నేతల హామీలు పునరావృతం కారాదు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నేతల హామీలు పునరావృతం కారాదు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, జులై 2014, శుక్రవారం

నేతల హామీలు పునరావృతం కారాదు


(27-07-2014 -   ఆదివారం సూర్య పత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)
మెదక్ జిల్లాలో  గురువారం ఉదయం  జరగరాని ఘోరం జరిగిపోయింది. మూసాయిపేట రైల్వే క్రాసింగు వద్ద పట్టాలు దాటుతున్న ఓ స్కూలు బస్సును వేగంగా దూసుకొచ్చిన నాందేడ్ పాసింజరు రైలు డీకొట్టింది. నాలుగు వూళ్ళు తిరిగి తమని రోజూ బడికి చేర్చే స్కూలు బస్సు ఆరోజు తమ పాలిట మృత్యు శకటంగా మారుతుందని తెలియని అందులోని చిన్నారులకు అసలు ఏమి జరుగుతున్నదో అర్ధం అయ్యేలోగా బస్సును వున్నపలాన రైలు  ముందుకు లాక్కుపోయింది. ఈ క్రమంలో బస్సు నుజ్జునుజ్జయింది. డ్రైవరు, పన్నెండు మంది పిల్లలు అక్కడికక్కడే కన్నుమూశారు.  మరో ఇద్దరు  ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే  మరణించారు. తీవ్రంగా గాయపడిన ఇరవై ఒక్కమందిని హైదరాబాదు  యశోదా ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. వీరిలో పదకొండుమంది పరిస్తితి విషమంగా వుందని కడపటి వార్తలు తెలుపుతున్నాయి.


సమాచారం తెలియగానే తెలంగాణా ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున అయిదు లక్షల చొప్పున ఆర్ధిక సాయం  ప్రకటించారు. యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను, వారి తలితండ్రులను  పరామర్శించారు. ఖర్చుకు వెనకాడకుండా వారికి అవసరమైన వైద్య సాయం అందించాల్సిందని అక్కడి వైద్యులను కోరారు. మంత్రి హరీష్ రావు హుటా హుటిన బయలుదేరి దుర్ఘటన ప్రదేశానికి చేరుకొని సహాయ కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇరవై అంబులెన్సులను రప్పించారు. గాయపడిన వారిని హైదరాబాదు తరలించారు. కాగా, ప్రమాదం గురించిన సమాచారం తెలియగానే రైల్వే మంత్రి సదానంద్ గౌడ్ లోకసభలో ప్రకటన చేశారు. తక్షణ సాయంగా రైల్వే తరపున మృతుల కుటుంబాలకు రెండేసి లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించడం జరుగుతుందని వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష, గాయపడినవారికి ఇరవై వేల రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అని ప్రాధమిక సమాచారం వల్ల తెలుస్తోందని అన్నారు.
రాష్ట్రపతి, ప్రధాని కూడా దుర్ఘటనపై సంతాప ప్రకటనలు చేశారు. ఆయా పార్టీలకు చెందిన  రాష్ట్ర స్థాయి నాయకులు సరే. అంతా యశోదా  ఆసుపత్రికి క్యూ కట్టారు. బాధితులను పరామర్శించి వారికి తక్షణ సాయం అందేలా తాము శక్తివంచన లేకుండా పాటుపడతామని పాత పల్లవినే అందుకున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు. సరే. ఇవన్నీ కూడా ఒక  పద్దతి ప్రకారం జరిగిపోతుంటాయి. ఇలాటి దుర్ఘటనలు జరిగినప్పుడల్లా పాలక పక్షం వారు షరా మామూలు ప్రకటనలు చేస్తుంటారు. దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మొక్కుబడి హామీలు ఇస్తుంటారు. ప్రతిపక్షాల సంగతి  చెప్పేదేముంది. ప్రభుత్వ అసమర్ధత వల్లనే ఇలాటివి జరుగుతున్నాయని ఆరోపిస్తుంటారు.        
కానీ ఈ ప్రకటనలతో పోయిన ప్రాణాలు తిరిగి రావు. ఈ హామీలతో మళ్ళీ ఇటువంటి దుర్ఘటనలు జరగవన్న  పూచీ కూడా  లేదు.
అసలు చేయాల్సింది ఏమిటి? చేస్తున్నది ఏమిటి?
చక్కగా చదువుకుని జీవితంలో ఎదిగివద్దామనుకున్న చిన్నారుల బతుకు దీపాలు ఈ దుర్ఘటనలో అర్ధాంతరంగా కొండెక్కాయి. ఎవరో చేసిన పొరబాటుకు అన్నం పున్నెం ఎరుగని పసివారు  దారుణంగా మూల్యం చెల్లించారు. బస్సు పట్టాలు దాటే సమయంలో డ్రైవరు సెల్ ఫోనులో మాట్లాడుతున్నాడని కొన్ని వార్తలు తెలుపుతున్నాయి. ఇదే నిజమయితే ఇంతకంటే నిర్లక్ష్యం మరోటి వుండదు.  పొద్దున్నే తయారై , బడికి పోయొద్దామని బయలుదేరిన వాళ్ళలో చాలామంది, తమ కన్నవారికి కడుపుకోతను మిగిల్చి కానరాని  లోకాలకు తరలిపోయారు. పిల్లల్ని స్కూలుకు సిద్ధం చేయించి, ప్రేమగా  గోరుముద్దలు తినిపించి, పుస్తకాల సంచీ, టిఫిన్ బాక్సులూ చేతికందించి దగ్గరుండి బస్సెక్కించిన తలితండ్రులకు ఈ ప్రమాద వార్త ఆశనిపాతంగా మారింది. వారి ఘోష వర్ణనాతీతం.
కాపలా లేని రైలు క్రాసింగు వద్ద జరిగిన దుర్ఘటన మెదక్ జిల్లా లోని నాలుగు గ్రామాల్లో అనేక కుటుంబాల ఇళ్లలో ఆరని శోకం రగిల్చింది. వీళ్ళందరూ కలిగినవాళ్ళు కాదు. పూట కూలీలు చేసుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలతో కాపురాలు నెట్టుకొస్తూ, ఆటోలతో   బతుకు బండి లాగిస్తూ, వున్నంతలో తమ  పిల్లల్ని   మంచి చదువులు చదివించి,  వారికయినా తమకు దక్కని మంచి జీవితం లభించేలా చూడాలని  చిరు ఆశలు పెంచుకున్న బడుగు జీవులు వాళ్లు. చక్కగా తలదువ్వుకుని, యూనిఫారాలు వేసుకుని, భుజాలపై పుస్తకాల సంచీలు వేలాడేసుకుని 'అమ్మా టాటా! నాన్న టాటా! 'అంటూ స్కూలు  బస్సెక్కి పోతున్న పిల్లల్ని చూసుకుంటూ మురిసిపోయే వాళ్లు వారు. చక్కగా మంచి స్కూళ్ళల్లో చదువుకుంటే,  వారి భవిష్యత్తు బంగారం అవుతుందనీ కమ్మని కలలు కనే వాళ్లు వారు. అలాటి వాళ్ల కన్నుల్లో ఇవాళ కనబడుతోంది కన్నీళ్ళే. ఇవి తుడిచినా ఆరేవి కావు. కానీ తుడిచేవాళ్ళే లేరు. అందరూ హామీలు ఇచ్చేవాళ్ళే. ఇదొక విషాదం.
ఈ సందర్భంలో మరో కోణం గురించి కూడా విశ్లేషించుకోవడం సముచితంగా వుంటుంది. ఏ దేశంలో అయినా డ్రైవరు పని అంటే మామూలు కాదు. డ్రైవింగు లైసెన్సు సంపాదించడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ మనదగ్గర మాత్రం  పైసా వున్నా,  పలుకుబడి వున్నా  లైసెన్సు ఎగురుకుంటూ వచ్చి వల్లో పడుతుంది. దేశ ఆర్ధిక పరిస్థితులు కూడా అలాగే వున్నాయి. చదువుకున్నా లేకపోయినా డ్రైవింగ్ తెలిస్తే పొట్టపోసుకోవచ్చు అనే అభిప్రాయం పల్లె పట్టుల్లో పెరిగిపోతోంది. లక్షలు పోసి బస్సులు కొనే స్కూలు యాజమాన్యాలు కూడా నైపుణ్యం  కలిగిన డ్రైవర్లకు మంచి జీతాలు ఇవ్వడానికి వెనుకాడతాయి. గీసి గీసి బేరమాడుతాయి. ఫలితం. అనుభవం లేని డ్రైవర్లు. డబ్బులు అదనంగా వస్తాయనుకుంటే నిద్రమానుకుని అదనపు పని గంటలు పనిచేసే డ్రైవర్లు స్కూలు బస్సులు నడుపుతుంటారు.  యజమానులకి కావాల్సింది అదే. ఏదో విధంగా పని నడిచిపోతే చాలు. మరి ప్రమాదాలు జరుగుతున్నాయంటే జరగవా. జరక్కపోతేనే ఆశ్చర్యపడాలి.
విలువలకు ప్రాణం ఇచ్చే ఈ పుణ్య భూమిలో ప్రాణాలకు విలువలేకుండా పోవడం మరో విషాదం.
పోతే, ప్రస్తుతానికి వస్తే,  కాపలాలేని రైలు క్రాసింగులు దేశంలో వేలకొద్దీ, రాష్ట్రంలో వందలకొద్దీ వున్నాయి. గేట్లు పెట్టి కాపలా సిబ్బందిని నియమించాలంటే ఒక్కొక్కదానికీ ఏటా ముప్పయి, నలభయ్ లక్షల రూపాయలు అదనంగా ఖర్చవుతుందని, లక్షల్లో  జీతాలు తీసుకుంటూ  అప్పనంగా లెక్కలు చెప్పే అధికారులు వందల సంఖ్యలో ఎప్పుడూ  సిద్దంగానే వుంటారు. వారి దృష్టిలో ఇది  అనవసరపు వ్యయం. మరోపక్క, పర్తి రైల్వే మంత్రీ   ఇన్నేళ్ళ వ్యవధిలో కాపలా లేని రైల్వే క్రాసింగులు అసలు వూసులోకి లేకుండా చేస్తామని పార్లమెంటు సాక్షిగా హామీలు ఇస్తూనే వుంటారు. అవన్నీ రికార్డుల్లో భద్రంగా వుండిపోతాయి.
అనకూడదు కానీ, ఈ లోగా ఇంకో సంఘటన చోటుచేసుకుంటుంది. మరికొందరి ప్రాణాలు గాలిలో కలుస్తాయి. మళ్ళీ యధావిదిగా ఎక్స్ గ్రేషియా ప్రకటనలు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కానిచ్చేది లేదని  షరామామూలు హామీలు. ఇదో విష చక్ర భ్రమణం.
పునరావృతం కానివ్వమనే ప్రకటనలు,  పునరావృతం కాని మంచి రోజులకోసం వేచి వుండడమే సాధారణ  ప్రజలకు మిగిలింది.   (25-07-2014)