23, జులై 2016, శనివారం

లయ తప్పుతోన్న ‘ప్రత్యేక’ రాగం

సూటిగా......సుతిమెత్తగా.......భండారు శ్రీనివాసరావు

ఎన్నాళ్ళో వేచిన శుక్రవారం రానూ వచ్చింది, పోనూ పోయింది. ఏమీ జరగకుండానే చక్కాపోయింది.
నడుమ మాత్రం శుక్రవారం ఏం జరుగుతుంది అనే విషయంలో మీడియాలో చర్చలు తీవ్రాతి తీవ్రంగా సాగాయి.
అందరి నోటా మాట వినబడ్డప్పుడు, గతంలో ఒకసారి శ్రీ కృష్ణ కమిషన్ నివేదిక నేపధ్యంలో, డిసెంబరు 31 తరువాత ఏం జరుగుతుంది అని ఢిల్లీలో విలేకరులు అడిగిన ప్రశ్నకు గవర్నర్ నరసింహన్ జవాబిస్తూ, ‘ఏం జరుగుతుంది, జనవరి ఒకటి వస్తుంది అని చెప్పడం గుర్తుకు వచ్చింది.
అలాగే ఇప్పుడు జరిగింది. శుక్రవారం తరువాత శనివారం వస్తుంది. అంతే. అంతకంటే ఏమీ కాదు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో శుక్రవారం రాజ్యసభలో ఏదో ఒకటి తేలబోతోంది అని కొందరు పెట్టుకున్న భ్రమలు అలాగే తేలిపోయాయి. కొత్తగా ఏర్పడ్డ ఒక రాష్ట్రానికి ఆయువుపట్టు అని అన్ని పార్టీలు ఒప్పుకున్న ప్రత్యేక ప్రతిపత్తి అనే అంశంపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లుకు ఒక ఆప్ సభ్యుడి నిర్వాకం అడ్డం తగిలి అతి ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ వ్యవహారం అడుక్కి వెళ్లిపోయింది. ఏమీ తేల్చకుండానే రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.
హరికధా భాగవతార్  హరికధతో పాటు శ్రోతల్ని ఆకట్టుకోవడానికి కొన్ని పిట్టకధలు కూడా చెబుతారు. కానీ అవి ప్రధాన కధను ఆటంక పరచకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
రాజ్యసభలో అలా జరగలేదు. ప్రైవేటు బిల్లులను శుక్రవారం నాడే చేపట్టడం చట్టసభల్లో ఆనవాయితీ. (చట్ట సభల్లో ప్రైవేటు బిల్లులు వీగిపోవడానికి అదొక కారణం అని గిట్టని వాళ్ళు చెబుతుంటారు. ఎందుకంటే వారాంతపు సెలవుల్లో, రైళ్ళూ విమానాలు పట్టుకుని   తమతమ నియోజక వర్గాలకు చేరుకునే ప్రయాణ సన్నాహాల్లో సభ్యులు వుండే  అవకాశం హెచ్చు కనుక ఆ రోజు సభల్లో హాజరు పలచగా వుంటుందని వారి అంచనా).
ఆ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి కేవీపీ ప్రతిపాదించిన బిల్లు మొన్న  శుక్రవారం నాడు ఎజెండాలో వుంది. వాయిదాలు పడుతూ వచ్చిన సభ మధ్యాన్నం రెండున్నరకు సమావేశమైనప్పుడు  ఈ బిల్లును తక్షణమే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలు కోరాయి. అదే సమయంలో అధికార  బీజేపీ సభ్యులు ఆమ్ ఆద్మీ పార్టీ లోకసభ సభ్యుడు భగవంత  మాన్ అంశాన్ని ప్రస్తావించి సభాకార్యక్రమానికి అడ్డు తగిలాయి. ఈ మాన్ మహాశయుల వ్యవహారమే ప్రధాన కధలో పిట్టకధ. అయితే  ఈ పిట్టకధ అసలు కధకు మోసం తెచ్చింది. క్యుములో నింబస్ మేఘాల మాదిరిగా కమ్ముకుని కధ పతాకస్థాయికి చేరకమునుపే దాన్ని పదిలంగా కంచికి చేర్చింది.
నిజానికి కొత్తగా పార్లమెంటుకు ఎన్నికయిన ఆమ్ ఆద్మీ సభ్యుడు భగవంత  మాన్ చేసిన నిర్వాకం కూడా క్షంతవ్యం కాదు. ఆయన పార్లమెంటు భవనం గుట్టుమట్టుల్ని తన ఫోన్ కెమెరాలో బంధించి ఆ వీడియోని సాంఘిక మాధ్యమాల్లో పోస్ట్  చేయడం పెను సంచలనం కలిగించింది. అప్పటివరకు  ఈయన ఎవరో దేశానికి తెలవదు. తరువాత దేశంలో ఈయనను  తెలియని వాళ్ళు లేరు. ఆస్థాయిలో మీడియా ప్రచారం లభించిన  ఈ వ్యవహారం, లోక్ సభ వాయిదా పడేవరకు ముదిరిపోయింది. దాని క్రీనీడలు సహజంగానే రాజ్యసభపై కూడా పడ్డాయి. ఆమ్ ఆద్మీ సభ్యుడిపై తక్షణం చర్యలు చేపట్టాలని కోరుతూ బీజేపీ సభ్యులు సభాధ్యక్షుడి స్థానాన్ని చుట్టూ ముట్టి నినాదాలు ప్రారంభించారు. పదిహేను నిమిషాల గందరగోళం తరువాత రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. పిట్టకధ ముందు అసలు హరి కధ వెనక్కి తప్పుకుంది.        
కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లు వ్యవహారం ఎలా జరగాలో అలా జరిగిందని చెప్పేవీలులేదు. కానీ ఎలా జరగాలని కోరుకున్నారో అలాగే జరిగింది. నిజానికి ఏమీ జరగలేదు కూడా. పదిహేను నిమిషాలు హడావిడి, గందరగోళం, సోమవారానికి వాయిదా పడడం, అంతే జరిగింది.
సభాప్రాంగణం తలుపులు మూయలేదు. ప్రత్యక్ష ప్రసారాలు నిలుపుచేయలేదు. కానీ సభ ఒక పద్దతిగా జరిగిందని మాత్రం చెప్పలేరు. ప్రజాస్వామ్య దేశంలో చట్ట సభలు ఎవరు అధికారంలో వున్నా అవి సాగే తీరులో మాత్రం మార్పు వుండదు.
కారణం రాజకీయం. రాజకీయుల రంగూ రుచీ మారుతుందేమో కానీ రాజకీయం రంగు మాత్రం ఎన్నటికీ వెలవదు.
మళ్ళీ బిల్లుకు మోక్షం ఎప్పుడంటే ఎవరూ చెప్పలేని పరిస్తితి. చిలక ప్రశ్న అడగాల్సిందే.
సందర్భం వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సంగతి కొంత ముచ్చటించుకోవడం అప్రస్తుతమేమీ కాదు.
రామాయణంలో ప్రధాన పాత్రలు రాముడు, రావణుడు  అయినప్పటికీ  ఆ  పురాణ గాధకు మూల కారణం దశరధ మహారాజు  కదన రంగంలో విల్లంబులు చేబూని తనకు సాయపడిన భార్య కైకేయికి ఇచ్చిన రెండు వరాలు. అవి లేకపోతే రామాయణమే లేదు. ఇచ్చిన మాటకు రాజు కట్టుబడడం వల్లా, లేదా ఆయన మాట నిలబెట్టడానికి రాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళడం వల్లా రామాయణ గాధ నేటికీ మానవులకు ఉత్కృష్టమైన నీతిని బోధించే ఇతిహాసంగా వర్ధిల్లుతోంది.
ఈ నేపధ్యం గమనంలో పెట్టుకుంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన  బాధ్యత నేటి రాజకీయులది. ఆ మాట వల్ల ప్రయోజనాలు శూన్యం అనే నమ్మకం వాటికి వున్న పక్షంలో అసలా మాట ఇవ్వనే కూడదు. ఇచ్చేముందే అన్ని విషయాలు సాకల్యంగా ఆలోచించుకుని వుండాల్సింది. అసలు సిసలు రాజకీయ నాయకుల నుంచి ప్రజలు ఆశించేది ఇదే.
లేదా బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు మరో పని కూడా చేయవచ్చు. ప్రజల్ని విశ్వాసం లోకి తీసుకుని మారిన పరిస్తితుల్లో మార్చుకున్న నిర్ణయం ఏదైనా వుంటే దాన్ని నిర్భయంగా, నిస్సంకోచంగా ప్రజల ముందు పెట్టాలి. అందుకు చట్ట సభలని మించిన వేదిక మరొకటి వుండదు.
ఇప్పటికయినా పాలకపక్షాలు ఈ విషయంలో తమ విధానాలను నిజాయితీగా స్పష్టం చేయాలి. రాజకీయ ప్రత్యర్ధులతో ఆడే క్రీడల్ని, ఎత్తులు పైఎత్తుల్ని, వ్యూహ ప్రతివ్యూహాలను  ఏదో విధంగా సరిపెట్టుకోవచ్చు, కానీ తమని నమ్మి గద్దె ఎక్కించిన ప్రజలతో దాగుడు మూతలు మాత్రం  క్షంతవ్యం కాదు. అసలు సిసలు రాజనీతిజ్ఞులు నడుచుకోవాల్సిన తీరు ఇదే.
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి అంశంలో కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకు, టీడీపీ, వై. ఎస్.ఆర్.సి.పీ. వంటి ప్రాంతీయ పార్టీలకి ప్రధాన బాధ్యత వుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, వాటిని ఒక జాబితా రూపంలో ఇస్తే ఆ వరుస క్రమంలో మొదటి రెండు స్థానాల్లో వుండాల్సినవి ప్రస్తుతం పాలక పక్షాలు అయిన బీజేపీ, టీడీపీ. ఎవరయినా ఆ తరువాతే. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోగల వెసులుబాటు వీటికి ఉన్నట్టుగా వేరే రాజకీయ పార్టీలకి లేదు.
2014 ఏప్రిల్ 20, (ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం జరిగిన తీరు)  2016 జులై  22. (ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతిపత్తి కోసం ప్రైవేటు బిల్లుకు పట్టిన గతి) ఈ రెంటినీ, ఆయా తేదీల్లో రాజ్యసభలో ఏం జరిగింది అనేదాన్ని ఆసాంతం  ఆంధ్ర ప్రజానీకం ఇళ్ళల్లో కూర్చుని టీవీల్లో చూశారు. వాళ్ళు ఒక అభిప్రాయానికి రావడానికి అవి చాలు.
శుక్రవారం రాజ్యసభలో కేవీపీ బిల్లు ఏదో సాధిస్తుందని రాజకీయాల పట్ల కనీస అవగాహన వున్నవారెవ్వరూ ఆశ పెట్టుకోలేదు. అయితే ఒక్కటి మాత్రం ఖాయం. ఫలితం రాకపోయినా, లేకపోయినా ఆయన బిల్లు రగిలించిన వేడి ఇంతా అంతా కాదు.  
కురుపాండవ యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు సంధికోసం కౌరవుల వద్దకు వెడతాడు. సంధి పొసిగే సంగతి కాదని కృష్ణుడికి ముందే తెలుసు. అంతేకాదు, యుద్ధం జరగాలని కోరుకున్నదీ ఆయనే, జరిగి తీరుతుందనీ తెలిసిందీ ఆయనకే. ఫలితం వుండదని తెలిసి చేసిన ప్రయత్నం అది. ఫలితం ఎలా వుంటుందో తెలిసి చేసిన యత్నం కూడా అది. సంధి పట్ల, యుద్ధం పట్ల సంబంధం వున్న అన్ని పక్షాల లేదా వ్యక్తుల వైఖరులు, అభిప్రాయాలు బయట పెట్టడానికి చేసిన రాజకీయం అనుకోవాలి.
ఫలితం రాకపోయినా, ఫలితం లేకపోయినా ప్రయత్నం మాత్రం వృధా కాదు. ఎవరు ఏమిటనేది అనేది, ఎవరి మనసులో ఏముందనేది జనాలకు తెలిసొచ్చేలా చేయగలిగితే ఆ ప్రయత్నం ఓ మేరకు విజయవంతం అయినట్టే. ఆ రకంగాచూస్తే ఈ బిల్లు పోషించింది నాటి భారతంలో కృష్ణుడి పాత్ర. Top of Form
ఉపశృతి:      
ఆకలి వేసిన బిడ్డ అమ్మా!అని ఒకలా అరుస్తాడు. నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా! అని ఒకలా అరుస్తాడు. ప్రతీ శబ్దానికి ఒక ప్రత్యేకమైన శృతి ఉంది, నాదం ఉంది. శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి గారి ఉవాచ.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో అన్ని పార్టీల రాగం ఒకటే అయినా ఎవరి శృతి వారిది. ఎవరి నాదం వారిది. అందుకే లయ తప్పుతోంది.
(రచయిత జంధ్యాలకు, సంగీతాభిమానులకు క్షమాపణలతో)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595


6 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడం కుదరదని అందరికీ తెలుసు అయినా డ్రామాలు ఆడుతున్నారు. పార్లమెంటులో బిల్ పాస్ చేయడం అంటూ జరిగినా అది చెల్లదు. An executive matter can't be legislated.

అజ్ఞాత చెప్పారు...

Special status issue is going to haunt Venkayya Naiduji for a long time.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Jai Gottimukkala: ఇవ్వడం కుదరదు అని తెలిసినప్పుడు అది స్పష్టంగా ఒప్పుకోవాలి. అది చెప్పుకోవడానికి పార్లమెంటును మించిన వేదిక ఏముంటుంది. ప్రైవేటు బిల్లు ద్వారా లభించిన అవకాశాన్ని ఉపయోగించుకుని వుంటే బాగుండేది. ఇంకా మభ్య పెట్టడం వల్ల, ఇతరులమీద నెపాలు మోపడం వల్ల ప్రజల్లో పలచన అయ్యే అవకాశం ఎక్కువ.

Jai Gottimukkala చెప్పారు...

@Bhandaru Srinivasrao:

"అది స్పష్టంగా ఒప్పుకోవాలి": బీజేపీ వారు స్పష్టంగా చెపుతూనే ఉన్నారు.

పార్లమెంటు లోనే ఆర్ధిక మంత్రి గారే చెప్పాలని అనుకుంటే చర్చకు (e.g. calling attention motion) నోటీస్ ఇవ్వడం ఉత్తమం. అయితే executive పరిధిలోని విషయాన్ని చట్టం ద్వారా సాధించాలని తలపెట్టడం బాలేదు.

Chaitanya చెప్పారు...

"అది స్పష్టంగా ఒప్పుకోవాలి: బీజేపీ వారు స్పష్టంగా చెపుతూనే ఉన్నారు."
Jai,

మీరు సరిగ్గా గమనించలేదు, ఒప్పుకోటానికి, చెప్పటానికి చాలా తేడా ఉంది. మీరన్నట్టు ఇది పార్లమెంట్లో చట్టం చేసినా చెల్లని విషయమే ఐతే, అది ఇప్పుడు చెప్పి తప్పుకోటం బీజేపీకి కుదరదు. ఆ విషయం తెలిసీ విభజన చట్టం రోజు, ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ఆంధ్ర ప్రజలని మభ్యపెట్టినందుకు, ఆ విషయాన్ని ఒప్పుకుని క్షమాపణ చెప్పుకోవలసి ఉంది ఆ పార్టీ.

ఐనా మీరు చెప్పే టెక్నికల్ రీజన్ అడ్డుపడితే, ప్రత్యేక హోదా అనే పేరుతో కాకపోతే మరో పేరుతో మరో దారిలో దాంట్లో సగం లాభాలు కొత్త రాష్ట్రానికి చేకూర్చినా జనం శాంతిస్తారు. ఏపీ ప్రభుత్వం అదే అడిగింది కూడా. దానికీ సిద్దంగా లేనప్పుడు మభ్యపెట్టినట్టు ఒప్పుకోటమే దారి.

లేదూ మేం చాలా ఇచ్చాం, చాలా చేసాం, రాష్ట్రప్రభుత్వం వాడేసింది అని చెప్పిన కబుర్లు ఉత్త పోసుకోలువని ఆరోజే ప్రభుత్వం చూపించింది, అవి అన్ని రాష్ట్రాలకి ఇచ్చినవేనని, ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చింది బహుతక్కువని. ఆ తర్వాత బీజేపీ దగ్గర నుంచి సౌండ్ లేదు. వాళ్ళ కబుర్లు అంత నిజమే ఐతే స్పష్టంగా లెక్కలు చెప్పి బోర విరుచుకుని తిరిగుండేవారు, టీడీపీని తగ్గించి తమ ఇమేజ్ పెంచుకుని ఉండేవాళ్ళు.

ఇప్పుడు ఏపీలో బీజేపీకి ఉన్న దారులు మూడే. ఒకటి, ప్రత్యేకహోదా ఇస్తే వచ్చే లాభాలు అవకాశాలు కొన్నైనా మరో రూపంలో ఇవ్వటం. రెండు, లేదూ మేమిస్తున్నాం రాష్ట్రపభుత్వం వాడేస్తోంది అనే రాగమే తీయదలిస్తే, రాష్ట్రప్రభుత్వాన్ని చర్చకి రప్పించి, తప్పుపట్టి, ఆ విషయాన్ని ప్రజలకి స్పష్టంగా వివరించటం. మూడు, తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ దారిపట్టడం.

Jai Gottimukkala చెప్పారు...

చైతన్య గారూ, బీజీపీయే కాదు ఎవరూ తాము తప్పు చేశామని ఒప్పుకోరు. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల దరిమిలా ప్రత్యేక ప్రతిపత్తికి అర్ధం మిగలలేదన్నది బీజీపీ ప్రస్తుత "రాగం".

రాజస్థాన్, యూపీ, బీహార్, ఝార్ఖండ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు (& కొంత మేరకు ఒరిస్సా) బీజీపీకి అత్యంత కీలకం. BJP will not commit political suicide by favoring AP over these BIMARU states (that are in a bad economic shape for decades).