rahul gandhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
rahul gandhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఫిబ్రవరి 2019, సోమవారం

అపుడు ఔనంటే ఇపుడు కాదనిలే! ఇపుడు ఔనంటే అపుడు కాదనిలే!



ఒక కేసు విషయంలో కోల్ కతా పోలీసు కమీషనర్ ను విచారించడానికి సీబీఐ అధికారుల బృందం వెళ్ళింది. స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటిన అక్కడికి వెళ్ళారు. ప్రధానమంత్రి మోడీ, సీబీఐని అడ్డుపెట్టుకుని తమ ప్రభుత్వంలో పనిచేసే అధికారులను వేధిస్తున్నారని ధర్నాకు దిగారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయుడుతో సహా దేశవ్యాప్తంగా అనేకమంది బీజేపీ వ్యతిరేకులు కోల్ కతా దీదీకి సంఘీభావం తెలిపారు.
ఓ పదేళ్ళు వెనక్కి వెడదాం.
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినప్పుడు అహమ్మదాబాదులో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న మోడీ ఏమన్నారో చూడండి.
‘సీబీఐ అంటే ఏమిటో తెలుసునా ! కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ సీబీఐ తమ ఢిల్లీ బాసులను మెప్పించడం కోసం మా ప్రభుత్వాన్ని వేధిస్తున్నారు. మా మంత్రులను, అధికారులను టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈ అధికారులు ఒక విషయం మరచిపోవద్దు. ఏదో ఒకరోజున మీరు జవాబు చెప్పుకోవాల్సివస్తుంది సుమా!’
మళ్ళీ ఓసారి ఆరేళ్ళు వెనక్కి వెడదాం!
2013. సుప్రీం కోర్టు. కోర్టు హాలు సూదిపడితే వినబడేంత నిశ్శబ్దంగా వుంది.
జస్టిస్ ఆర్. ఎం. లోధా  గొంతు పెంచి తీవ్ర స్వరంతో అన్నారు.
‘సీబీఐ. ప్రభుత్వ పంజరంలోని చిలుక’
కోర్టు హాలులో వున్నవాళ్ళందరూ నివ్వెర పోయారు న్యాయమూర్తి చేసిన ఈ బహిరంగ వ్యాఖ్యతో.
అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు కేటాయింపులలో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి  సీబీఐని ఓ పావులా వాడుకుంటోందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు, సుప్రీం న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యతో మంచి  ఊతం చిక్కినట్టయింది. ‘కోల్ గేట్’ కుంభకోణంగా మీడియా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన  సంగతి తెలిసిందే.
రెండేళ్ళ క్రితం సీబీఐ గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఏమన్నారో చూద్దాం.
ఉత్తర ప్రదేశ్ లోని సిధౌలిలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఇలా చెప్పారు. ‘సమాజ్ వాది, బిఎస్ పిలను అదుపు చేయడానికి, తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ఒక తాళం చెవి వుంది. దాని పేరే  సీబీఐ’.  

6, జూన్ 2013, గురువారం

చిన్నసార్లు వస్తున్నారు – భండారు శ్రీనివాసరావు


దేశంలో అతిపెద్ద రాష్ట్రం  అయిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అతిపిన్న వయస్కుడయిన అఖిలేష్ యాదవ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన దరిమిలా తలలు పండిన రాజకీయ నాయకుల్లో చిన్న కదలిక మొదలయింది.  రేపో మాపో తమ రాజకీయ వారసులను తెర మీదకు తీసుకు రావాలని పధకాలు రచిస్తున్న రాజకీయ పితాశ్రీలందరూ  ఆ పని ఇంకా ఎంతమాత్రం ఆలశ్యం చేయకుండా వెనువెంటనే ఆచరణలోకి తీసుకురావాలని తొందర పడుతున్నారు. ఈ  విషయంలో  మాత్రం అన్ని పార్టీల నాయకులదీ, ప్రత్యేకించి అవకాశం వున్న నాయకులందరిదీ ఒకే తీరు.
అఖిల భారత స్తాయిలో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ రాజకీయ రంగ ప్రవేశం అంతగా కలిసి రాకపోయినా ఆ పార్టీకి అంతకంటే ప్రత్యామ్నాయం లేదు. భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చూడడం ఒక్కటే ఆ పార్టీ శ్రేణుల లక్ష్యం. రాహుల్ గాంధీకి ఆ నాయకత్వ లక్షణాలు, ప్రతిభా పాటవాలు వున్నాయా లేదా అన్న దానితో వారికి నిమిత్తంలేదు. ఆ పార్టీకి చెందిన అధి నాయకులు, ముఖ్యమంత్రుల నుంచి అట్టడుగు నాయకులవరకు ఇదే వరస. ఎవరిని కదిలించినా ఇదే మాట చెబుతారు. ఇటీవల జరిగిన యూ పీ ఎన్నికల్లో మొత్తం బాధ్యతను రాహుల్  ఒంటి భుజం మీదకు ఎత్తుకుని వొంటరిగా  పాటుపడ్డా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకలేదు. ఇదే వేరొకరయితే అతగాడి రాజకీయ భవితవ్యం పార్టీలో ప్రశ్నార్ధకంగా మారివుండేది. అధినేత్రి కుమారుడు కాబట్టి పరాజయ కారణాలకు అతడిని బాధ్యుడుడిని చేయలేదు. అందుకే ఇంకా ఆయన్ని భావి భారత ప్రధాని అభ్యర్ధుల జాబితానుంచి తొలగించలేదు.
అప్పుడప్పుడు, అడపాదడపా ప్రియాంకా గాంధీ పేరు నలుగుతున్నప్పటికీ, రాహుల్ మాత్రమే ఇప్పటికీ దారీ తెన్నూ లేని కాంగ్రెస్ పార్టీకి దారి చూపే  చుక్కాని. ప్రధాని అభ్యర్ధిగా పార్టీ శ్రేణులు రాహుల్ భజన చేస్తున్నప్పటికీ జనం ఆమోదం లభించడానికి మాత్రం మరో ఏడాది  వేచివుండక తప్పదు, గత్యంతరం లేక మధ్యంతరం ముంచుకు వస్తే తప్ప.
మరో జాతీయ పార్టీ బీజేపీకి ఈ ‘యువరక్తం’ గొడవలేదు. అక్కడి అగ్రనాయకులందరూ కురు వృద్ధులే. మోడీ పేరు మీడియాలో మోగుతున్నప్పటికీ, వయస్సు రీత్యా ఆయనంత కుర్రకారేమీకాదు. నడికారు దాటినవాడే.
ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే, యువతరం నాయకుడిగా జగన్ జనంలోకి దూసుకు పోతున్నాడు. ఆయన్ని ఎదుర్కునే రాజకీయ పార్టీలన్నీ గతంలో  చేసిన, లేదా ప్రస్తుతం  చేస్తున్న వ్యూహాత్మక తప్పిదాలే జగన్ పట్ల శ్రీరామరక్షగా మారుతూ వున్నాయి. పాతతరం నాయకులెవరికీ ఎన్నికల సమరంలో ఆయన్ని  ఎదిరించి నిలవగల సత్తా లేదని ఇటీవలి  గత చరిత్రే చెబుతోంది. వ్యక్తిగతంగా అన్ని మరకలు అంటి కూడా, అవినీతి ఆరోపణల్లో కూరుకుని పోయి కూడా, జైల్లో కాలుపెట్టి  సంవత్సర కాలం  దాటిపోతున్నా కూడా అన్ని పార్టీల్లో వున్న దిగువ స్థాయి కార్యకర్తల చూపు వై.ఎస్.ఆర్. పార్టీ వైపు వుండడం ఆయా పార్టీల అధినాయకులకు మింగుడు పడడం లేదు. వున్న పార్టీల్లో పొసగలేక, బయటకు పోయేదారిగా భావించి పోయేవాళ్ళేకానీ అలాటివారివల్ల తమ పార్టీలకు వచ్చే నష్టం ఏముండదు అని పైకి సర్ది చెప్పుకుంటున్నా లోలోపల ఎవరి భయాలు వారికి వున్నాయి. అందుకే ‘యువ రక్తం’ పేరుతొ కొత్త నాయకులను పార్టీలోకి తీసుకువస్తే  ఎన్నికల  ముహూర్తం నాటికయినా పరిస్తితి  కొంతలో కొంతయినా మారక పోతుందా అన్నది వారి ఆశ. ముఖ్యంగా ఎలాటి మచ్చా లేని, అవినీతి ఆరోపణల మరకలు అంటని విద్యాధిక యువకుడు రంగప్రవేశం చేస్తే జగన్ పార్టీని కట్టడి చేయడం సాధ్యమని భావించేవాళ్ళు కూడా లేకపోలేదు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఈ ఆవశ్యకత హెచ్చుగావున్నట్టు తోస్తోంది. ఎందుకంటే టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీ రెండు పర్యాయాలకంటే ఎక్కువ కాలం అధికార పీఠానికి దూరంగా వుండడం అంటే చాలా ఇబ్బంది. కాంగ్రెస్ పరిస్తితి వేరు. జాతీయ పార్టీ కాబట్టి, రాష్ట్ర స్థాయి నాయకులు కొంతకాలం అధికారానికి దూరంగా వున్నా ఏదోవిధంగా ఓపిక పట్టగల స్తితిలో వుంటారు. మళ్ళీ అధికారానికి వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే భరోసా వారిలో పుష్కలం. ఎదుటివారి  వైఫల్యాలే వారికి  రక్షరేకు.  ప్రత్యామ్నాయం లేక  ప్రజలే  తమకు ఎప్పుడో ఒకప్పుడు ప్రభుత్వ పగ్గాలు అప్పగించక పోతారా అన్నది వారి మరో ధీమా.
కానీ టీడీపీ పరిస్తితి ఇందుకు విభిన్నం. గత ఎన్నికల్లో గెలుపు వూరించి వూరించి, కూతవేటు దూరంలో కనిపించిన అధికారం చేజారి పోయి మరో ‘చేతి’కి చిక్కిన విషయాన్ని తలచుకుని  టీడీపీ నేతలు ఇప్పటికీ చింతిల్లుతూ వుండడం చూస్తున్నాం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అరంగేట్రం చేయడం వల్లనే మహాకూటమి మహా ఓటమి పాలయిందని లెక్కలు చెబుతుంటారు. ఇది ఒక రకంగా నిజం. కానీ, ప్రజాస్వామ్యంలో అంతా అంకెల మహత్యమే. ఒంటి చేత్తో లెక్కించగల అతికొద్ది వోట్ల తేడా వచ్చినా గెలుపు గెలుపే.
అందుకే, చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఒక కొత్త కార్డు కావాలి. టీడీపీ కంటే కూడా ఆయనకే వ్యక్తిగతంగా ఈ అవసరం ఎక్కువ. ఎన్టీ రామారావు గారు  తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు ‘ఆంధ్రులు – ఆత్మగౌరవం’ నినాదంతో పాటు నెహ్రూ  కుటుంబం వారసత్వ రాజకీయాలను  ఎండగడుతూ చేసిన విమర్శలు కూడా  జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పార్టీ స్తాపించిన తొమ్మిది నెలలల్లోనే  అధికార అందలం ఎక్కడానికి  ఎన్టీయార్  అనుసరించిన ఆ విధానం బాగా  దోహదపడింది. మరి ఇప్పుడు అదే పార్టీ  వారసత్వరాజకీయ  విధానాలను అనుసరిస్తే ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారన్నది బాబు  గుంజాటన. దీనికి తోడు పైకి వొప్పుకున్నా వొప్పుకోకపోయినా నందమూరి, నారా కుటుంబాల నడుమ చాపకింది నీరులా పాకుతున్న  వారసత్వ ‘రాజకీయాలు’ కూడా టీడీపీ అధినేత, తన కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం విషయంలో మీనమేషాలు లెక్కించడానికి కారణమనే వారు కూడా వున్నారు.
ఏమయితేనేం, కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్టు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్, ఎట్టకేలకు  ‘మంచు గడ్డను’ బద్దలు కొట్టారు. తాను టీడీపీ లో ‘కార్యకర్తగా’ పనిచేయబోతున్నట్టు ప్రకటించి ఆయన రాజకీయ అరంగేట్రం విషయంలో అలముకునివున్న అనుమానాలన్నింటినీ  ఆయనే పటాపంచలు చేశారు.        
పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగానే  పనిచేస్తానని ఓ పక్క చెప్పుకుంటూనే, యువతకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంటూ పార్టీలో తాను నిర్వహించబోయే పాత్ర ప్రాముఖ్యాన్ని చెప్పకనే లోకేష్  చెప్పారు.
అనేక అనూహ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ, భవిష్యత్తు పట్ల ఆందోళనతో వున్న టీడీపీ శ్రేణులకు   ఎంతో ఉత్సాహం, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి మరెంతో  వూరట కలిగించే విషయమే ఇది.  పార్టీ ప్రతిష్ట వేగంగా కొడిగడుతున్న తరుణంలో చంద్రబాబు ఇటీవల స్వయంగా పూనుకుని పునరుజ్జీవ చర్యలు చేపట్టారు. బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ,  తెలంగాణా పై కేంద్రానికి  మరో లేఖ ఇవ్వడం వంటి పలు కీలక నిర్ణయాలతో పాటు రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా   ‘పాదయాత్ర’ చేసి పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురింప చేశారు. దరిమిలా మార్పుచెందుతున్న రాజకీయ పరిణామాల  నేపధ్యంలో – లోకేష్ వంటి యువకుడి దన్ను వుంటే లభించే ప్రయోజనాన్ని  ఆయన అంచనా వేయకుండా వుండరు. వేయరని,  బాబు గురించి బాగా  తెలిసిన వారెవ్వరూ అనుకోరు.

అందుకే రానున్న ఎన్నికలకల్లా అన్ని పార్టీల్లో ‘చిన్నసార్లే’ కానవస్తారు.                                   

11, ఏప్రిల్ 2013, గురువారం

రాహుల్ గాంధీని గుర్తు పట్టడం యెలా?



గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ శ్రేణులు చెప్పేమాటల్లో  ఒక నిజం లేకపోలేదు.
రాహుల్  గాంధీకి భేషజాలు లేవు. అందుకే ఓ రోజు సాధారణ పౌరుడి మాదిరిగానే  చెక్కు మార్చుకోవడానికి బ్యాంకులోకి వెళ్ళి క్యాషియర్ కు ఇచ్చాడు.
క్యాషియర్ చిరునవ్వుతో పలకరించి –‘దయచేసి మీ గుర్తింపు కార్డు చూపిస్తారా?’ అని అడిగాడు.
ముందు కంగుతిన్నా త్వరలోనే తేరుకుని ‘నిజం చెప్పాలంటే నా ఐ.డీ.కార్డు ఇంట్లో మరచిపోయివచ్చాను. అది తప్పనిసరి అని నాకూ తెలుసు. కానీ మనలో మాట. నా పేరు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిని. దేవుడు మేలు చేస్తే ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా బాగా వున్నాయంటున్నారు. ఈ పరిచయం చాలనుకుంటాను’ అన్నాడు మర్యాదగా.
బ్యాంకు ఉద్యోగి కూడా అంతే మర్యాదగా జవాబిచ్చాడు.
‘నాకా విషయం తెలుసు సార్. కానీ ఈ మధ్య ప్రభుత్వమే బ్యాంకుల పనితీరుకు సంబంధించి ఎన్నో నియమాలు నిబంధనలు ఏర్పాటుచేసింది. మీకు తెలియనిది కాదుకదా. పైగా రహస్య పర్యవేక్షణ కూడా అమలవుతోంది. కాబట్టి మీరు ఏదో విధమైన గుర్తింపు రుజువు చేసుకుంటేనే తప్ప నేనేమీ సాయం చేయలేను. మన్నించండి.’ అన్నాడు.
‘పోనీ బ్యాంకులో వున్నవారినెవరినయినా అడిగిచూడండి. అందరికీ తెలిసేవుండాలి నేనెవరన్నది”
“నేను కాదనడంలేదు సార్ కానీ రూల్స్ అలావున్నాయి. నన్నేమి చేయమంటారు మీరే చెప్పండి”
“రూల్స్ సంగతి నాకూ తెలుసు. దయచేసి ఈ పని చేసిపెట్టండి”
“సార్ నన్నో మాట చెప్పమంటారా? ఒక రోజు ఇలాగే మా బ్యాంకుకు సచిన్  టెండూల్కర్ వచ్చాడు. అతడూ మీ లాగే ఐ.డీ. ప్రూఫ్ లేకుండా చెక్కుపట్టుకు వచ్చి క్యాష్ కావాలన్నాడు. రుజువు అడిగితే చేతిసంచీలోనుంచి బ్యాటు బంతి తీసి, బ్యాంకులోనే ఓ షాట్ కొట్టి చూపించాడు. దాంతో అతడే సచిన్ అని నిర్ధారించుకుని చెక్కు పాస్ చేసి పంపించాము. అలాగే మరోసారి సినిమా నటుడు బాలకృష్ణ వచ్చాడు. ఐడీ అడిగితే అర్ధం కాని  డైలాగ్ ఏదో  చెప్పాడు. దాంతో అతడే బాలకృష్ణ అని మేము అర్ధం చేసుకుని పనిపూర్తిచేసి వెంటనే పంపించేసాము. ఆవిధంగానే భావిభారత ప్రధాని రాహుల్  గాంధీ మీరే అని నమ్మేలా ఏదయినా రుజువు చూపించారనుకోండి. మీ పని చిటికెలో చేసి పంపిస్తాం”
రాహుల్ గాంధీ కాసేపు ఆలోచించాడు. మరికాసేపు తల గోక్కున్నాడు. ఇంకొంతసేపు జుట్టు పీక్కున్నాడు.
చివరకు ఇలా అన్నాడు.
“నిజాయితీగా చెబుతున్నాను. యెంత ఆలోచించినా నా బుర్రకు ఏమీ తట్టడం లేదు. నా మెదడు బ్లాంకుగా తయారయింది. ఏం చెప్పాలో, ఏం చెయ్యాలో తల యెంత తడుముకున్నా తట్టిచావడం లేదు”
క్యాషియర్ ఏమాత్రం సమయం వృధా చేయకుండా రాహుల్ ఇచ్చిన చెక్కు తీసుకుని తక్షణం దానికి తగ్గ నగదు లెక్కబెట్టి రాహుల్ చేతికి ఇస్తూ అన్నాడు.
“సందేహం లేదు. మీరే రాహుల్ గాంధీ. డబ్బు తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి.”  
(నెట్లో సంచరిస్తున్న ఓ టిట్ బిట్ కి స్వేచ్చానువాదం – ఇమేజ్ ఓనర్ కి ధన్యవాదాలు)