సంసారం
నడిపే స్త్రీలు కారు నడపలేరా!
(మార్చి
ఎనిమిదో తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం)
తేదీ: 2011, జూన్ 17 – దేశం సౌదీ అరేబియా
ఆ రోజు
వందలాదిమంది జనం కార్లలో బయలుదేరారు.
ఇందులో విచిత్రం ఏమిటి అనుకుంటున్నారా. ఆ
కార్లు నడుపుతున్నవారందరూ స్తీలే. అయితే ఏమిటంటారా! వారందరికీ కార్లు వున్నాయి
కాని వాటిని నడపడానికి లైసెన్సులు మాత్రం
లేవు. మరి లైసెన్సులు లేకుండా వారంతా కార్లలో బయటకు ఎందుకు వచ్చినట్టు? లైసెన్సుల కోసమే అంటే నమ్ముతారా? నమ్మక తప్పదు. లైసెన్సుల కోసమే వారందరూ అలా
రోడ్డెక్కాల్సి వచ్చింది. లైసెన్స్ లేకుండా కారు నడిపితే ఏం జరుగుతుందో వారికి
తెలుసు. దానికి సిద్ధపడే వాళ్లు కార్లతో రోడ్డున పడ్డారు.
మూకుమ్మడి
నిరసన కావడం వల్ల పోలీసులు అందర్నీ అరెస్ట్ చేయలేకపోయారు. కొందరికి చలాన్లు
రాశారు. కొందర్ని హెచ్చరించి వొదిలేశారు. అరెస్ట్ అయిన కొద్దిమంది కూడా అందుకు బాధ
పడలేదు. ఎందుకంటె తమ బాధల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే వారు ఈ ఆందోళనకు నడుం
కట్టారు.
ఇంతకీ
విషయం ఏమిటంటే – ఆ దేశంలో స్త్రీలకు కార్లు నడిపే హక్కు లేదు.
ప్రపంచంలోవున్న లగ్జరీ కార్లన్నీ సౌదీలో దర్శనమిస్తాయి. పెట్రోలు కూడా చాలా చవుక.
కార్లు కొనుక్కోగల ఆర్ధిక స్తోమత ఆ దేశంలో చాలామందికి వుంది. మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తారు. కారు కొనుక్కోవడం వారికి ఓ
లెక్కలోనిది కాదు. పైగా వృత్తి రీత్యా వాహనం అవసరం కూడా. ఆఫీసులకు వెళ్లడానికీ, పిల్లల్ని స్కూళ్ళలో దింపడానికీ ఉద్యోగినులకి సొంత
వాహనం యెంత అవసరమో ఈ నాడు అందరికీ తెలిసిన విషయమే. ఆడా మగా తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా
దేశాల్లో అందరూ కారు నడపడం సర్వసాధారణంగా
మారిపోయింది. అయినా సౌదీ అరేబియాలో ఆడవారికి ఈ హక్కు ఇంకా హక్కుభుక్తం కాలేదు.
దీనికోసం వాళ్లు చాలాకాలంగా ఆందోళన చేస్తూ
వున్నారు. బహుశా, ఆడవారిని మోటారు కారులో డ్రైవింగ్ సీటులో చూడలేనిది
మొత్తం ప్రపంచంలో ఈ ఒక్క దేశంలోనే కాబోలు. ఆ దేశంలో వుంటున్న తెలుగువారెవరయినా
అనుమాన నివృత్తి చేస్తే బాగుంటుంది.
(ఇంటర్నెట్
లో సంచారం చేస్తున్న ఒక ఆంగ్లవ్యాసానికి స్వేచ్చానువాదం)
NOTE: Courtesy Image Owner