పల్లెటూళ్ళకో, అడవులకో వెళ్ళినప్పుడు చూడండి.
వందేళ్ళు దాటిన చెట్లు వేల సంఖ్యలో కానవస్తాయి. కానీ నూరేళ్ళు నిండిన మనుషులు
మాత్రం నూటికో కోటికో ఒకరిద్దరు మాత్రమే కనిపిస్తారు. అంటే ఏమిటన్నమాట. మనిషికి
నూరేళ్ళ జీవితం అని రాసిపెట్టి వున్నా ఎక్కువమంది బతికేది మాత్రం ఎక్కువలో ఎక్కువ
ఎనభై తొంభయ్ ఏళ్ళే! కాబట్టి అరవై దాటగానే మొదటి బెల్లు కొట్టినట్టు అనుకోవాలి. మరో
పదిహేను ఇరవై దాటుతుంటే రెండో బెల్లు. మూడో దానికోసం ఎదురు చూడ్డం అర్ధం లేని పని.
అంటే నిరాశగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. జీవితం ఇప్పుడే ప్రారంభం అయిందనుకోవాలి.
అప్పుడే ఎలాటి బాకీ లేకుండా అనుకున్నవన్నీ చేసుకుంటూ పోవచ్చు. మొత్తం జీవితమంతా పద్దతీ
పాడూ లేకుండా గడిపేశామనుకునేవాళ్లు కూడా చక్కగా మళ్ళీ ప్లాను చేసుకుని బతకొచ్చు. ఈ
బతకడం మనకోసం అనుకోవాలి. అప్పుడే ఈ బతుకు కొనసాగింపు వల్ల ఇతరులకు ఇబ్బందులు
చాలావరకు తగ్గించిన వాళ్ళం అవుతాము.
అలాగే ‘యావలు’ తగ్గించుకోవాలి. చైనా సామెత చెప్పినట్టు
ఎన్నివేల ఎకరాల పంట భూములువున్నా, ఎన్ని క్వింటాళ్ళ ధాన్యం పండించినా నోట్లోకి
వెళ్ళేవి నాలుగు ముద్దలే. ఎన్ని అంతస్తుల భవనాలు ఎన్నెన్ని వున్నా రాత్రివేళ
నిదురించడానికి అవసరం అయ్యేది ఆరుగజాల జాగానే.
తినడానికి తగిన తిండి, అవసరం అయిన మేరకు డబ్బులు
వుంటే ఇక చింతను చెంతకు రానివ్వకూడదు. మార్చలేని విషయాలను మార్చే ప్రయత్నం
మానుకోవాలి. విషయాలను ఏమార్చే పద్దతులు మానుకుంటే అంతకు మించింది ఈ వయస్సులో మరోటి
వుండదు.
మన సంతోషం మనది. మన ఆలోచనలు మనవి. అవి యెంత
మంచివి అయితే అంత మంచిని చేస్తాయి. అంత హాయిని కలిగిస్తాయి.
చూస్తుండగానే ఒక రోజు గడిచిపోతుంది. ఆయుస్సులో ఒక
రోజు తగ్గిపోతుంది.
అదే హాయిగా ఒక రోజు గడిపామనుకోండి. ఒక రోజు ఆయువు
పెరుగుతుంది.
మనసును ప్రశాంతంగా వుంచుకుంటే కొన్ని రోగాలు కూడా మటుమాయం
అయిపోతాయని చెబుతారు. ఇందులో నిజమెంతో తెలుకోవడానికి ఎవరూ అక్కరలేదు. మీకు మీరు చాలు.
(ఇంగ్లీష్ లోకి
అనువదించిన చైనీస్ వ్యాసాన్ని ఒక మిత్రుడు మెయిల్ చేశారు. దానికిది
స్వేచ్చానువాదం. వారికి కృతజ్ఞతలు) NOTE: Courtesy Image Owner
1 కామెంట్:
Very good message
కామెంట్‌ను పోస్ట్ చేయండి