వెనుకటి గుణమేలమాను – భండారు శ్రీనివాసరావు
మునుపటి రోజుల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా తమ అధినాయకులను కలుసుకోవడానికి పడే ప్రయాస అంతా ఇంతా కాదని చెప్పుకునేవారు. ఇక అప్పటి కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీని కలవడం అంటే ముఖ్యమంత్రులకు సయితం బ్రహ్మ ప్రళయంగా వుండేది. ప్రధాని కార్యాలయం నుంచి పిలుపుకోసం ఎదురుచూస్తూ ఏ పీ భవన్లో మన ముఖ్యమంత్రులు రోజుల తరబడి ఎదురుచూస్తూ పడిగాపులు పడిన సందర్భాలు అనేకం వున్నాయి. ఇందిరాగాంధీ ఇంటర్వ్యూ ఓ పట్టాన దొరక లేదంటే ఇక ఆ ముఖ్యమంత్రికి త్వరలోనే పదవీ గండం తధ్యం అనుకునే వాళ్లు. ఈ నేపధ్యం తెలిసినవారికి ఇప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఈ విషయంలో చాలా అదృష్ట వంతులనే అభిప్రాయం కలగడంలో వింతేమీ లేదు. ముఖ్యంగా యూ పీ యే - 1 ప్రభుత్వ పాలనాకాలంలో ఈ మార్పు మరింత స్పుఠంగా కానవచ్చింది. సోనియా గాంధీ పట్ల ప్రజల్లో కొంత సానుకూల వైఖరి ప్రబలడానికి ఇది కొంత మేరకు దోహదం చేసింది. ఇందిరాగాంధీతో పోల్చి చూసుకుని సోనియాకు కొన్ని మార్కులు అదనంగా వేయడం కూడా మొదలయింది. కాంగ్రెస్ అధిష్టానం తన సహజ వైఖరి నుంచి క్రమంగా దూరం జరుగుతూ ప్రజాస్వామ్య విలువలకు కొద్ది కొద్దిగా దగ్గరవుతున్నదేమో అన్న భ్రమలు ప్రజల్లో కలగసాగాయి. యూపీయే మొదటి అయిదేళ్ళ పాలన పట్ల ప్రజల్లో అంతగా వ్యతిరేకత వ్యక్తం కాకపోవడానికి సోనియా అనుసరించిన ఈ విధానం ఓ మేరకు ఉపయోగ పడిందనే చెప్పాలి. సహజంగా మృదు స్వ భావి, మంచివాడు అని జనసామాన్యంలో మంచి పేరున్న ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తన మానాన తన పని చేసుకుపోవడానికి కూడా దీనివల్ల వీలు పడింది. మరోవైపు, సోనియా గాంధీ తన అత్తగారు ఇందిరలా పేనుపెత్తనం చేయదన్న మంచి పేరు ఆమె ఖాతాలో జమ పడింది. రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను పదేపదే మార్చడం వంటి అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలకు కాంగ్రెస్ అధిష్టానం స్వస్తి చెప్పినట్టేననన్న అభిప్రాయం ప్రజల్లో బలపడడం ప్రారంభమయింది. కీర్తిశేషులు రాజశేఖరరెడ్డి నిరాఘాటంగా మొదటి అయిదేళ్ళ పదవీ కాలాన్ని జయప్రదంగా పూర్తిచేసుకోవడానికి అప్పట్లో సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ అధిష్టానం అనుసరించిన ఈ మెతక విధానం ఆయనకు బాగా కలసివచ్చిందని అనుకునేవాళ్ళు కూడా వున్నారు. కానీ, ఖండాంతరాలకు తెలుగు ఖ్యాతిని విస్తరిస్తూ తొమ్మిదేళ్ళకు పైగా చంద్రబాబునాయుడు సాగించిన హైటెక్ పాలనకు ప్రజలు స్వస్తివాక్యం పలికేలా చేయడంలో రాజశేఖరరెడ్డి జరిపిన పాదయాత్ర, ప్రజాసమస్యలపై ఆయన చేసిన నిరంతర పోరాటాలు చాలావరకు ఉపయోగపపడ్డాయనడం వాస్తవానికి దగ్గరగా వుంటుంది.
సరే! ముఖ్యమంత్రుల హస్తిన యాత్రలు గురించి చెప్పుకోవాలంటే ఆ నాటి ముఖ్యమంత్రి రామారావు గురించి గుర్తుచేసుకోవాలి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జాతీయ స్తాయిలో రాజకీయ శక్తుల ఏకీకరణకు ఆయన చేసిన ప్రయత్నాలు ఇన్నీ అన్నీ కావు. ఎన్టీయార్ దురదృష్టం ఏమిటంటే ఆయన ముఖ్యమంత్రిగా వున్నన్ని రోజులూ
కేంద్రంలో ఆయనతో ఏమాత్రం పొసగని ఉప్పు నిప్పు లాటి కాంగ్రెస్ ఏలుబడి వుండేది. ఒక వేళ ఢిల్లీ యాత్ర పెట్టుకున్నా, అక్కడ వున్నసమయమంతా ప్రతిపక్ష పార్టీల అగ్రనాయకులను కలుసుకుని సంప్రదింపులు జరపడంలోనే గడిచిపోయేది. ప్రధానమంత్రిని కానీ, కేంద్ర మంత్రులను కానీ కలుసుకోవాల్సివచ్చినా అది కేవలం మొక్కుబడిగా సాగిపోయేది. అయితే, ఆయన ఢిల్లీ లో ఎంతటి వున్నత స్తానంలో వున్న వ్యక్తులను కలుసుకోవాలని అనుకున్నాకానీ వేచిచూడాల్సిన అవసరం ఆయనకు ఎంతమాత్రం వుండేది కాదు. ముందుగా నిర్దేశించుకున్న అప్పాయింట్ మెంట్ల ప్రకారం ఎన్టీయార్ తన ఢిల్లీ పర్యటనను అనుకున్న వ్యవధిలో, అనుకున్న పద్ధతిలో ముగించుకుని తిరిగి వచ్చేవారు.
పోతే, ఆ తరువాత ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన చంద్రబాబు నాయుడుకి మరింత చక్కని వెసులుబాటు లభించింది. ఎవరు ప్రధానిగా వున్నా, కేంద్ర ప్రభుత్వం ఆయన కనుసన్నల్లో నడిచేదే కాబట్టి ఢిల్లీలో పనులు చక్కబెట్టుకురావడం అన్నది ఆయనకు నల్లేరుపై బండి నడకలా వుండేది. ఎన్టీయార్ వొదిలివెళ్ళిన కాంగ్రెస్ వ్యతిరేక వారసత్వం పుణ్యమా అని ఢిల్లీ లోని ఏలికలందరూ చంద్రబాబు మాటకు ఎదురుచేప్పే సాహసం చేసేవారు కాదు. అందుకే దేశరాజకీయాల్లో చక్రం తిప్పగల సమర్దుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.
ఇక రాజశేఖరరెడ్డి విషయానికి వస్తే – ఆయన అధికారంలోకి వచ్చేసమయానికి ఢిల్లీ స్తాయిలో కాంగ్రెస్ అధిష్టానం తీరుతెన్నులే సమూలంగా మారిపోయాయి. రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులను తరచూ మార్చే దుష్ట సంస్కృతికి సోనియా గాంధీ మంగళం పాడారు. కాంగ్రెస్ బలానికి తన సొంత బలాన్ని జోడించి, ప్రజలను కాంగ్రెస్ దిక్కుగా మళ్లించి ఇక కాంగ్రెస్ కు రాష్ట్రం లో పుట్టగతులు లేకుండా పోయాయని అనుకుంటున్న విపత్కర తరుణంలో తెలుగు దేశాన్ని ఓడించి కాంగ్రెస్ కు మళ్ళీ పట్టం కట్టించిన వీరుడిగా అధిష్టానం మెప్పును రాజశేఖరరెడ్డి పొందగలిగారు. అందుకే మరోమాట లేకుండా పార్టీ అధినేత్రి ఆయనకు రాష్ట్ర పాలనా పగ్గాలను అందించారు. ఢిల్లీ పెద్దల అనుగ్రహం పూర్తిగా వుండడంతో రాష్ట్రంలో ప్రత్యేకించి సొంత పార్టీలో వైఎస్సార్ కు ఎదురుచెప్పేవారు లేకుండా పోయారు. కాంగ్రెస్ సంస్కృతిలో భాగమయిన అసంతృప్తి వెల్లుబికి వెల్లువెత్తకుండా నిరోధించగలిగారు. అక్కడక్కడా, అప్పుడప్పుడూ కొందరు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సన్నాయి నొక్కులు నొక్కడానికి ప్రయత్నించినప్పటికీ ఆ అసంతృప్తి సెగలు ఢిల్లీ వరకు సోకకుండా ఒక స్తాయిలోనే అణిగిపోయాయి.
రాజశేఖరరెడ్డి మొదటి అయిదేళ్ళ పాలన అధిష్టానం జోక్యం అంతగా లేకుండానే అవిచ్చిన్నంగా సాగిపోయింది. వైఎస్సార్ 2004 లో కాకుండా అంతకుముందే అవకాశం లభించి ముఖ్యమంత్రి అయివుంటే గతంలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మాదిరిగానే ఒకటి రెండేళ్లు పాలించి మాజీ ముఖ్యమంత్రుల జాబితాలో చేరిపోవాల్సి వచ్చేదని భావించేవాళ్ళున్నారు. సరయిన సమయంలో ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం వల్లనే ఆయనకు పూర్తి అయిదేళ్ల కాలం పరిపాలించగల అవకాశం చిక్కింది. గతం నుంచి గుణపాఠాలు నేర్చుకున్న కాంగ్రెస్ అధిష్టానం తన వైఖరిని ఎంతో కొంత మార్చుకోవడమే దీనికి కారణం.
రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడింది. అప్పటికే వైఎస్సార్ అధినేత్రికి చెక్ చెప్పగల స్తాయినీ, స్తోమతనూ సముపార్జించుకున్నాడన్న సమాచారాన్ని ఆయనంటే గిట్టని కొందరు ఢిల్లీకి చేరవేయడంతో వైఎస్ మరణంతో లభించిన అవకాశాన్ని తనకనుకూలంగా మార్చుకునే చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగానే మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు వుందని పరోక్షంగా ప్రకటించుకున్న వైఎస్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ని పక్కన బెట్టి రోశయ్యను ముఖ్యమంత్రి గద్దె ఎక్కించింది. అది తాత్కాలికమయిన ఏర్పాటు కావచ్చన్న భ్రమలో జగన్ వర్గం – తాను తాత్కాలిక ముఖ్యమంత్రినే అన్న భావనలో రోశయ్య వుండగానే అధిష్టానం చకచక పావులు కదిపి రాజశేఖరరెడ్డి కాలంలో రాష్ట్ర పార్టీపై తాను కోల్పోయిన పాత పెత్తనాన్ని తిరిగి తన చేతుల్లోకి తెచ్చుకునే ఎత్తుగడలకు పూనుకుంది. రోశయ్యను మార్చి ఆ స్తానంలో కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టి, మళ్ళీ వెనుకటి విధానాలకే మళ్లి పోతున్న సంకేతాలను ఇచ్చింది. దానితో, ఇక కుదిరేపనికాదనుకున్న జగన్ సొంత కుంపటి పెట్టి కడప ఉపఎన్నికల్లో చావుదెబ్బ కొట్టడంతో దిమ్మతిరిగి తెప్పరిల్లిన ఢిల్లీ మేధావులు తమ మేధస్సులకు పనిపెట్టి, పదును పెట్టి రాష్ట్ర కాంగ్రెస్ పునరుజ్జీవనానికి కాయకల్ప చికిత్స మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే, చిరంజీవి పార్టీకి మంగళం పాడించి ఆయనకు కాంగ్రెస్ తీర్ధం ఇవ్వడం, బొత్స సత్యనారాయణకు పీసీసీ పీఠం అప్పగించడం, డిప్యూటీ స్ప్పీకర్ నాదెండ్ల మనోహర్ కు స్పీకర్ గా పదోన్నతి కల్పించడం, తెలంగాణాకు చెందిన ఎస్ స్సీ కాంగ్రెస్ నాయకులు రాజనరసింహకు ఉప ముఖ్యమంత్రి పదవి, మల్లు భట్టి విక్రమార్కకు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టడం మొదలయిన చర్యలన్నీ రాకెట్ వేగంతో తీసుకున్నారు.
కానీ ఎన్ని చేసినా ఏదో ఇంకా మిగిలి పోయిందన్న గుబులే కాంగ్రెస్ ను పట్టి పీడిస్తోంది. జగన్ సమస్యకు పరిష్కారం కనుగొనగలుగుతామన్న ఆశ మినుకు మినుకుమంటూ వుండగానే తెలంగాణా అంశం పీకలమీదకు వచ్చింది. దాంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మరోమారు హస్తిన సందర్శన తప్పలేదు. ఢిల్లీలో సోనియాతో సహా అధినాయకులనందరినీ కలిసి వచ్చానన్న సంతోషం ఆయనకు ఎంతో సేపు నిలవలేదు. ఈ లోగా, తెలంగాణా కాంగ్రెస్ నాయకులందరూ హైదరాబాదులోని ఎగ్జిబిషన్ మైదానంలో సమావేశమై ఈ నెల నాలుగో తేదీన మూకుమ్మడి రాజీనామాలు ఏకంగా అసెంబ్లీ స్పీకర్ కే అందచేస్తామని మరో ఆఖరు గడువుతో పాటు ఆఖరి అస్త్రాన్ని కూడా ఒక్కుమ్మడిగా సంధించారు. ప్రత్యేక తెలంగాణా విషయంలో డిసెంబర్ తొమ్మిదో తేదీ ప్రకటనకే కేంద్రం కట్టుబడి వుండాలని, తెలంగాణా ఏర్పాటు మినహా తమకు మరేదీ సమ్మతం కాదనీ వారు తెగేసి చెప్పారు. ఈ వ్యవహారం తెగేదాకా సాగుతుందో, తెగకుండానే మరో ముడి పడుతుందో హైదరాబాద్ వచ్చివెళ్ళిన రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ కే తెలియాలి. (01-07-2011)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి