హైదరాబాదు నగరాన్ని క్రమబద్దీకరణతో కూడిన ఒక
అధునాతన నగరంగా రూపొందించాలని తెలంగాణా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు చేస్తున్న
ప్రయత్నాలు, రూపొందిస్తున్న ప్రణాళికలు హర్షించదగినవే. ఆహ్వానించదగినవే. తెలంగాణా
రాజధానికి ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు వుంది. అనేక అంతర్జాతీయ సంస్థలు హైదరాబాదులో తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. గత
అయిదేళ్ళ కాలంలో పరిపాలనా పరంగా ఏర్పడ్డ అనిశ్చితి, ప్రాంతీయ ఉద్యమం కారణంగా
కొనసాగిన అసంగ్దిగ్ధ స్తితి మరికొన్ని విదేశీ సంస్థలు నగర ప్రవేశం చేయడానికి
అడ్డంకిగా మారాయి. ఇప్పుడా పరిస్తితి లేదు. కాకపొతే పెట్టుబడులు భారీగా
పెట్టేందుకు రాష్ట్రానికి వచ్చేవారు అనేక విషయాలు ముందుగా ఆలోచించుకుంటారు.
వాటిల్లో ప్రధానమైనది శాంతిభద్రతల అంశం. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునే కొత్త
ముఖ్యమంత్రి హైదరాబాదును నేరరహిత నగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచన చేస్తున్నట్టుంది.
పోలీసు బలగాల సంఖ్యను పెంచడం, విధులను మరింత వేగంగా సమర్ధంగా నిర్వహించేందుకు
వీలుగా వారికి అవసరమైన అధునాతన సదుపాయాలు కల్పించడం ఇలాటివన్నీ ఆ ఆలోచన నుంచి
పురుడుపోసుకున్నవే. ఈ క్రమంలోనే కాబోలు నగరంలో రోజురోజుకూ విచ్చలవిడిగా
పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలనే గట్టి నిర్ణయానికి ఆయన
వచ్చినట్టు తోస్తోంది. అయితే దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం తలపెట్టిన
కూల్చివేతల కార్యక్రమం రాజకీయ వర్గాల్లోనే కాక సాధారణ ప్రజల్లో కూడా అలజడి
రేపుతోంది. కొందరు దీనికి రాజకీయ ఉద్దేశ్యాలు ఆపాదిస్తుంటే మరికొందరు తొందరపాటు
చర్యగా పరిగణిస్తున్నారు. అయినా ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని, అక్రమనిర్మాణాలను
ఎట్టి పరిస్తితిలోను అనుమతించేది లేదనీ, హైదరాబాదును అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన
మహా నగరంగా తయారుచేయాలన్న స్వప్నం నిజం చేసుకోవాలంటే అక్రమార్కులపై కొరడా విదల్చక
తప్పదనీ ముఖ్యమంత్రి మరోమారు స్పష్టం చేయడంతో ఈ
విషయంలో ఆయన యెంత పట్టుదలగా
వున్నారో అన్న సంగతి అర్ధం అవుతోంది.
ఉద్దేశ్యం మంచిదే. పెట్టుకున్న లక్ష్యం గొప్పదే.
కానీ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆచరణలో దోవతప్పి మరో బాట పట్టడం కొత్త విషయం
ఏమీ కాదు. యెంత మంచి పధకం అయినా ప్రజల మద్దతు
లేనిదే విజయవంతం కానేరదు. ఈ ఒక్క విషయంలో
ముఖ్యమంత్రి తన పట్టుదలకు కొంత వివేచన జత చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం
అవుతోంది.
నిబంధలలోని లొసుగులను అడ్డం పెట్టుకుని గృహనిర్మాణ రంగంలోని
వ్యాపారస్తులు ఇబ్బడిముబ్బడిగా డబ్బు కొల్లగొడుతున్నారన్న ఆరోపణల్లో వాస్తవం
లేకపోలేదు. అయితే ఈ అక్రమ నిర్మాణాలకు కారణభూతులయిన పెట్టుబడిదార్లు ఇలాంటి
కూల్చివేతల వ్యవహారం వచ్చేసరికి పూర్తిగా రంగం నుంచి తప్పుకుంటారు. అక్రమ
స్థలాల్లో అక్రమ పద్దతుల్లో నిబంధనలను కాలరాసి, డబ్బుకు గడ్డితినే సిబ్బందిని
మామూళ్ళతో వశపరచుకుని సాగించే నిర్మాణాలు కాబట్టి కొంత చవకగా అమ్మే వెసులుబాటు
వారికి సహజంగా వుంటుంది. ఇదిగో ఇక్కడే, దిగువ మధ్య తరగతి ఆదాయ వర్గాలు వారికి శలభాల్లా
చిక్కుతారు. పదిమంది కొంటున్నప్పుడు మనకేమవుతుంది అనే ధీమా, గతంలో ఇలా కొన్న
భవనాలను గత ప్రభుత్వాలు క్రమబద్ధీకరించిన వైనాలు వారిని ఇలాటి నిర్మాణాలను కొనుగోలు
చేయడానికి పురికొల్పుతాయి. జీవిత పర్యంతం కూడబెట్టుకున్న డబ్బు, అదీ చాలకపోతే అప్పోసప్పో
చేసయినాసరే హైదరాబాదు నగరంలో ఒక గూడు అంటూ
ఏర్పాటుచేసుకోగలిగితే ఎప్పటికో అప్పటికి అదే ఓ పెద్ద ఆసరా అవుతుందన్న ఆశా, వారిచేత చేయకూడని ఇలాటి పనులు చేయిస్తాయి.
అందుకే ఇలాటి సందర్భాలలో పూర్తిగా నష్టపోయేది ఈ తరగతి వారే అవుతున్నారు.
హైదరాబాదు నగరంలో ఈ రకంగా నిబంధలకు విరుద్ధంగా
కట్టిన భవనాలు అరవై వేలవరకు వుండవచ్చని ఓ అంచనా. ప్రస్తుత భవన నిర్మాణ వ్యయాన్ని
ప్రామాణికంగా తీసుకుని లెక్కలు వేస్తె ఈ అక్రమ భవనాల మీద పెట్టుబడి
కోట్లరూపాయాల్లో వుంటుంది. వీటిని కూల్చివేయడం అంటే, సిమెంటు, ఇసుక, ఇనుము వంటి ఖరీదయిన నిర్మాణ
సామాగ్రితో పాటు వేలకొద్దీ కార్మికుల శ్రమదమాదులు కూడా వృధా అయినట్టే. ఇక్కడే ఒక
జవాబు దొరకని, దొరకాల్సిన ప్రశ్న తలెత్తుతొంది.
తెలంగాణాను అవినీతిరహిత రాష్ట్రంగా తయారు
చేయాలనే సత్సంకల్పం కలిగిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దృష్టి సారించాల్సిన అంశం కూడా ఇదే. ఒక బహుళ అంతస్తుల
భవననిర్మాణం అనేది ఒక్కరాత్రిలోనో లేదా కొన్ని రోజుల్లోనో పూర్తయ్యే వ్యవహారం
కాదు. సంబంధిత అధికారుల కన్నుగప్పి నిర్మాణం సాగించడం కూడా వీలుపడే విషయం కాదు.
కాబట్టి సర్కారు విదిలిస్తున్న మొదటి
కొరడా దెబ్బ పడాల్సింది అక్రమార్కులకు ఏదో రూపంలో సహకరిస్తున్న అధికారులు, వారి
సిబ్బంది మీద. ఇలా వాదించడం అక్రమ నిర్మాణదారులను సమర్ధించడానికి ఎంతమాత్రం కాదు.
కూల్చివేతల భయం కలిగించడం ద్వారా అక్రమనిర్మాణాల జోలికి పోరాదని ఎలాగైతే ప్రజానీకంలోకి
హెచ్చరికలు పంపాలని పాలకులు భావిస్తున్నారో, అలాగే కొందరు అధికారుల మీద రాజీ లేని కఠిన
చర్యలు తీసుకోగలిగితే ఇలాటి అక్రమాలకు శాశ్వితంగా అడ్డుకట్ట వేయడానికి
సాధ్యపడుతుంది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వానికి ఈ విషయంలో వున్న చిత్తశుద్ధి పట్ల
ఎవరికయినా ఏమైనా సందేహాలు వుంటే అవి
నివృత్తి అవుతాయి.
ఇప్పుడు వున్న అక్రమ నిర్మాణాలతో పాటు
ఇప్పటినుంచి నగరంలో ఎక్కడయినా అక్రమ నిర్మాణం జరిగినా లేదా జరుగుతున్నా దానికి
సంబంధించిన సమాచారం నిర్దిష్టంగా అందితే
ముందు ఎలాటి సంకోచం లేకుండా సంబంధిత అధికారులను సస్పెన్షన్ తో
సరిపుచ్చకుండా శాశ్వితంగా ఉద్యోగాలనుంచి తొలగించాలి. అలాగే, ముఖ్యమంత్రి వీలు
చేసుకుని ప్రతిరోజూ ఈ కూల్చివేతల వ్యవహారాన్ని స్వయంగా సమీక్షించాలి. ఎక్కడా ఎలాటి
లొసుగులకు చోటివ్వని రీతిలో అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన నిర్దారించుకోవాలి.
నగరాన్ని సుందరంగా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి
అభిలాష పూర్తిగా నెరవేరాలంటే, నగరంలో కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతాలలో
ఉన్నతాధికారులు పర్యటించి పరిస్తితులను పరిశీలించాలి. సగం సగం కూల్చిన ఇళ్ళు,
అడ్డదిడ్డంగా కూల్చిన అపార్ట్ మెంట్లు నగరం
నలుమూలలా అలా అందవికారంగా కనబడుతుంటే అది
నగరానికి ఏమాత్రం శోభనివ్వదు.