాలను ప్రసారానికి ముందే నిర్దారించుకోవాలనీ నీతి బోధలు చేస్తున్నారు. ఒకరికి దిశానిర్దేశనం  చేయాల్సిన   మీడియా, ఒకరితో చెప్పించుకోవాల్సిన దుస్తితిలో పడిపోయింది.
వీటికి తోడు అవినీతి ఆరోపణలు, బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలూ వెలుగులోకి వచ్చి అసలే మసకబారుతున్న మీడియా విశ్వసనీయతను మరింత ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. 

అందుకేమీడియా  ఆత్మ శోధన చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇతరుల తప్పులు ఎన్నడంతో సరిపుచ్చుకోక, తమ దగ్గర  తప్పు ఎక్కడ జరుగుతున్నదోఎలా జరుగుతున్నదో  తెలుసుకుని దిద్దుబాటు చర్యలు మొదలుబెట్టుకోవాలి.  పత్రికల్లో, మీడియాలో వస్తున్న వార్తలపై, వార్తాకధనాలపై  చదువరులనుంచి, వీక్షకులనుంచి విమర్శలు, అభిప్రాయాలు స్వీకరించి సరయినవాటిపై స్పందించి  భేషజాలకు పోకుండా తగు మార్పులు చేసుకోవాలి. రేటింగులలో పోటీ తగ్గించుకుని నవ్యత్వంతో కూడిన కార్యక్రమాల రూపకల్పనలో పోటీ పెంచుకోవాలి. సొంత కట్టుబాట్లుస్వీయ నియంత్రణ ఏర్పాటు చేసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్తలో మిగిలిన అన్ని స్తంభాలు  శిధిలమవుతున్నప్పుడు  సరిదిద్దడానికి నేనున్నానంటూ మీడియా సన్నద్ధంగా నిలబడాలి. పూర్వ వైభవాన్నీవెనుకటి ఔన్నత్యాన్నీ, విలువలతో కూడిన పత్రికా సంప్రదాయాలనూ పునరుద్ధరించుకోవాలి. 
కానీఈ పోటాపోటీ కాటా కుస్తీ యుగంలో ఇది నెరవేరే కలేనా?


1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

నేతిబీరకాయలో నెయ్యి !? 🤔