‘పెద్దయ్యాక
ఏమవుదామనుకుంటున్నావు?’ అనేది చిన్నప్పుడు
స్కూల్లో అడిగే ప్రశ్న.
‘తెలుగు మాస్టారు’ ఠకీమని
సమాధానం.
ప్రశ్న అడిగిన
లెక్కల మాస్టారుకి ఎక్కడ కాలాలో అక్కడే కాలేది. తరువాత ఏదో తప్పువెతికి
పట్టుకోవడం, చెయ్యి చాపమనడం, చాచిన చేతిని తిరగేయించడం, దానిమీద డష్టరు తిరగేయడం - అది వేరే కధ.
‘నరం లేని నాలుక
ఏవిధంగానయినా మాట్లాడుతుందంటారు చూడండి. అలా రాజకీయ నాయకులు ‘మొన్న ఏం మాట్లాడాం,
నిన్న ఏం చెప్పాం’ అన్నదానితో నిమిత్తం లేకుండా ‘ఈరోజు చెప్పిందే ఫైనల్’ అన్న
పద్ధతిలో బల్లగుద్ది వాదిస్తున్న విధం
చూస్తుంటే రాజకీయాల్లో సోషలిజం, కమ్యూనిజం, క్యాపిటలిజం కాకరకాయా ఏమీలేదు వొట్టి అవకాశవాదం తప్ప
అనిపిస్తే ఆశ్చర్యపోవాల్సింది ఏమీ వుండదు.
‘మా నాన్నవల్ల
ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూలగొట్టడం నామతం కాదు, అభిమతం కాదు, కాదెంతమాత్రం కానే కాదం’టూ ఎక్కడలేని ధర్మపన్నాలు వల్లించి ఆ తరువాత అనతికాలంలోనే పోటీ పార్టీ పెట్టి సొంతపార్టీకి చిల్లి పెడుతున్న
విధం చూస్తుంటే- రెండు నాలికలతో మాట్లాడడానికి
చిన్నప్పుడే స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?
‘అవినీతిలో
కూరుకుపోయిన కాంగ్రెస్ నాయకులను పంచెలూడతీసి తరిమికొడతాం!’ అంటూ పొడుగుపాటి
డైలాగులు అలవోకగా జనం మీదకు వొదులుతూ, పార్టీ పెట్టిన తొమ్మిదిమాసాల్లోనే అధికార పీఠం ఎక్కిన ఎన్టీయార్ రికార్డుని బద్దలుకొట్టేసి, రాజ్యాధికారంలోకి వద్దామనుకున్న కలలు కాస్తా పార్టీ
పారాణి ఆరకముందే కల్లలైపోవడంతో, ఇక విధిలేక
ఆ కాంగ్రెస్ పంచనే చేరి, కేంద్రమంత్రి
పదవిలో విదేశాల్లో సేదతీరుతూ, తీరిగ్గా సోనియా భజన చేస్తున్న వైఖరి చూస్తుంటే - రెండు
నాలికలతో మాట్లాడడానికి చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్
ఇచ్చారో అర్ధం కావడం లేదా?
‘హెలికాప్టర్
దుర్ఘటనలో వైఎస్సార్ చనిపోయినప్పుడు, పట్టు చీరెల అంచులతో, ఖాదీ ఉత్తరీయాలతో కళ్ళు
వొత్తుకుంటూ బుల్లితెరలమీద బారులుతీరి ‘అంతటి నాయకుడు ఇంతకు ముందు పుట్టలేదు
ఇకముందు పుట్టడు’ అంటూ విలపించిన ఆయన మంత్రివర్గ సహచరులే ఇప్పుడు పల్లవి మార్చి ‘అవినీతిలో వైఎస్ ను
మించినవాడు లేడం’టూ వైనవైనాలుగా శాపనార్ధాలు పెడుతున్న వైనం గమనిస్తుంటే - రెండు
నాలికలతో మాట్లాడడానికి చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్
ఇచ్చారో అర్ధం కావడం లేదా?
‘తుది శ్వాస
విడిచేవరకు తాత స్థాపించిన పార్టీలోనే వుంటానంటూ, ప్రత్యర్ధి పార్టీల ఫ్లెక్సీల్లో
అభిమానుల పేరుతొ తన ఫోటోలు పెడుతుంటే మిన్నకుండిపోయి ముసిముసి నవ్వులు నవ్వడం
చూస్తుంటే - రెండు నాలికలతో
మాట్లాడడానికి చిన్నప్పుడు
స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?
‘అల్లుడా రమ్మని
పిల్లనిచ్చిన మామ పిలిచి పార్టీ అందలం
ఎక్కిస్తే, పార్టీని బతికించే నెపంతో పార్టీ సంస్తాపకుడి అంతాన్నే కళ్ళారాచూసి,
ఇప్పడు మళ్ళీ పార్టీ పునరుద్దానానికి ఆ కీర్తిశేషుడి పేరునే వాడుకుంటూ, దానిపై
పేటెంటు రైటు తమదే అంటూ వాడవాడలా వూరేగుతున్న
విపరీతాన్ని చూస్తున్నప్పుడు - రెండు నాలికలతో
మాట్లాడడానికి చిన్నప్పుడు
స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?
పార్టీలు, వ్యక్తుల
భజనకోసం పెట్టిన టీవీ చానళ్ళలో పనిచేస్తూ, జీతాలకోసమో, హోదాలకోసమో వేరే చానళ్ళలో
చేరి పొగిడిన నోళ్లతోనే తెగుడుతున్న విధానాలను
పరికిస్తుంటే - రెండు నాలికలతో
మాట్లాడడానికి చిన్నప్పుడు
స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?
ఇలాటి చద్మ వేషధారుల, ఆషాఢభూతుల లీలలు చూపించి, వారి
అసలు రూపాలను, స్వరూపాలను చూపించే విధంగా ఏ టీవీ వారయినా పుణ్యం కట్టుకుని,
‘అప్పుడు – ఇప్పుడు’ అనే కార్యక్రమం ప్రసారం చేస్తే యెంత బాగుంటుందో ! (08-04-2013)
Note:
Courtesy image owner