27, జులై 2024, శనివారం

గుర్తుకొస్తున్నాయి - భండారు శ్రీనివాసరావు


నిన్న మధ్యాన్నం భాస్కర శర్మ గారికి నాకిచ్చిన మాట జ్ఞాపకం వచ్చినట్టుంది.
' మీరు సారును కలవాలి అనుకుంటే రెండున్నరకల్లా సెక్రటేరియట్ కి రాగలరా?' 
రాగలరా అనడంలోనే ఆయన సంశయం అర్థం అయింది. వాహన సౌకర్యం లేదు. ఉబెర్ లో వెళ్ళినా గేటు దగ్గర అటకాయింపులు తప్పవు. అప్పటికి భోజనం సరే, స్నానాదికాలు కూడా పూర్తి కాలేదు. 
దేవుడు నాలాంటి వాళ్ల కోసమే కదా వుంది. ఆయనే దోవ చూపించాడు. మా మూడో అక్కయ్య అల్లుడు మా ఇంటికి రావడం ఆయన కార్లో అనుకున్న సమయానికి ఓ అరగంట ఆలస్యంగా వెళ్ళడం జరిగింది.  అయిదారు లిఫ్టులు వున్నా వచ్చే జనం పోయే జనంతో కిటకిట లాడుతున్నాయి. రెండో అంతస్తు తొమ్మిదో నెంబరు గది అన్నారు. మెట్ల మీద వెళ్ళాము. శర్మగారు వచ్చి తీసుకు వెళ్ళడం వల్ల సెక్యూరిటీ బెడద తప్పింది. మమ్మల్ని నేరుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి గారి ఛాంబర్ లోకి తీసుకువెళ్ళారు. ఆయన యాంటీ రూములో మరో మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడుతున్నారు. బయటకు వస్తూనే భట్టి గారు తనదైన మందహాసంతో పలకరించి తన సీటు వద్దకు తీసుకు వెళ్ళారు. కాఫీ మర్యాదలు, ఆదరింపు మాటలు యధావిధిగా పూర్తయ్యాయి. ఫిబ్రవరిలో మా వాడు చనిపోయినప్పడు వద్దామనుకున్నా రు కానీ అదే సమయంలో వారి సోదరుడు చనిపోవడం వల్ల స్వగ్రామం వెళ్లాల్సి వచ్చింది. 
పేషీ అఫిషియల్ ఫోటోగ్రాఫర్ తో ఫోటోలు తీయించారు. 
ఆ పేషీలో పనిచేస్తున్న సత్యనారాయణ గారు, శేషుబాబు గారు సాదరంగా పేరుతో పలకరిస్తుంటే నా మతిమరపుకి చచ్చేంత సిగ్గు వేసింది 
రాకరాక వచ్చాను కదా మరో మిత్రుడిని కలిసిపోతే సరిపోతుందని అనిపించి ఫోన్ చేసాను. ఆయన గొంతు తగ్గించి , సీ ఎం గారితో వున్నాను, ఆరో అంతస్తులో నా ఆఫీసులో కూర్చోండి నేను వస్తాను అన్నారు.
సరే అని ఆరో ఫ్లోర్ కు వెళ్ళాము. సెక్యూరిటీ బాగానే వుంది సీ ఎం బ్లాకు కదా. వెళ్లి కూర్చున్న కాసేపటికి చిరు నవ్వు చిందిస్తూ సీ ఎం సీ పీ ఆర్వో అయోధ్య రెడ్డి గారు వచ్చారు. పూర్వాశ్రమంలో జర్నలిస్టుగా వున్నప్పుడు పాత అంటే మరీ పాత సచివాలయంలో కలిసి వార్తలకోసం తిరిగేవాళ్ళం. ముందు నవ్వు కనపడి తర్వాత మొహం కనపడడం ఆయన ప్రత్యేకత. 
మళ్ళీ పాత కబుర్లు. నలభయ్ ఏళ్ల గతానికి జారిపోయాను. ఆయన పేషీ లోనే మరో మిత్రుడు, సీ ఎంపీఆర్వో గా పనిచేస్తున్న జాకబ్ గారు కనిపించి ఆప్యాయంగా పలకరించారు.
లిఫ్ట్ దిగి వస్తుంటే ఒకనాడు జూనియర్లుగా  పరిచయం అయి ఈనాడు చాలా సీనియర్లు అయిన   ఐఏఎస్ అధికారులు ఇద్దరు కనపడ్డారు. వారు మధ్యలో దిగిపోయారు. కిందికి దిగుతుంటే లిఫ్ట్ బాయ్ పలకరించాడు. మీరు రేడియో శ్రీనివాస్ గారు కదా! అని అడుగుతుంటే కళ్ళు చెమర్చాయి. రిటైర్ అయి దాదాపు ఇరవై ఏళ్ళు. అయినా జనానికి గుర్తు వున్నాను అంటే అది నిజంగా వాళ్ళ గొప్పతనం, మంచితనం.
లిఫ్ట్ బయటకు రాగానే హిందుస్థాన్ టైమ్స్ అప్పరసు శ్రీనివాసరావు గారు, మరో మిత్రుడు సుధాకర్ (ఒకప్పుడు ఆంధ్ర జ్యోతి) కనిపించారు. శ్రీనివాస రావు, వారి అన్నగారు ఆంధ్ర జ్యోతి ఢిల్లీ కృష్ణా రావు గారు చిరకాల మిత్రులు. శ్రీనివాస రావు ఐ ఏ ఎస్ అధికారుల ద్వారా చాలా సమాచారాలు సేకరించేవారు. ఆయనతో పాటు నేను తిరిగేవాడిని. 
బహుశా నా జీవితంలో నడవాల్సిన నడక మొత్తం ఆ రోజుల్లో సచివాలయంలో నడిచి వుంటాను. కొన్ని చోట్ల లిఫ్టులు వుండేవి కాదు. నాలుగయిదు అంతస్తులు ఎక్కి దిగే వాళ్ళం. అలుపు అనిపించేది కాదు. వయసు అలాంటిది.
ఇంట్లో ఒంటరిగా వున్న వాళ్ళని దేవుడు ఇలా ఒక్కోసారి బయట తిరిగి వంట్లో సత్తువ పెరిగేలా చూస్తాడు. 
అసలీ వయసులో దీన్ని మించిన టానిక్ లేదు.
 ఇక వచ్చే రెండు మాసాలు అమెరికాలో. ఈ రాత్రే ప్రయాణం. సెప్టెంబర్ 22 న తిరిగి రాక.
 (27-7-2024)

1 కామెంట్‌:

Zilebi చెప్పారు...

Enjoy in Americas :)