“ఏటీఎంలలో డబ్బులు వస్తున్నాయని కొందరు, రావడం లేదని మరికొందరు వాదించుకొనుచున్నారు. మీరు ఎవరితో ఏకీవభించెదరు ఎడిటర్జీ?”
“ఇద్దరితో..”
“అదెలా?”
“అంటే ఇలా.
చెబుతాను ఇనుకో!.....సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. తాము ఒకటి నమ్ముతూ దాన్నే
ఇతరులు కూడా నమ్మి తీరాలనే మనస్తత్వం ఇందులో ప్రబలంగా వుండడమే దీనికి కారణం”
“మరి ఏది దారి?”
“కంటితో చూసి
రుజువు చేసుకోవడమే... నిన్న కాక మొన్న మా కజిన్ వాళ్ళు అరకు టూరు వెళ్లివచ్చారు.
వాళ్లకు ఎక్కడా ఇబ్బంది కాలేదు. అన్ని ఏటీఎంలు పనిచేస్తూనే వున్నాయి. డబ్బులు
దొరుకుతూనే వున్నాయి. అంతే కాదు, చిన్న షాపుల్లో
చిన్న వస్తువు కొనుక్కుని రెండువేల నోటు ఇచ్చినా మరో మాట అడగకుండా చిల్లర
లెక్కపెట్టి ఇస్తున్నారట. పైగా కొత్త అయిదు వందల నోట్లు పుష్కలంగా దొరుకుతున్నాయట.
ఇన్ని ‘ట’ లు వున్నాయని నమ్మను అనబోకు. మా కజిన్ చెప్పింది మరి. అదెప్పుడూ అబద్ధం
చెప్పదు. మరి హైదరాబాదులో ఈ గొడవ ఏమిటి? అక్కడ లేని
ఇబ్బందులు ఇక్కడ ఎందుకు?”
“అది అరకు. ఇది
హైదరాబాదు. పెద్ద నగరం. పెద్ద జనాభా. పెద్ద నోట్ల అవసరం ఇక్కడ ఎక్కువ. అందుకే ఇక్కడ
కొరత. అందుకే ముందే చెప్పాను, రెండు వాదనలు
నిజమే అని. విషయం విడమరచి చెబుతాను విను. ఇప్పుడు ఇక్కడ టైం ఎంత? పగలు పన్నెండు
గంటలు. అమెరికాలో వున్న మీ అబ్బాయికి ఫోను చేసి కనుక్కో. రాత్రి పన్నెండు అంటాడు.
అదీ నిజమే. ఇదీ నిజమే. అదన్న మాట”
(2nd January 2017)