14, జూన్ 2014, శనివారం

'వాదా'లు - వాదనలు


ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా   'వాదా' (ఇచ్చిన మాట)ల గురించిన చర్చలే. ఎన్నికల సమయంలో కురిపించిన వాగ్దాన వర్షాలు ఇప్పుడు గెలిచివచ్చిన పార్టీలకు 'విడువని ముసురు'లా తగులుకున్నాయి. నరంలేని నాలుకతో అవసరార్ధం ప్రకటించిన రుణ మాఫీలు ఇటు తెలంగాణాలో, అటు ఆంధ్ర ప్రదేశ్ లో అధికార పీఠం ఎక్కిన పార్టీలకు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 'షరతులు వర్తిస్తాయి' అనే తరహాలో మొదలుపెట్టి, పంట రుణాలు వేరు, వ్యవసాయ రుణాలు వేరు అంటూ  మాట మార్చడానికి చేసిన ప్రయత్నాల నుంచి వెనక్కు తగ్గాయి. నూటికి నూరు శాతం ఎన్నికల హామీని అమలుచేసి తీరుతామని మరో హామీ ఇచ్చి పరిస్తితి చేయి దాటిపోకుండా చూసుకున్నాయి.


తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ, ఈ విషయంలో పాలక పక్షాన్ని నిలదీయడంలో, నిగ్గదీయడంలో విజయం  సాధించామని చంకలు చరుచుకుంటూ సంతోషపడుతున్నప్పటికీ, మళ్ళీ తాము అధికారంలో వున్న ఆంధ్ర ప్రదేశ్ లో ఇదే విషయం తమకు గుదిబండ కాబోతున్నది అన్న విషయాన్ని మరిచిపోతున్నట్టుగా వుంది. రుణాల మాఫీ విషయంలో ఈ రెండు పార్టీల పరిస్తితి పైకి  ఒకే రకంగా కానవస్తున్నప్పటికీ, ఈ రెంటికీ సానుకూల ప్రతికూల అంశాలు కొన్ని  వున్నాయి.
ఆర్ధిక వనరుల విషయంలో తెలంగాణాకు ఆవిర్భావంతోనే కొంత వెసులుబాటు లభించింది. మిగులు బడ్జెట్ తో ఆ రాష్ట్రం  ఏర్పడింది. దీనికి తోడు రైతు రుణాల మాఫీ భారం కూడా పొరుగున వున్న ఆంధ్ర ప్రదేశ్ తో పోలిస్తే తక్కువ. విద్యుచ్చక్తి, సేద్యపునీటి సమస్యలు మినహాయిస్తే తెలంగాణా 'వడ్డించిన విస్తరి'. రాజధానితో సహా  అన్ని హంగులూ వున్నాయి. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం లేదన్న ఒక్క ప్రతికూల అంశం మినహాయిస్తే, తెలంగాణా పాలనాపగ్గాలు చేపట్టిన టీ.ఆర్.ఎస్. పార్టీ, పొరుగు రాష్ట్రంలో అధికార పీఠం ఎక్కిన తెలుగు దేశం పార్టీ పరిస్తితితో పోల్చుకున్నప్పుడు కాస్త మెరుగయిన స్తితిలోనే వుంది.
తెలుగుదేశం పార్టీకి కూడా కొన్ని అంశాలు సానుకూలంగా, మరికొన్ని ప్రతికూలంగా వున్నాయి. ఆ పార్టీకి ప్రధానంగా కలిసివచ్చిన  అంశం కేంద్రంలో అనుకూల ప్రభుత్వం వుండడం. పైపెచ్చు కేంద్ర  ప్రభుత్వంలో మంత్రి వర్గ భాగస్వామిగా వుండడం. వీటికి తోడు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి పాలనాపరంగా మంచి అనుభవం వుండడం, ఆయన దక్షత పట్ల ఆ ప్రాంత ప్రజల్లో నమ్మకం వుండడం అనేవి అనేవి  అదనపు సానుకూలతలు. కాకపొతే కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర ప్రదేశ్ ని ప్రధానంగా వేధించేది నిధుల కొరత. రుణాల మాఫీ భారం కూడా కొండంత. దీనికి తోడు 'ప్రత్యేక హోదా' విషయంలో ప్రణాళికా సంఘం పెట్టిన కొత్త మెలికతో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. అయితే,  ప్రతికూల అంశాలను సయితం తనకు అనుకూలంగా  మార్చుకోవడంలో దిట్ట అయిన చంద్రబాబు నాయుడికి ఇది అందివచ్చిన మరో సువర్ణావకాశం అనే భావించాలి. ఈ ఇబ్బందిని ఆయన తన దక్షతతో ఖచ్చితంగా అధిగమించడమే కాకుండా, మొత్తం వ్యవహారాన్ని  తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 'ప్రత్యేక హోదా'  హామీ అమలవుతే, దాని ఖ్యాతి  తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం కాంగ్రెస్  పార్టీ చేస్తుంది. ఇప్పుడు ఆ అవకాశం లేదు. నిబంధనలు మారిస్తే తప్ప ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న ప్రణాళికా సంఘం అభిప్రాయాన్ని టీడీపీ, బీజేపీలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాయి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడి జోక్యంతో ప్రణాళికా సంఘం ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా పరిశీలనలో వుందంటూ ప్రణాళికా సంఘం హడావిడిగా మరో ప్రకటన జారీ చేయడమే దీనికి నిదర్శనం. ఈ విషయలో సఫలం అయితే, కేంద్రాన్ని వొప్పించి, నిబంధనలు మార్పించి,   అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేయగలిగామని తెలుగుదేశం నాయకులు చెప్పుకోవడానికి వీలుకలుగుతుంది. రాజకీయ దక్షతలు ఇలాటి సందర్భాలలోనే బయట పడతాయి. ఈ ప్రతిభ విషయంలో చంద్రబాబు నాయుడికి సాటిరాగల నాయకులు అరుదు.                           
పోతే, తెలంగాణా విషయానికి వస్తే, రైతుల రుణ మాఫీ విషయంలో, ముందు టీ ఆర్ ఎస్ శ్రేణులు అనుభవ రాహిత్యంతో చేసిన ప్రకటనలు పార్టీని కొంత  ఇబ్బందుల్లోకి నెట్టినప్పటికీ, టీ.ఆర్.ఎస్.  నేత శ్రీ చంద్రశేఖర రావు సకాలంలో స్పందించి, తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించి పరిస్తితిని  అదుపులోకి తీసుకురాగలిగారు. తెలంగాణా అసెంబ్లీలో ఈ అంశంపై ఆయన చేసిన సుదీర్ఘ ప్రసంగంతో  రుణాల మాఫీపై నెలకొన్న అసంగ్దితతను చాలావరకు తొలగించడమే కాకుండా ఒక మేరకు స్పష్టతను ఇవ్వడంలో విజయం సాధించారనే చెప్పాలి. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన లక్ష రూపాయల రుణ మాఫీని ఖచ్చితంగా అమలుచేసి తీరుతామని అసెంబ్లీ  సాక్షిగా భరోసా ఇచ్చారు. అంతేకాదు,  'బంగారం కుదువబెట్టి రైతులు తీసుకున్న రుణాలను కూడా ప్రభుత్వమే తీరుస్తుందని స్పష్టం చేశారు.

మరో పక్క, రుణ మాఫీ హామీ అమలు గురించి అధ్యయనం చేయడానికి ఒక కమిటీ వేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన రాజకీయ ప్రత్యర్ధులకు ఒక ఆయుధాన్ని అందించినట్టు అయింది. ఆయన అదృష్టం ఏమిటంటే ఆంధ్ర ప్రదేశ్ లోని రైతాంగంలో ఎలాటి అలజడి, ఆందోళనా చోటుచేసుకోకపోవడం. ఇక్కడ మళ్ళీ ఆయన అనుభవమే బాగా అక్కరకు వచ్చినట్టుంది. టీడీఎల్పీ మొదటి సమావేశం తిరుపతిలో, ప్రమాణ స్వీకారం గుంటూరులో, మొట్టమొదటి మంత్రివర్గ సమావేశం విశాఖపట్నంలో నిర్వహించడం ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలను ఆకట్టుకోవడంలో ఆయన విజయం సాధించారు. అసలే ఆర్ధిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న కొత్త రాష్ట్రం ఇటువంటి అనవసరపు వ్యయాన్ని భరించగలదా అనే విమర్శలు మొగ్గలోనే అణగారిపోయాయి. ప్రజల దృష్టి మళ్ళించడం ద్వారా కొన్ని అంశాల తీవ్రతను తగ్గించడం, కొన్ని అంశాలకు తగిన ప్రాచుర్యం కలిగించడం ద్వారా వాటికి ప్రాధాన్యం కల్పించడం చంద్రబాబుకు వెన్నతోబెట్టిన విద్య. అదే ఆయనకు శ్రీరామ రక్ష. అయితే, మీడియా ప్రభావం అధికంగా వున్న ఈ రోజుల్లో ఈ రక్ష రేకులు అన్ని రోజులూ అక్కరకు వస్తాయని చెప్పడానికి వీలులేదు. ఈ వాస్తవం అందరికంటే ఆయనకే బాగా తెలుసు. మారిన మనిషిని అని రుజువు చేసుకోవడానికి ప్రజలిచ్చిన ఈ సువర్ణావకాశాన్ని చంద్రబాబు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిద్దాం. (14-06-2014)
NOTE: Courtesy image owner                       

1 కామెంట్‌:

Saahitya Abhimaani చెప్పారు...

ఎన్నికల్లో చేసే ఉత్తర కుమార ప్రతిజ్ఞలకు అంతులేకుండా పోతున్నది. ఒకళ్ళు ఋణ మాఫీ అంటే, మరొకల్లు ఫ్రీ లాప్ టాప్లు, వగైరా వగైరా. ఈ "వాదాలు" చేసేప్పుడు తెలియదా ఎలా నిలబెట్టుకోవాలని! ప్రజలు వెర్రి వాళ్ళలాగ వీళ్ళకి ఇవన్నీ చెయ్యటానికి డబ్బులేవీ అని ఆలోచన లేకుండా, 30శాతం వడ్డీ ఇస్తానన్నాడుకదా అని చిట్ ఫండ్ వాడికి డబ్బులు ధార పోసినట్టుగా, ఓట్లు ధారపోశేశారు. ఇప్పుడు ఇక ఆకుల కోసం వెతికి లాభం ఏమున్నది, అవ్వి దొరికినా కూడా!.

నా ఉద్దేశ్యంలో, ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఒక నిస్పక్షపాతమైన కమిటీ ఉండి, ఎలెక్షన్లు రావటానికి ఆరు నెలల ముందుగానే ప్రతి పార్టీ వాళ్ళ మానిఫెష్టో వాళ్ళకి సమర్పించాలి. ఆ మానిఫెష్టో లో ఉన్న "వాదాలు" అన్నీ కూడా ఆ పార్టీ వాళ్ళు ఎలా అమలుపరుస్తారు అని తేటతెల్లం చెయ్యాలి. అవ్వి లైవ్ టెలికాస్ట్ అయ్యి, ప్రజలు అందులో పాల్గొని, ప్రశ్నలు వేసే అవకాశం ఉండాలి. ఇది జరిగినాక, వాళ్ళ మానిఫెష్టో అమలు పరచటానికి అవకాశం ఉన్నదనిపిస్తేనే, వాళ్ళని ఆ దిక్కుమాలిన పేపర్ని ప్రజల మీదకు వదలటానికి అనుమతి ఇవ్వాలి. ఇవ్వేమీ లేకుండా నరం లేని నాలికతో మాట్లాడేవన్నీ వ్రాసేసి కాయితాలను మానిఫెష్టోలుగా జనాలమీదికి వదిలి, మేము ఇంగ్లీషులో ఇలా అన్నాము, కమిటీ వేశాము అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని బాధపడటం గత జల సేతు బంధనమే కాని మరొకటి కాదని నా అభిప్రాయం.

ఈ విషయం మీద నా బ్లాగులో కొంత కాలం క్రితం ఒక వ్యాసం వ్రాశాను, వీలైతే ఒకసారి చూడండి. అందులో ప్రముఖ కార్టూనిస్ట్ "బాబు" గారు వేసిన కార్టూన్ కూడా ఉన్నది.

http://saahitya-abhimaani.blogspot.in/2011/03/blog-post_20.html