(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 08-2015, SUNDAY)
సూటిగా .....సుతిమెత్తగా........
సూటిగా .....సుతిమెత్తగా........
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురించి
వెలువడిన ఎగ్జిట్ పోల్ వివరాలపై వాదోపవాదాలకు తెర పడబోతోంది. వాస్తవ ఫలితాలు ఆదివారం తొలి ఝాముకల్లా తెలియబోతున్నాయి.
ఈసారి బీహారు అసెంబ్లీ ఎన్నికలకు జాతివ్యాప్త
ప్రాచుర్యం లభించింది. ఈ ఎన్నికల ఫలితాలపట్ల అదే స్థాయిలో ఆసక్తి పెరిగింది.
ఎగ్జిట్ పోల్ నిర్వహించే సంస్థలే కాకుండా వాటికి వత్తాసుగా నిలిచే మీడియా సంస్థల
సంఖ్య కూడా గణనీయంగా పెరగడం గమనార్హం.
అటు ఆఖరి ఐదో దశ పోలింగు ముగిసిందో లేదో ఇటు దేశ
వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను అనేక
వార్తా ఛానళ్ళు పోటీపడి ప్రసారం చేయడం మొదలెట్టాయి. వాటి ఆధారంగా జాతీయ చానళ్ళే కాకుండా పలు ప్రాంతీయ టీవీ
ఛానల్లు సయితం చర్చాగోష్టులు నిర్వహించాయి. కొందరు ఇవన్నీ చూసి ఇవే నిజమైన
ఫలితాలని సంబరపడితే, మరికొందరు నిరుత్సాహపడ్డారు కూడా.
బీహారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీల
సంఖ్యతో పోటీపడ్డాయా అన్నట్టుగా అనేక సర్వే సంస్థలు ఈసారి రంగంలో దిగినట్టుగా
కానవచ్చింది. వీటిల్లో మెజారిటీ సర్వేలు, ‘హోరాహోరీ’ అని తేల్చాయి. ఈ పోటాపోటీలో
కూడా పలు సర్వేలు ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని
‘మహాకూటమి’ పట్లనే ప్రజలు కొద్దిగా మొగ్గుచూపే వీలుందని చెప్పాయి. ఒకటి రెండు సర్వేలు మోడీ
నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి విజయావకాశాలు వుంటాయని పేర్కొన్నాయి. ఒక సర్వేలో
ఎన్డీయే కూటమికి ఘన విజయం దక్కవచ్చని తేలింది. ఏదిఏమైనా వాస్తవ ఫలితాలు వెలువడనున్న తరుణంలో సర్వేల మంచి
చెడులు గురించిన తర్కం అనవసరం. కాకపొతే ఈ సర్వేల
అంచనాలను బట్టి ఒక విషయం స్థూలంగా అర్ధం అవుతోంది, రెండు కూటముల నడుమ పోటీ తీవ్రంగా వున్నదని.
ఎన్నికల ప్రచారంలోనే ఈ విషయం బయట పడింది కాబట్టి దానికి అంత ప్రాధాన్యత
వుండకపోవచ్చు.
మొత్తం మీద ఉభయ రాజకీయ కూటములు బీహార్ అసెంబ్లీ
ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని తేటతెల్లం అయింది. ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ అలుపెపెరగని ప్రచారం చేసి లెక్కకు మిక్కిలి ఎన్నికల సభల్లో
పాల్గొన్నారు. ఇదంతా బయట నుంచి గమనించేవారికి, జరిగిన
పోటీ మోడీ, నితీష్ నడుమనా అన్న సందేహం కలిగినా ఆశ్చర్యం
లేదు. బీహారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు
అనేది ప్రధాని మోడీ కీర్తి కిరీటంలో మరో
కలికి తురాయి కావచ్చేమో కానీ ఓటమి సంభవిస్తే అందువల్ల ఆయన ప్రతిష్టకు వాటిల్లే
నష్టం ఏమీ లేదు. దిగంతాలకు పాకుతున్న ఆయన వ్యక్తిగత ప్రభలకు కొంత ఛాయ తగ్గవచ్చేమో
కానీ అంతకు మించి ఏమీ జరగదు. బ్రహ్మాండమయిన మెజారిటీతో కేంద్రంలో అధికార చక్రం
తిప్పుతున్న మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఇప్పట్లో ముప్పేమీ వుండదు. ఆయనకు
కానీ, ఆయన కూటమికి కానీ రాజకీయంగా తూట్లు పడే వ్యవహారం కాదు. కాకపొతే,
మోడీ కీర్తికిరీటపు ధగధగలు
ఒకింత మసకబారవచ్చు. అంతకు మించి
ఇప్పట్లో వాటిల్లే ముప్పేమీ వుండదు. 2019 లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ళ
వ్యవధానం వుంది. ఆ నాటికి నాటికి కాలు
కూడతీసుకునే వీలున్నది. పొతే, మరోవైపు నితీష్ విషయం కూడా అంతే. పదేళ్ళ పాలన
అనంతరం ప్రభుత్వ వ్యతిరేకత కానరాకుండా చేసుకోవడం ఎంతటి కాకలు తిరిగిన నాయకుడికి
కూడా సాధ్యం కాదు. ఆయనకు వ్యక్తిగతంగా సచ్చీలుడనే మంచి పేరు యెంత వున్నప్పటికీ ఆయన
కూటమిలోని కొన్ని మిత్రపక్షాల నాయకులకు అంతటి మంచి పేరు లేదు సరికదా, చెడ్డ
పేరు వాళ్ళ ఖాతాలో బాగా పేరుకుపోయి వుంది. అలాటివారి నీడన వుండడం నితీష్ వంటి
మచ్చలేని నాయకుడికి అంత శోభ ఇవ్వదు. అయితే కుల రాజకీయం అనేది మారుపేరుగా మారిన
బీహార్ వంటి రాష్ట్రంలో ఇటువంటి విభిన్న, వైరుధ్య కలయికలు ఎటువంటి ఫలితాలు
ఇస్తాయన్నది ముందుగా చెప్పడం కష్టం. అది పడగనీడా కావచ్చు, కొండొకచో
పందిరి నీడా కావచ్చు.
పదేళ్ళ పాలనాకాలంలో పేరుకు పోయిన ప్రభుత్వ
వ్యతిరేకత, లాలూ వంటి వారితో పొత్తు, సాక్షాత్తు
దేశ ప్రధానమంత్రే స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని తన భుజానికి
ఎత్తుకోవడం - ఇలాటి అంశాలన్నీ నితీష్ నాయకత్వంలోని మహా కూటమికి ప్రతికూలమైనవే.
అంచేత ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ లో వెల్లడయిన విధంగా ఆ స్థాయిలో పోటీ ఇవ్వగలగడం
అంటే అది నిజంగా గొప్ప విషయమే. ఆ కోణంలో
నుంచి చూసినప్పుడు, ఒకవేళ ఆయన పరాజయం పాలయినా ఒకరకంగా ఆయనకది నైతిక
విజయం కిందే లెక్క.
ఇక మోడీ. బీహార్ ఎన్నికలను ఆయన అత్యంత
ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పడానికి సందేహించనక్కరలేదు. ఎన్నికల గోదాలోకి
దిగడానికి పూర్వం నుంచే ఆయన బీహారు ఎన్నికల్లో గెలిచి తీరాలనే వ్యూహంపై కన్నేసి
వుంచారని చెప్పడానికి ప్రధాని ఆ రాష్ట్రం పై కురిపించిన వరాల జల్లులను
గుర్తుచేసుకోవచ్చు. ఒక రకంగా మోడీ, అమిత్ షా జోడీ , బీహార్
అసెంబ్లీ ఎన్నికలను త్వరలో రాబోయే ఇతర అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం కావడానికి ఒక
పరీక్షా వేదికగా భావించారేమో తెలియదు. బీహార్ వ్యూహం ఫలిస్తే ముందు ముందు యావత్
భారతంలో తమ పార్టీని పటిష్ట పరచి, దక్షిణ భారతంలో కూడా బీజేపీ విజయ పతకం ఎగిరేలా
చేయడానికి ఉద్దేశించిన భవిష్యత్ ప్రణాళిక అమలుకు బీహారును ఒక ప్రయోగశాలగా ఎంచుకుని
ఉండవచ్చు. అవసరమైన పక్షంలో ఓటమికి కూడా సిద్ధపడి, సొంతంగా
పార్టీ ఉనికిని సుస్థిర పరచుకునేందుకు మునుముందు సాధించబోయే విజయలక్ష్యాల సాధనకు
బీహారు అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర
బిందువుగా చేసుకుని ఉండవచ్చు. బీహారులో అనుసరించిన ఎన్నికల వ్యూహం ఒకరకంగా కొన్ని
వర్గాలనుంచి వ్యతిరేకతను కట్టబెట్టినా, రానున్న కాలంలో తమ పార్టీకి మెజారిటీ
ప్రజల మద్దతు కూడగట్టుకునే వ్యూహంలో భాగంగా దాన్ని భావించవచ్చు.
ఏదిఏమైనా బీహారులో నితీష్ కూటమి, ఎగ్జిట్
పోల్స్ లో తేలిన విధంగా రవంత తేడాతో గెలుపొందినా అది మోడీ కూటమికి తలవంపులు తెచ్చే
పరాజయం కాబోదు. ఒకరకంగా గౌరవప్రదమైన ఓటమే అవుతుంది. అలాగే , కొన్ని
సర్వేలు చెప్పిన విధంగా మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించినా, అంతటి
ప్రతికూల పరిస్తితుల్లో కూడా ఆ విధమైన గట్టి
పోటీ ఇవ్వగలిగిన నితీష్ కుమార్ కు అది నైతిక విజయమే అని చెప్పవచ్చు.
ఇక చివరగా చెప్పేది ఏమిటంటే అటు మోడీకి, ఇటు
నితీష్ కు సామాన్య జనంలో ఒక వ్యక్తిగతమైన గౌరవం
వుంది. ఈ ఇద్దరు నాయకులు తాము నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయం
చేస్తారనేది చదువుకున్న యువతీ యువకుల్లో ప్రచారంలో వుంది.
మరి, ఎగ్జిట్ పోల్స్ సంకేతాలకు తగ్గట్టుగా ఈ
ఎన్నికల్లో ప్రజలు తమకు అవసరమయ్యే సంఖ్యాబలాన్ని
బొటాబొటిగా తమకిస్తే, అప్పుడు
వీళ్ళు ఏం చేస్తారనే దానిపై ఒక
చర్చ సాగుతోంది. సాధారణ రాజకీయ పార్టీల
మాదిరిగా ఏదో విధంగా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అడ్డదారులు
తొక్కుతారా, లేక ప్రజాస్వామ్య ప్రియులుగా అధికారానికి దూరం
జరిగి కొత్త బాట పడతారా? వేచి చూడాలి.
పీఎస్: పొతే ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి ఓ మాట.
వీటికి శాస్త్రీయమైన ప్రాతిపదిక వుందని నిర్వాహకులు చెప్పే మాటల్ని అత్యధిక జనం
నమ్మడం లేదు. ఈ సర్వేల విశ్వసనీయతపై ఈ సర్వే సంస్థలే స్వయంగా ఒక సర్వే నిర్వహిస్తే
బాగుంటుందని సూచన. రానున్న రోజుల్లో ఇటువంటి ఎన్నికల సర్వేలు, క్రికెట్ బెట్టింగుల మాదిరిగా వికృత పోకడలకు
దారితీయకుండా ముందు జాగ్రత్తగా ఒక చట్టం తీసుకువస్తే మరింత బాగుంటుంది. (07-11-2015)
NOTE: COURTESY IMAGE OWNER