ఆంద్ర ప్రదేశ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆంద్ర ప్రదేశ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జూన్ 2015, బుధవారం

హితవాక్యము


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 11-06-2015, THURSDAY)

'క్రమక్రమముగా కొలువుకూటము రణకూటమగుచున్నది, పదువురుండగనే నా మాటలాలకింపుడు' అంటాడు పాండవుల పనుపున దూతగా వచ్చిన శ్రీకృష్ణుడు కౌరవసభలో ధృతరాష్ట్రుడితో.
ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ రంగం  సమరాంగణంగా మారుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు ఉవ్వెత్తుతున్నాయి. ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. మీడియాలో చర్చలు, ఎవరివాదాన్ని వారు బలంగా వినిపించే ధోరణితో పేట్రేగిపోతూ దారితప్పుతున్నాయి. ఒకరు చెప్పేది మరొకరు వినిపించుకోరు. తమ మాటే వినాలని, తమ ప్రశ్నకే జవాబు చెప్పి తీరాలని, అ సమాధానం కూడా తమకు అనుకూలంగా వుండాలని పట్టుబట్టే పెడ ధోరణే  జడలు విప్పుకుంటోంది.  ఈ వేడిలో, వాడిలో  వివేచన వెనక్కు తప్పుకుంటోంది. తప్పు మీదంటే మీదని బురద చల్లుకునే క్రమంలో తప్పు చేయడం అసలు  తప్పేకాదన్న రీతిలో భాష్యాలు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న అధినాయకులే యుద్ధరంగంలో దిగి సమర శంఖాలు పూరిస్తూ వుండడంతో కధ క్లైమాక్స్ కు చేరుతోంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు అనుచర గణాలు ఈ విషయంలో  నాయకులను మించి గొంతులు పెంచి నానా యాగీ చేస్తున్నాయి. మొన్న ఒక టీవీ ఛానల్ చర్చకు వచ్చిన ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి నిస్సిగ్గుగా చెప్పాడు, 'ఈ విషయంలో జర్నలిష్టులయినా, విశ్లేషకులయినా ఎవరయినా సరే, ఏ ఒక్కర్నీ ఉపేక్షించవద్దు, గట్టిగా తిప్పికొట్టండి, మన వాదాన్ని బలంగా వినిపించండి'  అంటూ తమ నాయకుడే తమను ఆదేశించాడని. నిజానికి ఏ నాయకుడు అలా చెప్పడు. ఆ పార్టీ ప్రతినిధి అమాయకంగా చెప్పాడో, కావాలని చెప్పాడో కాని అదే  నిజమయితే ఆ పార్టీ నాయకుడికి అది యెంత అప్రదిష్ట.
రాళ్ళు కలిసిన బియ్యం వొండితే అన్నంలో రాళ్ళు పంటికి తగులుతాయి. జల్లెడ పట్టి రాళ్ళను వేరు చేస్తే వొండిన అన్నం నోటికి హితవుగా వుంటుంది. చదువూ సంధ్యాలేని గ్రామీణ ప్రాంతాల వాళ్లకు కూడా తెలిసిన ఈ నిజం నేటి రాజకీయ నాయకులు అర్ధం చేసుకోలేక పోతున్నారు. అర్ధం అయినా అవకాశం కోసం అర్ధం కానట్టు వుండిపోతున్నారు అనుకోవాలి.
ఏవిషయం వచ్చినా, ఏ  సమస్య వచ్చినా ముందు రాజకీయం అనే రక్కసి అందులో చేరి  పడగలు విప్పుతోంది. దాంతో ప్రతిదీ రాజకీయమయం అయిపోతోంది. ఎవడో ఒకడు ఒక నేరం చేస్తాడు. లేదా చట్టాన్ని ఉల్లంఘిస్తాడు. అతడు ఏదో ఒక పార్టీవాడు అయితే ఇక అంతే సంగతులు.  ఆ  పార్టీ అతడికి  కొమ్ము కాస్తుంది. వెంటనే ఎదుటి పక్షం  తన పల్లవి తాను అందుకుంటుంది. ఇలా రాజకీయం రంగ ప్రవేశం చేయడంతో ఆ మనిషి చేసిన నేరం కాస్తా  నేపధ్యంలోకి వెళ్ళిపోతుంది. ఇలాటి విషయాల్లో ఈ పార్టీ ఆ పార్టీ అని పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ప్రతి పార్టీ చేసే పని ఇదే. నేరం చేసిన వాడు పరాయి వాడు అయితే, 'చట్టం తన పని తను చేసుకు పోతుంది, చట్టానికి ఎవరూ అతీతులు కారు'  అంటూ బుడిబుడి రాగాలు తీస్తారు.  తమవాడే  అయితే 'చట్టం పాలకుల చేతిలో చుట్టం' అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. తప్పుచేసిన వాడిని పోలీసులు విచారిస్తే, అది సరికాదు, సీబీ  సీ ఐ డీ దర్యాప్తు కోసం గగ్గోలు పెడతారు. సీబీ సీ ఐ డీ విచారణ చేస్తుంటే, అది ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ, సీ బీ ఐ దర్యాప్తు అంటారు. సేబీఐ పరిస్తితీ ఇంతే, అది కేంద్రం చేతిలో ఆటబొమ్మ అంటారు. ఇలా వ్యవస్థలను భ్రష్టుపట్టించే అసంబద్ధ ఆరోపణలు చేస్తూ విచారణను నీరుకారుస్తారు. నేరారోపణలు ఎదుర్కున్న వ్యక్తులు కొన్నాళ్ళ తరువాత  హాయిగా జనం మధ్యే తిరుగుతుంటారు. ఇదీ కొన్నేళ్లుగా జరుగుతున్న కధ. ఇప్పుడు నడుస్తున్న కధ కూడా దానికి పొడిగింపే.        
ముందు చెప్పినట్టు బియ్యంలో రాళ్ళు కలగలసిపోయినట్టు ఈ నాడు నేరాలు, రాజకీయాలు జమిలిగా ముడి పడిపోయాయి. వీటిని విడదీసే జల్లెడలు లేవు. వున్నా రాజకీయ పార్టీలకి వాటి అవసరం లేదు. వాళ్లకి కావాల్సిందల్లా తమ వాళ్ళను కాపాడుకోవడం, వాళ్లు నేరస్తులయినా ఒకటే, కాకపోయినా ఒకటే. ఎదుటివాడయితే చేతిలో వున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులు పెట్టడం. మనవాడయితే వాటినుంచి బయటపడవేయడం. ఇదే నేటి రాజకీయ ధర్మం. 'ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంద'ని ఉవాచ. రాజకీయ పార్టీలు కూడా తాము నమ్మిన 'ఆ  ధర్మమే' తమను కాపాడుతుందని భావిస్తూ  తాము పెంచి పోషిస్తున్న  'అధర్మాన్నే' సదా కాపాడుతూ పోతుంటారు.
అందుకే, ఈనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల నడుమ తీవ్రం అవుతున్న వివాదాలు, వాటిపై అధినాయకుల సవాళ్లతో కూడిన ప్రకటనలు విన్నప్పుడు , వాటిపై టీవీల్లో  చర్చిస్తున్నప్పుడు చాలా బాధ వేస్తోంది. ఆ బాధ ఇప్పుడు భయంగా పరిణమిస్తోంది. ఏ ఒకరిద్దరికో కాదు, ఉభయ ప్రాంతాల్లో ఈ విధంగా ఆవేదన చెందుతున్న వారి సంఖ్య గణనీయంగానే వుంది. ఉభయ పక్షాలు ఇది గమనంలో పెట్టుకుని వ్యవహరించాలి.

ఏడాది గడిచింది రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి. రెండింటిలో పూర్తి సంఖ్యాబలం కలిగిన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. నాయకుల సమర్ధతను గీటు రాయిగా తీసుకుని  ఆయా రాష్ట్రాల ప్రజలు  రెండింటికీ, ఇద్దరు ముఖ్యమంత్రులకు అధికారం అప్పగించారు.  కొత్తగా పురుడు పోసుకున్న రెండు కొత్త రాష్ట్రాలను మొత్తం దేశంలో అగ్రగామి రాష్ట్రాలుగా తీర్చిదిద్దుతామని రెండు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు  మొదట్లో ప్రకటించినప్పుడు 'పరవాలేదు మంచి రోజులు రాబోతున్నాయి' అన్న ఆనందం అందరి గుండెల్లో నిండింది. అది ఏడాది గడవక ముందే ఇలా ఆవిరి అయిపోతుందని అప్పుడు ఎవరూ అనుకోలేదు. రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా కొంపలు మునగవు. అయితే వారిని మెప్పించడానికి వారి అనుచరగణాలు అత్యుత్సాహంతో బుల్లితెర చర్చల్లో చేసే విపరీత వ్యాఖ్యానాలు  జనంలోకి చేరిపోయి వారు కూడా  రెచ్చిపోతేనే అసలు సమస్య. ఏదైనా వివాదం వచ్చినప్పుడు పూర్తిగా ఒక వాదననే సమర్ధించడం అంటే సమస్యను మరింత జటిలం చేయడమే. పడిన ముళ్లు, లేదా తగిలించుకున్న ముళ్లు  మరింత బిగిసిపోకముందే ఉభయ ప్రాంతాల నాయకులు కళ్ళు తెరవాలి.  వ్యవహారాలు చేయిదాటిపోనివ్వకూడదు. నిజానికి ఇది బాధ్యతతో కూడిన కర్తవ్యం.  రెండు ప్రాంతాలలో వాతావరణం తేలిక పడే విధంగా వారి అడుగులు పడాలి. పోరాటాలు రెండు రాజ్యాల మధ్య జరగడం చరిత్రలో చదివాము. రెండు రాష్ట్రాల మధ్య కాదు. విజ్ఞతతో కూడిన సంయమనం నేటి అవసరం.  నచ్చినా నచ్చకపోయినా రెండు ప్రాంతాల ముఖ్యమంత్రులకు నా విజ్ఞప్తి ఇదే. (10-06-2015)


(చెడు వినకు, కనకు, మాట్లాడకు)
మహానుభావులు, కీర్తిశేషులు 'బాపు' గారికి కృతజ్ఞతలతో 

28, మార్చి 2010, ఆదివారం

శాసన సభలు- ప్రత్యక్ష ప్రసారాలు (వార్తావ్యాఖ్య - భండారు శ్రీనివాసరావు)



శాసన సభలు- ప్రత్యక్ష ప్రసారాలు  (వార్తావ్యాఖ్య - భండారు శ్రీనివాసరావు)


చాలా ఏళ్ళ క్రితం -
అటు పార్లమెంట్ సమావేశాలు కానీ, ఇటు శాసనసభ సమావేశాలు కానీ ప్రారంభం అయ్యే తరుణంలో  రేడియో, దూరదర్శన్ లలో ఒక రోజుముందు - 'యిస్యూస్ బిఫోర్ ది హవుస్' (చట్టసభలో చర్చకు రానున్న అంశాలు) అనే  శీర్షికతో పేరెన్నికగన్న జర్నలిస్టులతో కార్యక్రమాన్ని ప్రసారం చేసేవారు. దరిమిలా జరిగే చట్టసభల సమావేశాల్లోని చర్చల్లో - ఈ నిపుణుల అభిప్రాయాల ప్రభావం స్పష్టంగా కనబడేది. అలాగే సమావేశాలు జరిగినన్నాళ్ళు- ప్రతిరోజూ రాత్రి పదిహేను నిమిషాలపాటు జర్నలిస్టులతో రాయించిన సమీక్షలు రేడియోలో ప్రసారమయ్యేవి. ఆకాశవాణి వార్తావిభాగం సిబ్బందికి అసిధారావ్రతం లాంటి కార్యక్రమం ఇది. జర్నలిస్టులు రాసుకొచ్చిన సమీక్షను ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తరవాతగానీ ప్రసారం చేసేవాళ్ళు  కాదు. ఎందుకంటె ఏమాత్రం తభావతు వచ్చినా 'సభాహక్కుల ఉల్లంఘన'  కిందికి వస్తుందన్న భయం అనండి  ఇంకేదన్నా అనండి - అన్ని జాగ్రత్తలు తీసుకునేలా జాగరూకులను చేసేది. రేడియోలో ప్రసారం అయ్యే ఈ సమీక్షలను శాసన సభ్యులు నివసించే ప్రాంగణాల్లో మైకుల ద్వారా వినిపించేవాళ్ళు. వినే శ్రోతలకు కరవు వుండేది కాదు. స్తానిక సమస్యలను  శాసన సభలో-   తాము లేవనెత్తిన వయినం గురించి తమ నియోజక వర్గాలలోని జనాలకు తెలియడానికి బాగా ఉపయోగపడుతుందన్న అభిప్రాయం చాలామంది సభ్యులలో ఉండడంవల్లనొ ఏమో గానీ వారు కూడా ఈ కార్యక్రమం పట్ల యెంతో ఆసక్తి చూపడం ఆనాటి  రేడియో విలేకరిగా నా స్వానుభవం.  విమర్శలు, ప్రతి విమర్శలు ఒక  స్తాయికి మించి ప్రసారం చేయకపోవడం వల్ల - ఛలోక్తులకు తగిన స్తానం కల్పించడంవల్లా - ఈ కార్యక్రమ ప్రభావం సభలో ప్రతిఫలించేది. 
ఇక ప్రస్తుతానికి వస్తే-
టీవీ చానళ్ళ విస్తృతి, వాటిమధ్య పోటీల నీలినీడలు శాసన సభల పని తీరుపై ముసురుకుంటున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో ఈ అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. శాసన సభ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు మొదలయినప్పుడు ప్రజాస్వామ్య ప్రియులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల వాణి జనాలకు వినపడుతుందని  ఆశపడ్డారు.అర్ధవంతమయిన చర్చలను ఆస్వాదించే అవకాశం లభించిందని సంబరపడ్డారు.  కానీ, సంచలనం ఒక్కటే ఈ ప్రసారాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం వుందని ఊహించలేకపోయారు. ఈ ప్రసారాల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్న ఒక జర్నలిష్టు మిత్రుడొకరు చేసిన వ్యాఖ్య సమంజసమనిపించేదిగా వుంది. సభ సజావుగా జరుగుతోందన్న అభిప్రాయం లేశ మాత్రంగా కలిగినాసరే - ప్రత్యక్ష ప్రసారాన్ని తక్షణం నిలిపివేసి - టీవీ యాంకర్ మరో అంశానికి మారిపోతాడట. టీవీల కోణం నుంచి చూస్తే ఇందులో అసహజమయినది ఏమీ వుండదు. ఎందుకంటె సంచలనం లేకుండా చూపిస్తే చూసేవాళ్ళు వుండరన్నది వారి అభిప్రాయం అయివుండవచ్చు. కానీ దీని ప్రభావం సభ జరిగే తీరుపై పడుతోందన్నది కూడా కాదనలేని నిజం. వీక్షకులు కూడా సంచలనాన్నే కోరుకున్న పక్షంలో ఇక ఈ విషవలయం నుంచి బయటపడడం కష్టం. అయితే ఈ విషయం నిర్ధారణ చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదన్నది సయితం అంగీకరించాల్సిన అంశం. 
చట్ట సభల సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఆశించిన సానుకూల ఫలితాలు ఒనగూరాయా అన్న విషయంపై  సమగ్ర చర్చ జరగాల్సి వుంది. సానుకూల ఫలితాల సంగతి సరే, ప్రతికూల  ఫలితాలు గురించి కూడా దృష్టి సారించాలి. అయితే ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చట్ట సభల్లో తాము ఎన్నుకున్న సభ్యుల ప్రవర్తన ఏవిధంగా వుందో గమనించుకోవడానికి వోటర్లకు వున్న  ఒకే ఒక అవకాశం ఈ  ప్రత్యక్ష ప్రసారాలే  అన్న అంశాన్ని మరువకూడదు.
అందుకే, సమస్యతో సంబంధం వున్న వాళ్ళందరూ ఈ చర్చలో భాగస్వాములు కావాలి. ఎవరి పాత్ర ఎంతవరకో స్వచ్చందంగా నిర్దే సించుకోవాలి. అనారోగ్యకరమయిన సంచలన ప్రసారాలకు స్వచ్చందంగా అడ్డుకట్ట వేసుకోవాలి. సహేతుక విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు సరైన అవకాశం సభలో లభించాలి. అయితే విమర్సల పేరుతో సభా సమయం వృధా చేయని తత్వాన్ని అవి అలవరచుకోవాలి. అదేసమయంలో -  సంచలనానికి సంయమనం జోడించి నిఖార్సయిన సమాచారం అందించే భాద్యతను మీడియా నెత్తికెత్తుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో తమవంతు కర్తవ్యాన్ని నలుగురూ కలసి  కలసికట్టుగా నిర్వర్తించినప్పుడే ప్రజాస్వామ్య సౌద పునాదులు నాలుగు కాలాలపాటు పటిష్టంగా మనగలుగుతాయి.(28-03-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.


                                                      


Y