1, మార్చి 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (275) : భండారు శ్రీనివాసరావు

 పాలించడానికి కాదు, ప్రశ్నించడానికి

‘ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడుగంటలకు హైదరాబాదు ప్రెస్ క్లబ్ కు వెళ్ళాలి, అక్కడ అందరం కలవాలి, ఇది పిలుపులు లేని పేరంటం’ అని మిత్రుడు జ్వాలా చెప్పిన విషయం మొన్న శుక్రవారం నాడు పొద్దుగుంకుతున్న సమయంలో జ్ఞాపకం వచ్చింది.
తయారయి ఏడుగంటల కల్లా అక్కడ వుండాలి అనే ఉద్దేశ్యంతో ఉబెర్ యాప్ ఓపెన్ చేశాను.
నిజానికి నేను రెగ్యులర్ గా డ్రైవర్లను బుక్ చేసే షఫీకే ముందు ఫోన్ చేశాను. రంజాన్ మాసం కావడం వల్ల ఆ సమయానికి డ్రైవర్లు అందుబాటులో లేరు. మామూలుగా అయితే అరగంట ముందు చెప్పినా డ్రైవర్ వచ్చేవాడు.
ఓలా, ఉబెర్ లు అంతర్జాతీయ కంపెనీలు. కష్టమర్లను ఆకర్షిస్తూనే మరోపక్క లాభాలు ఆర్జించడం వాళ్ళ ధ్యేయం.
పదేళ్ల క్రితమో అంతకు కొంత ముందో ఈ కొత్త రకం రవాణా వ్యవస్థ హైదరాబాదులో ప్రవేశించిన నాటి నుంచి నేను వీటికి కష్టమర్ ని. సొంతానికి కారు వుందన్న మాటే కానీ, మధ్యలో ఆగితే కారు తోయడం కూడా తెలవదు. నాలాంటి వారికి ఆ రోజుల్లో ఈ ఉబెర్లు, ఓలాలు వరప్రసాదంలా దొరికాయి. ఆటో చార్జీతో సమానంగా వీటి ఛార్జీలు వుండేవి. హాయిగా ఏసీ కార్లో కాలుమీద కాలు వేసుకుని, ఎక్కడికి కావాలంటే అక్కడికి, ‘లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు’ అని చెప్పే పనిలేకుండా, గమ్యస్థానం దగ్గరే నేరుగా దిగిపోవచ్చు’ అనే సాధారణ మధ్యతరగతి మనస్తత్వం ఈ కంపెనీలకు కాసులు కురిపిస్తోంది. చౌకగా జనాలకు అలవాటు చేసి తరువాత తరువాత రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటూ పోవడాన్ని కష్టమర్లు నిస్సహాయంగా చూస్తూనే వాటికి అలవాటు పడిపోయారు. మల్టీ నేషనల్ కంపెనీల అసలు గుట్టు ఇదే. ముందు అలవాటు చేయాలి. తరువాత తరువాత ఎంతగా రేట్లు పెంచినా, పెంచిన రేట్లకు జనమే కిమ్మనకుండా అలవాటుపడిపోతారు. ఈ సూత్రంతోనే అవి నడుస్తుంటాయి. మనల్ని నడిపిస్తుంటాయి.
వీటికి సొంతంగా ఒక్కటంటే ఒక్క కారు వుండదు. కానీ వేలాది కార్లు ఈ బ్రాండ్ తో నడుస్తుంటాయి. టెక్నాలజీతో కారు డ్రైవర్ ని, వినియోగదారుడుడిని కలపడం ఒక్కటే వీళ్ళు చేసే పని. ఒకరకంగా చెప్పాలి అంటే చిట్ ఫండ్ వ్యాపారం. అందులో నిర్వాహకులకు ఒక్క రూపాయి ఖర్చు వుండదు. డబ్బు అవసరం వున్నవాడిని, అంతగా లేని వాడిని కలపడం. అవసరం వున్నవాడు పాడుకుంటాడు, కొంత నష్టానికి. ఆ నష్టమే అవసరం లేని వాడికి లాభంగా మారుతుంది. ఆ లాభాల్లో సింహభాగం చిట్ ఫండ్ కంపెనీ వాడు వుంచుకుని మిగిలిన డబ్బుని పాట పాడని వాళ్ళకు పంచడం. ఈ రవాణా కంపెనీ వాళ్ళదీ ఇదే వరస.
ఆ శుక్రవారం అదృష్టం కొద్దీ ఉబెర్ కారు తొందరగానే వచ్చింది. డ్రైవర్ పేరు వెంకటేష్. పిన్ నెంబరు చెప్పగానే డోరు తీశాడు. యాప్ లో ప్రెస్ క్లబ్ చేరే టైము చూపిస్తోంది. పర్వాలేదు పది నిముషాలు ముందే వుంటాను అనుకున్నాను, కారులో సర్దుకుని కూర్చొంటూ.
‘మీరు జర్నలిస్టా?’ అడిగాడు, కారు మెయిన్ రోడ్డు మీదకు పోనిస్తూ.
‘ఏమీ లేదు, ప్రెస్ క్లబ్ కు వెడుతున్నారు కదా! అందుకని అడిగాను’ అన్నాడు అతడే వివరణ ఇస్తూ.
ఇలా వెళ్ళే సమయాల్లో డ్రైవర్లు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. అన్యమనస్కంగానే వింటూ వుంటాను. కొంత స్వార్ధం కూడా వుంది. ఒక్కోసారి రాసుకోవడానికి మంచి విషయాలు తెలుస్తుంటాయి.
‘రాఘవ్ చద్దా రీల్స్ చూస్తుంటారా!’ అని అడిగాడు డ్రైవర్ వెంకటేష్. ఈ మధ్యనే ఎవరో మిత్రుడు చెబితే ఒకటి రెండు సార్లు రాజ్యసభలో రాఘవ్ చద్దా చేసిన కొన్ని ప్రసంగాలు విన్నాను. అతడు ఏ పార్టీ వాడో కూడా తెలియదు. సాధారణ ప్రజలు నిత్య జీవితంలో ఎదుర్కునే సమస్యలను ప్రస్తావిస్తూ వుంటాడు. ఆ రాఘవ్ చద్దా పేరు ఒక సామాన్య టాక్సీ డ్రైవర్ నోట వినడం నాకు చాలా వింతగా అనిపించింది.
రద్దీ రోడ్డుపై లాఘవంగా డ్రైవ్ చేస్తూనే వెంకటేష్ రాఘవ్ గురించి చెబుతూనే వున్నాడు.
‘నాకు ఆయన ఏ పార్టీవాడో తెలియదండీ. ఎప్పుడు మాట్లాడినా దేశంలో చిన్న మనుషుల సమస్యలే మాట్లాడుతాడు. నిజానికి అవి చిన్నవాళ్ల పెద్ద సమస్యలు. పెద్దవాళ్లకు అసలు పట్టని సంగతులు. ఆయన అవే మాట్లాడుతాడు. పెద్ద ఉపన్యాసాలు చేయడు. అయిదు కిలోల రేషన్ కోసం వేలిముద్రలు అడుగుతారు. యూరియా కొనాలి అంటే వేలి ముద్రలు తీసుకుంటారు. మరి, అతి ముఖ్యమైన ఓటు వేయడానికి వేలిముద్రలు ఎందుకు తీసుకోరు. ఓటును వేలిముద్రకు ముడిపెడితే దొంగ ఓట్ల బెడద వుండదు కదా! అని ఒకసారి చెప్పాడండీ. ఎంతచక్కని మాట! నాకు బాగా నచ్చిందండీ’ చెబుతున్నాడు వెంకటేష్.
‘ఆయన చెప్పేవన్నీ ఇలాంటివేనండీ. ఎవర్నీ ఘాటుగా విమర్శించడు. పొల్లు మాట ఆయన నోట వినపడదు. ఇలాంటి వాళ్ళు ఓ పదిమంది వుంటే దేశం పరిస్థితి ఇలా వుండదండీ’
వెంకటేష్ చెప్పుకు పోతున్నాడు. రాజ్యసభలో రాఘవ్ చద్దా చెప్పిన మరి కొన్ని సంగతులు గుర్తుచేసుకుని మరీ చెబుతున్నాడు.
‘దేశంలో ఎక్కువమంది పేదవాళ్లు, మధ్యతరగతి వాళ్ళు తమకు కావాల్సినవి కొనుక్కుని పన్నులు చెల్లిస్తూ వుంటే, వాటిని తయారు చేసిన పెద్దోళ్లు సంపాదించి పన్నులు కడుతున్నారు. పేదవాళ్లకు సబ్సిడీలు , పధకాలు. గొప్పోళ్ళు తీసుకున్న బ్యాంకు రుణాలు పూర్తిగా మాఫీ, మరి పన్నులు కట్టే మధ్యతరగతికి మాత్రం గుండు సున్నా. వాళ్ళు బంగారు గుడ్లు పెట్టే బాతులు మాత్రమే. బతకాలంటే పన్ను, ఆఖరికి చావాలంటే కూడా పన్నే. ఎయిర్ పోర్టుల్లో మామూలోడు ఒక కప్పు కాఫీ కొనుక్కుని తాగే పరిస్థితి ఉందా!
‘ఇలాంటి సంగతులు ఎన్ని చెబుతూ వుంటాడండీ ఆ పెద్దాయన. నాకయితే కాళ్ళకు మొక్కాలని అనిపిస్తుంది ఆ మాటలు వింటుంటే’
ఇంతలో ప్రెస్ క్లబ్ వచ్చింది.
‘అసెంబ్లీలో, పార్లమెంటులో ఎప్పుడు ఏదో ఒక విషయంపై రగడ. అనవసరమైన విషయాలపై ఏదో ఒక రభస. అందరూ రాఘవ్ గారి మాదిరిగా ప్రజా సమస్యలను ఎందుకు లేవనెత్తరో అర్ధం కాదు’ అన్నాడు రైడ్ క్లోజ్ చేస్తూ.
గూగుల్ పే చేసిన తర్వాత అడిగాను వెంకటేష్ ని, ‘నీకు సెల్ఫీ తీయడం వచ్చా! నీతో నా ఫోటో ఒకటి తీస్తావా’ అని.
వెంకటేష్ ఏమి చదువుకున్నాడో, అతడి నేపధ్యం ఏమిటో నాకు తెలియదు.
అతడి మాటల వల్ల తెలిసిందల్లా దేశంలో, సామాన్య జనంలో పాజిటివ్ థింకింగ్ క్రమంగా పెరుగుతోందని.
దీర్ఘకాలంలో జాతికి మేలు చేసే ఆలోచనా ధోరణులు పెరుగుతున్నాయని.
భయం లేదు! సమాజం మేలుకుంటోంది!



(ఇంకా వుంది)
01-03-2026

12 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్యామలీయం చెప్పారు...

అవునండి. విద్యావంతుల శాతం పెరుతోంది. పైగా ఎప్పటికప్పుడు వార్తలు అందరికీ వెంటనే చేరుతున్నాయి. ఆలోచించే వారు పెరుతున్నారు. అరవై డభ్భై యేళ్ళ క్రితం జాతీయపతాకాన్ని పోలిన పార్టీపతాకంతో ఎన్నికలలో ఒక పార్టీ " గవర్నమెంట్ పార్టీ" ఆన్న భ్రమని కల్పించి లాభంపొందేది. ఇప్పుడు ప్రజల్లో అలాంటి అమాయకత్వం లేదు . ఆలోచిస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. మంచిపరిణామం.

అజ్ఞాత చెప్పారు...

అవునండి. ఇప్పుడు మతం పేరుతొ ఒక పార్టీ లాభపడుతోంది. ప్రజలు గమనిస్తున్నారు. గమనించవలసి వస్తుంది. రోజులన్నీ ఎప్పుడూ ఒకే రీతిగా ఉండవుగా.

అజ్ఞాత చెప్పారు...

అవును బాగా చెప్పారు. భాగ్యనగరం లో అలాంటి పార్టీ ఒకటి ఉంది.

అజ్ఞాత చెప్పారు...

ఈ సంభాషణ నిజంగా జరిగింది అనుకోను. మీ భావాలను అతను చెప్పినట్లు వ్రాసారు అనిపిస్తుంది. సాధారణంగా క్యాబ్ డ్రైవర్లు ఇలా ముచ్చట్లు పెట్టుకోవడం ఉండదు.

శ్యామలీయం చెప్పారు...

పొరబడుతున్నారు. భండారు వారికి అటువంటి అవసరం ఎంతమాత్రమూ లేదు. అపారమైన వారి వృత్తిజీవితానుభవగాథావిశేషాలను వారు ఎంతవిస్తారంగా వ్రాసినా ఆశ్చర్యం లేదు. అటువంటప్పుడు జరుగని సంఘటనలను కల్పించో చిన్న సంఘటనలను చిలువలుపలువలు చేసో వ్రాయవలసిన అగత్యం వారికి లేనే లేదు. లేని పాత్రలను కల్పించి వ్రాయటం వారికి ఎన్నడూ అవసరం కాదు. గ్రహించగలరు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

మూడో అజ్ఞాత గారికి
నాలుగేళ్ల క్రితం ఇదే బ్లాగులో మరో క్యాబ్ డ్రైవర్ తో ముచ్చట్లు. నేను సాధారణంగా ఇటువంటి వాటికి జవాబు ఇవ్వను. కాకపొతే నా తరపున శ్యామలీయం గారు వివరణ ఇవ్వడం గమనించి ఇది జ్ఞాపకం చేస్తున్నాను. వారికి న ధన్యవాదాలు
7, మార్చి 2022, సోమవారం
ముఖే ముఖే సరస్వతి - భండారు శ్రీనివాసరావు

పట్టుమని పాతికేళ్ళు వున్నట్టు లేవు. చేసేది డ్రైవర్ పని. ఇంటర్ చదివాడు. మునిసిపల్ కార్పోరేషన్ లో తాత్కాలిక ఉద్యోగం కొన్నాళ్ళు చేశాడు. అదీ ఒదిలేశాడు. జీతం చాలక కాదు. ఎక్కువై. వినడానికే వింత అనిపించేలా వున్నాయి అతడి మాటలు. నెలకు ఆరువేలు ఇచ్చేవారు. అదేమంత పెద్ద జీతం కాదు, కానీ అందుకు తగ్గ పని వుండేది కాదు, రెండుగంటలు పనిచేయడం, ఆరుగంటలు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం. ఆరువేలు తీసుకుని రోజుకు రెండు గంటలే పనిచేయడం అతడికి అస్సలు నచ్చలేదు. అందుకే ఒదిలేసి ఉబెర్ డ్రైవర్ పనిలో చేరాడు. పేరు మోడరన్ గా ప్రభాత్ కుమార్. కానీ కదిలిస్తే అన్నీ ఆధ్యాత్మిక భావాలు.
తీరిక దొరికినప్పుడల్లా ఇందిరా పార్కు దగ్గర రామకృష్ణ మఠంలో గడుపుతాడు. రామకృష్ణ ప్రభ కు ఏడాది చందా కట్టాడు. కానీ రెండు నెలలు గడవక ముందే ఇల్లు మారాల్సి వచ్చింది. ఆ పత్రిక చదవకపోతే అతడికి తోచదు. అందుకని మళ్ళీ వెళ్లి కొత్త చిరునామాతో మరో ఏడాది చందా కట్టాడు. నిజానికి ఆ పత్రిక తిరగేయడానికి ఎంతో టైం పట్టదు. కానీ అతడు తిరగేయడు. చదువుతాడు. అదీ మనసు పెట్టి. కొత్తా పాతా తేడా లేకుండా ఆ మాసపత్రికను నెలంతా చదువుతూనే ఉంటాడు. చదివినదే అయినా మరోసారి, మరోసారి, అలా చదువుతూనే ఉంటాడు.
బిజినెస్ మేనేజ్ మెంట్ లాగా ఫ్యామిలీ మేనేజ్ మెంట్ కోర్సులు పెట్టాలంటాడు. చిన్నాభిన్నమైపోతున్న కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలంటే అలాంటి చదువులు అవసరమంటాడు ప్రభాత్ కుమార్.
చిన్నవాడయినా మంచి మాట చెప్పాడు.
ఉబెర్ డ్రైవర్ పుణ్యమా అని ఓ కొత్త పాఠం నేర్చుకున్నాను.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

https://bhandarusrinivasarao.blogspot.com/2022/03/blog-post_7.html

శ్యామలీయం చెప్పారు...

క్యాబ్ డ్రైవర్ ఒకతనితో శనివారం నాటి ముచ్చట. మెడ్ ప్లస్ డయాగ్నోష్టిక్ సెంటర్లో ఎక్స్- రేలు తీయించుకొని క్యాబులో తిరిగివస్తున్నపుడు దానిని నడిపినది ఒక ఐటీ బిజినెస్ మేన్ అని మాటల్లో తెలిసింది. ఒకే రంగం వాళ్ళం కాబట్టి చాలా విషయాలే చర్చించుకున్నాం. ఇటువంటి అనుభవాలు ఎందరికో కలుగుతూనే ఉంటాయి.

అలాగే రాంగ్ లొకేషన్లో దింపేసిన ,డ్రైవర్లనూ డయిలసిస్ పేషంటును స్వయంగా వీల్ ఛైర్లో సెంటర్ లోపలికి తీసుకొని వచ్చిన డ్రైవర్లనూ కూడా చూసాను.

అజ్ఞాత చెప్పారు...

Ok sir . You are able to get such interestimg cab drivers. Somehow I feel that even the old cab driver story also difficult to believe. Maybe because I didn't come across any such cab drivers. Most of the times I find them to be indifferent and unhelpful, sometimes speaking on phone while driving etc.

అజ్ఞాత చెప్పారు...

Writers are generally imaginative.

అజ్ఞాత చెప్పారు...

'పేరు మోడరన్ గా ప్రభాత్ కుమార్. కానీ కదిలిస్తే అన్నీ ఆధ్యాత్మిక భావాలు.'

పేరుకు స్వభావానికి సంబంధం
ఏమి ఉంటుంది.

మహాకవి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. కానీ కదిలిస్తే అన్నీ నాస్తిక కమ్యూనిస్టు భావాలు అని అంటే ఎలా ఉంటుంది.