విన్నంతలో కన్నంతలో అమెరికా
:
అమెరికాలో అమ్మ ఆబ్దీకం
శ్రావణ త్రయోదశి
మా అమ్మగారి ఆబ్దీకం. ఏటా హైదరాబాదులో జరిగే ఈ కార్యక్రమంలో ‘అమ్మలగన్నమా అమ్మను’
మనసారా స్మరించుకోవడానికి ఆమె పిల్లలతో పాటు ఆ పిల్లల పిల్లలుకూడా
కట్టగట్టుకుని వచ్చేవారు. అంతకుముందు మా
మూడో అన్నయ్య భండారు వేంకటేశ్వర రావు బతికున్న రోజుల్లో మా అమ్మానాన్నల తద్దినాలను
'వూరంతా పండగే' అన్న రీతిలో ఏళ్లతరబడి ఏటా నిర్వహిస్తూ వచ్చేవారు. మా ఇంట్లో
పెళ్ళిళ్ళు చాలా సాదా సీదాగా జరిగేవి. తద్దినాలు మాత్రం పెళ్ళి చేసినట్టు గొప్పగా
చేస్తారని చెప్పుకునే వారు.
కానీ
ఈసారి అమెరికాలో వున్నాము.
‘ఎలా?’ అనే ప్రశ్నకు సియాటిల్ లోని హిందూ టెంపుల్ పూజారి సుధీర్ ఝా రూపంలో
జవాబు లభించింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఈ హిందూ దేవాలయ సముదాయం
నిర్మాణానికి భూరివిరాళం ఇవ్వడంవల్ల దీన్ని మైక్రోసాఫ్ట్ టెంపుల్ అని పిలవడం
కద్దు. (హైదరాబాదులో ‘బిర్లా
టెంపుల్ మాదిరిగా)
ఈ
దేవాలయం విశాలమయిన ప్రాంగణంలో వుంది. ఒక ఎత్తయిన వేదిక మీద శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ గణేష్ మొదలయిన
దేవతామూర్తులను కొలువు తీర్చారు. పుష్పశోభితమయిన ఉద్యానవనం నడుమ నిర్మించిన ఈ
దేవాలయం ప్రశాంతతకు, పరిశుభ్రతతకు
నిలయంగా వుంది.
శని ఆదివారాల్లో నగరంలోని భారతీయ కుటుంబాల వాళ్ళు
ఈ మందిరాన్ని సందర్శించి పూజాదికాలు నిర్వహిస్తూ వుంటారు. గతంలో ఈ గుడిలో
దీక్షితులుగారనే తెలుగు పూజారి వుండేవారు. ఇప్పుడాయన సియాటిల్ లోనే రెడ్మండ్ అనే
ప్రాంతంలో వున్న మరో హిందూ టెంపుల్ లో పనిచేస్తున్నారు.
(తల్లీ! నీకు వందనం!)
మైక్రోసాఫ్ట్
హిందూ టెంపుల్ లో ఆబ్దీకం పెట్టుకోవడానికి యాభయి ఒక్క డాలర్లు తీసుకుని టెంపుల్
కమిటీ వాళ్ళు రసీదు ఇచ్చారు. ఆ ప్రాంగణంలోనే ఒక గదిలో మా కార్యక్రమం
పూర్తిచేసుకున్నాము. (2010)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి