అవినీతి వ్యతిరేక పోరాటంలో రాజకీయ కోణాలు – భండారు శ్రీనివాసరావు
(30-07-2011 ‘సూర్య’ దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)
ఆగస్టు ఒకటినుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభ కానున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ సమావేశాలు ఎంత సజావుగా సాగగలవన్న దానిపై ఉజ్జాయింపుగా ఒక అంచనాకు రావడం కష్టమేమీకాదు. అయితే, ఈ సమావేశాల పుణ్యమా అని - లోక్ పాల్ ముసాయిదా బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం, కర్నాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు- అనే రెండు కీలక అంశాలపట్ల రెండు ప్రధాన రాజకీయ పార్టీలు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చింది.
రాజకీయ అవినీతికి సంబంధించిన పలు వార్తలు వివిధ కోణాలలో వెలువడుతున్న నేపధ్యంలో కేంద్ర క్యాబినెట్ గత గురువారం నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన సమావేశమై లోక్ పాల్ ముసాయిదా బిల్లును ఆమోదించింది. స్పెక్ట్రం కుంభకోణం తాలూకు కారుమేఘాలు వర్షాకాల సమావేశాలను కబళించే వాతావరణం ప్రస్పుటంగా కానవస్తున్న దృష్ట్యా, లోక్ పాల్ బిల్లుకు ఏదో ఒకవిధమయిన స్వరూపం ఇవ్వక తప్పని పరిస్తితిని- ప్రతిష్ట మసకబార్చుకున్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి ఎదుర్కుంటోంది. అందుకే కేంద్ర మంత్రివర్గం, లోక్ పాల్ బిల్లు వ్యవహారాన్ని ప్రాధాన్యతా క్రమంలో ముందుకు తీసుకురావాల్సివచ్చింది. అయినా సరే, ఈ బిల్లుకు సంబంధించి పౌరసమాజ ప్రతినిధులు చేసిన ప్రధానమయిన సూచనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టి తను అనుకున్న పద్ధతిలోనే లోక్ పాల్ బిల్లుకు తుది రూపం ఇచ్చింది. ఈ బిల్లు పరిధి నుంచి ప్రధానమంత్రినీ, న్యాయ వ్యవస్థను మినహాయించి లోక్ పాల్ వ్యవస్థకు వుండాల్సిన కోరలు తొలగించారు. ప్రధాని పదవిని కూడా బిల్లు పరిధిలోకి తీసుకురావాలని మన్మోహన్ సింగ్ మొన్నటి క్యాబినెట్ సమావేశంలో పట్టుబట్టినప్పటికీ మంత్రివర్గంలోని ఇతర సభ్యులు అందుకు ససేమిరా అంగీకరించలేదన్న స్క్రోలింగులు ఈ వార్తతో పాటే టీవీ తెరలపై దర్శనమివ్వడం విశేషం. ముసాయిదా బిల్లు తనకు అసంతృప్తి కలిగించిందనీ, మళ్ళీ ఆగస్టు 16 నుంచి దీక్ష ప్రారంభిస్తాననీ అన్నాహజారే వ్యాఖ్యానించడాన్నిబట్టి చూస్తే ఇది పార్లమెంటులో బతికి బట్టగట్టి చట్టరూపం తీసుకుంటుందన్న ఆశలు నీరుగారిపోతున్నాయి.
యూ.పీ.యే. సర్కారుపై వస్తున్న అవినీతి ఆరోపణలు, వెలుగుచూస్తున్న కుంభకోణాలపై ప్రభుత్వ పక్షాన్ని ఇరుకున పెట్టడానికి ప్రధాన ప్రతిపక్షం బీ జే పీ వ్యూహరచన చేస్తూ వుండడంతో లోక్ పాల్ బిల్లును పార్ల మెంటులో ప్రవేశ పెట్టి అవినీతి నిర్మూలనలో తనకూ చిత్తశుద్ధి వుందని నిరూపించుకోవడం కోసమే ఈ ముసాయిదాను కేంద్ర మంత్రివర్గం ఆమోదించి వుంటుంది.
పోతే, బీ.జే.పీ. పరిస్తితి మరింత విడ్డూరం.
స్పెక్ట్రం కుంభకోణం దర్యాప్తులోను, తదుపరి విచారణ లోను వెల్లడవుతున్నసంచలనాత్మక సమాచారాన్ని పదునయిన అస్త్ర శస్త్రాలుగా సమకూర్చుకుని పార్ల మెంటు వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీపై ముప్పేట దాడి చేసి దానిని ప్రధమ ముద్దాయిగా నిలబెట్టి రాజకీయ లభ్దిపొందాలని పధకాలు సిద్ధం చేసుకుంటున్న ఆ పార్టీ అధిష్టానానికి కర్నాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం తెచ్చిపెట్టిన తలనొప్పి అంతా ఇంతా కాదు. ఏ అవినీతిపై గళం విప్పి, కదను తొక్కి పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ ను ఓ పట్టు పట్టాలని అనుకున్నదో అదే అవినీతి భాగోతం కర్నాటక లోకాయుక్త రూపంలో బీ.జే.పీ. గొంతులో పచ్చి వెలక్కాయగా మారింది. దానితో, ఇష్టం వున్నా లేకున్నా యడ్యూరప్పను ముఖ్య మంత్రి పదవినుంచి తొలగించాల్సిన అనివార్య పరిస్తితి ఆ పార్టీకి ఎదురయింది. గతంలో, ఈ మాదిరి రాజకీయ సంక్షోభాలు, పదవీ గండాలు యడ్యూరప్పకు కొత్తేమీ కాదు. 2008 మార్చి మాసంలో కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచి, రాజకీయ పరమపద సోపాన పఠంలో యడ్యూరప్ప పలు పర్యాయాలు పెద్దపాము నోటబడి అట్టడుగుగుకు దిగజారే ప్రమాదం అనేకమార్లు ఆయనకు ఎదురయింది. అయినా తప్పించుకుని పీఠానికి అంటిపెట్టుకునే వుండగలిగారు. కానీ, ఈసారి పరిస్తితి పూర్తిగా మారిపోయి ఆయన మాజీ సీ యెం కాక తప్పని పరిస్తితి ఏర్పడింది. వర్షాకాల సమావేశాల్లో బీ.జే.పీ. అనుసరించదలచిన వ్యూహమే ఇప్పడు యడ్యూరప్పకు అడ్డుగోడగా తయారయింది. పార్ల మెంటులో కాంగ్రెస్ పార్టీని కడిగి గాలించాలంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యడ్యూరప్పను వొదిలించుకోక తప్పదు. ఆ క్రమంలోనే బీ.జే.పీ. అధిష్టానం ముఖ్యమంత్రి మార్పుకు పచ్చ జెండా వూపాల్సివచ్చింది.
ఇక, కేంద్రంలో కాంగ్రెస్ పరిస్తితి నానాటికి తీసికట్టు అన్న సామెత చందంగా తయారవుతోంది. యూ.పీ.ఏ. ప్రభుత్వం మొదటి దఫా పదవీకాలం అయిదేళ్ళలో సంపాదించుకున్న ఘనకీర్తి యావత్తూ రెండో మారు అధికారంలోకి వచ్చిన అచిర కాలంలోనే ఆవిరయిపోయింది. ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యక్తిగత నిజాయితీ, నిస్వార్ధ వ్యక్తిత్వం సయితం యూ.పీ.ఏ. సర్కారుపై వెల్లువెత్తిన కుంభకోణాల మాటున మసకబారిపోయాయి. ఆయన మంత్రివర్గంలో కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖను నిర్వహించిన రాజా స్పెక్ట్రం కుంభకోణం విచారణ సందర్భంగా వెల్లడించిన విషయాలు మన్మోహన్ సింగ్ గురించి ప్రజలు వేరే విధంగా ఆలోచించే పరిస్తితిని కల్పించాయి. మరో మూడేళ్లలోపు రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి పీఠం పై కూర్చోబెట్టాలనే లక్ష్యసాధన దిశగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ అధినాయకత్వం- తమది పరిశుద్ధ ప్రభుత్వమని నిరూపించుకునే క్రమంలో తన భాగస్వామ్య పక్షం డీ.ఏం.కే. నాయకులనే అవినీతి కేసుల్లో ఇరికించి జైలుకు పంపి ప్రజలనుంచి మంచి మార్కులు రాబట్టాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇప్పుడు కోర్టు సమక్షంలో రాజా చేస్తున్న తీవ్రమయిన ఆరోపణలు సాధారణ రాజకీయ ఎత్తుగడల్లో భాగమని జనం నమ్మేలా చేయడానికి మన్మోహన్ సింగ్ ఎంతో శ్రమించాల్సివుంటుంది. డ్రగ్స్ వాడకం వంటి కేసుల్లో పట్టుబడిన వ్యక్తులు వెల్లడించే పేర్లు ఆధారంగా చర్యలు తీసుకోవడానికి ఉబలాటపడే అధికార యంత్రాంగానికి సదా ఉపయోగపడే ‘చట్టం’ – ప్రధాని మన్మోహన్ సింగ్, ఇప్పటి హోం మంత్రి, ఒకప్పటి ఆర్ధిక మంత్రి అయిన చిదంబరం గురించి న్యాయస్తానంలో మాజీ కేంద్ర మంత్రి రాజా బాహాటంగా చేసిన ప్రస్తావనల పట్ల కూడా అదేవిధంగా ‘తన పని తాను చేసుకుపోతుంది’ అనే నమ్మకం జనంలో కలిగించగలిగితే అంతకన్నా ఆహ్వానించాల్సిన అంశం మరొకటి వుండదు. కానీ, ఒకరిపట్ల ఒకరకంగా, మరొకరిపట్ల మరోరకంగా అవసరాన్నిబట్టి చట్టాల అన్వయం మారిపోతూ వుండడమే మన వ్యవస్థ లోని విషాదం. అందుకే చట్టాల పట్ల సామాన్యుడికి విశ్వాసం సన్నగిల్లుతోంది. అవినీతిపై ఆయా రాజకీయ పార్టీలు ఎక్కుబెట్టే బాణాలన్నిటి వెనుకా పైకి కనబడని రాజకీయ లక్ష్యాలు, ఉద్దేశ్యాలు ఏవో దాగున్నాయని ప్రజలు నమ్మే పరిస్తితి దాపురిస్తోంది.
మొన్నటికి మొన్న అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమం పట్ల భారత ప్రజానీకం ముఖ్యంగా యువత స్పందించిన తీరు గమనించిన వారికి దేశ భవిష్యత్తు గురించి కొత్త ఆశలు రెక్కలు తొడిగాయి. కల్మాడీ, కనిమొళి, రాజాల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతున్న విషయాలు గమనించిన తరువాత ఈ ఆశలు మరింత ముప్పిరిగొన్నాయి. ఇటీవలి కాలంలో రాజకీయ అవినీతి కేసుల విషయంలో న్యాయస్తానాలు స్పందిస్తున్న తీరు సయితం హర్షనీయం.
అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత చందంగా రాజకీయ అవినీతి గురించి జరిగిన దర్యాప్తులు, అవి నిగ్గు దేల్చిన నిజాలు కాలగర్భంలో కలసిపోతున్నాయి. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇన్ని సంవత్సరాల కాలంలో అవినీతి, లంచగొండితనం ఆరోపణలు రుజువై శిక్ష పడ్డ రాజకీయ ప్రముఖులు కలికానికి కూడా కానరారు. నేరానికి తగిన శిక్ష తధ్యం అన్న భయం వున్నప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుంది. నేర ప్రవృత్తి సయితం తగ్గుముఖం పడుతుంది.
మనకంటే చిన్న దేశాల్లో కూడా లంచగొండి రాజకీయనాయకులు చట్టం నుంచి తప్పించుకోలేక జైల్లో మగ్గుతున్న సందర్భాలు వున్నాయి. ఉదాహరణకు 1997-2002 నడుమ నికరాగువా అధ్యక్షుడిగా పనిచేసిన ఆర్నాల్డోపై తీవ్రమయిన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిని గురించి విచారించిన ఆ దేశపు సుప్రీం కోర్టు ఆర్నాల్దో కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే, గతంలో యుగోస్లావియా అధ్యక్షుడిగా పనిచేసి కోట్లాది డాలర్ల ప్రజాధనాన్ని స్వాహా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కున్న మిలోసెవిక్ ప్రస్తుతం జైలు వూచలు లెక్కబెడుతున్నాడు. 1990 – 2000 మధ్య పెరు ప్రెసిడెంటుగా వున్న ఫ్యుజిమోరి తన పదవీకాలంలో దేశంలో టెర్రరిజాన్ని పూర్తిగా మట్టుబెట్టగలిగాడు. కానీ, సంపూర్ణ అధికారం అతడిని ఒక టెర్రరిస్టుకన్నా ప్రమాదకారిగా మార్చింది. ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు కొల్లగొట్టాడు. దానితో విసిగిపోయిన ప్రజలు తిరగబడి అతడిని గద్దె దించారు. ఫ్యుజిమోరి దేశం విడిచిపెట్టి పారిపోయినా అతడిని పట్టుకుని పెరు తీసుకువచ్చి జైల్లో పెట్టారు.
చట్టం అందరిపట్లా ఒకే రకంగా వ్యవహరించినప్పుడే ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అనే వాక్యానికి అర్ధం వుంటుంది. లేని పక్షంలో అది ఒక పనికిరాని వూతపదంగా మిగిలిపోతుంది. (28-07-2011)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి