“మీరు పాత కాలంవాళ్ళు. ఇవన్నీఈ రోజుల్లో చాలా మామూలు. తేలిగ్గా తీసుకోవాలి” అన్నాడు ఓ
మిత్రుడు.
నిజమే. కానీ ఆ మిత్రుడు అన్నట్టు పాత
కాలపు వాసనలు కదా! త్వరగా వదలవు.
ఈ మధ్య ఫేస్ బుక్ లో ప్రతి విషయంలో అనవసరమైన నిందారోపణలు, వ్యాఖ్యలు
దర్శనమిస్తున్నాయి.
చిన్నప్పుడు మా బామ్మ అనేది, ఇష్టం
లేని వాడి పాపిడి వంకర అని. అలాగే వున్నాయి ఇవి కూడా.
ఏదో ఎవరూ అనుకోని తెలియని ఉత్పాతం వచ్చి పడింది. అందరూ తలో చేయీ
వేస్తున్నారు. కానీ వీళ్ళ చేతులు ఊరుకోవు కదా! సోషల్ మీడియాలో సన్నాయి నొక్కులు
మొదలయ్యాయి.
“టాటా సాయం చేస్తే బిర్లా ఎందుకు
చేయడు? (బిర్లాలు చేసారో లేదో నేను పత్రికల్లో చదవలేదు, ఎందుకంటే పత్రిక మొహం చూసి
రమ్యమైన రెండో వారం నడుస్తోంది)
“హీరోలు ఒక్కళ్ళేనా హీరోయిన్లకు బాధ్యత
లేదా”
“అందరూ కోట్లు లక్షలు ఇస్తుంటే ఈయనకు
ఏమైంది వేలతో సరిపుచ్చాడు”
“ఇంకా వాళ్ళు మొదలు పెట్టలేదేమిటి? గతంలో ఏదైనా
ఉపద్రవం వస్తే చాలు చందాల వసూలుకు జనం మీద పడేవాళ్ళు. వసూలు చేసిన వాటికి ఇంతవరకు
లెక్కా డొక్కాలేదు”
“ఈ ముఖ్యమంత్రిని నమ్మి వందల కోట్లు
ఇస్తున్నారు, అదిగో ఆ ముఖ్యమంత్రిపై నమ్మకం లేక ఎవరూ చేయి విదల్చడం లేదు”
అంటే ఏమిటి? రాజుగారి పెద్ద భార్య
మంచిది అంటే చిన్న భార్య చెడ్డదనేనా?
ఈ విషమ సమయంలో ఇవేనా మనం మాట్లాడుకోవాల్సింది.
వెనక చైనా యుద్ధం అప్పుడు దేశ రక్షణ
నిధికి విరాళాలు పోగుచేస్తుంటే మా రెండో అక్కయ్య కూతురు శాంత, అప్పటికి చాలా చిన్నపిల్ల,
తన చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులు తీసి జోలెలో వేసింది. మా బావగారు ‘మంచి
పనిచేశావ్ అమ్మాయి’ అని మెచ్చుకున్నారు. అంతే! అప్పటితో మరచిపోయారు. ఇరుగూ పొరుగు
వాళ్లకి కూడా చెప్పుకోలేదు.