India and China in race లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
India and China in race లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఏప్రిల్ 2013, శుక్రవారం

చైనాతో పోటీలో భారత్ వెనుకంజ




(ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను శాసించే విధంగా అతిత్వరగా ఎదుగుతున్న ఆసియా దేశాల్లో చైనా ముందంజలో వుంటే దానితో సమానంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నది భారత దేశం అనడంలో సందేహం లేదు. కానీ ఈ పరుగుపందెంలో చైనా అందుకోలేనంత వేగంగా కదులుతోందని, భారత దేశం ఈ పోటీలో పూర్తిగా  వెనుకబడిపోతోందని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన వ్యాసంలో సుప్రసిద్ధ ఆర్ధిక వ్యవహారాల నిపుణుడు స్టీవెన్ రాట్నర్ (STEVEN RATTNER) అభిప్రాయపడ్డారు. నిష్టూరమనిపించే కొన్ని నిజాలు ఇందులో వెలుగుచూశాయి. ఆ వ్యాసం నుంచి కొన్ని ముఖ్యమైన భాగాలు.)
2006 లో నేను మొట్టమొదటిసారి భారత్, చైనాలను సందర్శించాను. ఆ రోజుల్లో ఈ రెండు దేశాలు ఆర్ధికపరమైన పోటీలో ముందుకు సాగుతున్నాయి. ఈ రెండింటిలో యేది ముందుకు దూసుకుపోతుందన్న దానిపై అప్పుడు ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.
ప్రజాస్వామ్యం వేళ్ళూనుకున్న భారత దేశం,  నియంతృత్వపాలనలో వున్న చైనాను ఈ పోటీలో అధిగమించగలదని చాలామంది పశ్చిమ దేశాలవాళ్ళు అప్పట్లో భావించారు.
కానీ, ఇప్పుడు  చూస్తే పోటీ ముగిసినట్టు అనిపిస్తోంది. చైనా 21వ శతాబ్దంలోకి దూసుకుపోతే, భారత్ మాత్రం ఇంకా ఆ దిశగా అడుగులు మెల్లగా వేస్తోంది. ఈ నిర్ధారణకు రావడానికి కేవలం అంకెలు,సంఖ్యలు గణాంకాలను కొలమానంగా తీసుకోవడం లేదు. భద్రమైన భవిష్యత్తును నిర్మించుకునే క్రమంలో చైనా తన గతాన్ని పూర్తిగా చెరిపేసుకుంటూ పోతే, భారత దేశం మాత్రం తన లోపాల సవరణలో ఆచితూచి వ్యవహరిస్తోంది.
ఇప్పుడు ఇండియా సందర్శించడానికి  వెళ్ళిన వాళ్ళకి , అది చిన్న పట్టణం కావచ్చు, పెద్ద నగరం కావచ్చు ఎక్కడ చూసినా కళ్ళు మిరుమిట్లు కొలిపే వ్యాపార, వాణిజ్య సముదాయాలే  దర్శనమిస్తాయి.  అందమైన, ఖరీదైన దుస్తులు ధరించిన జనం క్షణం విరామం లేకుండా  సెల్ ఫోన్లలో మాట్లాడుతూ  ఒక్క ఘడియ కూడా తీరికలేనివాళ్ళ మాదిరిగా కనిపిస్తారు. మరోపక్క వీధుల్లో ముష్టివాళ్ళు, తోపుడు బండ్లమీద తినుబండారాలు, చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే చిల్లర వర్తకులు కానవస్తారు. ఇవన్నీ చూసినప్పుడు వేగంగా వృద్ధి  చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ తాలూకు అసలు  స్వరూపం కానరాదు. దాని స్థానంలో కన్స్యూమరిజానికి పెద్దపీట వేస్తున్న పర్యాటకం దర్శనమిస్తుంది. అదీ అస్తవ్యస్తంగా.
దీనికి భిన్నంగా చైనాలో ఉత్పాదకరంగం పెద్దయెత్తున అభివృద్ధి  చెందుతోంది. దీన్ని దృష్టిలో వుంచుకుని చూసినప్పుడు ఇండియా కేవలం దుకాణదారుల దేశంగా కానవస్తుంది.       
అయితే, భారత్ ఏవీ  సాధించకుండా గమ్మున కూర్చుండి పోయిందని కాదు. వ్యాపార వాణిజ్య సేవలను అందించే విషయంలో ఈ దేశం సాధించిన అభివృద్ధిని చూసినప్పుడు ఎవరికయినా కన్ను కుట్టకమానదు. బెంగళూరు వంటి నగరాలలో కానవచ్చే  కళ్ళు చెదిరే కాల్ సెంటర్లు, ఐ.టీ. పార్కులే  ఇందుకు నిదర్శనం. కానీ, ఉత్పత్తికారక, ఉత్పత్తిదాయక  ఉపాధికల్పనలో మాత్రం  భారత్ తన వాటాను చైనాతో పోటీగా సాధించుకోలేకపోయింది.
ఈనాడు పరిస్తితి  ఎలావుందంటే చైనాలో తలసరి స్తూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) డాలర్లు. అంటే యేవన్నమాట.  అక్కడి జీడీపీ మనకంటే రెండింతల కన్నా ఎక్కువ. నిరుడు ఆ దేశపు ఆర్ధిక వ్యవస్థ 7.7 శాతం చొప్పున పెరిగింది. భారత్ లో 5.3 శాతం పెరగడమే గగనం అయింది. చైనా తన  జీ.డీ.పీ. లో నలభై ఎనిమిది శాతం పెట్టుబళ్ళుగా  పెట్టింది. చైనా సత్వర అభివృద్ధికి దోహదం చేసిన కీలక అంశాల్లో ఇదొకటి. భారత్ కూడా తన జీ.డీ.పీ.లో 36 శాతం పెట్టుబడి పెట్టింది. పశ్చిమ దేశాలతో పోల్చి చూసినప్పుడు ఇది ఎక్కువే కావచ్చు కాని, చైనాతో పోల్చిచూసుకున్నప్పుడు తక్కువే అని చెప్పాలి. అయినాకూడా ఈ పెట్టుబళ్ళ  ప్రభావం ప్రస్పుటంగా లేదు. ఈ మధ్య భారత్ వెళ్ళి పన్నెండు రోజులు వున్నాను. ముంబైలో ఛత్రపతి శివాజీ టెర్మినల్ మీద పెట్టిన ఖర్చు చెప్పుకోవడానికి చాలా ఘనంగా వుంది. తీరా వెళ్ళి చూస్తే అంత డబ్బు ఖర్చుచేసిన దాఖలాలు కానరాలేదు. అలాగే బోలెడు డబ్బు ఖర్చు పెట్టి బంద్రా  కుర్లా ఫైనాన్సియల్ జిల్లా ఏర్పాటు చేశారు. అది అప్పుడే పాతబడిపోయినట్టు కానవచ్చింది. బహుశా అందుకోసం వాడిన నిర్మాణ సామాగ్రి నాసిరకంది అయివుండవచ్చు. లేదా  అక్కడి భవనాల నిర్వహణ  లోపం అయివుండవచ్చు. లేదా ఈ రెండూ కారణం కావచ్చు. యేవయితేనేం పెట్టిన ఖర్చు కళ్ళు తిరిగేలా వుంటే చివరికి తయారయింది అందుకు భిన్నంగా వుంది. అవినీతి యే స్థాయిలో వుందో దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు.
షాంగై లో చైనా నిర్మించిన విమానాశ్రయాన్ని చూస్తే ఈ రెండు దేశాలనడుమ  తేడా  సులభంగా తెలిసిపోతుంది.      
“ అలాగే ఆదేశంలో పదహారు మెట్రోలు నిర్మిస్తే, ఇండియాలో అయిదే నిర్మించగలిగారు. టిబెట్ వరకు చైనా అద్భుతమైన సూపర్ హై వే నిర్మించింది. ఇండియాలో ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద రహదారులను నిర్మిస్తున్నారు కాని నాణ్యతా ప్రమాణాల లోపం కొట్టవచ్చినట్టుగా కనిపిస్తుంది. అనేక రకాల ఆధునిక వాహనాలు రంగ ప్రవేశం చేసాయి. కానీ  వాటిని నడిపేది మాత్రం కాలం చెల్లిన పాత రోడ్లమీదనే కావడం వల్ల ప్రయోజనం వుండడం లేదు. కార్లూ, బర్రెలూ, గొర్రెలు అన్నీ కలసి  రోడ్లమీద దర్శనమిస్తుంటాయి.
“ఇక ఇండియాలో విద్యుత్ కొరత గురించి యెంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వినియోగం పెంచుకోవడంలో చూపిస్తున్న ఉత్సాహం ఉత్పాదన పెంచే విషయంలో చూపించడం లేదు. ఈ రంగంలో ఎక్కువ భాగం ఇప్పటికీ  ప్రధానంగా ప్రభుత్వ ఆజమాయిషీలోనే వుంది.  ఇప్పుడిప్పుడే  ప్రైవేటు రంగం ఇందులో ప్రవేశిస్తోంది కాని, ముడుపుల పుణ్యమా అని వాళ్లు సాధిస్తోంది కూడా అంతంత మాత్రమే. అందుకే విద్యుత్ కోతలతో పారిశ్రామిక, ఉత్పాదక రంగాలు కునారిల్లుతున్నాయి.
“అయితే, మోర్గాన్ స్టాన్లీ అంచనాలు మాత్రం ఇండియా గురించి వేరేరకంగా వున్నాయి. 2010  లోనే  ఈ సంస్థ భారతదేశ పురోగమనం గురించి కొన్ని అంచనాలు ప్రకటించింది. ఈ దశాబ్దం నడిమికల్లా ఇండియా చైనా కంటే వేగంగా అభివృద్ధి చెందుతుందన్నది మోర్గాన్ స్టాన్లీ నిశ్చితాభిప్రాయం. ఇప్పటికీ అది ఈ అభిప్రాయానికే కట్టుబడివుంది. కానీ వాస్తవ పరిస్తితి గమనిస్తే  ఇది కార్యరూపం ధరించేలా లేదు. 1991 నుంచి  అనుసరిస్తున్న నూతన ఆర్దికవిధానాలు, సంస్కరణలు ఏవీ కూడా భారతదేశం జనాభాలో అధిక సంఖ్యాకులయిన యువజనులను నైపుణ్యం కలిగిన పనివారిగా తయారు చేయలేకపోయాయి. వీరిలో చాలామంది ఇప్పటికీ వీధుల్లో తోపుడు బండ్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. లేదా అసలు ఎలాటి ఉపాధి లేకుండా నిరుద్యోగులుగా కాలం వెళ్ళబుచ్చుతున్నారు. స్వాతంత్ర్యానంతరం తాను ఎంచుకున్న సామ్యవాద సిద్ధాంతం నుంచి వైదొలిగిన తరువాత  భారత దేశం చేపట్టిన ఆర్ధిక  సంస్కరణలు ఈ పరిస్తితిని ఏమాత్రం మార్చలేకపోయాయి. మార్చలేకపోగా అవినీతిని, అసమర్ధతను  పెంచిపోషిస్తూ వచ్చాయి.
“నిజమే. చైనాతో పోల్చి చూసుకున్నప్పుడు భారత దేశం పెద్ద ప్రజాస్వామ్య దేశమే. కానీ అనేక రుగ్మతలు పట్టి పీడిస్తున్నప్పుడు అభివృద్ధి అందని పండే అవుతుంది.
“రాజకీయ వొత్తిళ్లకు గురవుతున్న అధికారగణం, కేంద్రంపై కాలుదువ్వుతున్న రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు, వీటితో భారతదేశ పాలనాసామర్ధ్యం ఓ పక్క కుంటుపడుతుంటే మరోపక్క ఆస్తులకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు, చీకాకులు చైనా నమూనా అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయి. పట్టణాలమీద, నగరాల మీద పెరుగుతున్న జనాభా వొత్తిళ్లు, అందుకు తగ్గ పౌర సదుపాయాలు కల్పించలేని పరిస్థితులు, వృత్తి నైపుణ్యాలు మెరుగుపరుచుకోలేని స్తితిలో పల్లెల్లోనే మగ్గిపోతున్న యువతరం, ఇవన్నీ కలసి భారత దేశ అభివృద్ధికి ప్రధాన ప్రతిబంధకాలుగా తయారయ్యాయి.
“అలాగని ఒక్క ఇండియాలోనే అవినీతి, లంచగొండితనం రాజ్యమేలుతున్నాయని కాదు. ఈ విషయాల్లో చైనా తక్కువేమీ తినలేదు. చైనాకు మారుపేరు అవినీతి అనే చెడ్డ పేరు కావాల్సినంతగా  ఆ దేశం ఇప్పటికే  మూటగట్టుకుంది. కాకపొతే ‘ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్’ అనే సంస్థ వార్షిక నివేదికల్లో అవినీతి విషయంలో భారత  దేశానికి చైనాకంటే పెద్ద పీట వేసారు.
“పోతే ఒక్క విషయంలో మాత్రం  భారత దేశం చైనాను తలదన్నే పరిస్తితిలో  వుంది. అదేమిటంటే న్యాయవ్యవస్థ. బ్రిటిష్ వారినుంచి వారసత్వంగా తీసుకున్న భారతీయ న్యాయవ్యవస్థ కొంచెం మందగమనంతో అయినా ముందుకు సాగుతోంది. చైనాలో మాదిరిగా మూకుమ్మడి ఉరితీతల వ్యవహారం భారత దేశంలో లేదు. చైనాకంటే కూడా ఇండియాలో న్యాయవ్యవస్థ పారదర్సకత, జవాబుదారీతనం విషయంలో మిన్నగా వుందని చెప్పాలి.                        


“అయితే ఈ మధ్య మరోసారి ఆ దేశానికి వెళ్ళిన సమయంలోనే భారత రాజధాని ఢిల్లీ నగరంలో ఒక యువతి గ్యాంగ్ రేప్ కు గురై మరణించిన సంఘటన జరిగింది. ఈ సంఘటనపట్ల స్పందించిన యువజనులను ఒకచోట గుమికూడకుండా చూడడానికి ప్రభుత్వం ముందు ప్రయత్నించింది. చివరకు విధిలేని స్తితిలో పరిస్తితిని సర్దుబాటు చేయడానికి కొన్నికంటితుడుపు  చర్యలు ఆలశ్యంగా తీసుకోవడం విచారకరమనిపించింది.
“భారతదేశంలో తరతరాలుగా తిష్టవేసుకుని వున్న సాంఘిక పరిస్థితులు ఆర్ధిక రంగంలో అసమానతలను రూపుమాపడానికి అడ్డంకిగా వుంతున్నాయి. లేనివారికీ వున్నవారికీ నడుమ అంతరాలు బాగా పెరిగిపోతున్నాయి. భారతదేశ ఆర్ధిక రాజధానిగా చెప్పుకునే ముంబై లో సగం జనాభా ఇప్పటికీ మురికివాడల్లో ఎలాటి ప్రాధమిక పౌరసౌకర్యాలకు నోచుకోకుండా  దుర్భర జీవితాలు గడుపుతున్నారు. మరోపక్క ముఖేష్ అంబానీ వంటి సంపన్నులు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి  ఇరవయ్యేడు అంతస్తుల రమ్య హర్మ్య భవనాన్ని తన నివాసంకోసం కట్టించుకున్న వైనాన్ని  కధలుగా  చెప్పుకుంటారు.
‘ఇలా అంటున్నానని నన్ను అపార్ధం చేసుకోవద్దు. నేను నియంతృత్వ పోకడలతో కూడిన వ్యవస్థను  సమర్ధించడం లేదు. అలాటి ప్రభుత్వాలను పొగడడం నా అభిమతం కాదు. నేను చెప్పదలచుకుంది ఒక్కటే. వర్ధమాన దేశాల విజయాలను గుర్తించడానికి,  కేవలం స్వేచ్చగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పుకోవడం  ఒక్కటే గీటురాయిగా తీసుకోరాదన్న వాస్తవాన్ని గ్రహించాలని మాత్రమే.
“చివరిగా ఒక మాట. అగ్రస్థానం అధిరోహించే విషయంలో చైనా ఆత్రుతపడుతున్నట్టుగా కాకపోయినా కనీసం గౌరవప్రదం అయిన రెండో స్థానం సాధించడానికి అయినా భారతదేశం ఒకమేరకయినా పాటుపడాలి. ఎందుకంటే ఈ పోటీలో  చైనాను  ఓడగొట్టడం అంత సులభం ఏమీ కాదు కాబట్టి.”
(12-04-2013)