పాతికేళ్ళనాటి మాస్కో - 5 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పాతికేళ్ళనాటి మాస్కో - 5 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

పాతికేళ్ళనాటి మాస్కో - 5


కన్నుకొట్టని కరెంటు దీపాలు
ఒక నగరం నగరాన్ని ఆ మాటకు వస్తే ఒక దేశం దేశాన్నీ అందులోనూ నీళ్ళు గడ్డకట్టే వాతావరణం కలిగిన దేశాన్ని వెచ్చగా వుంచడం అక్కడే చూసాను. ఏడాదిలో దాదాపు పదినెలలు మంచు దుప్పటి కప్పుకుండే మాస్కోలో దుప్పటి అవసరం లేకుండా నిద్ర పోవడం అక్కడే సాధ్యం. అదీ పైసా (కోపెక్) ఖర్చు లేకుండా. ఇళ్లూ వాకిళ్ళూ , ఆఫీసులు, బస్సులు, ట్రాములు, మెట్రో రైళ్ళు, సినిమా హాళ్ళు, హోటళ్లు, స్కూళ్ళు, కాలేజీలు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రష్యన్ సర్కస్ డేరాలు చివరాఖరుకు స్విమ్మింగ్ పూల్స్ అన్నీ ఎయిర్ కండిషన్ అంటే నమ్మశఖ్యమా చెప్పండి. ఇంటి బయట ఎముకలు కొరికే చలి పులి పంజా విసురుతున్నా- ఇంట్లో మాత్రం లుంగీ పైజమాలతో మసలగలిగేంత వెచ్చగా వుండేది. ఆ వెచ్చదనం కూడా ఏటిపోడుగునా ఏమాత్రం హెచ్చుతగ్గులు లేకుండా ఒకేమాదిరిగా వుండడం వల్ల ఆ అయిదేళ్ళలో ఒకసారి కూడా తుమ్మాల్సిన అగత్యం రాలేదు. ఎయిర్ కండిషన్ వ్యవస్తకు  మరమ్మతులు చేయడానికి మాత్రం వేసవిలో ఓ పదిహేను రోజులు ఈ సదుపాయాన్ని నిలుపు చేస్తారు. అసలు ఈ వ్యవస్థ పనిచేసే విధానమే మాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇళ్లు ఆఫీసులు అన్నిటిలో వేడినీరు ప్రవహించే ఇనుప గొట్టాలు వుంటాయి. ఆ గొట్టాలనుంచి సదా వెలువడే వేడితో ఇల్లంతా వెచ్చగా వుంటుంది. బయట ఉష్ణోగ్రతల్లో ఏర్పడే హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఈ గొట్టాలలో ప్రవహించే నీటి వేడిని పెంచడమో తగ్గించడమో చేస్తుంటారు. దేశ ప్రజలను పొత్తిళ్ళలో పాపాయిలమాదిరిగా నులి వెచ్చగా ఉంచేందుకు అక్కడి పాలకులు చూపించిన శ్రద్ధాసక్తులకు ఇదో చక్కని తార్కాణం.


(హాయిగా తెలుగువార పత్రిక తిరగేస్తూ మా ఆవిడ నిర్మల)


 అలాగే రాత్రల్లా కురిసిన మంచుతో కప్పుకుపోయిన రహదారులను తెల్లవారేసరికల్లా వాహనాల రాకపోకలకు అనుగుణంగా ఒక దారికి తీసుకురావడం , అందుకు పడుతున్న శ్రమా, పెడుతున్న ఖర్చూ చూసేవాళ్ళకు కళ్ళు తిరగక మానవు. ప్రతి రోజూ అర్ధరాత్రి దాటిన  తరవాత అంటే సుమారు రెండుగంటలనుంచి ఓ రెండు మూడు గంటలపాటు రహదారులపై బస్సులు, ట్రాములు మొదలయిన వాహనాలతో పాటు మెట్రో రైళ్ళ రాకపోకలను నిలిపివేస్తారు. అక్కడినుంచి మొదలవుతుంది  యుద్ధ ప్రాతిపదికన రోడ్లపై మంచు తొలగించే కార్యక్రమం. వార్ ఫుటింగ్ అన్న పదానికి సరయిన అర్ధం తెలుసుకోవాలంటే దీన్ని  ఒక సారి పరిశీలించాలి. మొత్తం మూడు రకాల వాహనాలను ఇందులో వాడతారు. ముందు ఒక వాహనం ఉప్పు కలిపిన ఇసుకను రోడ్లపై చల్లుకుంటూ వెడుతుంది. దానితో గట్టిగా పేరుకుపోయిన మంచు నీళ్లగా కరుగుతుంది. రెండో వాహనం కింద అమర్చిన చీపురు యంత్రాలు ఆ ఇసకను, నీటిని చిమ్మివేస్తాయి. మూడో వాహనం నీటితో రోడ్లను శుభ్రంగా అద్దంలా కడిగేస్తుంది. ఇది ఏదో బాగా వర్షం పడినప్పుడు హడావిడి చేసి చేతులు దులుపుకోవడంలాంటిది కాదు. ఇది సంవత్సరం అంతా జరిగే కార్యక్రమం. పైగా నిత్య కృత్యం.