Narendra Modi. నరేంద్ర మోదీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Narendra Modi. నరేంద్ర మోదీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, నవంబర్ 2015, బుధవారం

భార్య (చెప్పిన) రహస్యం


ప్రధమ కబళే మక్షికాపాతః
అంటే మొదటి ముద్దలోనే ఈగ పడింది అని అర్ధం.
ఈ శీర్షికలో ముందు బ్రాకెట్లో రాసిన పదం ‘చెప్పిన’ అని లేదు. రాసిన తరువాత చూసుకుంటే, చూడ్డం మంచిదయింది, లేకపోతే పుట్టి పూర్తిగా మునిగేది. ఆ విధంగా కలిగిన జ్ఞానోదయంతో  తెలివినపడిన వాడినై,  అర్జంటుగా ముందో  బ్రాకెట్టు పెట్టి అందులో ‘చెప్పిన’ అనే పదాన్ని యమర్జెంటుగా కూరిపెట్టి, ‘భార్య రహస్యం’ ఏవిటి?  అనే దిక్కుమాలిన అనుమానాలు తలెత్తి సంసారపు పుట్టి నిండామునగకుండా నిండుదా  జాగ్రత్త పడ్డాను.
ఇంతకీ అసలు విషయం ఏవిటంటే, మా ఆవిడ బయట వర్షం పడొచ్చనే వాతావరణ హెచ్చరికలు నమ్మినదై, బయట పెత్తనాలకు పోలేకా,  లోపల కరెంటులేని కారణంగా  టీవీ సీరియల్ చూసే అవకాశం బొత్తిగా లేకయున్నూ,  ఇత్యాది బలమైన అనేక  కారణాల కారణంగా విధిలేని స్తితిలో ఇంటిపట్టునే వుండిపోయి, తప్పనిసరై  నాతో మాటవరసకు మాటలు కలిపి వాటి మధ్యలో ఒక తూటా పెట్టి  పేల్చింది. ఆ మాట  అన్నది మా ఆవిడ కాబట్టి, ఆ సమయంలో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. అదేవిటో ఈ భార్యామణులు  ఉన్నట్టుండి తమ తమ మొగుళ్ళను ఎవరితోనో ఒకరితో పోల్చి తమ ఈగోను చల్లార్చుకుంటూ ఉంటారని ఆడవాళ్ళంటే వోర్చుకోలేని ఒకాయన ఎప్పుడో  చెప్పాడు. సాధారణంగా పక్కింటాయనతోనో, ఎదురింటాయనతోనో (వాళ్ళ సంపాదనలతో సుమా) పోల్చి ‘మీరూ వున్నారు ఎందుకూ...’ అని సన్నాయినొక్కులు నొక్కడం పరిపాటి. కానీ ఈసారి మా ఆవిడంబాళ్ళు నన్ను పోల్చి చెప్పింది అట్లాంటిట్లాంటి అల్లాటప్పా వాళ్ళతో కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తోటి. ‘ఆయనకూ   మీకూ  తేడా ఏమీ  కనబడడం లేదండీ’ అని ఉన్నట్టుండి   అనేసింది. ‘అమ్మ భడవఖానా. నన్నంటే ఏదో మొగుడుముండావాడ్ని సరిపుచ్చుకుంటాను కాని నన్ను ప్రధాన మంత్రితో పోల్చడం, కాదు కాదు సాక్షాత్తు ప్రధాన మంత్రిని నాతో పోల్చడం  ఏవిటి అసాధ్యం కూలా’ అనుకున్నాను.
ఏవిటో  అనుకున్నాకాని ఆమె లాజిక్కు ఆమెకు వుంది.
“నరేంద్ర మోడీ గారి లాగే  నేను మొండివాడ్ని(ట). కాదు, నాలాగే ఆయన మొండివాడు. ఎవరి మాటా వినడు” ఆవిడ ఉవాచ. కాదంటే కుదరని మాట.
“ఎవరు ఏమైనా  పరవాలేదు తన మాటే నెగ్గాలి అనే  తరహా ఆయన్ది, మీలానే” అని లా పాయింటు తీసింది.
“హౌరా!” అనుకున్నాను నాలో నేనే.
“అన్ని ధరలు పెరిగాయి కాస్త నెల బడ్జెట్ పెంచవయ్యా మగడా అంటే కుదరదంటే కుదరదని  మీలాగే నిక్కచ్చిగా తెగేసి చెప్పేరకం.” ఏమనడానికి ఏముంది? నిజమే కదా!
ఇంతవరకు బాగానే వుంది అనుకుంటూ వుంటే ఆఖరి తూటా పేల్చింది.
“మీరు బయట టీవీల్లో మాట్లాడ్డం తప్పిస్తే ఇంట్లో వాళ్ళతో ఓ మాటా వుండదు ఓ ముచ్చటా వుండదు. ఆయన్ని గురించి వాళ్ళ పార్టీ వాళ్ళదీ అదే గోల”
“అందుకే మీకూ ఆయనకూ తేడాలేదనేది” అనేసింది పేపరు మడిచి పక్కనపడేస్తూ.   

ఇంకేం అనను? అనాల్సింది అంతా తానేఅనేసిన తరువాత. (11-11-2015)

1, జూన్ 2014, ఆదివారం

నమ్మలేని నిజం


నిజాలు ఒక్కోసారి నిజమేనని నమ్మలేనంత  విడ్డూరంగా వుంటాయి.
1990
అంటే సుమారు కొంచెం అటూ ఇటుగా పాతికేళ్ళనాటి ముచ్చట.
ఇద్డరు యువతులు ఢిల్లీ వెళ్ళడానికి లక్నోలో రైలెక్కారు. ఆ మరునాడే మల్ళీ అహమ్మదాబాదు వెళ్ళాలి. రైలు కదిలేముందు ఇద్దరు బడా నేతలు  అదే బోగీలోకి ఎక్కారు. వారితో పాటే బిలబిలమంటూ మరో డజను మంది వారి అనుచరులు కూడా  జొరబడ్డారు. ఆ యువతుల్ని సామాన్లమీద కూర్చోమని వాళ్ల బెర్తుల్ని  దర్జాగా ఆక్రమించుకున్నారు. అంతటితో ఆగారా.  పక్కన ఆడవాళ్ళు వున్నారు అనే సోయ  లేకుండా పెద్ద గొంతుకతో అసభ్య పదజాలంతో  సంభాషణ సాగించారు. వారి ధోరణితో ఆ యువతులు బిక్కచచ్చిపోయారు. ఢిల్లీ చేరేంతవరకు ప్రాణాలు అరచేతబెట్టుకుని ప్రయాణం చేశారు.
మరునాడు రాత్రి ఢిల్లీ నుంచి అహమ్మదాబాదు వెళ్లేందుకు రైలెక్కారు. మళ్ళీ 'మరో' ఇద్దరు నేతలు అదే బోగీలో కనబడ్డారు. రాత్రి అనుభవం ఇంకా  మనసులో పచ్చిగా  వుండిపోవడంతో  యువతుల భయం రెట్టింపు అయింది. అయితే చిత్రం. ఆ కొత్త వారిద్దరూ ఆ ఇద్దరు ఆడవాళ్లని చూడగానే జరిగి సర్దుకు కూర్చుని చోటిచ్చారు. అనుచరగణం కూడా లేకపోవడంతో తరువాత  ప్రయాణం సాఫీగా సాగిపోయింది.
మరునాడు ఉదయం రైలుదిగి ఎవరిదోవనవాళ్లు వెళ్ళబోయేముందు ఒక యువతి డైరీ తెరచి పట్టుకుని ' నేనూ  నా స్నేహితురాలు ఇద్దరం రైల్వేలో ప్రొబేషనరీ అధికారులుగా పనిచేస్తున్నాము. నా పేరు లీనా శర్మ.  శిక్షణ కోసం ఈ ప్రయాణం పెట్టుకున్నాము. మీవంటి వారు తోడుగా వుండడం వల్ల  రాత్రి మా ప్రయాణం ఎలాటి ఇబ్బంది లేకుండా సాగిపోయింది. ధన్యవాదాలు' అంటూ వారి పేర్లు అడిగింది.
వారిలో ఒకతను జవాబు చెప్పాడు.
'నా పేరు  శంకర్ సింగ్ వాఘేలా, ఇతడు నా రాజకీయ సహచరుడు నరేంద్ర మోడీ'
 (ఫేస్ బుక్ కోసం తెలుగులో క్లుప్తీకరించిన ఈ కధనం పూర్తి పాఠం ఈరోజు (01-06-2014)- హిందూ దినపత్రిక 'ఓపెన్ పేజ్' లో వుంది. ఆ పత్రికకి కృతజ్ఞతలు. ప్రస్తుతం రైల్వేలో అత్యున్నత పదవిలో వున్న అనే ఆవిడ రాశారు. నరేంద్ర మోడీ మొదటిసారి ముఖ్యమంత్రి కాకపూర్వమే ఆవిడ సొంత రాష్ట్రం అయిన అస్సాం లో ఒక స్థానిక దినపత్రిక ఈ కధనాన్ని లోనే ప్రచురించింది. షరా మామూలుగా ఇది స్వేచ్చానువాదం)

20, మే 2014, మంగళవారం

పనిచెయ్యని 'బూచి' మంత్రం


స్వాతంత్య్రానంతరం భారత దేశరాజకీయలు ఒక కొత్త మలుపు తిరగబోతున్నాయి. గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందని ఒక రాజకీయనాయకుడు, దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత జన్మించిన ఓ వృద్ధ యువకుడు మొదటిసారి ప్రధాని పదవిని చేపట్టబోతున్నాడు. అంతేకాదు భారత దేశం వంటి ఓ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశానికి బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి అధికార పగ్గాలను అందుకోబోతున్నాడు. రాజకీయాలను ఓ పక్కనబెట్టి చూస్తే నిజంగా ఇది ఒక శుభ పరిణామం అనే చెప్పాలి.


దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ అనేది యెంత ప్రభావశీలి అయినప్పటికీ కొందరి దృష్టిలో అది ఇప్పటికీ ఎప్పటికీ మతోన్మాద పార్టీ. పార్టీ ఒక్కటే కాదు ఇప్పుడు దానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోదీ సంగతి చెప్పనక్కరలేదు. ఆయన పేరు వింటేనే కొందరికి కంపరం. మోదీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తేనే సహించలేక కొందరు నాయకులు ఎన్డీయే కూటమి నుంచే తప్పుకున్న సందర్భాలు వున్నాయి. కర్నాటకు చెందిన ఓ ప్రసిద్ధ రచయిత మోదీ ప్రధాని అయితే తాను భారత దేశం విడిచి పెట్టి వెళ్ళిపోతానని శపధం పూనాడంటే ఆయనంటే కొన్ని వర్గాలలో వైమనస్యం  ఏ స్థాయిలో వున్నదీ అర్ధం చేసుకోవచ్చు. పదేళ్ళ పాలన తరువాత ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో తాటి ప్రమాణంలో వుందని తెలిసిన తరువాత కూడా ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వానికి తామే నాయకత్వం వహిస్తామని కాంగ్రెస్ అధిష్టానానికి చెందిన కొందరు నాయకులు ధీమాతో కూడిన ప్రకటనలు చేయడానికి కారణం కూడా కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీ ని ఒక అంటరాని పార్టీగా పరిగణించే తత్వానికి అలవాటుపడివుండడమే. బీజేపీని ఒక బూచిగా చూపించి తమ పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ పెంచుకున్న ఆశలపై ప్రజలు నీళ్ళు చల్లారు. అది కూడా ఏదో మామూలుగా కాదు, చీత్కరించినట్టు పెద్దపెట్టున తిరస్కరించారు. నూటపాతికేళ్ల పైచిలుకు చరిత్ర కలిగిన, దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించిన రికార్డు ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ పార్టీని అతి తక్కువ స్థానాలకు పరిమితం చేసి 'మా దృష్టిలో ఇదీ మీ స్థానం' అని తేటతెల్లం చేశారు. ఇంతటి ఘన  విజయాన్ని మూటగట్టుకోగలిగిన స్థోమత వస్తుతః మోదీకి వున్నప్పటికీ, నిజం చెప్పాలంటే ఇందులో కాంగ్రెస్ నిర్వాకం కూడా చాలా వుంది. స్వయంకృతాపరాధాలకు ఆ పార్టీ చెల్లించిన మూల్యంగా చెప్పుకోవచ్చు.
పెద్ద బాధ్యత భుజానికి ఎత్తుకుని మోదీ ఇంత పెద్ద పదవిని స్వీకరించబోతున్నారు. ఆయన తమ బతుకుల్ని మారుస్తాడనే ఆశతో జనం ఆయనకు ఈ పగ్గాలు అప్పగించారు. ఎవరిమీదా ఆధారపడకుండా, నిష్క్రియాపరత్వానికి ఇతరులపై నిందమోపి తప్పుకునే వీలులేకుండా తిరుగులేని సంఖ్యాబలంతో అధికారాన్ని దఖలు పరిచారు. ఇక బంతి మోదీ కోర్టులో వుంది. ఇన్నాళ్ళు చెబుతూ వచ్చిన మాటలు నీటి మీది రాతలు కావు, రాతి మీది గీతల్లా చెక్కుచెదరవని నిరూపించుకోవాల్సిన నైతిక బాధ్యత ఆయన భుజస్కందాలపైనే వుంది.
దేశాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతారో, తానే ఓ మలుపు తిరిగి తానులో ముక్కనని నిరూపించుకుంటారో కాలమే తేలుస్తుంది. (20-05-2010)